శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు. మానవుడి కర్మలను అనుసరించే భగవంతుడి అనుగ్రహమైనా, ఆగ్రహమైనా అతడిపై ప్రభావం చూపుతుంది. మానవుడు ఒంటరిగా ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తూ, ఒంటరిగానే నిష్క్రమించినా, మిగతా మధ్యకాలమంతా కుటుంబంలో సమాజంలో అనేక మందితో కలిసి జీవించవలసి వస్తుంది. సర్దుబాటు తీరు సత్ఫలితాలనిస్తే కలహించే తీరు ఎందరినో దూరం చేస్తుంది. విజ్ఞులు తమ హితాన్ని, లోకహితాన్ని దృష్టిలో వుంచుకొని ఎంత జాగ్రత్తగా వుండాలనుకున్నా ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి ఇబ్బందులు కలిగించాలని చూసేవారున్నా- సహనం, సంయమనం వాటిని అధిగమించి ముందుకు సాగితే నిస్సందేహంగా సత్ఫలితాలు చేతికందుతుంటాయి.
తన తోటివారితో ఇంటా బయటా అనుకూలంగా వుండాలని ఆసక్తి కలిగినవారే తమ శక్తియుక్తుల్ని సత్కార్యాలకు వెచ్చించగలుగుతారు.. అలుపుకి తావివ్వని అంకితభావంతో ప్రతినిత్యం ముందడుగు వెయ్యడమే గాక జన హితానికి శాశ్వత చిరునామా అవుతారు. ఫలితంగా జీవితంలో ప్రతిక్షణాన్ని మధురానుభూతులతో నింపుకోవడమే గాక మాటల్లో వివరించ వీల్లేని సంతృప్తిని స్వంతం చేసుకుంటారు. తాము సంతృప్తి చెందితే సరిపోదని మిగతా వారిలో కొందరికైనా ఆ సంతృప్తిని కలిగించేందుకు త్రికరణశుద్ధిగా ప్రయత్నిస్తుంటారు. ఇది జీవితం పట్ల, ఆధ్యాత్మికత, ధార్మిక భావనలపట్ల పూర్తిగా అవగాహన కలిగినవారివల్లనే సాధ్యమవుతుంది. ఏమీతెలియకున్నా అంతా తెలుసని విర్రవీగేవారివల్ల జరిగే మేలేమీ వుండకపోగా కీడు వాటిల్లే అవకాశాలు ఎక్కువ.
కుల మతాల భాషా భేదాలకు అతీతంగా సత్కర్మలు ఆచరించడం వల్లనే మనసు ఆనందానుభూతుల్ని స్వంతం చేసుకుంటుంది. ధర్మాచరణతో కూడిన ఎవరి జీవితమైనా కావలసినంత పుణ్యాన్ని మూట కట్టుకోవడమే గాక అర్థించినవారందరికీ చేతననైన సాయాన్ని అందించగలుగుతుంది. వారికి తెలియజెప్పుతుంది. సుఖం వెనుక దుఃఖం, శాంతి వెనక నీడలా అశాంతి వుంటాయని విజ్ఞులెరగని విషయం కాదు. అనుకోని విధంగా కష్టనష్టాలు ఎదురైనపుడు పరనిందకు పూనుకోవడం కన్న ఒకటికి పదిసార్లు ఆత్మవిమర్శకు పూనుకోవడం శ్రేయస్కరం.
జీవితంలో ఎవరికైనా వద్దనడం చిక్కుగా, దిద్దుబాటుని పెద్దదిక్కుగా భావించేవారికి పంచినకొద్ది ప్రేమానురాగాలు కుప్పలు తెప్పలుగా పెరగడమైనా, చూపినకొద్ది వినయ విధేయతలు ఊహకందని రీతిలో సత్ఫలితాలు అందజేయడం ఎవరికైనా అనుభవంలో తెలిసొచ్చేది తప్ప మాటలకందే మామూలు విషయం కాదు.
ఇహపరమైన అవసరాలు, ఆకర్షణలు, ఆనందాలు, ప్రయోజనాలపట్ల మొగ్గుచూపే వారెవరైనా జీవితంలో శాశ్వత ప్రయోజనాల పట్ల ఆసక్తిని చూపలేరు. ఆసక్తే లేక ఏ పనినైనా ఎవరైనా ప్రారంభించే ప్రయత్నమే చెయ్యరని, ఒకవేళ చేసినా అర్థాంతరంగానే ఆపివేస్తుంటారనేది జగద్వితమే.
తననెవరో నచ్చాలని, మరెవరో మెచ్చాలని కాక, ఎక్కడ ఎవరి నోట ఒక మంచి మాట వినిపించినా నచ్చినట్లు, జనహితం కోరి ఎవరు ఏ పని చేస్తున్నా హృదయపూర్వకంగా మెచ్చుకుంటూ తనకు చేతనైనంతలో వారికి సహకరిస్తూ ముందడుగు వెయ్యడం, సమాజానికి తనవంతు సేవలు అందించడమే అవుతుంది. అలా కాక సమాజం నుండి స్వీకరించడానికి పుట్టామే తప్ప సమాజానికి ఎంతైనా ఇవ్వగలిగి వుండి ఏమీ ఇవ్వకపోవడమైనా, ఎంతో చెయ్యగలిగి వుండి కూడా ఏమీ చెయ్యకపోవడమైనా సత్కర్మలకు దూరంగా వుండటమే అవుతుంది.
పసలేని చర్చలతో, లేనిపోని ఊహగానాలతో కాలక్షేపం చేసేవారు. లేని గొప్పలు ఎదుటివారికి వినిపించజూసేవారు సమయాన్ని, జీవితాన్ని సత్కర్మలకు దూరంగా వుంచుతున్నవారే!
శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు
english title:
good results
Date:
Sunday, November 11, 2012