పరిశోధనకోసం 1979లో ఆదిలాబాదు జిల్లాలో పర్యటిస్తున్నాను. నెత్తిమీద నెమలీకలు తలపాగాలు, కొమ్ములు అమర్చుకున్న తలలతో గిరిజనులు ఉంటారని అనుకునేవాడిని. అందుకు కారణం సినిమాలు. నవలలు. కాని గోండులు చాలావరకు సాదాసీదా దుస్తుల్లో కనపడతారు. పైకి కట్టిన తెల్లని ధోవతి, చేతుల బనీను లేదా అంగీ. మామూలు దుస్తులు వారివి. కాని వారు మామూలు మనుషులు కాదు. మహనీయులు.
కేవలం దీపావళి పండగ సందర్భంలో దండారి నృత్యం చేసే వాళ్ళు మాత్రమే నెమలీకల కట్ట, చేతిలో కర్ర, నడుముకి గవ్వల పేరు, సంచి వంటి వాటితో ఒక ప్రత్యేక వేషధారణ ఉంటుంది. అది ఎంతో పవిత్రమైనది. ఒక గోండు గూడెంనుండి మరో గోండు గూడేనికి వెళ్ళి ఆట ఆడి, వాళ్ళదగ్గర భోజనం చేసి తిరిగి వస్తారు. వచ్చేముందు ఆ గూడెంవారిని వచ్చే పండక్కి తమ ఊరికి ఆహ్వానిస్తారు. వాళ్ళు అలాంటి వేషధారణతోనే మరుసటేడు వచ్చి ఆ వూళ్ళో దండారి నృత్యం చేసి వెళ్ళాలి. ఇది కట్టడి. ఊళ్ళమధ్య సయోధ్య. అవగాహన పెంచుకోవడం దీని ఉద్దేశం కావచ్చు. దీపావళికి ముందురోజుల్లో కాలిబాటలు, జాతీయ రహదారుల్లో ఈ వేషాలు కనుపిస్తాయి. అలా వందలాది నృత్యాల ఊరేగింపులు కనువిందు చేస్తాయి.
గోండులు ప్రాచీనకాలం నుండి రాజ్యాలు ఏలారు. శత్రుమూకలను దునుమాడారు. అటు నాగరిక ప్రపంచం దాడిని, ఆ రాజ్య వ్యవస్థలను ఏకకాలంలో ఎదుర్కొన్నారు. వారు ప్రకృతితో పోరాడుతునే జీవితాన్ని గెలిచిన యోధులు.
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలవడానికి వారి స్వీయానుభవ జ్ఞానమే వారికి తోడ్పడింది. పరాయి జ్ఞానాన్ని తిరస్కరించారు. కాబట్టే స్థానిక జీవన ప్రమాణాలను ఉన్నతీకరించుకున్నారు. వారి కళలు, నిర్మాణాలు ఆనాటికి అద్భుతాలే. వారి నమ్మికాలూ, విశ్వాసాలు వారి తెగకి ఉపయోగకారులే.
ఇంత అత్యాధునిక కాలంలో చదువుకున్నవాళ్ళలో పెచ్చుపెరుగుతున్న వ్ఢ్యౌం, మూఢ భక్తి, అంధవిశ్వాసాలు, నమ్మకాలకి అంతులేదు. శాస్ర్తియ భావాలు పెరిగినా, సాంకేతిక శాస్త్రం పురోగతి చెందినా మనిషి మూఢుడిగా మారుతున్నాడు. ప్రకృతితో సహచర్యం చేస్తూ దాని వరాలను పొందినప్పుడు ఆదివాసీ ఆనందిస్తాడు. శాపాలను చవిచూసి భీతిల్లుతాడు. అనిశ్చితి, భీతివల్ల మనిషి బలహీనపడతాడు. అలాంటప్పుడు వాటిని చూసి వారిని అనాగరికులని అనుకోవద్దు. అది మానవ జాతిలో సర్వసాధారణం. ఒక జాతి, గుంపు, ప్రాంతం, అక్కడి ప్రజల గుణగణాలు ముఖ్యం. దయ, ధార్మికత, ఔదార్యం, క్షమ, పోరాట నైజం వంటి వాటిని చూడాలి. మానవ ధర్మంగా సంక్రమించే సహజీవన గుణగణాలు ముఖ్యం. వాటిని పరిహరించి చూసే సిద్ధాంతాలు, అవగాహనలు తప్పు. ఆ ప్రజల సాంస్కృతిక వ్యక్తీకరణ, విలక్షణ సంప్రదాయాలు కూడ జీవితాన్ని ముందుకు తీసుకుపోయే లక్షణాలుగా గుర్తించాలి. ప్రాదేశిక భౌగోళికత, పర్యావరణం, జీవన శైలుల సమగ్రతలో నూటికి ఒకటీ అరా కాలంచెల్లిన నమ్మకాలు ఒకరిద్దరి వద్ద కనుపిస్తే వాటిని పెద్దగా పేర్కొనవలసిన అవసరం లేదు.
ఆధునిక వైద్యం (అది వైరుధ్యాలమయం) అందనిచోట సులభంగా లభ్యమయ్యే ఆకు పసరుతో రోగం నయంచేసుకోవాలని ప్రయత్నిస్తే అది తప్పా? ఎవరి తప్పు? ప్రభుత్వానిది కావచ్చు. పార్టీలది కావచ్చు. లేదా శిష్టజనులది కావచ్చు. ఈ వర్గాలే ఆ గిరిజనులను చులకన చేయడం బాధాకరం.
ఇవ్వాళ మన రాష్ట్ర సరిహద్దుల వెంట, ఆవల ఉన్న గిరిజన తెగలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అశాంతితో కొట్టుమిట్టాడుతున్నాయి. తమ జాతి, ప్రాంత సంపదపై దోపిడి పంజా విసరబడితే ఏంచేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. బహుళజాతి కంపెనీలకి భారత ప్రభుత్వం విచక్షణారాహిత్యంగా అనుమతులివ్వడం, రాష్ట్ర ప్రభుత్వ పాలకవర్గాలు అందుకు జోహుకుం అనడం, న్యాయవ్యవస్థ, సంభవించే ఆపదని రాజ్యాంగ నేత్రంతో చూడలేకపోవడం బాధాకరం.
వామపక్ష పార్టీలు ఎన్నికల ప్రయోజనాలకోసమే ప్రయోగాలు చేయడం పైగా అందుకు సైద్ధాంతిక వెసులుబాటు కల్పించడం విచిత్రం. సామ్రాజ్యవాదానికి కొన్ని రాష్ట్రాలలో వెసులుబాటు కల్పిస్తూనే, మరోచోట వ్యతిరేకించే విధానాలను, ఉద్యమాలను చేపట్టడం చిత్తశుద్ధిని తెలియజేస్తున్న తరుణం.
విప్లవశక్తులు కొన్ని నగరాలకే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని గిరిజన ప్రాంతాలలోనే లోతుగా దిగబడిపోయాయి. గిరిజన, గిరిజనేతర శక్తుల మధ్య వారధి నిర్మాణం కాలేకపోవడాన్ని ఏమనాలో తెలియదు. పోరాటం చేసే శక్తుల త్యాగాన్ని ఎవరూకాదనరు. వారి ఉద్యమాలకు సానుభూతి ఉంటుంది. కాని సానుభూతిని, సహకారాన్ని అందుకోలేని పరిస్థితి కొంత ఆలోచనీయం.
వంతెన కిరువైపులా ఉన్న పోరాట శక్తుల అనుసంధానం జరగనిదే జయాపజయాలు గురించి ఇవ్వాళ నిర్దిష్టంగా ఏమీచెప్పలేం. గిరిజనుడి గెలుపే రేపటి జన విజయం. అపజయం సామ్రాజ్యవాదుల ఉక్కు పిడికిలి విజయం. అందుకే గిరిజనుడు గెలవాలి. కేవలం రాజ్యాధికారంకోసం చేసే పోరాటంవల్ల విజయుడుకాలేడు. వారి పంట పొలాలు, జలపాతాలు, కొండకోనలు, వన సంపదని కాపాడుకోవాలి. అవి లేకుండా పొందే విజయం కోట కోల్పోయి, జెండా గెలవడం వంటిది.
ఆదివాసీ వారసత్వ సంపదని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? 1979లో ఆదిలాబాదులో పర్యటిస్తున్నప్పుడు అనుకోకుండా కలుసుకున్న లచ్చూబాయి ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నది. అప్పటికి ఆమె వయస్సు అరవై ఏళ్ళు. కుడి కాలి మడమ దెబ్బతిన్నది. ఆమె గోండుల తెగ పెద్దల కుటుంబానికి చెందింది. ఆమె భర్త, అన్న ఇద్దరూ ఒకే ప్రమాదంలో మరణించారు. దానికి కారణాలు ఏమిటి? ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేకపోయారు. కాని ఆమె మాటల్లో ఏదో శంక. భయం. ఐనా ఆమె తన బతుకు బాధ్యతని స్వీకరించింది. ఇంటి పెద్దరికాన్ని చేపట్టక తప్పలేదు. తెగ కూడా ఆమెకి కొన్ని బాధ్యతలు ఉంచిందనిపించింది. అవేమిటో స్పష్టంగా ఆమె వ్యక్తంచేయలేదు. కాని పలుమార్లు ప్రశ్నిస్తే ఏదో గొణిగింది. పెన్నాపెర్సా గురించి చెప్పింది. కొండమీది పెద్దలు తన ప్రాచీనులని ఎలా కాపాడిందీ చెప్పింది. అందుకు ప్రతిఫలంగా పెద్దలు తమ మీద ఉంచిన బాధ్యత ఏదో ఉందని చెప్పింది. కాని సగం తెలుగు, సగం గోండీ భాష. మళ్ళీ మళ్ళీ అడిగితే మాట్లాడ్డం మానేస్తుందని మారుమాట్లాడకుండా వింటూపోయాం. అప్పుడప్పుడే దూరంగా సిమెంట్ ఫాక్టరీ ఏర్పాటు. దానిలో పనికోసం గోండులు కూలీలయ్యారు. రాళ్ళని కొట్టి పిండిచేసి సిమెంట్ ఫాక్టరీకి లారీల్లో పంపేవారు. ఒక కొత్త వాతావరణం. గోండుల బతుకు చిత్రంలో ఛిద్రాలు.
ఐనా లచ్చూబాయి రాత్రి భోజనాలయ్యాక తన పంట పొలంలోకి వెళ్ళి అక్కడ వేసుకున్న గుడిసెలో ఉండి తెల్లారి వచ్చేది. ఆమెని అక్కడే కలుసుకున్నాం. గోండీ స్ర్తి సమర్త, పెళ్ళి, కాన్పు వంటి జీవిత చక్రం దశలకి సంబంధించిన పాటలు, విజ్ఞానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.
మిగతావారు ఆ ప్రశ్నలడిగారు. నాకు మాత్రం ఆమె రాత్రి ఇక్కడ ఎందుకోసం ఉంటున్నదని అనిపించింది. ఆ ప్రశ్న అడగ్గానే ఆమె మాట మార్చేది. విననట్లే ఉండిపోయింది. ఆ రాత్రి అక్కడే గడిపి తెల్లారి వెళ్ళిపోయాం. వేకువ వెలుగులో ఆమె చేతిమీద పచ్చబొట్టు. ఇదేమి బొమ్మ అని అడిగి చూశాను. అది సంకేత రూపంలో ఉన్న ఉడుం. ఆ ప్రాంతంలో ఉన్న గోండులు ఉడుం తినరాదని ఆ తరువాత తెలిసింది. మరో రెండ్రోజుల తరువాత అదే తోవలో పోతూ మళ్ళీ ఆవిడని కలుసుకున్నా. ఎందుకు వచ్చారా అన్నట్లు చూసింది. కాని వెంటనే శనగపప్పులో బంగాళాదుంపలు వేసి చేసిన కూర, అన్నం పెట్టి సాగనంపింది. పెద్ద కొడుకుని దారిచూపమని సాగనంపమని చెప్పింది. దారిలో అతనితో మాటలు కలిసాయి. రాత్రి తల్లి ఒక్కర్తె కొండదాపున ఉన్న పంట పొలంలో ఎందుకు ఉంటుందని అడిగాను. అతడికే తెలియదన్నట్లు మాట్లాడాడు. రాత్రి ఉడుములతో మాట్లాడుతుందని, వాటికి సంబంధించి ఒక గీతం పాడుతుందని చెప్పాడు. ఎండాకాలంలో వాటికి కావలసిన నీళ్ళు పారే చిన్నపాయ ఒకటి అక్కడ ఉందని, అక్కడకు అవి వెళ్ళడానికి ఆమె సహకరిస్తుందని అన్నాడు. నాకు పూర్తిగా అర్ధంకాలేదు. ఆ పాయ పారడంలో ఆటంకం కలగకుండా చూస్తుందని కూడా గోండీ భాషలో చెప్పాడు.
లచ్చూబాయి. రూపం నాకు మసకగా కనుపించింది. ఆమె రూపంలో ప్రాచీన గోండుల ఆచారం, మానవీయత కనుపించింది. ఆ నీటిపాయ వన్యప్రాణులకోసం. అది పారితేనే అక్కడ జీవరాశి నిలుస్తుంది. దానిని కాపాడడం వన్యప్రాణి రక్షణే. మన రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పార్టీలు, సిద్ధాంతాలు తాకని దరి అది.
తెలియని వారికి- లచ్చూబాయి సిద్ధాంతం, బాధ్యత, ఆచరణ అంధవిశ్వాసంలా తోచవచ్చు. ఆమె బాధ్యత పిచ్చిగా అనిపించవచ్చు. పురావిశ్వాసాన్ని జీవావరణ సంరక్షణ బాధ్యతకు జీవితాన్ని అర్పించిన మహిళ అని తెలుసుకోవడానికి మన చదువులు పనికివస్తాయా.
ఆనాడు మేం చూసిన లచ్చూబాయి ఇంకా బతికి ఉందా?
లేదా అలాంటి లచ్చూబాయిలు వేరే ఎవరైనా ఎక్కడ ఉన్నారా? వాళ్ళని కలుసుకోవడం సాధ్యమా? అలాంటి దేవతలు, సులభంగా కనుపించరు. ‘‘తపస్సు’’ చేయాలి.
పరిశోధనకోసం 1979లో ఆదిలాబాదు జిల్లాలో పర్యటిస్తున్నాను. నెత్తిమీద నెమలీకలు
english title:
thovva muchatlu
Date:
Sunday, November 11, 2012