Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

హింసకు బీజం వేస్తున్న పోటీ తత్వం

$
0
0

అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో అప్రతిహతంగా ఉన్నత స్థాయిని కలిగి వున్న ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తే! ఇతర ఏ వృత్తి కూడా ఉపాధ్యాయ వృత్తితో సరితూగలేకపోతూనే ఉంది. భారత్ లాంటి దేశంలో వేదకాలం నుండి ఉపాధ్యాయుడికి ప్రత్యేక గౌరవ ప్రతిపత్తి ఉంటూనే ఉంది. కాని నేటి విద్యా రంగాన్ని తరచి చూస్తే ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల భృతి కోసం నడుస్తుంటే, ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యానికి కాసుల వర్షం కురిపించేదిగా, తల్లిదండ్రుల ఆకాంక్షల్ని నెరవేర్చేదిగా కొనసాగుతున్నది. విద్యార్థుల ఆకాంక్షలు, అభిరుచులు హైజాక్ చేయబడ్డాయి.
1947 తర్వాత అనూహ్య మార్పుకు గురౌతుందనుకున్న విద్యారంగం తిరోగమన దిశలోనే పయనిస్తోంది. అస్తవ్యస్త వ్యవస్థీకృత విధానాలతో విద్యా రంగం దశ, దిశ లేకుండాపోవడంతో ఉపాధ్యాయుడికి, విద్యార్థికి మధ్యన ఉండాల్సిన అవినాభావ సంబంధం పూర్తిగా దెబ్బతిన్నది. తమ పిల్లలు తరగతి గదిలో మార్కులే కొలమానంగా చదువులో అందరికన్నా ముందుండాలనే తప్పుడు భావన ప్రతీ తల్లిదండ్రికి కలగడం, అలా కలిగేలా భ్రమల్ని కలిగించిన యాజమాన్యాలు బట్టీ చదువులకు, ర్యాంకుల పందేరానికి పెద్ద పీట వేసి ఉపాధ్యాయుల్ని బలిపశువుగా మార్చివేసాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేని ఉపాధ్యాయులు, ఉద్యోగ అభద్రతా భావనతో తమ ప్రతాపాన్ని విద్యార్థులపై చూపడంతో విద్యార్థులపై హింస అనివార్యమైంది. ఈ పోటీ తత్వమే హింసకు బీజాలు వేస్తున్నది.
గతంలో అన్నిదేశాల్లో విద్యా రంగంలో శిక్షలు అధికారికంగా ఉండేవి. సనాతన భారతీయ విద్యలో గురువు తాడుముక్కతోనో, లేత వెదురు బెత్తంతోనో వీపుపై అరచేతులపై కొట్టవచ్చు! సున్నిత భాగాలపై కొట్టకూడదు. దీనికి విరుద్ధంగా గురువు వ్యవహరిస్తే రాజ గురువును మందలించడం జరిగేది. కాని న్యాయస్థానం ముందుకు పోవడం ఏ వ్యవస్థలో జరగలేదు. నాగరికత పరిఢవిల్లుతున్న క్రమంలో శిక్షలకు తావు లేకుండా పిల్లలను తీర్చిదిద్దాలనే ఆలోచనలు మొదలయ్యాయి. దీనికి తోడుగా ప్రపంచ వ్యాపితంగా బోధన విధానంపై (pedagogy) విస్తృతమైన ఫరిశోధనలు జరిగాయి. ఆ పరిశీలనల, పరిశోధనల ఫలితాలు ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బ్రెజిల్ విద్యా వేత్త పౌలోఫ్రేయరీ పేదల చదువు (విముక్తి విద్య), ఇటలీలోని బాల్బియానా పిల్లలు టీచర్లకు రాసిన ఉత్తరం (పంతులమ్మకు లేఖ), సోవియట్ రష్యాలో ఎ.ఎస్.యకరెంకో చేసిన ప్రయోగం అల్లరి పిల్లలతో అద్భుత మార్పులు, ఇంగ్లండులో ఎ.ఎస్.నీల్ రాసి ప్రయోగం చేసిన సమ్మర్ హిల్ పాఠశాల, జాన్‌హోల్ట్ పిల్లలు ఎలా నేర్చుకుంటారనే ప్రయోగాలు, జపాన్ విద్యా విధానంపై రైలుబడి ప్రయోగం విధిగా ఉపాధ్యాయులు జీవితాంతం చదవాల్సిన పుస్తకాలు. ఇక మన దేశంలో కూడా విద్యా విషయక ప్రయోగ అనుభవాలు గిజుబాయి పగటికల తదితర పుస్తకాల్లో ఎత్తిచూపడం జరిగింది. మన రాష్ట్రంలో చలం పిల్లల పెంపకం, కొకు రాసిన ‘చదువు’ విధిగా చదవాల్సిన పుస్తకాలు. విశ్వకవి రవీంద్రుడు ‘వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్’ (Where the mind is without fear) అనే కవితలో విద్యా రంగానికి ఉండాల్సిన సముచిత స్థానాన్ని ఎత్తిచూపాడు. పైగా మన విద్య బంగారు పంజరంలో ఎలా చిక్కుకుందో వివరిస్తూ చిలుక చదువు అనే కథానికలో చక్కగా రవీంద్రుడు విశదపర్చాడు.
విప్లవాల్ని సాధించిన రష్యా, చైనాలు విద్యా రంగంపై అనేక ప్రయోగాల్ని నెరపాయ. పిల్లల మనస్తత్వం ఎంత సున్నితంగా ఉంటుందో వివరిస్తూ టాల్‌స్టాయి రాసిన కథ అకుల్య, మొదటి విద్యా మంత్రి (కమిస్సార్), ఎ.లునచార్‌స్కీ ప్రవచించిన విద్య-శిక్షణలు రష్యా విద్యావిధానానికి అద్దం పడతాయి. ఇక మావో స్వయంగా గాడి తప్పిన విద్యా రంగాన్ని ముందుగా పట్టించుకొని, నవ చైనా నిర్మాణంలో యువతను పెద్ద ఎత్తున భాగస్వాముల్ని చేసాడు. వాటి ఫలితంగానే ఈ రెండు దేశాలు అమెరికాను ఎదిరించగల అగ్రరాజ్యాలుగా ఎదిగాయి. సహజంగా ఏ వృత్తికి సంబంధించినవారైనా, వృత్తి నైపుణ్యతల్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటారు. దీనికి భిన్నంగా ఉపాధ్యాయులు ఎప్పుడో పొందిన శిక్షణతో, విషయ అవగాహనతో జీవితాంతం సరిపెట్టుకుంటూ, గతంలో నమ్మిన సిద్ధాంతం చుట్టే పరిభ్రమిస్తూ ఉంటారు. సృజనాత్మకత లోపించి, యాంత్రిక జీవనానికి అలవాటుపడడంతో తల్లిదండ్రులు యాజమాన్య సహకారంతో, ఉపాధ్యాయుల్ని పనిముట్లుగా వాడుకుంటూ విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నారు. ఇది తీవ్రరూపం దాల్చి హింస రూపంలో బహిర్గతవౌతున్నది. కొట్టకుండా, తిట్టకుండా బోధన చేయలేని స్థితికి ఉపాధ్యాయుల్ని నెట్టి, కొట్టకుండా చదువు చెప్పాలనే సూత్రీకరణ చేయడం నేలవిడిచి సాము చేయడమే అవుతుంది.
ఈవిషయంపై ఆలోచించుకోవాల్సింది ఉపాధ్యాయులే! తమకో వ్యక్తిత్వం ఉందని, తాము ఉపాధ్యాయులుగా జన్మించలేదని, తీర్చిదిద్దబడినామని (Teacher is not born, but made), నిరంతరం తీర్చిదిద్దబడాలని, స్వతంత్రంగా పనిచేసే స్వభావం ఉండాలని గుర్తించుకోవాలి. అలాగే ఈ దేశానికి కేవలం డాలర్లను ఆర్జించే ఇంజనీర్లు, డాక్టర్లే కాకుండా న్యాయాన్ని అందించే మంచి లాయర్లు, సమాజ స్థితిగతుల్ని చిత్రీకరించి రచనలు చేసే రచయితలు, కవులు, ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే వార్తలను సృజించే జర్నలిస్టులు, ప్రజల గొంతుల్ని వినిపించే గాయకులు, రాజకీయ కుళ్లును గీతల్లో వ్యంగ్యంగా గీచి చూపే కార్టూనిస్టులు, చిత్రకారులు, నైపుణ్యతతో కూడిన వివిధ వృత్తి కళాకారులు, మంచి పాలనను అందించే పార్లమెంటేరియన్లను, నిజాయితీగా ఉండి, ఆలోచించే పౌర సమాజంతోపాటుగా వీరందర్ని తయారుచేసే ఉత్తమ ఉపాధ్యాయులు కూడా కావాలని నేటి ఉపాధ్యాయులు గుర్తించాలి. వీటన్నింటిని మరిచి కేవలం కొన్ని వృత్తులకే మార్కెట్ డిమాండ్ ఉందని ఆ వృత్తుల చుట్టే విద్యా రంగాన్ని తిప్పుతే ఫలితాలు ఇప్పుడున్నట్లే ఉంటాయి.
ఈ సందర్భంగా అబ్రహం లింకన్ తన కొడుకు చదువు విషయంగా, ఉపాధ్యాయుడికి రాసిన లేఖను మననం చేసుకోవాలి. వెలుతురుతోపాటు చీకటి, సంతోషంతోపాటు దుఃఖం, మంచితోపాటు చెడు ఉంటాయనే భావనతో విద్యను అందించాలని, అమెరికా అధ్యక్షుడి కొడుకుగా కాదని రాసిన లేఖ నేటి ఉపాధ్యాయుడికి మార్గదర్శనం కావాలి. అలాగే ఔరంగజేబుకు విద్య నేర్పిన గురువు, ఆ స్థానంలో తనకో మంచి స్థాయి కలిగిన ఉద్యోగం ఇప్పించమని కోరితే, తనకెప్పుడు సాధారణ విద్యార్థిగా కాక, చక్రవర్తి షాజహాన్ కుమారునిగా మాత్రమే చదువునందించావని గురువును నిందించిన ఔరంగజేబు నిజాయితీని ఉపాధ్యాయులు నిత్యం గుర్తుంచుకోవాలి.
తరగతిలో విద్యార్థి అనూహ్యమైన శిక్షల్ని అనుభవిస్తున్నాడని భావిస్తూ, పాఠశాలలో అనైతిక పద్ధతుల నిరోధక బిల్లు - 2012ను కేంద్రీయ విద్యా సలహా మండలికి (CABE)కి సమర్పించడం ఉపాధ్యాయుల్ని కించపరిచేదే కాకుండా, ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని తెలుపుతుంది. వరకట్న, గృహహింస నిరోధక చట్టాలు దుర్వినియోగం అయినట్లే ఈ చట్టం కూడా దుర్వినియోగం జరిగి, దుర్మార్గపు టీచర్లు తరగతి గదుల్లో ఉంటే, నిజాయితీగల టీచర్లు ఈ బిల్లుకు బలిపశువులయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలోని చట్టాలు, వాటిని అతిక్రమించినవారికే ఎక్కువ ఉపయోగపడుతాయి కాబట్టి! దొంగా, పోలీసుల్లా, ఉపాధ్యాయ, విద్యార్థుల సంబంధాన్ని చూడాలనుకోవడం చదివితే ఉన్న మతి పోయిన చందంగా ఉంది. 1972లో ‘నేటి, రేపటి విద్య’ అనే అంశంతో యునెస్కో వివిధ దేశాల విద్యా రంగాన్ని పరిశీలించి లర్నింగ్ టుబి (Learning to be) అనే నివేధికను రూపొందించింది. ఉపాధ్యాయుడికి ఉండాల్సిన స్థాయి గూర్చి అందులో ప్రస్తావిస్తూ ‘‘ఉపాధ్యాయుడే స్వయంగా అత్యుత్తమస్థాయికి ఎదగాలని, ప్రతీ ఉపాధ్యయుడు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా మసలుకునే ప్రత్యేక మనస్తత్వాన్ని సంతరించుకోవాలని, కేవలం బోధించడం అనే విధానంనుంచి కాకుండా, విద్యావంతులుగా, సృజనాత్మకంగా ఆలోచించే విధంగా విద్యార్థుల్ని తయారుచేయాలని, నిర్దేశించిన పాఠ్యప్రణాళికల్ని అప్పజెప్పకుండా, వివిధ విషయిక స్పెషలిస్టులుగా కాకుండా నిజమైన విద్యావేత్తలుగా ఉపాధ్యాయులు సంసిద్ధులు కావాలని సూచించిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.

అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో అప్రతిహతంగా ఉన్నత స్థాయిని
english title: 
competition
author: 
- జి.లచ్చయ్య (సెల్: 9440116162)

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>