సత్య హితాలాప చతురత యర్హంబు
సంతత సుజన పూజనము వలయు
విను కామసంరంభ విద్వేషముల జేసి
మతి గలంగినను ధర్మంబు దప్ప
ద్రొక్కక నడచు టత్యుత్తమ సరణి, య
ప్రియములయందును బ్రియములందు
దైన్య హర్షంబుల దగుల యున్నట్టి
కల్యాణ వర్తన కాంక్ష లెస్స
ఎగ్గు చేసిన వారికి హితము సేత
యార్యజనములు కీర్తింతు, రన్యదోష
కారి తన పాపమున దాన కాలిపోవు
వేఱ వానికి గీడు గావింపనేల?
భావం: మానవునకు సత్యమూ, హితమూ అయన మాటలనేర్పు ఉండాలి. ఎల్లవేళలా మంచివారిని మన్నిస్తూ ఉండాలి . విను. కోరికల విజృంభణం వలన ఏర్పడే పగల చేత మనస్సు కలతపడినా ధర్మాన్ని తప్పకుండా మెలగటం చాలా గొప్ప పద్ధతి. అప్రియం కలిగినప్పుడు క్రుంగిపోవడం ప్రియం కలిగినపుడు పొంగిపోవటం లేని శుభప్రదమైన జీవన విధానం మేలైనది.
కీడు చేసిన వారికి కూడా మేలు చేయటాన్ని సజ్జనులు కొనియాడుతారు. ఇతరులకు కీడు చేసేవాడు తన పాపంతో తాన కాలిపోతాడు వేరుగా వానికి కీడు చేయటం ఎందుకు?
ఆంధ్ర మహాభారతంలోని పద్యమిది