‘వడ్డించమంటారా?’ అన్న భార్య ప్రశ్నకి సమాధానంగా తలూపాడు. కిచెన్‌ని ఆనుకుని ఉన్న వసారాలో కోడలు అందరికీ అరిటాకులు వేసింది. సర్వేశ్వరరావు కాళ్లూ చేతులూ కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. తన ప్రక్కనే కొడుకు, ఆ ప్రక్కనే అఖిల, ఆమెప్రక్కన ఆమె చెల్లెలు, వాళ్లకెదురుగా మనుమడు, మనవరాలు కూర్చున్నారు.
పెరట్లోంచి చల్లటిగాలి వీస్తోంది. ఇంచుమించు ఏడునెలల తరువాత మళ్లీ అలా తండ్రి ప్రక్కనకూర్చుని, అందరితో భోజనం చేయడం అఖిలకి చాలా ఆనందంగా అనిపించింది.
కాకపోతే ‘అది తిను, ఇది తిను, ఈ కూర ఆరోగ్యానికి మంచిది’ అంటూ సరదాగా ఉండే తండ్రి వౌనంగా భోజనం చేయడం మాత్రం ఆమెకు కొంచెం బాధగా ఆనిపించింది.
తల్లీ, వదిన కూడా భోజనాలు ముగించి గదిలోకొచ్చారు. పిల్లలు టీవీకి అతుక్కుపోయారు. అఖిల అన్న పనిమీద బయటికి వెళ్లిపోయాడు. సర్వేశ్వరరావు గదిలో కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నాడు.
‘‘ఏమిటే విశేషాలు?’’ తల్లి మంగాదేవి అడిగింది కూతురు అఖిలని.
తను చేస్తున్న ఉద్యోగం, ఉంటున్న ఫ్లాటు అన్నీ వివరంగా చెప్పింది అఖిల.
‘‘బాబాయ్ దగ్గరే ఉండొచ్చు కదా! ఎందుకు వేరే వెళ్లిపోయావ్’’ అడిగిందామె.
అఖిల సమాధానం చెప్పలేదు. తండ్రివైపు కళ్లతో సైగ చేసింది. మంగాదేవి ఇంక మాట్లాడలేదు. నవ్వి ఊరుకుంది.
‘‘అతడుకూడా అక్కడే ఉన్నాట్ట కదా?’’ అనూహ్యమైన ప్రశ్న తండ్రి నోటినుంచి వచ్చేసరికి లిప్తకాలంవౌనం వహించింది అఖిల.
‘‘అవును నాన్నా! లాయర్ దగ్గర అసిస్టెంటుగా ఉన్నాడు. ప్రాక్టీసు చేస్తున్నాడు’’ ఏ తడబాటు లేకుండా చెప్పింది అఖిల.
సర్వేశ్వరరావు మరింకేం మాట్లాడలేదు. ఇంకా ఏమన్నా అడిగితే చెబుదామనే ఉందామెకు. ఏదీ దాచాలని ఆమె అనుకోవడం లేదు. తండ్రి లేచి హాల్లోకి వెళ్లిపోయాడు.
మంగాదేవికి కూతుర్ని చాలా విషయాలు అడగాలని ఉంది- మీరిద్దరూ రోజూ కలుసుకుంటున్నారా? అతడు నీ రూముకొస్తున్నాడా? వగైరా...
తల్లి తహతహ అఖిలకి అర్థమయ్యింది. ఆమె అడగాలనుకున్నవన్నీ ఆమే చెప్పింది. తాము ఫోన్లు చేసుకుంటామని, అప్పుడప్పుడు కలుసుకుని కబుర్లు చెప్పుకుంటామని, సినిమాలు, షికార్లు చేస్తామని, కానీ- ఎవరి హద్దుల్లో వాళ్లుంటామని- ఏదీ దాచకుండా చెప్పింది అఖిల.
అంతా విని నిట్టూరుస్తూ- ‘‘సంబంధాలు దొరక్క చస్తుంటే చాదస్తం కాకపోతే మీ నాన్నకీ శాఖల పట్టింపులేమిటి!?’’ అయినా ఆయన పిచ్చిగానీ ఇవ్వాళున్న ఆస్తులు రేపుంటాయా! ఎంతమందిని చూళ్లేదు దర్జాగా వెలిగి బికారులైపోయిన వాళ్లని!’’ అన్నది మంగాదేవి.
‘‘సరే ప్రయాణం చేసొచ్చావ్. కాస్సేపు పడుకో’’ అనేసి ఆమె బయటికి వెళ్లిపోయింది. ఓపావుగంట కూర్చుని కబుర్లు చెప్పి వదిన కూడా వెళ్లిపోయింది. అఖిలని ఏవో ఆలోచనలు చుట్టుముట్టాయి కాస్సేపు.... ‘‘పవన్ కూడా ఇంటికి వెళ్లి ఉంటాడు... అతడూ ఇలాంటి ప్రశ్నలే ఎదుర్కొంటున్నాడా...’’ ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది.
సెవెన్ సీటర్ దిగి అరఫర్లాంగు నడుచుకుంటూ ఇంటికొచ్చిన పవన్‌కుమార్‌కి గుమ్మంలోనే ఎదురయ్యింది తల్లి రామలక్ష్మి. కొడుకుని చూసి ఆవిడ ముఖం చాటంతయ్యింది. ఆప్యాయంగా చేతులు పట్టుకుని లోపలికి తీసుకు వెళ్లింది.
ఆరోజు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్నాడు తండ్రి జగన్నాధం.
‘‘ఏ ట్రెయిన్‌కి వచ్చావ్?’’ కొడుకుని అడిగాడు. చెప్పాడు పవన్.
‘‘్భను మామయ్యా వాళ్లూ బాగున్నారా?’’ తల్లి అడిగింది.
‘‘బావున్నారమ్మా. పోయిన ఆదివారమే వెళ్లాను వాళ్ళింటికి’’ పవన్ చెప్పాడు.
తండ్రి అలా ప్రశాంతంగా మాట్లాడతాడని అనుకోలేదు పవన్. ఉద్యోగం మానేసినందుకు గయ్‌మని అరుస్తాడేమోనుకున్నాడు. ఆయనలా ప్రశాంతంగా ఉండడంతో తాను ఉద్యోగం మానేసినా లా ప్రాక్టీసు చేస్తూ నెలనెలా డబ్బు పంపుతున్నందుకు ఆయన కోపం కొంచెం తగ్గిందనుకున్నాడు.
బ్రష్ చేసుకొచ్చేసరికి తల్లికాఫీ ఇచ్చింది. గచ్చుమీద కూర్చున్నాడు గోడనానుకుని. చెల్లెల్లి ‘బాగా చదువుతున్నావా?’ అని పలుకరించి అవీ ఇవీ మాట్లాడాడు.
‘‘స్నానం చేస్తే చేసెయ్‌రా. వేణ్ణీళ్లు కాగి ఉన్నాయి’’ అని తల్లి చెప్పింది.
ఇంతలో జగన్నాథం తుండు భుజాన వేసుకుని స్నానానికి బయల్దేరాడు. నాన్నగారికి నీళ్లు పెట్టమని కూతురికి పురమాయించింది రామలక్ష్మి.
‘‘ఆ అమ్మాయి కూడా అక్కడే ఉద్యోగం చేస్తోందట కదా!’’ పవన్‌ని అడిగాడు జగన్నాధం.
‘‘అవును చేస్తోంది’’ పవన్ చెప్పాడు.
‘‘ఎక్కడుంటోంది? రోజూ కలుసుకుంటున్నారా? లేక ఇద్దరూ ఒకే చోట ఉంటున్నారా? లాంటి ప్రశ్నలు జగన్నాధం నోట్లో నానుతున్నాయి.
‘‘నేను మా ఫ్రెండు కలిసి ఒక అపార్టుమెంటులో ఉంటున్నాం. అఖిల తన ఫ్రెండుతో కలిసి ఉంటోంది. ఎప్పుడైనా కలుస్తుంది...’’ తండ్రి తనను అడగలేక అవస్థపడుతున్న సంగతి గ్రహించి తనే చెప్పేశాడు.
అది విన్నాక చటుక్కున భర్త ముఖంలోకి చూసింది రామలక్ష్మి. జగన్నాధం ముఖంలో ఆమెకే మార్పూ కనిపించలేదు. వెంటనే చిందులేస్తాడేమోననుకున్నదామె.
‘‘వద్దురా! ఆ కుటుంబంతో మనం వేగలేం. సర్వేశ్వరరావు నోటి దురుసు మనిషి. పైగా వాళ్ళ అంతస్తుతో మనం ఏ కోశానా పోటీ పడలేం... నా మాట విను...’’ అనేసి స్నానానికి వెళ్లిపోయాడు జగన్నాధం.
భర్త ధోరణి రామలక్ష్మికి ఆశ్చర్యం వేసింది. అంత శాంతంగా అతడు మాట్లాడ్డం ఒక రకంగా ఆమెకు సంతోషంగానే అనిపించింది.
తండ్రి అంత ప్రశాంతంగా మాట్లాడ్డం ఇటు పవన్‌కీ ఆశ్చర్యంగా అనిపించింది. ఒక రకంగా అది ఆయనలో వస్తున్న మార్పునకు సంకేతంగా అనుకున్నాడు.
-ఇంకాఉంది