దయచేసి ఒక్కసారైనా
నీ ముఖం చూపించు
నీ నవ్వు చూపించు
నువ్వు నువ్వుగా నిలబడు
డాలర్ మొహం సందర్భాని
కనుగుణంగా మారిస్తే మార్చుదువు గాక
అనివార్యంగా తెచ్చుకున్న
సినిమా వెనె్నలని
పెదాలపై వేలాడదీస్తే
తీసావుగాక
అభినయ దర్పణం ఏదీ చెప్పలేని
నాగరికతా మూల్యాల నట సామ్రాజ్యం
నిర్మించుకుంటే
నిర్మించుకున్నావ్ గాక
అయినా మిత్రుడా
ఒక్కసారి నిజంగా నవ్వవూ
ఆనాటి ముఖంతో నవ్వవూ
నా కాళ్లకు లేపనాలు
పూయమని అడగను
నాకు నిర్వాణ పథం చెప్పమని
అభ్యర్థించను
నా పద్యాలను విని తీరమని
ఆంక్షించను
అడవిలో బధిరుడై
తిరిగే ఆర్తుని మీద
సుడిగాలై పోతావేమిటని
ప్రశ్నించను
మిత్రుడా ఒక్క చిరునవ్వు చాలు
నువ్వు తొలి తీరంలో
కదిలిన క్షణాన
ఏ దేవతలు అమ్మ చను
బాలై ప్రవేశించారో
ఏ వనరాణులు
కనిపించని దృశ్యాలై
నీకు వింజామరలు వీచారో
ఏ తల్లి చెట్టు నీపై
ఎడతెగని పూలవానై కురిసిందో
ఆనాటి నీ నవ్వు మళ్లీ నవ్వవూ
అంబళి వేళో
గాంధారి వేళో
కాదంటే
గోరుకొయ్యల కాలమో
భూపాల చినుకుల వేళ
చిగురు కలల తొలి
ఝాముల వీణల తీగెల్ని
మీటుతున్న క్షణాలలోనే
ఎప్పుడు కలవమన్నా కలుస్తా
ఎక్కడికి రమ్మన్నా వస్తా
ఆ నవ్వు కోసం
ఏం చేయమన్నా చేస్తా
దయచేసి ఆ నవ్వు నవ్వవూ..
*
ఊయెల
-సాంధ్యశ్రీ
వంపు గీతపై ఇటువైపు
వనజభవుడు
అందమెగబోస్తూ అటుపక్క
చందమామ
రేపు ఒక్కటే
రెండుగా రేయి- పవలు
తత్త్వ దర్శనమిచ్చు
చైతన్య భిక్ష...
సంజ కొలనిపై
తెలిమంచు చదురు మీద
కన్ను కొంచెమె తెరిచింది
కలికి తొలుత
సంజ నారింజ తొనలను
చప్పరిస్తు
పడమటింటికి
సిగ్గుతో ప్రాణమూదె
పొడుపు మలపైన
కుంకుమ పువ్వు విరిసె
తరళ మోహన రాగపు
తతులు పొల్చె
తావులను చిమ్ము
అలరుల దాపులోని
నిదుర పొదచాటు
కలలకు కదురు త్రిప్పె...
కోరిక కన్ను విచ్చినది
కూరిమి తామర కనె్నపిల్లకీ
తీరులు పొంగి తీయ
వలతీ వలయమ్మును ముట్టడించగా...
చందన సార శైత్యములు
జాల్కొను వెనె్నలలో కుముద్వతీ
సుందరి రేవెలుంగు పడుచుం
దొరసాని తనంబు చూపె నో....
ఇచ్ఛ ప్రకృతిదైనట్టి యినుమడింపు
ఫలము దినమైన సంతలో పవలు రాత్రి
ఉభయ సంధ్యల మధ్య నిట్లూగుచున్న
బ్రతుకు టూయెల; దీనికి స్వాస్థ్యమెచట...?
బతుకు
-బెహరా ఉమామహేశ్వరరావు
పుంఖాను పుంఖాల అనుభవం
చింపిరి చింపిరి పండు జుత్తు
రంగు వేయడంలో ఇబ్బంది లేదు
చిరిగిన మాసిన చొక్కా
కుంటిగా నడుస్తూ
అవసరం లేకున్నా
ముఖంలో దయనీయత
చేతికర్రతో ముందుకు సాగుతూ
ఊరూరు వేగంగా వెళ్లే
రైలు పెట్టెల్లో కనిపించేదే
చేయి చాచితే చాలు
కాసులు వేసే అపరకర్ణులు
కడుపు నిండడం కష్టం కాదు
పది, ఇరవై ఇంటికి చాలు కొందరికి
‘కావలెను’ అని బోర్డులు తగిలించిన
చేరేవారు చాల తక్కువ
పండుటాకుల్లాంటి మనుషులు
శరణాలయాలకు చేరడం
అహం అడ్డు వస్తూంది కొందరికి
పెంచిన పిల్లలు ఖండాంతరాలు పోతే
నడిరోడ్డున పడిన వృద్ధులకు తప్పదు
అదే బ్రతుకు, అదే బ్రతుకు
*