Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘ఆరోగ్యానికి ఆటలు దోహదం’

$
0
0

బొండపల్లి, నవంబర్ 8 : ఆరోగ్యానికి ఆటలు దోహదం చేస్తాయని స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి. విజయలక్ష్మి అన్నారు. గురువారం ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండలస్థాయి పైకా క్రీడలను ఆమె ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధులు చదువుతో పాటు క్రీడలలోను రాణించాలని కోరారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు. విద్యార్ధులు విరామ సమయాల్లో క్రీడల కోసం సమయం కేటాయించాలన్నారు. క్రీడా పోటీలలో విద్యార్ధుల రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణించి మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. చదువుకు అంతరాయం కలగకుండా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మండల విద్యాశాఖ అధికారి అల్లు వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడల కోసం నిర్ధిష్టమైన సమయం కేటాయించాలన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు వస్తున్న వారిని అభినందించారు. బొండపల్లి గ్రామానికి చెందిన చిరంజీవిరాజు, బండారు పాపునాయుడు, ఎంఇఒ అల్లు వెంకటరమణలు తొమ్మిది వేల రూపాయల ఖర్చుతో జోనల్ స్థాయిలో పాల్గొనే విద్యార్ధులకు టీ షర్టులు, క్రీడా సామగ్రిని సమకూర్చారు. బొండపల్లి, దేవుపల్లి, నెలివాడ, బిల్లలవలస, గరుడబిల్లి, గొట్లాం, ఎం.కొత్తవలస, రాచకిండాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్ధులు పోటీల్లో పాల్గొన్నారు. బొండపల్లి పిఇటి రామ్మూర్తి, విద్యాకమిటీ వైస్ చైర్మన్ ఆల్తి శ్రీను, పలు పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పంట నష్టాన్ని పరిశీలిస్తున్న అధికారులు
దత్తిరాజేరు, నవంబర్ 8 : మండలంలోని 35 గ్రామ పంచాయతీల పరిధిలోని 46 రెవిన్యూ గ్రామాల్లో నీలం తుఫాను ప్రభావంతో జరిగిన పంట నష్టాన్ని గురువారం వ్యవసాయ అధికారి కె. తిరుపతిరావు టి. భూర్జివలస, భూపాలరాజుపురం, గ్రామాల్లో పరిశీలించి నమోదు చేసారు. అలాగే ఎఇఓ రాజశేఖర్, విఆర్‌ఓ బంగారునాయుడు, దాసుపేట, ఎఇఓ నీలాకృష్ణ, వింధ్యావాశి, వి.కృష్ణాపురం గ్రామాల్లో విఆర్‌ఓ ఆదర్శ రైతులతో కలసి పంట నష్టాన్ని పరిశీలించారు. గ్రామంలో నష్టపోయిన పంట, ఏఏ సర్వే నెంబర్లలో ఎంత మేర నష్ట పోయిందో, పాసుబుక్కులు రైతుల వద్దనున్నవి పరిశీలించి పంట నష్టపోయిన వివరాలను నమోదు చేసుకొని, రైతులచే సంతకం చేయించామని వ్యవసాయాధికారి తిరుపతిరావు ఎఇఓలను ఆదేశించారు.

‘అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి’
విజయనగరం (తోటపాలెం), నవంబర్ 8: రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో అంబేధ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత సంఘాల జెఎసి నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం ఎంఎల్‌ఎ పూసపాటి అశోక్‌గజపతిరాజుకు గురువారం వినతి పత్రాన్ని అందించారు. వినతి పత్రం అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేధ్కర్ విగ్రహ ఏర్పాటుకు అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ చాలా కాలం క్రితం ప్రయత్నించిందన్నారు. తదుపరి దళిత సంఘాల జెఎసి చైర్మన్ ఎ.ఉదయబాస్కర్ మట్లాడుతూ ఎస్.సి, ఎస్.టి సప్లాంట్‌పై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో నియవించిన దళిత,గిరిజన మోనటరింగ్ విజెలెన్సు కమిటిని రద్ధు చేయాలన్నారు. ఎస్‌సి,ఎస్‌టి నిధులను పది సంవత్సరాలుగా ఖర్చు చేస్తున్న నివేదిక శేత పత్రం విడుదల చేయాలన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కలెక్టరేట్‌లో పెట్టాలన్నారు. సాంఘీక సంక్షేమ హాస్టల్‌లో మెనూను పెంచి, వసతులు కల్పించాలన్నారు. దళితుల నిధులను ఖర్చు చేయని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ ఆరో తేదిలోగా ఎంఎల్‌ఎలకు అందించిన అనంతరం ధ్నాను నిర్వహించనున్నామన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
జామి, నవంబర్ 8: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న గ్రామస్తులు అధికారులకు అప్పగించిన సంఘటన ఈ మండలం అన్నమరాజుపేట శివారు సీతానగరం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కార్డు దార్లకు ఇవ్వాల్సిన బియ్యాన్ని వాహనంలో అక్రమంగా తరలిస్తూ గ్రామస్తులకు చిక్కాడు. సుమారు 8 క్వింటాళ్ళ బియ్యాన్ని తరలిస్తున్న వాహనంతో పాటు పట్టుకున్న గ్రామస్తులు రెవెన్యూ అధికారుకు అప్పగించారు. గ్రామంలో రేషన్ డీలర్ సరుకులను సక్రమంగా సరఫరా చేయట్లేదని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దుకాణాన్ని సరిగా తెరవకుండా కార్డు దార్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అధికారులు దృష్టికి తీసుకువచ్చారు.

‘గ్రంథాలయ సంస్థ
బలోపేతానికి చర్యలు’
మక్కువ, నవంబర్ 8 : జిల్లా గ్రంథాలయ సంస్థను ఆర్ధికంగా బలో పేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ చైర్మన్ రొంగలి పోతన్న తెలిపారు. మండల కేంద్రంలోని గ్రంథాలయ శాఖను గురువారం ఆయన తనీఖీ చేసారు. గ్రంథాలయ నిర్మాణానికి సరిపడే నాలుగు సెంట్లు స్ధలాన్ని మావుడి ప్రసాదునాయుడు విరాళంగా ఇచ్చారు. ఆయనలో కలసి స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 2012-13 ఆర్ధిక సంవత్సరానికి 3కోట్లు రూపాయలు గ్రంథాలయ సెస్సును వసూళ్ళు చేసి ఆర్ధికంగా బలో పేతం చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం 50 శాతం గ్రంథాలయ నిర్వహణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 38 గ్రంథాలయాలు పాఠకుల కోరుకొనే విధంగా తయారు చేసామన్నారు. జిల్లాలో 38 జిల్లా పరిషత్ ఉన్నత పాఠవాలలో9 పిల్లలు, కళాశాలలకు 30 లక్షలు రూపాయలతో పుస్తక పఠనాలయాలను ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు జిల్లా యూనియర్ లీడర్ రాంబధ్రరాజు, సెక్రటరీ కుమారారాజు పాల్గొన్నారు.
నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన కల్వర్టు
సీతానగరం, నవంబర్ 8: నీలం తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాల దాటికి రెడ్డివానివలస, రామవరం గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ ప్రక్కనే ఉన్న కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోయింది. దీని వలన సుమారు 4 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రెండు నెలల క్రితం పైన ఉన్న చెరువు నీటి ఉద్దృతికి ఈ కల్వర్టు కొంత భాగం కూలిపోయింది. అధికారులు కూడా కల్వర్టు నిర్మాణానికి తగు చర్యలు చేపడతామని ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఉన్నది కాస్త నీలం తుఫాన్ వర్షాలతో కొట్టుకుపోవడంతో కల్వర్టు నిర్మాణం జరిగేనా అని గ్రామస్థులు అనుకుంటన్నారు. పూర్తిగా కల్వర్టు కూలిపోయి రోడ్లు మధ్యలో గొయ్యి ఏర్పడింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి కల్వర్టును త్వరితగతిన నిర్మించేవిధంగా తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నేడు మెగా లోక్ అదాలత్
* జిల్లా జడ్జి పి.ముత్యాలనాయుడు
విజయనగరం (కంటోనె్మంట్), నవంబర్ 8: జాతీయ లీగల్ సర్వీసు డే సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయసేవ సదన్‌లో మెగాలోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి పి.ముత్యాలనాయుడు తెలిపారు. తన ఛాంబర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు న్యాయసేవలను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశ్యంతో లోక్‌అదాలత్‌ను అమల్లోకి తెచ్చారన్నారు. లోక్‌అదాలత్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కొన్ని గ్రామాలకు కలిపి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ఏర్పాటుచేసి, వీటిద్వారా స్థానిక సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు.
వర్షాలతో చెరువులకు జలకళ
విజయనగరం (తోటపాలెం), నవంబర్ 8: తుపాను కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని చెరువుల్లో నీరు చేరి కళకళలాడుతున్నాయి. మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు పూర్తిస్ధాయిలో నిండి చప్టాల మీద నుంచి నీరు పారుతున్నది. పూర్తిగా చెరువులు నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం వర్షాలు ముందుగా పడకపోవడంతో ఉభాలు ఆలస్యంగా జరిగిందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం చెరువులు నిండడం వలన పంటలు పూర్తి స్థాయిలో పండే అవకాశం ఉందని తెలుపుతున్నారు. వరి పంటలే కాకుండా కోతలు అనంతరం ఆపరాలు, చిరుధాన్యాల పంటలు పండించుకునేందుకు అవకాశం ఉందంటున్నారు.
ప్రజలు. గత ఏడాది సకాలంలో వర్షాలు లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడి నీరును తోడి పండించాలని ప్రయత్నాలు చేసారు. పంటకు సరిపడా నీరు అందక రైతుల ఆశలు నిరాశగా మిగిలాయి. ఈ ఏడాది నీలం తుఫాన్ కారణంగా పడిన వర్షాలతో రైతుల్లో పంట పూర్తి స్ధాయిలో పండుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెరువులకు జలకళ రావడంపై ఆనందం వ్యక్తం అవుతోంది.
బాణసంచా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి
సీతానగరం, నవంబర్ 8: అనుమతులు లేకుండా బాణసంచాను తయారుచేస్తున్న ఏడుగురు వ్యక్తులను, మందుగుండు సామగ్రిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని సుభద్ర సీతారాంపురం గ్రామంలో ఎరుకుల వీధిలో గొర్లె సూర్యనారాయణ, డి. ఆదినారాయణ, నారాయణ, ఎం.సూరిలతోపాటు మరో ముగ్గురు చాలా కాలంగా ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామంలో మందుగుండు సామాన్లును తయారుచేస్తున్నారు. గ్రామస్థులు అందించిన సమాచారం ప్రకారం గురువారం సీతానగరం ఎస్.ఐ. జి.ఎ.వి. రమణ ఆధ్వర్యంలో పోలీసులు బాణసంచా తయారీ కేంద్రంపై దాడి చేసి తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులలో వారి వద్ద నుంచి పలు రకాల బాణసంచా తయారీ మందులతోపాటు తాటాకు టపాసులు, ,ఒత్తుబాంబులు వంటివి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 10వేల రూపాయలు ఉంటుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి’
గరుగుబిల్లి, నవంబర్ 8: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేశానని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. మండల పరిధిలోని గరుగుబిల్లి, ఉల్లిభద్ర, తదితర గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో అమలు చేస్తున్న జలమణి, మన టి.వి., వంటి పథకాలు నిరుపయోగమయ్యాయన్నారు. పాఠశాలల్లో బోధకులు లేక కంప్యూటర్ విద్య అమలుకావడం లేదన్నారు. ఈ మేరకు కంప్యూటర్ విద్య కోసం డి. ఎస్సీ ద్వారా ఒక ఉపాధ్యాయుడిని నియమించాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లుకు జూనియర్ లెక్చరర్‌లుగా పదోన్నతుల విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇళ్ల స్థలాలను కేటాయించనున్నట్లు ప్రకటించిందని అయితే ఆ స్థలం ద్వారా వచ్చిన నగదును ఉపాధ్యాయుల సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నామన్నారు. జిల్లా పి.ఆర్.టి.యు. ప్రధాన కార్యదర్శి ఓలేటి తవిటినాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి.జె. రోజారమణి, సి.హెచ్. చిరంజీవినాయుడు, పాల్గొన్నారు.
గొస్తనీ నదిలో గల్లంతైన వ్యక్తి
మృత దేహం లభ్యం
జామి, నవంబర్ 8 : గొస్తనీ నదిలో గల్లంతైన మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమైంది. బుధవారం మధ్యాహ్నం గల్లంతైన మీసాల అప్పారావు (40) ఆనేవ్యక్తి సుమారు అరకిలో మీటరు దూరం నదిలో కొట్టుకు పోయి గ్రామ సమీప తుప్పలకు చిక్కుకుని శవమై కనిపించాడు. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గొస్తనీ నదికి అవతల ఓడ్డున ఉన్న మల్లి బాబు తోటకు చెందిన మీసాల అప్పారావు నిత్యాఅవసర వస్తువులు కోసం నదిలోదిగి ఇవతర ఓడ్డున ఉన్న బజారుకు వచ్చేందుకు ప్రయత్తిస్తుండగా నది ఉద్దృతికి గల్లంతైయ్యాడు. మత్య్సశాఖ ఇన్‌స్పెక్టర్ శ్యామ్యూల్ సిబ్బంది కలిసి గజ ఈతగాల్ల సహాయంతో నదిలో ఉన్న మృత దేహాన్ని కనుకోన్నారు. తహశీల్ధార్ ఎంవిఎస్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు శవ పంచనామా పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌కోట ఆసుపత్రికి తరలించారు.
‘అర్హులందరికీ నష్ట పరిహారం అందాలి’
విజయనగరం(టౌన్), నవంబర్ 8 : తుఫాన్ వలన పంటలు, ఇళ్ళు కోల్పోయిన అర్హులందరికీ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య ఆదేశించారు. తుఫాన్ నష్టాలపై గురువారం తన ఛాంబర్‌లో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట నష్టంపై అంచనా వేసేందుకు మండల, గ్రామస్థాయిలో కమిటీలు వేసి ఈ నెల 15వ తేదీలోపు అంచనాల తయారు చేయాలన్నారు. 19 నుండి 21 తేదీ వరకూ పంట నష్ట వివరాలను గ్రామస్థాయిలోను తహశీల్దార్, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లోను ప్రదర్శించాలని మార్పులు, చేర్పులు ఉంటే పూర్తిచేసి 25వ తేదీనాటికి తుది జాబితాను ఇవ్వాలన్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని వ్యవసాయశాఖ జెడికి సూచించారు. జిల్లాలో 2,099 ఇళ్లు దెబ్బ తిన్నాయని వాటికి సంబంధిచి నష్టపరిహారం లబ్ధిదారులకు త్వరితంగా అందజేయాలని( ఆర్డీవోలను ఆదేశించారు. విజయనగరం డివిజన్‌లో 26ఇల్లు, పార్వతీపురం డివిజన్లో పూర్తిగా దెబ్బ 13 ఇల్లు దెబ్బతిన్నాయని వాటికి ఐఎవై క్రింద ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఉద్యాన వన శాఖకు సంబందించి జిల్లాలో 12 మండలాల్లో 342 హెక్టార్లలో కూరగాయల పంటకు నష్టం వాటిల్లిందని, పశుసంవర్ధక శాఖకు సంబందించి 9 పశువులు చనిపోయాయని సంబందిత అధికారులు వివరించారు. వర్షాలవలన జీవన బృతి కోల్పోయిన 8,632 మందికి ఒక్కొకుటుంబానికి 10 కేజీలు వంతున బియ్యం పంపిణీకి ప్రతిపాన పంపామణి మత్య్సుశాఖ ఎడి తెలిపారు. వర్షాల వలన తమ శాఖకు 16.74 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. అలాగే ఆర్ అండ్ బి శాఖకు 107 కోట్ల రూపాయలు, పంచాయితీ రాజ్‌కు 65 కోట్లు, నీటిపారుల శాఖకు 20 కోట్ల రూపాయలు కావాలని సంబందిత అధికారులు తెలియజేసారు. జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలో రోడ్లుకాలువలు భవనాలు తదితర వాటికి సంబందించి అవసరమయ్యే ఖర్చును అంచనా వేయ్యాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా పలు శాఖలకు సంబందించి కలెక్టర్ సమీక్ష జరిపారు. జాయింట్‌కలెక్టర్ పిఏ శోభ మాట్లాడుతూ మరమ్మతులకు గురైన తహశీల్ధార్ కార్యాలయ వివరాలు తెలపాలని ఆర్డీఓలను ఆదేశించారు. సమావేశంలో విజయనగరం ఆర్డీఓ రాజకుమారి, పార్వతీపురం వెంకట్రావు, వ్యవసాయశాఖ జెడి లీలావతి తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన రైతులకు నష్ట పరిహారం అందేనా?

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 8: ఒకసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి రైతన్న కంట కన్నీరు పెట్టిస్తున్న ప్రకృతి ఈసారీ తన ప్రతాపాన్ని చూపింది. రెండేళ్ళుగా అన్నదాతను వదిపెట్టని వాతావరణం ఈసారి కూడా కనికరించలేదు. వరుసగా మూడో ఏడాది ఖరీఫ్ రైతాంగం నీలం తుపాను దెబ్బకు కుదేలైంది. జిల్లాలో ఈఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాగుకు పెద్దగా ఇష్టపడలేదు. అయితే ఆలస్యంగానైనా కురిసిన వర్షాలు రైతులో ఆశలు చిగురింపచేయగా, పంట చేతికొచ్చే సమయంలో నీలం తుపాను రూపంలో మరోసారి రైతు నెత్తిన పిడుగుపడింది. జిల్లాలో సాధారణ వరిసాగు విస్తీర్ణం 1.21 లక్షల హెక్టార్లుండగా, ఈసారి 1.12 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. ఆలస్యంగా నాట్లు పూర్తి చేసిన రైతాంగం ఈసారి నవంబర్ నెలాఖరు నాటికి వరికోతలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంతలోనే నీలం తుపాను ప్రభావంతో అయిదు రోజుల పాటు ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, వాగులు పొంగి పొర్లడంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రాధమిక అంచనా మేరకు 16 వేల హెక్టార్లలో పంటలు నీట మునిగినట్టుగుర్తించారు. అయితే దీనిలో వరి విస్తీర్ణమే 14వేల హెక్టార్లుంటుందని అంచనా. ఇదిలా ఉండగా భారీ వర్షాలతో నీట మునిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు గ్రామపెద్దల సహాయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతకు ముందు సంవత్సరం అతివృష్టి పరిస్థితుల నేపధ్యంలో పంట నష్ట పరిహారం అంచనాతో పాటు చెల్లింపుల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన వారికి పంటనష్ట పరిహారం అందించారని, విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. ఇక గతేడాది కరవు పరిస్థితుల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని సుమారు 15 మండలాల్లో వర్షాభావం కారణంగా పటనష్టం సంభవించింది. 77,810 మంది రైతులను గుర్తించి వారికి 13.5 కోట్ల రూపాయల మేర నష్ట పరిహారం ప్రభుత్వం విడుదల చేసింది. బ్యాంకు ఖాతాలను తెరిపించి వీరిలో 60,822 మంది రైతులకు 11.02 కోట్ల రూపాయల మేర పంపిణీ చేశారు. అయితే పంట నష్టపోయిన రైతులను గుర్తించడంలోనే అధికారులు అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. కొత్తవలస, శృంగవరపుకోట, జామి, వేపాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, డెంకాడ మండలాల్లో అధికార పక్షంతో కుమ్మక్కైన అధికారులు అనర్హులకు సైతం పంట నష్టపరిహారం చెల్లించారని ఫిర్యాదులు అందాయి.
తాజాగా నీలం తుపాను నష్టం అంచనాల్లో గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, పెద్దల సహాయం తీసుకోవాలన్న ఆదేశాలతో ఇప్పడు కూడా రాజకీయ జోక్యం తప్పదని విపక్షాలకు చెందిన ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మంత్రి ఆదేశాల మేరకు గ్రామపెద్దల ప్రమేయంతో పంటనష్టం అంచనాలు వేస్తే అనర్హుల హవా తప్పదని అధికారులు సైతం అంగీకరిస్తున్న వాస్తవం.

‘రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కల్పించాలి’

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 8: సృజనాత్మక రైతుల అనుసంధానం వ్యవసాయాభివృద్ధికి దోహదపడుతుందని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం.వెంకునాయుడు అభిప్రాయపడ్డారు. గాజులరేగ ఏరువాక కేంద్రంలో సృజనాత్మక రైతుల అనుసంధానం, శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మక రైతులు గ్రామాల్లోని రైతాంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కల్పించేందుకు తోడ్పడాలని అన్నారు. తమకు అందుబాటులో ఉన్న వనరులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఉత్పాదక పెంచేందుకు వీరు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన సహాయాన్ని ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలైతే వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం డైరెక్టర్ ఆర్.అంకయ్య మాట్లాడుతూ సృజనాత్మక రైతులు తమ అనుభవాలను, పరిజ్ఞానాన్ని ఇతర రైతులతో పంచుకోవాలని సూచించారు. గాజులరేగ వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారి డాక్టర్ ఎన్.డి.ఆర్.కె.శర్మ మాట్లాడుతూ విషయ పరిజ్ఞానం ఉన్న చదువుకున్న యువత వ్యవసాయం పట్ల మక్కువ చూపాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉత్పాదక శక్తిని పెంచుకోవాలన్నారు. ఈసందర్భంగా వరి మాగాణిలో పండించే అపరాల్లో అధిక దిగుబడికి తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్ శర్మ, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగంపై కేంద్రం ప్రతినిధి డాక్టర్ గురుమూర్తి, రబీ పంటలో కలుపు మొక్కల యాజమాన్యంపై డాక్టర్ వెంకటరావు సృజనాత్మక రైతుకు శిక్షణను ఇచ్చారు. కార్యక్రమంలో సృజనాత్మక రైతులు జి.వి.ఎ.రామరాజు, ఎల్.ఆదినారాయణ మూర్తి, సుంకరి పైడపునాయుడు, చనుమోలు మాధవరావు, దాట్ల హనుమంత రాజు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సభ్యుడు ఎం.వెంకునాయుడును ఘనంగా సత్కరించారు.
‘బాణసంచా విక్రయాలకు
అనుమతులు తప్పనిసరి’
బొబ్బిలి, నవంబర్ 8: అనుమతి లేకుండా దీపావళి బాణాసంచా సామాన్లును విక్రయించిన పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో వెంకటరావు హెచ్చరించారు. స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ సమీపంలో బాణాసంచా హోల్‌సేల్ షాపును ఏర్పాటు చేయనున్న స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హోల్‌సేల్ షాపును ఏర్పాటు చేయడం మంచిది కాదన్నారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భవనాలు ఉన్నాయని, ఎటువంటి ప్రమాదం ఏర్పడిన ఇళ్ల వారు ఇబ్బందులు పడతారన్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఇళ్లు లేకపోవడంతో అనుమతులిచ్చేవారని, ప్రస్తుతం ఇళ్లను నిర్మించిన నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదన్నారు. ఈ విషయం పట్ల అనుమతులు ఇచ్చిన సి.ఐ.తో చర్చిస్తామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతించిన షాపులలో మాత్రమే బాణాసంచా విక్రయించాలని కోరారు. లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. ఊరు చివారులలో మాత్రమే వీటిని విక్రయించాలన్నారు. ఈ విషయమై రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈయనతోపాటు తహశీల్దారు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

వరహాలగెడ్డకు తగ్గిన ఉద్ధృతి
పార్వతీపురం, నవంబర్ 8: పార్వతీపురం పట్టణంలోని వరదనీటి ఉద్ధృతి తగ్గుముఖం పెట్టింది. అయితే పార్వతీపురం పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోని ఇంటిగోడలు కూలిపోయాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురంలోని కాపారపుజనార్థననాయుడుకు చెందిన ఇంటి ప్రహరీగోడ కూడా వదర ఉద్ధృతికి కూలిపోయింది. అదేవిధంగా పలు పూరిళ్లుకు చెందిన గోడలు కూడా పాడయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల అధికారులు నష్టాలు అంచనా వేసి ఆర్థికసాయం అందించాలని కోరుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గడం పార్వతీపురంలోని ప్రజలు ఊపరిపీల్చుకున్నారు. ఏమైనప్పటికీ పార్వతీపురంలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే నీటి ఉద్ధృతికి నుండి కోలుకుంటున్నాయని చెప్పవచ్చు.
సీజ్ చేసిన సరకులు వేలం
సీతానగరం, నవంబర్ 8: మండల పరిధిలోని తామరఖండి గ్రామంలోని రైసు మిల్లులో విజిలెన్స్ అధికారులు సీజ్ చేసిన సరుకులను వేలం వేయనున్నట్లు సిఎస్‌డిటి జి.చంద్రరావు తెలిపారు. గురువారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన రైసుమిల్లు ప్రాంగణంలో వేలం పాట జరుగుతుందని, ఆసక్తిగల అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని తెలిపారు. సీజ్ చేసిన సరుకులను వేలం వేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. విజిలెన్స్ అధికారులు 10లక్షల రూపాయల సరుకులను సీజ్ చేశారని, అందులో 413.95 క్వింటాళ్ల సోనామసూరి బియ్యం, 13 క్వింటాళ్ల నూకలు, 190 బస్తాలు పాడి ఉందన్నారు. రేషన్ డీలర్లు ప్రజలకు సరుకులను సక్రమంగా అందించాలని, ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
‘కార్తీక మాస ప్రత్యేక ప్యాకేజీలు వినియోగించుకోవాలి’
పార్వతీపురం, నవంబర్ 8: కార్తీక మాసం సందర్భంగా పార్వతీపురం ఆర్టీసీ డిపో నుండి వివిధ పుణ్యక్షేత్రాలు, వన విహార యాత్రలు దర్శించువారి సౌకర్యార్థం కార్తీక మాస ప్రత్యేక టూర్లుకు ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు తీసుకున్నామని పార్వతీపురం ఆర్టీసీ డిపోమేనేజర్ ఎన్‌వి ఎస్ వేణుగోపాల్ తెలిపారు. గురువారం ఆర్టీసీ డిపో కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ పంచారామదర్శిని ప్యాకేజి మేరకు శ్రీ అమరేశ్వరాలయం (అమరావతి) శ్రీ సోమేశ్వరాలయం (్భమవరం) శ్రీ క్షీర రామలింగేశ్వరాలయం (పాలకొల్లు), శ్రీ భీమేశ్వరాలయం (ద్రాక్షారామం) శ్రీ కొమరా రామలింగేశ్వర ఆలయం (సామర్లకోట) పుణ్యక్షేత్రాలకు ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు బస్సు బయలుదేరుతుందని తిరిగి మంగళవారం ఉదయం 8గంటలకు పార్వతీపురం డిపోకు చేరుకుంటుందన్నారు. అయితే డీలక్సుకు ఛార్జీ రూ.1050, ఎక్స్‌ప్రెస్‌కు రూ.950, పల్లెవెలుగుకు రూ.750గా నిర్ణయించామన్నారు. కళింగ దర్శిని ప్యాకేజిలో గుంప, సంగాం, కళ్లేపల్లి, అరసపల్లి, శ్రీకూర్మం, కళింగపట్నం బీచ్ ప్రాంతాలకు ఆదివారం ఉదయం 6 గంటలకు బయలు దేరి అదేరోజు రాత్రి 9గంటలకు తిరిగి పార్వతీపురం చేరుకుంటుందన్నారు. అయితే ఈటూరుకు ఎక్స్‌ప్రెస్‌కు రూ.250, పల్లెవెలుగుకు రూ.200లుగా నిర్ణయించామన్నారు. అరకు దర్శినిలో భాగంగా తాటిపూడి రిజర్వాయర్, బొర్రాగుహలు, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అరకు వ్యాలీ ఆదివారం ఉదయం 6గంటలకు బయలుదేరి ఆదివారం రాత్రి 9గంటలకు తిరిగి చేరుకుంటుందన్నారు. ఎక్స్‌ప్రెస్ ఛార్జీ రూ.300,పల్లెవెలుగు రూ.250లు చార్జీలుగా నిర్ణయించామని తెలిపారు. విశాఖ దర్శిని టూరులో భాగంగా జూపార్కు, ఆర్‌కె బీచ్ కైలాసగిరి, తొల్లుకొండ, భీమిలి బీచ్‌లకు ఆదివారం ఉదయం 6గంటలకు బయలుదేరి రాత్రి 9గంటలకు పార్వతీపురం చేరుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.300, పల్లెవెలుగు రూ.250 నిర్ణయించినట్టు డి ఎం తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఇంజనీరు జాన్ సుందరం, డిప్యూటీ సూపరింటెండెంట్ (టాఫిక్) ఎస్.సంగమేషులు పాల్గొన్నారు.
ఎంఆర్ పిజి కళాశాలలో
ఇగ్నో కోర్సులు
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 8: మహారాజ పోస్ట్‌గ్రాడ్యుయేట్ (ఎం.ఆర్.పి.జి.) కళాశాలలో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) కోర్సులు ప్రవేశపెట్టినట్లు ఇగ్నో స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ విశ్వభూషణ్ తెలిపారు. గురువారం పి.జి.కళాశాలలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇగ్నో కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని చెప్పారు. ఈ కళాశాలలో నిర్వహిస్తున్న ఇగ్నో ఎం.బి.ఎ., ఎం.ఎస్.డబ్ల్యు. (ఎం.ఎ.సోషల్‌వర్క్), ఎం.కాం., బి.ఎస్.డబ్ల్యు, పి.జి.డిప్లమో ఇన్ మేనేజిమెంట్ వంటి సర్ట్ఫికేట్ కోర్సులు, సోషల్‌వర్క్ కోర్సులు దేశవిదేశాలల్లో అత్యుత్తమ ప్రమాణాలతో గుర్తింపు పొందాయని తెలిపారు. ఇగ్నో స్టడీసెంటర్‌ను గత ఏడాది ప్రారంభించామన్నారు. ఇగ్నో సర్ట్ఫికేట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల కోసం ఎంతో ఉపయోగపడతాయన్నారు. చదువుకోవాలనేవారికి ఇదోక సువర్ణ అవకాశమన్నారు. అన్ని విభాగాల్లోను పలురకాల కోర్సులు ఉన్నాయన్నారు. ఉత్తమ ప్రమాణాలతో కూడిన కోర్సులు ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ విశ్వభూషణ్ కోరారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తిగల వారు ఈనెల 30వ తేదీలోగా సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో ఎం.ఆర్.పి.జి.కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ పి.తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.

‘ఆరోగ్యానికి ఆటలు దోహదం’
english title: 
gg

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>