ఒంగోలు, నవంబర్ 12: జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాజ్యసభ సభ్యుడు జెడి శీలం వెల్లడించారు. సోమవారం స్ధానిక కలెక్టర్ యాంటి రూంలో పార్లమెంటు సభ్యుల నిధులతో చేపట్టిన పనులపై జిల్లాకలెక్టర్‌తో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి ,సంక్షేమ హాస్టల్స్‌లో ఒక లక్షా 55వేలతో రెండువందల లీటర్ల కెపాసిటీ ఉన్నవాటర్‌ప్లాంట్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో అవసరనున్న సంక్షేమ హాస్టళ్లను ఎంపికచేయాలని కలెక్టర్‌కు సూచించారు. ఒంగోలులో పార్లమెంటు నిధులతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవన సముదాయాన్ని వేగవంతంగా పూర్తిచేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. సమావేశంలో సిపిఒ వెంకయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ప్రపంచ భాషలకు దీటుగా తెలుగుభాష
చీరాల, నవంబర్ 12: తెలుగు భాషను ప్రపంచ భాషలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు, తగిన గుర్తింపుకోసం తెలుగువారందరూ కృషి చేయాలని చీరాల శాసన సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభల శతాబ్ధి ఉత్సవాలు, తిరుపతి పట్టణంలో డిసెంబర్‌లో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతాన్ని కోరుతూ పద్మశ్రీ ఘంటసాల సాంస్కృతిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టే కళాయాత్రలో భాగంగా సోమవారం ఈపూరుపాలెంలో జరిగిన సభలో ఎమ్మెల్యే ఆమంచి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం అధికార భాషాసంఘాన్ని ఏర్పాటుచేసి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో కమిటిని నెలకొల్పినట్లు ఆయన తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఘంటసాల పాట తెలుగుభాషకు పట్ట్భాషేకం అని, ప్రతి ఒక్కరూ తెలుగు జాతి చరిత్ర, భాష, సంస్కృతిలపై అవగాహన కోసం తమ వేదిక నేతృత్వంలో ఈ కళాయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. చీరాలలో ఘంటసాల విగ్రహం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కోట ఝాన్సీరాణి, బొనిగల జైసన్‌బాబు, గంజి వెంకటేశ్వర్లు, గట్టు సుబ్బారావు, పి నాగేశ్వరరావు, యంపిడివో రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
శివకాశి దెబ్బకు పెరిగిన బాణాసంచా ధరలు
ఠారెత్తుతున్న వినియోదారులు
ఒంగోలు, నవంబర్ 12: శివకాశి దెబ్బకు పెరిగిన దీపావళి మందుల ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. గతసంవత్సరంతో పోలిస్తే ఈసంవత్సరం దీపావళి మందుల ధరలు 30శాతంనుండి 40శాతం వరకు పెరిగాయి. ప్రధానంగా శివకాశిలో దీపావళి మందులు తయారుచే ఫ్యాక్టరీలు ఎనిమిది వందలు ఉన్నాయి. కాని ఈసంవత్సరం అగ్నిప్రమాదాలు ఎక్కువుగా జరగటంతో రెండువందలప్యాక్టరీలకు పైగా దగ్ధంకావటంతో ఉన్న ఫ్యాక్టరీ యజమానులు మందుల ధరలను భారీగా పెంచారు. అదేవిధంగా మందుల ఉత్పత్తికూడా గణనీయంగా తగ్గినట్లు వ్యాపార వర్గాల ద్వారా సమాచారం. గతసంవత్సరం ప్యాక్టరీలో పనిచేసే కూలీకి రోజుకు వందనుండి రెండువందల రూపాయల వరకు ఇవ్వగా ఈసంవత్సరం అదే కూలీకు ఐదువందలరూపాయలనుండి ఆరువందల రూపాయల వరకు యజమానులు ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో కూడా యజమానులు ధరలను భారీస్ధాయికి పెంచినట్లు సమాచారం. గత సంవత్సరం జిల్లావ్యాప్తంగా 350 షాపులను ఏర్పాటుచేయగా ఈసంవత్సరం నాలుగువందలకు పైగానే దీపావళి మందుల షాపులను ఏర్పాటుచేశారు. గతంలో శివకాశికి ఎక్కువమంది వ్యాపారులు వెళ్ళి దీపావళి మందులను కొనుగోలు చేసేవారు. కాని అక్కడి పరిస్ధితులు సక్రమంగా లేకపోవటంతో ఎక్కువశాతంమంది వ్యాపారులు ఇక్కడ ఉన్న హోల్‌సేల్ షాపుల్లోనే కొనుగోలుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
జిల్లాకేంద్రమైన ఒంగోలులోని పివిఆర్ హైస్కూలు ఆవరణ, డిఆర్‌ఆర్‌ఎం హైస్కూలు మైదానంలో దీపావళి మందుల షాపులను నిర్వాహకులు ఏర్పాటుచేశారు. సూపర్‌బజార్‌లో కూడా షాపును ఏర్పాటుచేసి 72శాతం డిస్కౌంట్‌ను ప్రకటించారు. దీంతో కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. కొన్ని సెల్‌కంపెనీలు కూడా సెల్‌కొనుగోలు చేస్తే దీపావళి మందుల గిఫ్ట్‌ప్యాక్‌లను ప్రకటించారు. కాగా జిల్లాలో అధికారికంగా, అనధికారికంగా దీపావళిమందుల షాపులను ఏర్పాటుచేసుకోవాలంటే ఒక్కొక్కరు 15వేలరూపాయలనుండి 25వేల రూపాయల వరకు అధికారులకు ముట్టుచెప్పాల్సిన పరిస్ధితులు ఏర్పాడ్డాయి. ప్రజాప్రతినిధులు అధికారులకు పోన్లు చేసి తమ అనుచరులకు లైసెన్స్‌లు ఇవ్వాలని హుకం జారీచేసినప్పటికి ఫలితం మాత్రం శూన్యం. ఎవరిగోలలో వారు నిమగ్నమై ఉండటంతో దీపావళి మందులు కొనుగోలుచేసే వినియోగదారుల జేబులు గుల్లాయ్యాయి.
‘మండలానికో క్రీడా మైదానం ఏర్పాటుచేస్తాం’
చీరాల, నవంబర్ 12: మండల పరిధిలోని ఈపూరుపాలెం బాలికల హైస్కూల్‌లో పైకా జోనల్ పోటీలను చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోమవారం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. విద్యార్ధుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్ధులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలని, మానసిక దారుఢ్యానాకి, శారీరక ఉల్లాసానికి క్రీడలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల క్రీడాభివృద్ధికి ఎన్నో నిధులు కేటాయిస్తుందని అన్నారు. క్రీడలకోసం ఈపూరుపాలెం బాలుర హైస్కూల్, యన్ ఆర్ అండ్‌పియం చీరాల, జాండ్రపేట ఎ ఆర్‌యం స్కూల్స్‌కు ఎంతో ఖర్చు చేస్తుందని అన్నారు. క్రీడలకోసం ప్లే గ్రౌండ్‌ను ప్రతి మండలంలో నిర్మించేందుకు ప్రభుత్వం కోటి రూపాయల నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ పోటీలలో చీరాల, కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు, చినగంజాం, వేటపాలెం మండలాలకు చెందిన విద్యార్ధులు పాల్గొననున్నారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, ఫుట్‌బాల్, షాట్‌పుట్, లాంగ్ జంప్, హైజంప్, డిస్క్ త్రో, హాకీ పరుగు పందేలు నిర్వహించనున్నారు. గెలుపొందిన విద్యార్ధులు ఈ నెల 15న ఒంగోలులో జరుగబోవు జోనల్ పోటీలకు ఎంపికవుతారని నిర్వాహకులు తెలిపారు. క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరుగు పందెంలో ఎమ్మెల్యే ఆమంచి పిల్లలతో పాటు పరుగు తీశారు. కార్యక్రమంలో జోనల్ పైకా క్రీడల చైర్మన్, యంపిడివో రాంబాబు, యం ఇవో రత్నకుమారి, మాజీ సర్పంచ్ పాలపర్తి నాగేశ్వరరావు, సూర్యనారాయణ శాస్ర్తీ, సీతారామయ్య, సురేష్, జంగం జయపాల్, జంగం రాజవర్ధనరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరామయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బి జైసన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణా జెఎసి చైర్మన్ దిష్టిబొమ్మ దగ్ధం
ఒంగోలు అర్బన్, నవంబర్ 12: రాష్ట్ర మంత్రి జె గీతారెడ్డిపై తెలంగాణా జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ వేమా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం కోదండరామ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగా కోదండరామ్ దిష్టిబొమ్మతో స్థానిక పాతరిమ్స్ వైద్యశాల నుండి ఊరేగింపుగా బయలుదేరి చర్చి సెంటర్ మీదుగా ప్రకాశం భవనం కూడలిలోని భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కాంశ్య విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ విభాగం చైర్మన్ వేమా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి గీతారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణా జె ఎసి చైర్మన్ కోదండరామ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే జరగకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పిసిసి సంయుక్త కార్యదర్శి అయినాబత్తిన ఘనశ్యాం మాట్లాడుతూ వెంటనే గీతారెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మూరి కనకారావు మాదిగ, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బిల్లా చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్ ప్రసంగించగా సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, ఒంగోలు పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్‌కె కరిముల్లా, నగర కాంగ్రెస్ ఎస్సీసెల్ చైర్మన్ పర్రే నవీన్‌రాయ్, కొత్తపట్నం మాజీ ఎంపిపి నాళం నర్సమ్మ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు జడా బాలనాగేంద్రయాదవ్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శ్రీపతి ప్రకాశం, సేవాదళ్ మహిళా అధ్యక్షురాలు కొమ్ము సులోచన, నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్, ఎస్వీ శేషయ్య, పాలేటి ఆదిశేషు, చెరుకూరి లక్ష్మి, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు.
ఎంప్లారుూస్ యూనియన్ దర్నా
చీరాల రూరల్, నవంబర్ 12: ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌టిసి బస్టాండ్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ వోడీలను రద్దుచేయాలని, సిక్ కాలానికి జీతం ఇవ్వాలని, తదితర డిమాండ్‌లతో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఎలీషా, శంకరరావు, కె శ్రీనివాసరావు, సాల్మన్, సాయిబాబు, పివి రావు తదితరులు పాల్గొన్నారు.
14 నుంచి కుసుమహరనాథుల కార్తీక పూజలు
గిద్దలూరు, నవంబర్ 12: కార్తీకమాసం శుద్ధిపాఢ్యమిలు 14వతేదీ నుంచి డిసెంబర్ 16వతేదీ వరకు కార్తీకమాస పూజకార్యక్రమాలు శ్రీ కుసుమహరనాధ ఆలయంలో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి నటుకుల శ్రీనివాసులు, వాడకట్టు చిన్నసత్యనారాయణ, తుమ్మలపెంట శ్రీనివాసులు తెలిపారు. ఈకార్తీక పూజోత్సవాలను నిర్వహించే ఆహ్వానపత్రికను సోమవారం సాయంత్రం కుసుమహరనాధమందిరంలో ఆవిష్కరించారు. బక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
కార్తీక మాసపూజలకు
ముస్తాబైన శివాలయాలు
ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న కార్తీకమాస పూజలకు నియోజకవర్గంలోని పలు శివాలయాలు ముస్తాబయ్యాయి. రాచర్ల మండలం రామాపురం గ్రామసమీపంలో వెలసిన సిద్ధ్భిరవేశ్వరస్వామి ఆలయం కార్తీక పూజోత్సవాలకు ధర్మకర్తలమండలి చైర్మన్ ఎం శ్రీరంగారెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రం మెరుగులు దిద్దుకుంది. భక్తులు వచ్చేందుకు వీలుగా సౌకర్యాలను అటవీప్రాంతంలో ఏర్పాటు చేశారు. పట్టణంలోని శ్రీ పాతాళనాగేశ్వరస్వామి ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాచర్ల మండలంలోని రామలింగేశ్వర భీమలింగేశ్వర ఆలయాలను కూడా భక్తుల దర్శనార్ధం ఏర్పాట్లు చేశారు. గిద్దలూరు సమీపంలోని కృష్ణంశెట్టిపల్లి సమీపంలోగల భీమలింగేశ్వరస్వామి ఆలయాన్ని కూడా కార్తీక పూజోత్సవాలకు సిద్ధం చేశారు.
నిధులు లేవు..
విధులు నిర్వర్తించలేం
మార్కాపురం, నవంబర్ 12: స్థానిక సంస్థల కాలపరిమితి ముగియడంతో ఆ స్థానాల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తూ 15నెలల కిందట ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం పాలన సాగించాలంటే గ్రామపంచాయతీల్లో నిధులు లేకపోవడంతో విధులు నిర్వర్తించలేమని, త్వరలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్రత్యేక అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించి అంటువ్యాధులు ప్రబలుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టేందుకు తమ వద్ద నిధులు లేవని, ఉన్నతాధికారులు మాత్రం ఫాగింగ్, క్లోరినేషన్ లాంటివి చేయాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని, తామెక్కడ నుంచి తెచ్చిపెట్టాలని ప్రత్యేక అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించే పైపులైన్లు మరమ్మతులకు గురైనా, మోటారు కాలిపోయినా, వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, ఇప్పటికే కొందరు కార్యదర్శులు తమ పరిచయాలను అడ్డుపెట్టుకొని వేల రూపాయలు అప్పులు చేసి పాలనకు సహకరిస్తున్నారని, ఇకపై వారు కూడా ఆ భారం మోసే పరిస్థితి లేదని ప్రత్యేక అధికారులు అంటున్నారు. మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం పంచాయతీలో ఇటీవల ఓ మహిళకు డెంగ్యూవ్యాధి సోకడంతో ఆ గ్రామంలో ఫాగింగ్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేశారని, అయితే నిధులు లేని విషయం తెలిసి కూడా ఇలా ఆదేశిస్తే తామెక్కడ నుంచి తెచ్చి ఖర్చుపెట్టాలని, అలాగే ఈ పంచాయతీ పరిధిలోని బిరుదులనరవ గ్రామంలో మోటారు కాలిపోతే సుమారు 10వేల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేయించామని, ప్రస్తుతం మళ్ళీ మరమ్మతులకు గురైందని, నిధులు లేని కారణంతో తాము చేయలేమని గ్రామస్థులకు చెప్పామని ప్రత్యేక అధికారి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆస్తిపన్ను వసూలు చేసుకొని పంచాయతీలో పారిశుద్ధ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలని చెప్పారని, అయితే గత 25ఏళ్ళుగా మైనర్ పంచాయతీలో సర్పంచ్‌లు ఆస్తిపన్ను వసూలుపై దృష్టి సారించకపోవడంతో ప్రస్తుతం తాము చెల్లించమని అడిగినా చెల్లించేవారు లేరని అధికారులు అంటున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు కూడా వచ్చే అవకాశం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు పాలన ఎలా సాగిస్తారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి విధుల నుంచి తప్పుకుంటామని పలువురు ప్రత్యేక అధికారులు అంటున్నారు.
పూర్తికాని కంప్యూటరీకరణ..
మార్కాపురం, నవంబర్ 12: రైతులకు మెరుగైన సేవలు అందించాలనే ధ్యేయంతో భూ వివరాలను కంప్యూటరీకరణ చేయాలని భావించిన ప్రభుత్వ తీరు ప్రస్తుతం రైతులకు శాపంలా మారింది. మీసేవా కేంద్రాల ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా 15 నిమిషాల్లోపు అడంగల్, పహాణి, ఆర్‌ఎస్‌ఆర్, ఎఫ్‌ఎల్‌ఆర్ లాంటి రికార్డులు పొందవచ్చునని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది. అయితే గ్రామీణస్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిస్థాయి భూ వివరాలు కంప్యూటరీకరణ జరగకపోవడంతో ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఒకే సర్వేనెంబర్‌లోని భూమిని పంచుకొని ముగ్గురు పాసుపుస్తకాలు తీసుకొని మరొకరు తీసుకోకపోయిన ఆ భూములను రికార్డుల్లో కంప్యూటరీకరణ చేసేందుకు వీలులేకపోవడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో బ్యాంకు అధికారులు రెవెన్యూ అధికారులు రాసి ఇచ్చిన అడంగల్‌పై వ్యవసాయ రుణాలను ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో కంప్యూటరీకరణ రికార్డులు ఉంటేనే రుణాలు ఇస్తామని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో 25శాతం మించి భూముల వివరాలను కంప్యూటరీకరణ జరిగిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రుణాలు అందక రైతులు బయట వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై గత మూడురోజుల కిందట మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ అనిత రాజేంధర్‌ను కలిసి డివిజన్‌లోని అనేక మండలాలకు చెందిన రైతులు తమ గోడును విన్నవించుకున్నారు. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. దీనితో వర్షాలు కురిసి సీజన్ ప్రారంభమైనప్పటికీ బ్యాంకు అధికారులు వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భూ రికార్డులు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ జరిగేవరకు ప్రత్యామ్నాయ మార్గంలో వ్యవసాయ రుణాలు అందేలా చూసి రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఘనంగా ఫుట్‌బాల్, టగ్ ఆఫ్‌వార్ క్రీడలు ప్రారంభం
ఒంగోలు, నవంబర్ 12: ఈ నెల 12వ తేది నుండి 14వ తేది వరకు ఒంగోలులోని బిఆర్‌ఆర్ ఎం హైస్కూల్‌లో ఒంగోలు యువజన కాంగ్రెస్ కమిటి, బ్రేవ్ అకాడమీవారు సంయుక్తంగా నిర్వహిస్తున్న సి ఎస్ ఎఫ్ ట్రోపి, టగ్ ఆఫ్‌వార్ బాలికల పోటీలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పిసిసి సంయుక్త కార్యదర్శి అయినాబత్తిన ఘనశ్యాం, ఒంగోలు సూపర్‌బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, డి ఆర్ ఆర్ ఎం స్కూల్ హెడ్‌మాష్టర్ శ్రీరామమూర్తి, ఫుట్‌బాల్ జిల్లా సెక్రటరీ వై శశికాంత్ భూషణ్, ఒంగోలు ఎల్‌వైసి అధ్యక్షుడు షేక్ కరిముల్లా, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు నవీన్‌రాయ్, టగ్ ఆఫ్‌వార్ వైస్ ప్రసిడెంట్ ప్రసన్నరాజు, ఆవుల జాలయ్య, ఎన్ ఎస్‌యు ఐ జిల్లా అధ్యక్షుడు వై శివార్జున్, చావలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బ్రేవ్ అకాడమీ చైర్మన్ డి రాజేంద్ర ప్రారంభ ఉపన్యాసం చేశారు. ముఖ్య అతిధులు అయినాబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్ ఫుట్‌బాల్‌ని కిక్‌కొట్టి పోటీలను ప్రారంభించారు. టగ్ ఆఫ్‌వార్ బాలికల పోటీలను వారు ప్రారంభించి ప్రసంగించారు. కార్యక్రమానికి ఒంగోలు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రసిడెంట్, బ్రేవ్ అకాడమీ చైర్మన్ రాజేంద్ర నిర్వాహణ బాధ్యత వహించారు. విజేతలకు నవంబర్ 14న స్థానిక డిఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో బహుమతి ప్రదానం జరగనున్నట్లు తెలిపారు.
విజేతలు
ఫుట్‌బాల్ మొదటి మ్యాచ్ పేస్ స్కూల్ వర్సెస్ సెయింట్ జేవియర్స్ స్కూల్ విద్యార్థులు పోటీపడగా పేస్ స్కూల్ విద్యార్థులు గెలుపొందారు. రెండవ మ్యాచ్ కేంద్రీయ విద్యాలయం, ఆదిత్యా విద్యార్థులు పోటీ పడగా కేంద్రీయ విద్యార్థులు గెలుపొందారు. టగ్ ఆఫ్‌వార్ (బాలికల) ఇనాగ్రేషన్ మ్యాచ్‌లో పేస్, ఎకెవికె విద్యార్థులు పోటీ పడగా హోరాహోరీ మ్యాచ్‌లో పేస్ విద్యార్థులు గెలుపొందారు. ఈ మ్యాచ్‌ల నిర్వాహణలో కిరణ్ బాబావలి, సంతు, సాయి భరధ్వజ, అన్సర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.