పరమ యశోధనులైన సూర్యవంశ రాజుల ఘన చరిత్రని తలపవలదా? జరుగవలసిన కార్యాలు జరుగక తప్పదు. ఇటువంటివి దైవయత్నాలు. దాటశక్యం అవుతుందా? అని రాముడు వక్కాణించాడు.
అంత లక్ష్మణుడు కోపాటోపం విడిచి, తన అన్న శ్రీరాముని అంతరంగ భావాన్ని తెలిసికొని, జడిసి మిన్నక ఉన్నాడు. పరమ సాధ్వియైన కౌసల్య రాముడి తెగింపునకు మిక్కుటంగా వగపొందుతూ కళాకాంతుల చేత పున్నమచంద్రున్ని తలదనే్న రాముడి ముఖంపైన దృష్టి సారించింది. తర్వాత ‘‘నా ముద్దులయ్యా! నా అనుగు కొడుకా! నా కుల దీపమా, నన్ను కన్న తండ్రీ! వత్సాన్ని పాసిన గోవు మాదిరి నిన్ను వీడి ఈ పధ్నాలుగు సంవత్సరాలు ఈ అయోధ్యలో వసింపజాలను. ఆ నిష్ఠురాటవులకి నీ వెంట నేను కూడా వస్తాను’’ అని పలికింది. ఆ విధంగా శోకించే తల్లిని ఓదార్చి, అనునయ ఆలాపాలు పలికాడు రాముడు. అంతేకాక ‘‘ఓ తల్లీ! ఈ కరణి మాటాడతగునా? ఆత్మలో తలంచి చూడగా సతికి పతియే ప్రాణపదం. పతియే బంధువు. సతియేదైవం. అటువంటి ప్రాణేశ్వరుణ్ణి వదిలి నా వెంట అడవులకి ఏతెంచుతాను అని పల్కడం నీకు పాడియా? రాజాజ్ఞ చేత ధరణీ భారమును భరతుడికివ్వడం దోషమా? మా తండ్రి తనకు ఒసగిన వరాలూ రెండూ అడగడం కైక తప్పా? ఆడిన మాట తప్పడానికి వెనుకాడి ఆమెకి వరాలివ్వడం మా తండ్రి దోషమా? మా తండ్రి యానతిని నెరవేర్చ పూనుకోవడం నా తప్పా? నిజం ఆలోచిస్తే పతి చేసిన బాస నీకైనా చెల్లింపక తప్పదు. నేను కానలకేగినట్లయిన దీనాతిదీనుడై పొగులు భూవిభుణ్ణి అనునయిస్తూ సపర్యలు కావిస్తూ ఆయన మనోదుఃఖాన్ని మాన్పతగునా? పాపధూరుడూ, సాంద్ర నీతిరతుడూ అయిన భరతుడు నా కంటె భక్తితో నిన్ను కొలుస్తాడు. నువ్వు శోకింపకు. అతడు కైక నువ్వూ కలిసిమెలసి మెలగండి. నా క్షేమం ఆశించి నన్ను వీడ్కొలిపి’’ అని చేతులు జోడించిన రామచంద్రుణ్ణి అక్కున చేర్చుకొని, నిరంతర ధారగా క్రమ్ముకొని వచ్చే శుగశ్రుకణాలు రామభద్రుని వెన్నుపై రాల్చింది. ‘‘నాయనా! కాంతారానికి వెడలుదువా?’’ అని అతని మేను నిమిరి డగ్గుత్తికతో సుంతధృతి వహించి, చెక్కిట కన్నీరు చేత పోవతుడిచి, నిర్మల జలములతో ముఖం ప్రక్షాళనం చేసికొని వచ్చి పుణ్యాహం చేయించింది.
అనంతరం ‘‘దేవతలు, ఖేచరులు, శ్రుతులు, యతులు, గేరులు, తరులు, దాంతి, శాంతి, నదులు, నిధులు, ఆర్ణవము, ఆకాశము, మారుతము, జలము, అగ్ని, నేల, దిక్పాలురు, దశదిక్కులు, సూర్యచంద్రులు, బ్రహ్మదేవుడు ఆదిగా గల ప్రముఖులు ఎల్లవేళల నీకు శుభం చేకూరుస్తారు’’ అని ఆశీర్వదించింది. తర్వాత వేల్పులని అర్చించింది. రాముడి కుడిముంజేతికి ఒక రక్ష రేగు కట్టింది.
అనంతరం ఇంకా ఈ క్రియ పలికింది ‘‘రామచంద్రా! తొల్లి వృత్రాసురిని మీద అలిగి అనిలో సంహరించబోయే వజ్రపాణికి దేవతలందరూ ఏ శుభాలు ఒసగేరో ఆ మంగళాలు నీకు కల్గుతాయి. ఆశ్చర్యకరంగా దివికేగి అమృతం కొని తేవడానికి ఏగిన గరుత్మంతుడికే శుభాలు వినత ఒసగిందో ఆ శుభాలన్నీ నీకు కల్గుగాక! స్వర్గరాజ్యాన్ని మరల ఆర్జించడానికి వామనుడు ఏగేటప్పుడు ఏ శుభాలు అదితి కలిగించిందో ఆ మంగళాలు నీకు సిద్ధించుగాక!’’ అని దీవించింది. శిరస్సు మూర్కొంది, నిండు హృదయంతో రాముణ్ణి పంపింది. అతడు తల్లి పదములకి వందనం ఆచరించి లక్ష్మణ సహితుడై అటనుండి కదలి వచ్చాడు. అపుడు అభిషేకానికి ఆటంకం కలిగిన వృత్తాంతం తెలిసి కొలువు కూటమందలి రాజులు, మంత్రులు, పౌరులు దుఃఖింప పాదచారుడై మనోహరములైన విజామరలు, శే్వతచ్ఛత్రం మాని వేడుకతో రాముడు తన నగరికి చనుదెంచాడు.
అంత సీత, చెలికత్తెలుతో ఎదురు వచ్చింది. తన్ను చూసి విన్నదనంతో ఉన్న రాముడిని సీత పరికించింది.
-ఇంకాఉంది
పరమ యశోధనులైన సూర్యవంశ రాజుల ఘన చరిత్రని
english title:
ranganatha ramayanam
Date:
Saturday, November 10, 2012