దేనికైనా రెఢీ సినిమా వివాదం ఒకవైపు సాగుతుంటే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా దేనికైనా రె‘్ఢ’ అంటున్నారు. అదేమిటంటారా?... ఈ నెల 2వ తేదీన బొత్స కుమార్తె వివాసం విజయనగరం జిల్లాలో అట్టహాసంగా జరిగింది. అయితే పిసిసి అధ్యక్షునిగా రాష్ట్ర మంత్రిగా ఉన్న బొత్స (ఆయన భార్య ఝాన్సీ లోక్‌సభ సభ్యురాలు) తమ కుమార్తె వివాహం సందర్భంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కొంత మంది విలేఖరులు బొత్స వద్ద ప్రస్తావించగా, ‘నేనుగానీ, నా కుటుంబ సభ్యులు గానీ ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు..’ అని చెప్పారు. గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు వివాహానికి వచ్చినప్పుడు పోలీసులు వారి విధి వారు నిర్వర్తించారే తప్ప అధికార దుర్వినియోగానికి ఆస్కారమే లేదని ఘంటాపథంగా చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువు చేస్తే తాను తలదించుకుంటానని తెలిపారు. వివాహానికి వంద కోట్లు వ్యయం చేసినట్లు కూడా అంటున్నారని చెప్పారు. వివాహానికి వంద కోట్లు ఖర్చు అవుతాయా? అని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారని ఆయన అంటూ ఈ విషయంలో ఏ విచారణకైనా రెడీ అని బొత్స ఛాలెంజ్ చేశారు.
- వి. ఈశ్వర్ రెడ్డి
డిజిపి పేరు దినేశ్‌కుమారా..?
డిజిపి పేరు మంత్రులకే తెలియకపోతే ఎలా ఉంటుంది? దినేష్‌రెడ్డి పేరును స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆయన ముందే దినేష్‌కుమార్ చేశారు. జూబ్లీహాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు దినేష్ కుమార్ అని ప్రస్తావించారు. జూబ్లీహాల్లో మహిళల సమస్యలపై జరిగిన వర్క్‌షాప్‌లో మంత్రి ప్రసంగిస్తూ వేదికపై ఉన్న వారి గురించి చెబుతూ దినేశ్‌రెడ్డిని దినేశ్‌కుమారంటూ ఉచ్చరించడంతో ఏంటీ ఏమైనా మార్పా? అని ఒకరినొకరు చూసుకున్నారు. మార్పు కాదు మంత్రి నోటిలో పేరు మారింది అంతే అని తెలిశాక నవ్వుకున్నారు.
- బివి రమణ
రైళ్లను పరిగెత్తిస్తున్న నేతలు
కేంద్ర రైల్వే మంత్రుల పుణ్యమా అని ఈ మధ్య మన రాష్ట్రానికి కొత్త రైళ్లు ఏమీ రావడం లేదు. వరదల పుణ్యమా అని పలు రైళ్లు కదలకుండా పట్టాలపై ఉండిపోయాయి. ఇలాంటి సమయంలో మన నాయకులు మాత్రం రైళ్లను పరిగెత్తిస్తున్నామని చెబుతున్నారు. ఏమిటా కథ అంటే ... తాను పాదయాత్ర ప్రారంభించగానే కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చంద్రబాబు ప్రకటించారు. తాను జగనన్న విడిచిన బాణాన్ని, జగనన్నకు లభిస్తున్న ఆదరణ చూసి కిరణ్ కుమార్, చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని షర్మిల చెబుతున్నారు. ఇవన్నీ తప్పు నేను ఇందిరమ్మ బాట ప్రారంభించగానే టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఆయా పార్టీల నాయకులు సైతం ఇదే వాదన చేస్తున్నారు. ఇంత మంది నాయకులు గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తుండగా, పట్టాలపై వెళ్లడం ఎందుకు అనుకున్నాయేమో ఈ మధ్య వరదల్లో రైళ్లు ఆగిపోయాయి. ఇంతకూ ఎవరి గుండెల్లో ఎవరు రైళ్లు పరిగెత్తిస్తున్నట్టు? నాయకులు కాదు ఏడాది ఆగితే నాయకుల గుండెళ్లో ప్రజలే రైళ్లు పరిగెత్తిస్తారు అని ఒక నాయకుడు సమాధానం చెప్పారు.
- మురళి
కెసిఆర్ కొత్త సినిమా రిలీజు
‘టిజెఎసి చైర్మన్ కోదండరామ్‌తో కలిసి టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్’ టైటిల్‌తో మార్కెట్‌లోకి మరో వివాదస్పద కొత్త సినిమా విడుదల కాబోతున్నది. ఇటీవల విడుదలైన సినిమాలన్నీ వరుసగా వివాదాస్పదం అవుతుండటంతో, అదే పరంపరలో తన కొత్త సినిమా త్వరలో మార్కెట్‌లోకి రాబోతుందని కెసిఆర్ స్వయంగా చెప్పారు. అయితే ఇది రాజకీయ సినిమా కావడంతో విడుదల కాకముందే విమర్శలు వెల్లువెతున్నాయి, అది వేరే సంగతి. సినిమాలపై వివాదాల పరంపర కొనసాగుతుండటంతో, అదే పరిభాషలో టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తన మలి దశ ఉద్యమాన్ని అభివర్ణించారు. ‘కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రధాన మంత్రి చెప్పారు కాబట్టి కొంతకాలంగా వౌనంగా ఉన్నాను. ఇక నుంచి చూడండి, మార్కెట్‌లోకి కొత్తగా కెసిఆర్ విడుదల కాబోతున్నాడు’ ఆయన అన్నారు. తన న్యూ ఎంట్రీ నరసింహా అవతరాన్ని పోలి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
- వెల్జాల చంద్రశేఖర్
మంచి పోలీసులు
ఒక లక్ష కాదు, రెండు లక్షల రూపాయల కాదు. ఏకంగా ఆరు కోట్ల రూపాయల నగదు... కళ్లు జిగేల్ మనే నోట్ల కట్టలు. ఈ కలికాలంలో ఇంత భారీ మొత్తం దొరికితే వదులుకునే పిచ్చోళ్లు ఎవరుంటారు? కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో నీతి నిజాయతీ ఉందని చెబుతున్నారు పోలీసులు. డిజిపి కార్యాలయం వద్ద ఆటోలో ఆరు కోట్ల రూపాయల నోట్లకట్టల బాక్స్ దొరికిన విషయం విదితమే. ఇంత పెద్ద మొత్తంలో నగదును పట్టుకున్న పోలీసులు ఎంతో నిజాయితీగా పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మా నిజాయితీకి ఇంత కన్నా ఇంకేం నిదర్శనం కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో నోట్ల కట్టలను పట్టుకున్న పోలీసులను పోలీస్ బాస్ అభినందించి, నగదు పారితోషికం ప్రకటిస్తే బాగుంటుందని పోలీసులు అంటున్నారు. అస్తమానం పోలీసు శాఖను తిట్టుకునే వారికి ఈ సంఘటన కనువిప్పు కావాలని పోలీసులు అంటున్నారు.
- శైలేంద్ర