ఒంటి చేతి చప్పట్లూ, ఒంటి శరీరపు కౌగలింతలూ, ఒంటెద్దు నాగళ్ళూ..ఉంటాయా? అని అడగకూడదు. ఉంటాయి. ఏక సభ్య సంఘటలో చర్చల్లాగా..!
ఉన్నదే ఒకే ఒక సభ్యుడు కదా! ఎలా చర్చిస్తాడూ- అన్న అనుమానం వస్తుంది. తనలో తాను చర్చిస్తాడు. ఏం?
తప్పా! ఆ మాటకొస్తే గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ తరహా చర్చలే చేస్తారు. అసలు గొప్ప వారంటేనే ఒంటరివారు.
లక్షల, కోట్ల సంఖ్యల్లో సభ్యులున్న పార్టీ నేతలు కూడా గొప్ప వారే. అనగా ఒంటరి వారే.
అంతమంది అండవున్నా, చర్చలకొచ్చేసరికి ఒంటరి వారయిపోతారు.
రాష్ట్ర కమిటీలూ, కేంద్ర కమిటీలూ, పోలిట్ బ్యూరోలూ, వర్కింగ్ కమిటీలు ఎన్నో వుంటాయి. వాటిల్లో కూడా తక్కువ సంఖ్యలో సభ్యులుంటారు. వారిని ముందు పెట్టుకుని కూడా గొప్ప నేతలు- ఒంటరివారిగానే ఫీలవుతారు.
అందుకు వారి తరపున కూడా తానే ఆలోచించి పెడతారు. తమ తరపున కూడా చర్చించి పెడారు. ఒకే ఒక్కరయి తమలో తాము మథన పడతారు. నిజానికి ఇది అంతర్మథనం. కానీ అలా అనటం ప్రజాస్వామ్య భాష కాదని ‘మేధో మథనం’ వంటి గంభీరమైన పదాలు వాడతారు.
ఉండటానికి అక్కడ వంద బుర్రలు వుండవచ్చు. కానీ ఒక్క బుర్రే ఆలోచిస్తుంది. మిగిలిన తొంభయి తొమ్మిది బుర్రలకు పనిలేదని కాదా? ఏం? ఊపటం మాత్రం పని కాదా? ఆవి ఆ పనిలో నిమగ్నమయి వుంటాయి. పార్టీ అన్నాక అందరి భాగస్వామ్యం తప్పదు.
ఇదేమీ ఆక్షేపించ దగింది కాదు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎలా ఎన్నుకుంటారు చెప్పండి. మెజారిటీ వచ్చిన లెజిస్లేచర్ పార్టీ సభ్యులు ముఖ్యమంత్రిని ఎంపిక చేసే నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి (ఆలోచించే బుర్రకి) వదలి పెడుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారు. ఆ తర్వాత అధిష్ఠానం బాగా ‘అంతర్మథనం’ చెంది ఒక పేరును సీల్డు కవరులో పంపుతుంది.
ఇలా ఒకే బుర్ర ‘ఎంపిక’ ఎన్నికయినప్పుడు, ఒకే బుర్ర ప్రకటించిన ‘అభిప్రాయం’ చర్చ ఎందుకు కాదూ?
కాంగ్రెస్ సూరజ్‌కుండ్‌లోనూ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) కరీంనగర్‌లోనూ ఇలాంటి ప్రజాస్వామిక చర్చలే చేసారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ మిగిలిన సభ్యులతో పాటు బస్సులో కూర్చుని ప్రయాణించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇతర పార్టీ పెద్దలను ఎంతో వినయంగా ఆహ్వానించారు.
కానీ రెండు చోట్లా జరిగినవి ప్రధానంగా ‘ఒంటి బుర్ర చర్చలే.’
సబ్సిడీ మీద ఇచ్చే గ్యాస్ బండల్ని మూడు చెయ్యటమూ, చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్య పెట్టుబడుల్ని అనుమతించటమూ మంచిదా? కాదా? ఇదీ సూరజ్ కుండ్ చర్చ.
పనె్నండు బండలు ఇవ్వాలనీ విదేశీ పెట్టుబడుల్ని నిలుపు చేయాలనీ ‘ఊపే’ బుర్రలను కొద్ది సేపు ఆపించవచ్చు. ‘నేరుగా వోటరుకి నగదు బదిలీ చేస్తే నొప్పులన్నీ అవే పోతాయి’ అని అధిష్ఠానం అనగానే, ‘అవును కదా! ఈ అభిప్రాయమే రైటు’ అని అందరికీ అనిపించింది. అలా అనిపించటంలో ప్రజాస్వామ్యం ఊరేగుతోంది.
తెలంగాణ మీద కేంద్రం తక్షణం ప్రకటన చేయకుంటే అల్లకల్లోలం చేయాలని టీఆర్‌ఎస్‌లో కూడా ‘ఊపే’ బుర్రలకనిపించవచ్చు. కానీ ‘2014’ ఎన్నికలలో 15 పార్లమెంటు సీట్లు గెల్చుకుని తెలంగాణ తెచ్చుకుందాం’ అని అధినేత అంటే, ‘అవును’ కదా ఈ మార్గమే రైటు’ అని ‘ఊపే’ బుర్రలు కూడా ఉంటాయి.
రెండు చోట్లా ఇలా ‘మేధో మథనం’ జరిగిపోయింది.
రెండు పార్టీల్లోను అధినేతలు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేశారు.
అనుకుంటాం కానీ, ఇటీవల కుటుంబాల్లోనూ, కాపురాల్లోనూ కూడా ఇలాంటి ‘మేధో మథనాలు’ వచ్చేశాయి.
మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న కాపురాల్లో ఈ అంతర్గత ప్రజాస్వామ్యం అంతంత మాత్రంగాను, కుదిర్చిన పెళ్ళిళ్ళలో కొట్టొచ్చినట్టూ కనిపిస్తోంది.
ఆదివారం మధ్యాహ్నం ఓ మిత్రుడి నుంచి ఫోనొచ్చింది. వాడిది ప్రేమ వివాహం లెండి.
‘నేనూ మా ఆవిడా ఏ సినిమాకు వెళ్దామని చర్చించుకుంటున్నాం. నీకు తెలుసు మేం ఏ విషయమైనా నిర్మొహమాటంగా చర్చించుకుంటాం. తానే బాలివుడ్ సినిమాకే వెళ్దామంటుందామె. నేనేమో హాలీవుడ్ సినిమా అంటాను. నాకు కోపం వచ్చింది. బాలీవుడ్ సినిమాకి వెళ్ళాల్సి వస్తే గుండు గీయించుకుంటాను- అని అనేశాను. ఆమెకు ఇంకా కోపం వచ్చింది. హాలీవుడ్ సినిమా చూపిస్తే, విడాకులిచ్చేస్తానంది..’ ఇంకా వాడేమొ చెబుతున్నాడు కానీ, సంభాషణను అడ్డుకున్నాను.
‘మరి టోపీ కొనుక్కున్నావా? లేదా?’ అనడిగాను.
‘మీ ఆవిడేమో కానీ, నేను మాత్రం నిన్ను గుండుతో చూడలేన్రా!’ అన్నాను.
‘అంత ఖచ్చిడంగా ఎలా చెప్పగలిగావ్!’ అని ఆశ్చర్యపోయాడు వాడు. ఆ రోజు ఆదివారం కావటం వల్ల అప్పటికే వాడు గుండు గీయించుకున్నాడు లెండి.
‘ఇందులో చెప్పటానికేముంది. మీ ఇంట్లో మీ ఆవిడే అధిష్ఠానం కదా!’ అన్నాను.
అయితే చాలా కుటుంబాల్లో భర్తే అధిష్ఠాన స్థానాల్లో ఉంటారు.
ఒకావిడ లేడీస్ క్లబ్‌లో అంటోంది: ‘నాకు పీడించి లంచం పుచ్చుకునే వాళ్ళంటే అసహ్యం. వాళ్ళంతట వాళ్ళిస్తే పుచ్చుకోవాలి తప్ప, పీడించటమేమిటి మరీను.’
ఇది ఆమె ‘బుర్ర’లో పుట్టిన అభిప్రాయం కాదు. మెండుగా ‘రాబడి’ వచ్చే ప్రభుత్వాధికారిని వెతికి పట్టి కోటి రూపాయలు లంచమిచ్చి అతన్ని ఈమెనిచ్చి పెళ్ళి చేశాడట వాళ్ళ నాన్న. అంచేత ఆమెకు భర్తే అధిష్ఠానం. భర్తదే ‘ఆలోచించే బుర్ర’. తనది ఆడించే ‘బుర్ర’. ప్రతీ విషయాన్నీ రెండు బుర్రలూ ప్రతీ రోజూ చర్చిస్తాయి. చూశారా! కుటుంబంల్లోను, పార్టీల్లోనూ ఒకే రీతిలో ‘బుర్ర’కథలు నడిచిపోతున్నాయి!!
ఒంటి చేతి చప్పట్లూ, ఒంటి శరీరపు కౌగలింతలూ, ఒంటెద్దు
english title:
takita takitaka
Date:
Sunday, November 11, 2012