Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మెడికల్ కళాశాల పరిశీలనకు డిసెంబర్‌లో ఎంసిఐ బృందం

$
0
0

నిజామాబాద్, నవంబర్ 12: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతి, సౌకర్యాల పరిశీలన నిమిత్తం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసిఐ) అధికారుల బృందం డిసెంబర్ 15వ తేదీ అనంతరం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. మరో నెల రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున తుదిదశ పనులను మరింత వేగవంతం చేయాలని, ఎలాంటి అసౌకర్యాలకు తావులేకుండా చూడాలని ఆయన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, కలెక్టర్ క్రిస్టీనా ఇతర అధికారులతో కలిసి మంత్రి సుదర్శన్‌రెడ్డి వైద్య కళాశాల భవనాన్ని పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కాలేజీ తరగతులను నిర్వహిస్తూ, జిల్లా ఆసుపత్రిని నూతనంగా ఖలీల్‌వాడి మైదానంలో నిర్మించిన భవన సముదాయంలోకి మార్చనున్నారు. దీంతో ఈ భవన సముదాయంలోని వివిధ గదులను మంత్రి పరిశీలించి, తుది విడతగా చేపట్టాల్సి ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంసిఐ అధికారుల బృందం పరిశీలనకు వచ్చేలోపే అన్ని వౌలిక సదుపాయాలు, వసతులతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు కల్పించినా కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెడతామని, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తం ఆరు అంతస్థుల నిర్మాణం జరుపగా, మూడు అంతస్తుల్లో పనులన్నీ పూర్తయ్యాయని, మరో మూడు అంతస్థుల్లో సీలింగ్, ఫ్లోరింగ్ పనులు పూర్తికావాల్సి ఉందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ఈ నెల 15వ తేదీన జిల్లా ఆసుపత్రిలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో కొనసాగుతున్న అవుట్‌పేషెంట్, ఇతర విభాగాలను కొత్త భవనంలోకి తరలించాలని మంత్రి ఆదేశించారు. తద్వారా జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కళాశాల తరగతుల నిర్వహణకు అనువుగా అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధుల కొరత ఎంతమాత్రం లేదని, కోరిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. వాస్తవానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించాలని కసరత్తులు చేసినప్పటికీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తూ అక్టోబర్ 30వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించినప్పుడే ఎంసిఐ బృందం పరిశీలనకు రావాలనే నిబంధన ఉండడం వల్ల అనుమతి లభించడంలో జాప్యం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే ఎంసిఐకు దరఖాస్తుతో కూడిన లేఖలు పంపించామని, ఈ మేరకు డిసెంబర్ 15వ తేదీ అనంతరం ఎంసిఐ బృందం పరిశీలన నిమిత్తం హాజరయ్యే అవకాశాలున్నాయని మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అసౌకర్యాలకు తావులేకుండా నిబంధనల ప్రకారం అన్ని వసతులు సమకూరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఏవేవో కుంటిసాకులతో పనులను పెండింగ్‌లో ఉంచితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
రబీలో ఆరుతడి పంటలే వేయాలి
కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రధాన జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలు లేనందున రైతులు రబీ సీజన్‌లో ఆరుతడి పంటలనే సాగు చేయాలని మంత్రి సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 11లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కేవలం 30టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉందని, ఎస్సారెస్పీలో 28టిఎంసిలు, సింగూర్‌లో 8టిఎంసిలు తాగునీటి అవసరాలకు మినహాయిస్తే మిగులుగా 11టిఎంసిలు, నిజాంసాగర్‌లోనూ 4.5టిఎంసిలకు గాను 2టిఎంసిలు మంచినీటి అవసరాలకు కేటాయించాల్సి ఉండగా, కేవలం మరో 2టిఎంసిల నీరు మాత్రమే సాగు జలాలుగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు రబీలో ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. నూనె ఉత్పత్తులకు సంబంధించిన పంటలు సైతం అధిక దిగుబడులు అందించడమే కాకుండా, మార్కెట్‌లో మంచి ధర పలుకుతున్నాయని, పంటల మార్పిడి వల్ల భూసారం సైతం పెరిగి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని, ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోందని అన్నారు. మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్, జడ్పీ మాజీ వైస్‌చైర్మెన్ తాహెర్‌బిన్ హందాన్, డిసిసి అధ్యక్షుడు గడుగు గంగాధర్, డిసిహెచ్‌ఎస్ తులసిబాయి, డిఎంహెచ్‌ఓ హరినాథ్ తదితరులు ఉన్నారు.

విద్యుత్ సమస్య పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింథే డిమాండ్
బిచ్కుంద, నవంబర్ 12: వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని వహిస్తోందని స్థానిక ఎమ్మెల్యే హన్మంత్‌సింథే ఆరోపించారు. సోమవారం బిచ్కుందలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జుక్కల్ నియోజకవర్గంలో నెలకొన్న లోఓల్టేజ్ విద్యుత్ సమస్య పరిష్కారానికి ఐదు 33/11కెవి సబ్ స్టేషన్లు, మరో 132కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి సంవత్సరాలు గడుస్తున్నా మంజూరీ చేయలేదన్నారు. సెగ్మెంట్‌లోని బిచ్కుంద మండలం రాజుల్లా, కాస్లాబాద్, జుక్కల్ మండలం పెద్దఎడ్గి, పిట్లం మండలం రాంపూర్ గ్రామాలలో 33/11కెవి సబ్‌స్టేషన్లతో పాటు మద్నూర్ మండలం లచ్చన్‌గేట్ వద్ద అదనంగా మరో 132కెవి సబ్‌స్టేషన్ అవసరం ఉందన్నారు. కానీ ప్రస్తుతం బిచ్కుంద మండలం గుండెనెమ్లి గ్రామానికి ఒకేఒక్క 33/11కెవి సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయరంగానికి 7గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఖరీఫ్‌లో కనీసం 3గంటల కూడా సరఫరా చేయలేయిందన్నారు. దీంతో వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులకు కనీసం పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితి నెలకొందన్నారు. అలాంటి పరిస్థితుల్లో భగవంతుడు కరుణించి వర్షాలు కురిపించడంతో అంతోఇంతో పంట ఉత్పత్తులు రైతుల చేతికి అందాయని అన్నారు. వేళాపాళా లేకుండా ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం రబీ సీజన్‌లోనై విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సరఫరా చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్య పరిష్కారానికి మరో 33/11కెవి, ఒక 132కెసి సబ్‌స్టేషన్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే హన్మంత్‌సింథే కోరారు. విలేఖరుల సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు రాజుల్లా అశోక్, ప్రచార కార్యదర్శి ఎంఎం.బాల్‌రాజ్, కార్యదర్శి మహేష్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలి

ప్రజలకు ఎర్రజెండా పార్టీల నేతల పిలుపు

కాగ్రెస్‌కు టిడిపికి పట్టినగతే పడుతుందని హెచ్చరిక

కంఠేశ్వర్, నవంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం సర్ చార్జీల పేరిట దొడ్డిదారిన 18వేలకోట్ల రూపాయల భారం వేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని ఎర్రజెండా పార్టీల రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేస్తూ ప్రజలపై మోయలేని ఆర్థిక భారం వేస్తే గత టిడిపి ప్రభుత్వానికి పట్టినగతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసి, ఎంసిపిఐ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని న్యూఅంబేద్కర్ భవన్‌లో సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం రాష్ట్ర నాయకుడు సాగర్, న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకుడు డివి.క్రిష్ణ, సిపిఐ రాష్ట్ర నాయకుడు రామనర్సింహలు మాట్లాడారు. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు లాభాలు చేకూర్చడానికే ప్రభుత్వం సర్ చార్జీల పేరిట వినియోగదారులపై తీవ్ర ఆర్థిక భారం వేస్తోందని ఆరోపించారు. మన రాష్ట్రంలో లభించే బొగ్గు, గ్యాస్‌ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న పాలకులు, విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా అధిక ధరలకు దిగుమతి చేసుకోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ రంగంలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ పాలకులు తమ స్వార్థం కోసం ప్రైవేటు కంపెనీలకు అనేక రాయితీలు కల్పించడంతో పాటు అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తోందని విమర్షించారు. ప్రజాప్రతినిధుల నెలకొల్పిన కంపెనీలు కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించకుండా ఎగవేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పేద ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తోందన్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు బస్ చార్జీలను పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం వేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు 13వేల కోట్ల రూపాయల విద్యుత్ సర్‌చార్జీలను పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరో ఐదువేల కోట్ల రూపాయల సర్‌చార్జీల భారాన్ని సైతం ప్రజలపై వేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. నిబంధనల ప్రకారం గ్యాస్ నిక్షేపాలు ఉన్న రాష్ట్రానికి 50శాతం గ్యాస్ సరఫరా చేయాల్సి ఉండగా ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రపంచ బ్యాంకు విధానాల అమలులో భాగంగానే ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడం జరిగిందని ఆరోపించారు. టిడిపి అధికారంలో ఉండగా ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును గద్దె దించడానికి ఉద్యమించిన కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం మూడింతల విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డివిరుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత టిడిపి విధానాలనే అవలంభిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్ సర్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో విద్యుత్ పోరాటం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ, ఎంసిపిఐ నాయకులు పెద్ది వెంకట్రాములు, భూమయ్య, యాదగిరి, సాయిబాబా, ప్రభాకర్, దండి వెంకట్, సిద్ధిరాములు, సుధాకర్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

జూదం ఆడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ హెచ్చరిక
నిజామాబాద్ టౌన్, నవంబర్ 12: దీపావళిని పురస్కరించుకుని పేకాట జూదంను నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ తెలిపారు. జిల్లాలో జూదంను పూర్తిగా నిషేధించామని, దీపావళి వేడుక సాకుతో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. దీపావళి పర్వదినాన్ని శాంతియుత వాతావరణంలో, ఆనందోత్సాహాల నడుమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అంతేతప్ప ఆనవాయితీ పేరుతో పేకాట ఆడడం సరికాదని హితవు పలికారు. ఎంతో శుభాలు అందించే దీపావళి వేడుక సందర్భంగా జూదమాడి డబ్బులు, ఆస్తులు పోగొట్టుకోవడం వల్ల దుఃఖమే మిగులుతుందని, అనేక కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా పేకాట జూదాన్ని నిషేధించామని, ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక పోలీసు బృందాలు నిఘాను కొనసాగిస్తాయని అన్నారు. ఎక్కడైనా పేకాట జూదం ఆడుతున్నట్టు గమనిస్తే ప్రజలు వెంటనే తమ దృష్టికి తేవాలని ఎస్పీ సూచించారు. సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. 100, 08462-227100, 225100, 226101, 9440795452 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు.

నల్గొండ.....

లారీ - ట్రాక్టర్ ఢీ
* ఇద్దరి పరిస్థితి విషమం
* 12మందికి గాయాలు
నల్లగొండ టౌన్, నవంబర్ 12: నల్లగొండ సమీపంలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై చర్లపల్లి సాయిసదన్ వద్ద సోమవారం రాత్రి లారీ, ట్రాక్టర్ డీకొన్న సంఘటనలో 10మందికి గాయాలు కాగా, ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూరు మండలంలోని పేరన్‌దేవిగూడెంకు చెందిన కూలీలు నల్లగొండ మండలం బుద్దారం గ్రామానికి పత్తి చేలో పనికి వెళ్ళారు. ట్రాక్టర్‌లో తిరుగు ప్రయాణంలో చర్లపల్లి వద్దకు రాగానే తిప్పర్తి వైపునుండి చౌటుప్పల్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. గాయపడిన వారిని నల్లగొండ కేంద్ర ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన గాదరి మల్లమ్మ, రాములమ్మలను ప్రాథమిక చికిత్సనంతరం హైద్రాబాద్‌కు తరలించారు. లారీ డ్రైవర్ ఎండి. జాంగీర్‌కు రెండు విరిగినట్లు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ ఎస్‌ఎం భాషా తెలిపారు.

జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు
కలెక్టర్ అభినందన
నల్లగొండ టౌన్, నవంబర్ 12: అండర్-19 స్కూల్ గేమ్స్ విభాగంలో ఈ నెల 9నుండి 11వరకు కర్నూల్‌లోజరిగిన రాష్టస్థ్రాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా క్రీడాకారులు బంగారు పతకాలను కైవసం చేసుకున్నట్లు జిల్లా అండర్-19 క్రీడల అధికారి, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పిడిరవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ ముక్తేశ్వరరావు కలెక్టరేట్‌లో అథ్లెటిక్స్‌లో రాష్టస్థ్రాయిలో 5వేలు, 3వేలు, 15వందల మీటర్ల పరుగు పందాలలో జిల్లాలోని సూర్యాపేటలోని శ్రీనిధి జూనియర్ కళాశాల విద్యార్థిని వి.నవ్య మూడు బంగారు పథకాలు, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నకిరేకల్‌కు చెంది న బి.సైదులు 3వేల మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతాకం సాధించడంతో కలెక్టర్ అభినందించారు. అదే విధంగా కరీంనగర్‌లో జరిగిన తాంగ్ తా పోటీలలో నల్లగొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు చెందిన మని చంద్ర, కమల్ చంద్రలకు వరుసగా వెండి, కాంస్య పథకాలు సాధించడంతో అభినందించారు.

గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు వినతులు
నల్లగొండ టౌన్, నవంబర్ 12: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌డేలో జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావుకు వినతి పత్రాలు అందించారు. కలెక్టర్ కొన్నింటిని అక్కడే పరిష్కరించి మరికొన్నింటిని అక్కడే ఉన్న వివిధ శాఖల అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. నల్లగొండకు చెందిన ఓగ్గు కవిత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్ననాని భర్త మృతితో కుటుంబం గడపడం కష్టంగా ఉందని వితంతు పించన్ అందించాలని కోరారు. చిట్యాల మండలంలోని బోయదుబ్బకు చెందిన జి.రమణ వికలాంగుల వినతి పత్రం ఇప్పించాలని కోరారు. అనుముల మండలంలోని చిల్కపురంకు చెందిన అల్లాబి వృద్యాప పించన్ అందించాలని వినతి అందించారు. దామరచర్ల మండలంకు చెందిన సిరిపాల సైదులు తన పట్ట్భామిలో అక్రమంగా నిర్మించే శ్రీ లక్ష్మీ ఇండియన్ గ్యాస్ గోడౌన్ డిస్ట్రిబ్యూటర్ షిప్ రద్దుచేసి తన భూమిని ఇచ్చించాలని కోరారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా భర్తీ చేసిన సిఆర్‌పి, డిఎంటి పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని తెలుగు యువత జిల్లా కమిటీ అధ్యక్షుడు జక్కలి ఐల్లయ్య యాదవ్ కోరారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కార్యదర్శి పోతేపాక సాంబయ్యల ఆధ్వర్యంలో నీలం తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని వినతి పత్రం అందించారు. జిల్లా కేంద్రంలోని హైదర్‌ఖాన్‌గూడలో అసంపూర్తిగా వదిలేసిన సిసి రోడ్లను పూర్తిచేయాలని, డ్రైనేజీ, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి వినతిపత్రం అందించారు. అదనపు జెసి నీలకంఠం, కోనేరు రంగారావు కమిటీ ప్రత్యేక కలెక్టర్ ప్రసాద్‌రావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

వామ్మో..! సర్‌చార్జీతో విద్యుత్ బిల్లులు
వినియోగదారుల గగ్గోలు
మిర్యాలగూడ టౌన్, నవంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కు విధించిన సర్‌చార్జీ అనంతరం బిల్లులు ఒకొక్కటి వినియోగదారుల చేతికి వస్తుండటంతో వామ్మో అంటు గగ్గోలు పడ్తున్నారు. ఏప్రిల్ 2010 నుండి యూనిట్‌కు సర్‌చార్జీ సుమారు 52 పైసలు వసూలు చేయగా, గత ఏప్రిల్ 2011 నుండి సర్‌చార్జీని ఈ ఏడాది సుమారు రూపాయి 32 పైసులు వసూలు చేస్తున్నారు. 50 యూనిట్ల వినియోగించే వినియోగదారుడికి మినహాయింపు ఉండగా, 100 యూనిట్లు వాడే వారికి సర్‌చార్జీ రూపాయి 32 పైసలు యూనిట్‌కు విధిస్తుండటంతో అక్టోబర్‌లో సుమారు రూ.70 వచ్చిన వారికి నవంబర్‌లో చేసిన బిల్లులో 300 రూపాయలు వచ్చినట్టు కోల సాయి అనే వినియోగదారుడు తెలిపాడు. అదే విధంగా అక్టోబర్ బిల్లు రూ.1090 రాగా, నవంబర్‌లో తీసుకున్న రీడింగ్‌తో బిల్లు రూ.1444 వచ్చినట్టు మరో వినియోగదారుడు వాపోయారు. అక్టోబర్‌లో రూ.150 బిల్లు రాగా, నవంబర్‌లో రూ.337 వచ్చినట్టు మరో వినియోగదారుడు వాపోయారు. ఇక వాణిజ్య సంస్థల బిల్లులు చెప్పనక్కరలేదని అంటున్నారు. సగానికి సగంవరకు పెరిగాయని వ్యాపారస్తులు వాపోతున్నారు. సర్‌చార్జీల బకాయిలంటూ వసూలుచేసే విధానాన్ని రద్దుచేయాలని వినియోగదారులు కోరుతున్నారు. 4 నుండి 6 గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నా కూడా బిల్లులు మాత్రం ఎక్కువగా వస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

ఉద్యమిస్తేనే ప్రజలు ఆదరిస్తారు
ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు
మర్రిగూడ, నవంబర్ 12: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమించే నాయకులనే ప్రజలు ఆదరిస్తారని మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ఐక్య వేదిక కావలని సూచించారు. మొదటి నుండి సిపిఐ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటాలు చేస్తుందన్నారు. మండలంలో పత్తి కొనుగోలు కోసం సిసిఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నీలం తుఫాన్ కారణంగా నష్టపోయిన పత్తి, వరి రైతులను ప్రభుత్వం ఎకరాకు 25వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి బుర్ర అంజయ్య, అనుబంధ సంఘాల నాయకులు చెల్లం పాండురంగారావు, బూడిద సురేష్, విష్ణు, సిద్దగోని మహేష్, బొడ్డు సాయి తదితరులు పాల్గొన్నారు.

సమరభేరికి తెలంగాణ వాదులు దండులా కదలాలి
* సమైక్యవాధి పార్టీలను భూస్తాపితం చేయాలి
* టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా
నల్లగొండ టౌన్, నవంబర్ 12: ప్రత్యేక రాష్ట్ర సాధనకై ఈ నెల 23న జిల్లా లోని సూర్యాపేటలో టి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘తెలంగాణ సమరబేరి’కి తెలంగాణ వాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, విద్యార్థిలు దండులా కదలిరావాలని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమరభేరికి 2లక్షల మందిని తరలించి విజయవంతం చేయడానికి జిల్లాలోని 12నియోజకవర్గాలకు అధినేత కెసిఆర్ పార్టీ ఎమ్మెల్యేల బృందాన్ని నియమించారని వెల్లడించారు. సమైక్య వాదంతో ముందుకు వస్తున్న పార్టీలకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పి భూస్థాపితం చేస్తారన్నారు. సమైఖ్యవాదంతో ముందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌సిపిలోకి తెలంగాణ వాదులు చేరడం బాధకరమన్నారు. వైఎస్‌ఆర్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డికి, సంకినేని వెంకటేశ్వరరావులకు రాబోయే కాలంలో ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. టిడిపి తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి వైఖరితోనే ఆ పార్టీ సీనియర్ నేతలు ఇతర పార్టీలలోకి పరుగుతు తీస్తున్నారని ఆరోపించారు. టిడిపిని ఏ విధంగా బహిష్కరించారో అదే తరహాలో వైఎస్‌ఆర్‌సిపిని కూడా ప్రజలు విస్మరిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి, టిడిపి ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, వేనేపల్లి చందర్‌రావులు ఆయా పార్టీలను వీడే అవకాశం ఉందని ప్రచారం సాగుతుందని వారు తెలంగాణ వాదంతో పోరాడే పార్టీలలోనే చేరితే ప్రజలు ఆదరిస్తారని కోరారు. ఉద్యమాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు రాజకీయంగా టి ఆర్ ఎస్ ముందుకు సాగుతూ 2014 ఎన్నికలలో 100అసెంబ్లీ, 16పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో టి ఆర్ ఎస్ అధికార ప్రతినిధి బక్క పిచ్చయ్య, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు రేకల భద్రాద్రి, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు మాలె శరణ్యరెడ్డి, జిల్లా నాయకులు గుంటోజు వెంకటాచారి, అభిమన్యు శ్రీనివాస్, చాడ కిషన్‌రెడ్డి, కృష్ణ, విద్యార్థి నాయకులు బొమరబోయిన నాగార్జున, కట్ట శ్రీను, చల్ల కోటేష్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు వైభవాన్ని ప్రజలకు చాటిచెప్పాలి
* జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు
నల్లగొండ టౌన్, నవంబర్ 12: తెలుగు వైభవాన్ని, తెలుగు వారి చైతన్యాన్ని దశ దిశలో ప్రజలకు చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైన్నా ఉందని జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు కోరారు. సోమవారం పట్టణంలోని డైట్ కేంద్రంలో డిసెంబర్ 27నుండి తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహసభల సందర్భంగా తెలుగు భాషా పండితులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక కళా వైభవాన్ని చాట్టి చెప్పె బృహతర కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో వారం రోజుల పాటు నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడలు, కళాజానం చేతి వృత్తులు, అమ్మమ్మ, నాన్నమ్మ నుండి కథలు, పాటలు సేకరించడంతోపాటు ప్రతి విద్యార్థి కనీసం పది పద్యాలు నేర్చుకుని పాడగలిగేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. తెలుగు వారిగా పుట్టింనందుకు తెలుగు భాషలో మాట్లాడుతున్నందుకు ప్రతి విద్యార్థి గర్వ పడేలా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో క్విజ్, వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతోపాటు కవులు కళాకారులను సన్మానించాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి నీలకంఠం, డిఇవో ఆచార్య జగదీష్, డిప్యూటి డిఇవో పి.రమేష్, ఎడి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సాగర్ నీటి కోసం ఎదురుచూపులు!
* నీటి విడుదలపై ఎటూ తేల్చని ప్రభుత్వం
* రబీ సీజన్‌తో రైతుల్లో ఆందోళన
మిర్యాలగూడ, నవంబర్ 12: నాగార్జునసాగర్ ఆయకట్టు మొదటిజోన్‌కు సాగు నీటి విడుదలపై రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు జిల్లా ప్రజాప్రతినిధులు ప్రక టించారు. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నీటి విడు దలపై ఇప్పటివరకు ఏలాంటి ప్రకటన లేకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన కలుగుతోంది. రబీసీజన్ ముంచుకొస్తుండడంతో మొదటిజోన్‌కు నీటి విడుదల జరుగు తుందా.. జరగదాఅన్న అయోమయంలో రైతులు కొట్టుమిట్టా డుతున్నారు. గత ఏడాది రబీలో నీటి విడుదల జరగలేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సైతం సాగునీటి విడుదల జరగకపోవడంతో ఆయకట్టులో వరుసగా 3వ పంట నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఉన్న నీటితో మొదటిజోన్‌లోని ఆయకట్టుకు సాగునీటి విడుదల సాధ్యాసాధ్యాలపై సాగర్‌ప్రాజెక్టు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యమంత్రికి ఇప్పటికే ఎన్ని టిఎంసీల నీరు అందుబాటులోఉందో అధికారులు తెలియచేశారు. అయినప్ప టికి భారీనీటి పారుదలశాఖ మంత్రితో ప్రకటన చేయిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నప్పటికి నీటి విడుదలపై ఏలాంటి ప్రకటన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన ఎక్కువవుతుంది. దీపావళినాటికే సాగునీటి విడుదలపై సానుకూల ప్రకటన ప్రభుత్వం చేస్తుందనుకున్న రైతాంగానికి నిరాశే మిగిలింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో త్రాగునీరు, ఇతర అవసరాలకుపోను సాగునీటికి అందుబాటులో 90 టిఎంసీల కృష్ణాజలాలు ఉన్నాయి. ఈ నేపద్యంలోనే మొదటిజోన్‌కు నీటి విడుదల చేయాలనే డిమాండ్ బలపడింది. జిల్లాకు చెందిన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిపిఎం శాసనసభాపక్షనేత, మిర్యాలగూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలు ముఖ్యమంత్రిని కలిసి ఆయకట్టు పరిస్థితిని వివరించారు. ఇదిలా ఉండగా శ్రీశైలంలోని నీటి నిల్వలు రోజురోజుకు నిండుకుంటున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా అడపాదడపా అక్కడి అవసరాలకు నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలంలో నీటిమట్టం 191 టిఎంసీల నుండి 122 టిఎంసీలకు పడిపోయింది. మరోవైపు సాగర్‌లోనూ క్రమక్రమంగా నీటిమట్టం తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం త్వరితగతిన నీటి విడుదలపై ప్రకటన చేస్తే ప్రాజెక్టుల్లోని నీటివృధాను అరికట్టి సాగుకోసం కృష్ణాజలాలను ఉపయోగించే వీలుంటుందని ఆయకట్టు రైతులు అంటున్నారు.

వేగం పెంచిన వైకాపా..టిఆర్‌ఎస్‌లు !
కాంగ్రెస్..టిడిపిలకు వలసల బెంగ !!
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, నవంబర్ 12: రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణల ప్రభావం జిల్లా రాజకీయాల్లోను భారీ మార్పులను కల్గిస్తుంది. జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలకు చెందిన పలువురు ముఖ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టిఆర్‌ఎస్‌లు తమ పార్టీల్లోకి చేర్చుకుంటు రాజకీయంగా బలాన్ని పెంచుకుంటుండగా ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టిడిపిలకు వలసల బెంగ పెట్టుకుంది. ఏ నియోజకవర్గం నుండి ఏ నాయకుడు ఎప్పుడు పార్టీ మారుతాడోనన్న ఆందోళన ఆ పార్టీ అధినాయత్వాలకు కలవరపాటుకు గురిచేస్తుంది. నవంబర్ 23న సూర్యాపేటలో జరిగే సమరభేరి సభతో భారీగా వలసల పర్వానికి తెర లేపాలని టిఆర్‌ఎస్ కసరత్తు సాగిస్తుంది. దక్షిణ తెలంగాణలో బలం పెంచుకునే దిశగా దిశగా కీలకమైన నల్లగొండలో పార్టీ విస్తరణకు ఏకంగా ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఈ దఫా ఎన్నికల్లో భువనగిరి, నల్లగొండలలో ఏదో ఒక స్థానం నుండి నిలిచే ఆలోచన చేస్తుండటం జిల్లాలో టిఆర్‌ఎస్ శ్రేణుల్లో కదనోత్సహాన్ని నింపుతుంది. అటు వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి టిడిపిలో బలమైన నాయకుడిగా ఉన్న సంకినేని వెంకటేశ్వర్‌రావు, భువనగిరి, ఆలేరులకు సంబంధించి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలను, మిర్యాలగూడ, కోదాడల నుండి పాదూరి కరుణ, శ్రీకళారెడ్డిలను తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల సమాయత్తం దిశగా వేగం పెంచింది. కాంగ్రెస్, టిడిపిల నుండి మరింత మంది పెద్ద తలకాయలకు ఆ పార్టీ నేతలు గాలం వేసినట్లుగా సమాచారం. త్వరలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ వైఎస్సార్‌సిపిలో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తుండగా, తెలంగాణ సాధన పట్ల వారికి చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీలో చేరాలంటు టిఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం వారికి తలుపులు తెరిచిపెట్టి ఉంచింది. నల్లగొండ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే తెలంగాణపై కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి తీసుకుంటే పార్టీకి గుడ్‌బై కొడుతానంటు బాహటంగానే ప్రకటించారు. ఆయన కె.కేశవరావు బృందంలో సాగుతారో లేక మరో పార్టీలో చేరుతారో త్వరలోనే తేలనుంది. టిడిపిలో మోత్కుపల్లి నర్సింహులుతో పొసగలేకపోతున్న భువనగిరి, కోదాడ ఎమ్మెల్యేలు ఎ.ఉమామాధవరెడ్డి, వేనెపల్లి చందర్‌రావులు సైతం త్వరలో ఆ పార్టీని వీడనున్నట్లుగా ప్రచారం సాగుతుంది. టిడిపి, కాంగ్రెస్‌లను వీడే వారంతా సమైఖ్యవాద పార్టీల్లో కాకుండా తెలంగాణ సాధించే టిఆర్‌ఎస్‌లో చేరాలంటు ఏకంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి పిలుపునివ్వడం గమనార్హం. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిఆర్‌ఎస్‌కు బలమైన అభ్యర్ధి లేడన్న లోటును పూడ్చేందుకు టిడిపి ఎమ్మెల్యే ఎ.ఉమామాధవరెడ్డిని, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డిని కారు ఎక్కించేందుకు కొంతమంది రాయబారం నెరపుతున్నారు. అయితే సందీప్‌రెడ్డి సన్నిహితులు ఆయనను వైఎస్సార్‌సిపిలో చేరాలంటు ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. భువనగిరి నియోజకవర్గం నుండి దివంగత టిఆర్‌ఎస్ నేత కళ్లెం యాదగిరిరెడ్డి కూమారుడు వేణుగోపాల్‌రెడ్డి కూడా త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి రావచ్చని భావిస్తున్నారు. అటు బిజెపి సైతం ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలాన్ని పెంచుకునే క్రమంలో చేరికలపై దృష్టి సారించి ఇప్పటికే భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ డిఎస్పీ నళినిని పార్టీలో చేర్చుకుని బలసమీకరణల్లో ప్రధాన పార్టీలకు తామేమి తక్కువ తినలేదని చాటారు. పద్మశాలి సామాజిక వర్గంకు చెందిన నళినిని భువనగిరి బరిలో నిలిపినట్లయితే ఈ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న ఆ వర్గం మద్దతు లభిస్తుందని కమలనాధుల ఆశ. పోటీలో ఇతర పార్టీల నుండి దాదాపుగా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులే ఉంటే బిసి వాదం..తెలంగాణ నినాదంతో నళిని గెలుపు తీరాలకు చేరవచ్చని ఆ పార్టీ అంచనా. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో సైతం తమ బలాన్ని పెంచుకునేందుకు బిజెపి నాయకత్వం పావులు కదుపుతుంది. టిడిపి సాగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి తేరా చిన్నపరెడ్డి కూడా పార్టీ మారే అవకాశం లేకపోలేదని భోగట్టా. అటు వలసలతో ఠారెత్తిపోతున్నప్పటికి కాంగ్రెస్‌కు జానా..ఉత్తమ్,దామన్న, పాల్వాయి వంటి సీనియర్లు కొండంత బలంగా ఉన్నా..తెలంగాణ వాదం, వైకాపా గాలి జోరులో వారి ప్రభ అంతగా వెలగకపోవచ్చన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వలసల సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్, టిడిపిలకు జిల్లా పార్టీల అధ్యక్షుల నియామక సైతం తలనొప్పిగా తయారైంది. డిసిసి అధ్యక్షుడిగా తూడి దేవేందర్‌రెడ్డి కొనసాగింపుపై స్పష్టత లేకపోగా, టిడిపి జిల్లా అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ మార్పుపై నిర్ణయం అధినేత చంద్రబాబు వద్ధ పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు సంసిద్ధంగా లేని ఆ పార్టీ శ్రేణులకు మరింత బెంగ కల్గించేలా లోక్‌సభ ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్‌కు మజ్లీస్ మద్ధతు ఉపసంహారణ వ్యవహారం ఆశనిపాతంగా మారిందని రాజకీయ వర్గాలు విశే్లషిస్తున్నాయి.

మంత్రి సుదర్శన్‌రెడ్డి వెల్లడి
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>