Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నీలం తుఫాన్ బాధితులను ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా

$
0
0

మచిలీపట్నం టౌన్, నవంబర్ 12: నీలం తుఫాన్ నష్టపోయిన బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు జె జగన్ మాట్లాడుతూ దశాబ్దాల తరబడి డ్రైన్లు మెరుగుపర్చకపోవడం వల్ల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది రైతులు వేలాది రూపాయలు నష్టపోయారని వారందరికీ పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 10 వేలు తక్షణ సాయంగా అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

స్పెషల్ ప్యాకేజీ నిధులతో
మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి పర్చాలి
* జాయింట్ కలెక్టర్‌ను కోరిన వైఎస్‌ఆర్ సిపి నేతలు
మచిలీపట్నం టౌన్, నవంబర్ 12: మంగినపూడి బీచ్ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజీ నిధులు కేటాయించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదివాడ రాము, కుంభం చరిత కార్తీక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం జాయింట్ కలెక్టర్ ఉషాకుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్తీక పౌర్ణమి స్నానాలకు మంగినపూడి బీచ్‌లో పర్యాటకులకు అనుమతి ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సిపి నేతలు పి వెంకటేశ్వరరావు, సిహెచ్ నాగమల్లేశ్వరరావు, థామస్ పాల్గొన్నారు.

వరకట్న వేధింపులతో వివాహిత అనుమానాస్పద మృతి, భర్త ఆత్మహత్య
బంటుమిల్లి, నవంబర్ 12: బంటుమిల్లి మండలం కంచడం శివారు కొత్తూరులో వరకట్నం వేధింపులకు జ్యోతిశ్రీ అనే వివాహిత ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని కంచడం శివారు కొత్తూరు గ్రామానికి చెందిన సింహాద్రి ఎర్మియా(రాజు)కి పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్రం గ్రామానికి చెందిన జ్యోతిశ్రీతో సంవత్సరన్నరం క్రితం వివాహమైంది. వివాహం అయిన మూడు నెలల తరువాత వారి కాపురాల్లో కట్నం వేధింపులు మొదలవటంతో విసిగివేసారిన జ్యోతిశ్రీ ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించింది. కోడలు ఉరివేసుకుని మరణించటం చూసిన ఆమె అత్త పొలం పనిలో ఉన్న తన భర్త నరసయ్యను తీసుకువచ్చింది. ఇద్దరూ కలిసి కోడలి శవాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో జ్యోతిశ్రీ భర్త రాజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఈ సమాచారం ఫోన్ ద్వారా జ్యోతిశ్రీ తల్లికి అందజేశారు. వెంటనే ఆమె వచ్చి సోమవారం ఉదయం బంటుమిల్లి పోలీసులకు తన కుమార్తెను తన అల్లుడు రాజు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదు చేసింది. బంటుమిల్లి ఎస్‌ఐ ఎల్ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంటుమిల్లి తహశీల్దార్ పూర్ణిమ శవ పంచనామ చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం బందరు తరలించారు. బందరు డిఎస్‌పి లావణ్యలక్ష్మి సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతిశ్రీ తల్లి లక్ష్మి తన కుమార్తెకు లక్ష రూపాయలు నగదు, ఎనిమిది కాసుల బంగారం ఇచ్చి వివాహం జరిపించామని డిఎస్‌పికి మొరపట్టుకుంది. కాగా ఇంటి నుంచి పారిపోయిన రాజు పెడన బస్టాండులో సోమవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు బంటుమిల్లిలో వెల్డింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. జ్యోతిశ్రీ, రాజుకు 9 నెలల కుమార్తె ఉంది.

చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోం
గుడివాడ, నవంబర్ 12: ప్రజానేత చంద్రబాబునాయుడ్ని విమర్శిస్తే ఊరుకునేది లేదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)ని మాజీ కౌన్సిలర్ దింట్యాల రాంబాబు హెచ్చరించారు. సోమవారం స్థానిక ఏలూర్ రోడ్డులోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు భిక్షతో ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయాన్ని కొడాలి నాని మర్చిపోవడం సిగ్గుచేటన్నారు. ఒకవైపు తుఫాను ప్రభావంతో ప్రజలు అల్లాడుతుండగా నందివాడ మండలంలో తుఫాను వల్ల నష్టపోయిన ప్రాంతంలో సన్మానం చేయించుకోవడం ఎమ్మెల్యే కొడాలి నానికే చెల్లిందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం దొంగల పార్టీ వైఎస్సార్ సిపిలోకి చేరి చంద్రబాబును విమర్శిస్తే గుణపాఠం చెబుతామని అన్నారు. పార్టీ సీనియర్ నేత నూతక్కి బాలాజీ మాట్లాడుతూ చెంచల్‌గూడ జైలు సాక్షిగా వైఎస్సార్ సిపిలో చేరిన నేతలంతా నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. షర్మిల పాదయాత్ర ప్రభావం రాష్ట్రంపై ఉండదని, బంగాళాఖాతంలో ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నేతలు బేతనపల్లి నాగేశ్వరరావు, తంగిరాల మోహన్‌దాస్, పల్లపోతు వెంకట కృష్ణారావు, రేమల్లి కమలకుమారి, కంచర్ల సుధాకర్, అరికేపూడి రామశాస్త్రులు, నర్రా శ్రీనివాస్, సిరిపురపు తులసీరాణి పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు జీవ వైవిధ్యం దోహదం
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 12: పర్యావరణ పరిరక్షణకు జీవ వైవిధ్యం దోహదం చేస్తుందని హిందూ కళాశాల ప్రిన్సిపాల్ వి ఉషారాణి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక హిందూ కళాశాలలో జీవ వైవిధ్య పరిరక్షణ - విద్యార్థుల పాత్ర - నిర్మాణాత్మక సూచనలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషారాణి జీవ వైవిధ్య ఆవశ్యకతను వివరించారు. పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల 17న కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేస్తామని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కన్వీనర్ పి ఓం నమశ్శివయ్య తెలిపారు.

20లోపు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 12: జిల్లాలోని షెడ్యుల్డు కులాలు, షెడ్యుల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ఈ నెల 20వ తేదీ లోపు ఇ-పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు పిఎస్‌ఎ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. అంగవైకల్యం గల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సిఓ, పిఆర్‌పిల బదిలీలను ఆపాలి

మచిలీపట్నం (కోనేరుసెంటరు), నవంబర్ 12: జగ్గయ్యపేట ఇందిరా క్రాంతిపథం పావర్టీ రిసోర్స్ పర్సన్, కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఎస్ సుధారాణి, కె కవిత తాత్కాలిక బదిలీని నిలుపు చేయాలని కోరుతూ సోమవారం జగ్గయ్యపేట డ్వాక్రా గ్రూపుల మహిళలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిఆర్‌పిలు రమాదేవి, రాజ్యలక్ష్మి పై అధికారులకు తెలియకుండా 14,400, 10,000 బ్యాంకు నుండి డ్రా చేశారని, దీనిపై ప్రశ్నించిన సుధారాణి, కవితను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ రమాదేవి, రాజ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని, సుధారాణి, కవిత బదిలీలను నిలుపు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం సరోజిని, ఎం మరియమ్మ, ఎన్ సుశీల, పి రామలక్ష్మి, పి స్వరాజ్యం, కె నాగలక్ష్మి, టి లక్ష్మి, ఎన్ మనోహరి, కె రూతమ్మ తదితరులు పాల్గొన్నారు.

రేపు కేంద్ర మంత్రి చిరంజీవి రాక
విజయవాడ (క్రైం), నవంబర్ 12: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ కె చిరంజీవి ఈ నెల 14న నగరానికి రానున్నారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా నగరానికి వస్తున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 8గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 8నుంచి 9గంటల వరకు అల్పాహార విందు తీసుకొని అధికారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఉదయం పదిన్నర గంటలకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15 నుంచి ఒంటి గంట వరకు 48వ డివిజన్‌లో రాజీవ్ ఆవాస్ యోజన ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన నిర్వహించి పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 50వ డివిజన్‌లో ఆకుల నారాయణరావు స్మారక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.15 నుంచి 4గంటల వరకు పర్యాటక శాఖ అధికారులతో ప్రభుత్వ అతిథిగృహంలో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి నగరంలోనే మంత్రి చిరంజీవి బసచేస్తారు.

15న గవర్నర్ రాక
విజయవాడ (క్రైం), నవంబర్ 12: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఈ నెల 15న నగరానికి రానున్నారు. ఆరోజు ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 8గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డుమార్గం ద్వారా ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారు. ఉదయం 10.20కి ప్రభుత్వం అతిథిగృహం నుంచి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి బయలుదేరుతారు. అక్కడి కార్యక్రమాల అనంతరం 12.30కి యూనివర్శిటీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.10కి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరతారు.

కేంద్రమంత్రి చిరంజీవి సహకారంతో ముఖ్య పర్యాటక కేంద్రంగా...
గాంధీ హిల్‌ను తీర్చిదిద్దుదాం
* అధికార్లతో సమావేశంలో ఎమ్మెల్యే వెలంపల్లి
విజయవాడ (క్రైం), నవంబర్ 12: చారిత్రక ప్రాముఖ్యత కలిగిన గాంధీ పర్వతాన్ని పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు గాంధీ హిల్ సొసైటీ సహకరించాలని శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. స్థానిక గాంధీ పర్వతం వైపు ఉన్న చరిత్రాత్మక కట్టడాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ కె చిరంజీవి సహకారంతో అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గాంధీ హిల్ సొసైటీ సభ్యులు, ఇతర అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ స్మృతికి చిహ్నంగా నగరంలో ఏర్పాటు చేసిన గాంధీ స్మారక స్థూపం అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందిందన్నారు. గాంధీ పర్వతాన్ని అభివృద్ధి చేసేందుకు గాంధీ హిల్ సొసైటీకి సహకరించేందుకు ముందుకు రావాలని కోరారు. కేంద్ర మంత్రి చిరంజీవి ఈ నెల 14న నగరంలో పర్యటించనున్నారని, ఈసందర్భంగా గాంధీ హిల్ విశిష్టతను ఆయనకు వివరించి అభివృద్ధి పరిచేందుకు అవసరమైన నిధులను విడుదల చేయమని కోరనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పర్వతంపై ఉన్న పురాతన కట్టడాలను పునరుద్ధరించి పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను తయారుచేసి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ ప్రతినిధులు సమష్టిగా కృషి చేద్దామని వెలంపల్లి కోరారు. సమావేశంలో గాంధీ హిల్ సొసైటీ అధ్యక్షులు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ 19ఎకరాల విస్తీర్ణం కలిగిన పర్వతంపై 1968లో అప్పటి రాష్టప్రతి జాకీర్ హుస్సేన్ గాంధీజీ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారన్నారు. 1968లో సౌండ్ అండ్ లైట్స్ ప్రోమోను ఏర్పాటు చేశారని, అనంతరం ప్లానిటోరియం పరికరాలను సేకరించి జమన్‌లాల్ జజార్ వారి సహకారంతో టెలిస్కోప్ పరికరాలను, దాతల సహకారంతో సోలార్ సిస్టమ్, ప్రాజెక్టర్లను ఏర్పాటు చేసి ప్లానిటోరియంను నిర్మించామన్నారు. 1969లో పిల్లల ట్రైన్‌ను ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేలా సొసైటీ కృషి చేసిందన్నారు. కాలక్రమేణా కొన్ని పరికరాలు నిర్జీవమయ్యాయని, ప్రస్తుతం ప్లానిటోరియం పరికరాల సామర్థ్యాన్ని పెంపొందించి పురాతన కట్టడాలకు పునర్జీవం పోయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే గాంధీ పర్వతం విశిష్టతకు భంగం కలగకుండా అభివృద్ధి చేసేందుకు సౌసైటీకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆర్డీఓ, జిల్లా పర్యాటకాధికారి ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి చిరంజీవి సహకారంతో రాష్ట్రంలోనే జిల్లాను ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. నగరంలో అభివృద్ధి చేయాల్సిన పర్యాటక కేంద్రాలను, వాటి విశిష్టతను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు విడుదల చేసేలా సమష్టిగా కృషి చేద్దామని కోరారు. సమావేశంలో గాంధీ హిల్ సొసైటీ సభ్యులు తొండెపు హనుమంతరావు, జి గణేష్, జి విశ్వనాథ్, గాంధీ హిల్ మేనేజర్ ఎంకె బేగ్, అర్బన్ తహసిల్దార్ ఆర్ శివరావు, టూరిజం అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా లక్ష్మీకుబేర వ్రతం
ఇంద్రకీలాద్రి, నవంబర్ 12: పటమట దత్తపీఠంలో ధనత్రయోదశి సందర్భంగా సోమవారం ఉదయం లక్ష్మీకుబేర వ్రతం వైభవంగా జరిగింది. ఈకార్యక్రమానికి శ్రీపరాశరం పట్ట్భారామాచార్యులు ఆధ్వర్యంలో అర్చకస్వాములు అత్యంత నియమనిష్ఠలతో నిర్వహించారు. భక్తులు అందరూ కలశరూపంలో లక్ష్మీదేవిని స్థాపించి పూజించి కలశం చుట్టూ నవగ్రహాలను అవగాహనచేసి అర్చించారు. శ్రీ సూక్త పఠనం, మహాలక్ష్మీ అష్టోత్తర నామాలతో కుంకుమార్చన చేశారు.

బిసిసిఐ సౌత్ జోన్ సీనియర్ మహిళల క్రికెట్..
చాంపియన్ హైదరాబాద్
* ఆంధ్రాకు వైట్‌వాష్
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 12: కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బిసిసిఐ సౌత్ జోన్ అంతర్ రాష్ట్రాల సీనియర్ మహిళల క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు 24పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది. 19పాయింట్లతో తమిళనాడు, 11పాయింట్లతో కేరళ తరువాత రెండు స్థానాలను దక్కించుకున్నాయి. ఆంధ్రా జట్టు ఘోర పరాజయాలు నమోదు చేసి వైట్‌వాష్ పొందిన జట్టుగా రికార్డ్ సాధించింది. ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించకపోవడంతో 2పాయింట్లతో చివరిస్థానంతో సరిపెట్టుకుంది.
హైదరాబాద్, తమిళనాడు జట్లు తలపడగా హైదరాబాద్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. జట్టులో డయానా డేవిడ్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి బౌలింగ్‌లో 36 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకుంది. ఛేజింగ్‌కు దిగిన తమిళనాడు జట్టు 48.3 ఓవర్లలో 172 పరుగులకు అలౌటైంది. జట్టులో అనూష ప్రభాకరన్ 39 పరుగులు, విలాసినీ 29 పరుగులు చేశారు.
5 వికెట్లతో కేరళ విజయం
కేరళ, గోవా జట్లు తలపడగా కేరళ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన కేరళ జట్టు గోవాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గోవా జట్టు 47.3 ఓవర్లలో 120 పరుగులకు అలౌటైంది. జట్టులో షికారెడ్డి 29 పరుగులు, రేషా 17 పరుగులు చేశారు. ఛేజింగ్‌కు దిగిన కేరళ జట్టు49.1 ఓవర్లతో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. జట్టులో టి.శాంతి 44 పరుగులు, ఎస్.అషా 35 పరుగులు చేశారు.
ఆంధ్రా, కర్నాటక జట్లు తలపడగా కర్నాటక జట్టు 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆంధ్రా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సుధారాణి 30 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన కర్నాటక జట్టు 40.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. జట్టులో విఆర్ వనిత 57 పరుగులు చేయగా కరుణజైన్ 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

దుర్గగుడిలో అనిశ్చితికి
త్వరలోనే తెర!
ఇంద్రకీలాద్రి, నవంబర్ 12: శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ప్రస్తుతం నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్ధితుల పరిష్కారంలో సర్కార్ ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. భారీస్థాయిలో మార్పులు, చేర్పులు, తదితర అంశాలు చోటుచేసుకోనే అవకాశం ఉన్నట్లు దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన సీనియర్ ఉద్యోగులు తెలిపారు. ఆర్‌జెసి యం రఘునాథ్‌ను సస్పెన్షన్ చేసిన తర్వాత జరిగిన వివిధ పరిణామాలను దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి సి రామచంద్రయ్య పూర్తిస్థాయిలో పరిశీలించి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకొని సియం అనుమతితో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయటానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీపావళి పర్వదినం తర్వాత యం రఘునాథ్ ప్రస్తుతం కోర్టును ఆశ్రయించటం, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి సి రామచంద్రయ్య తీసుకున్న నిర్ణయాలు అమలుచేయటానికి వేచి ఉన్నట్లు మంత్రి సన్నిహితులు తెలిపారు. ఇన్‌చార్జ్ ఇవో విష్ణుప్రసాద్ తప్పిదం వల్లే అకారణంగా విపక్ష పార్టీల నాయకులు అధికారపార్టీని విమర్శించటానికి అవకాశం కలిగిందని, ఆరోజు జరిగిన సంఘటనకు కేవలం ఇన్‌చార్జ్ ఇవో కారణమని ఇప్పటికే రెండు వినతిపత్రాలు మంత్రికి చేరినట్లు సమాచారం. ఆర్‌జెసి యం రఘునాథ్ దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించి ఇప్పటివరకు దేవస్థానం ఆదాయాన్ని గణనీయంగా పెంచిన విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిసింది. దీంతో మంత్రి సైతం యం రఘునాథ్, ఇన్‌చార్జ్ ఇవో విష్ణుప్రసాద్, తదితరుల విషయంలో పూర్తిస్థాయిలో పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్లు ఈశాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. తిరిగి యం రఘునాథ్‌కే దుర్గగుడి ఇవో బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని పుకారులు, షికారులు చేస్తున్నాయి. దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వద్ద ఒక వర్గనాయకుల చేత ఇన్‌చార్జ్ నుండి రెగ్యులర్ చేయించుకోవటానికి ఇన్‌చార్జ్ ఇవో విష్ణుప్రసాద్ భారీస్థాయిలో లాబీ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా లభించిన కీలక సమాచారం. ఇదిలా ఉండగా రెండు, మూడు రోజుల్లో కేంద్రమంత్రి ఒకరు స్వయంగా రంగంలోకి దిగి ఆర్‌జెసి యం రఘునాథ్‌కు తిరిగి దుర్గగుడి ఇవో పోస్ట్‌ను ఇప్పించటానికి ముందుకు వస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈపరిణామాలు ఐదురోజుల తర్వాత ఒక కొలిక్కి వచ్చిన వెంటనే సర్కార్ దుర్గగుడి విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.

బుడమేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు
విజయవాడ రూరల్, నవంబర్ 12: ఏటేటా వేలాది ఎకరాలు పంటనష్టంతో పాటు, నగర పరిసరాలు ముంపు బారినుండి పరిరక్షణకు ప్రభుత్వం తగుచర్యలు చేపట్టనున్నట్లు శాసనసభ్యుడు యలమంచిలి రవి, మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు అప్పసాని సందీప్ (నన్ను) తెలిపారు. ఇటీవల సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వరద పరిస్థితులు సమీక్షించటానికి వచ్చినప్పుడు బుడమేరు ముంపు నివారణపై యంత్రాంగానికి తగు ఆదేశాలు యివ్వటం జరిగిందని వివరించారు. ఇందులో భాగంగా సోమవారం ప్రజాప్రతినిధులు, స్థానికులు, అధికారుల బృందంతో ఆయా ప్రాంతాల పరిస్థితులను పరిశీలించారు. కొత్తూరు తాడేపల్లి, నున్న, జి.కొండూరు కొండల మధ్య రిజర్వాయర్ ఏర్పాటు ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు ఆధికారులు వివరించారు. 18కిలోమీటర్ల పొడవు, 2కిలోమీటర్ల వెడల్పు మేర 10 టిఎంసిల నీరు నిల్వ ఉంచే విధానంపై ఒక నివేదిక ప్రభుత్వానికి అందించనున్నట్లు ఇఇ శ్రీనివాస్, డిఇ శేషుబాబు తెలిపారు. కొండల మధ్య అనువుగా వున్న ప్రాంతంలో రిజర్వాయర్ ఆధునిక పద్ధతులతో నిర్మించటం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు, వివిధ గ్రామాలకు తాగునీరు అందించేందుకు సాంకేతిక అంశాలు తెలియజేయాలని సిఎం అధికారులను ఆదేశించటం జరిగిందని నన్ను చెప్పారు. బుడమేరు ముంపుతోపాటు బహుళ ప్రయోజనాలు పరిరక్షణలో ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపుతోందని వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖాధికారులతోపాటు స్థానిక కాంగె స్ నాయకుడు పుండరీక వరద వర్మ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ వారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
* తుర్లపాటి వెల్లడి
అజిత్‌సింగ్‌నగర్, నవంబర్ 12: భారతదేశంలో జాతీయ గ్రంథాలయ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన కృష్ణాజిల్లాలో 45వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తుర్లపాటి కుటుంబరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నగరంలోని ఠాగూర్ కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ దేశ వ్యాప్తంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీ అని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలతోపాటు జిల్లాలో ఉన్న అన్ని జిల్లా గ్రంథాలయాల్లో కూడా వారోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ వారోత్సవాల్లో పాఠకులను భాగస్వాములుగా చేయడంతోపాటు వారి సూచనల ప్రకారం గ్రంథాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్షించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాల్లో వారోత్సవాలను నిర్వహించేందుకు గాను సుమారు ఐదు లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు, యువకులకు వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖనం, క్విజ్, పాటల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా గ్రంథాలయ సంస్థ తరుపున మెమొంటో, సర్ట్ఫికెట్లను ప్రదానం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి విస్తృత చర్యలు తీసుకొంటున్నామని, పాఠకుల అవసరాల మేరకు వారికి కావాల్సిన సౌకర్యాల కల్పన, అధునిక వసతుల కల్పనల ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో అంతర్భాగాలైన గ్రంథాలయాలను మారుతున్న ఆధునిక సమాజానికి ధీటుగా తీర్చిదిద్ది మారుతున్న విద్యావసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని తగు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఠాగూర్ గ్రంథాలయాధికారి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్ళేపల్లి మధుసూధనరాజు తదితరులు పాల్గొన్నారు.
ఠాగూర్ గ్రంథాలయంలో...
నగరంలోని ప్రధాన గ్రంథాలయమైన ఠాగూర్ గ్రంథాలయంలో 45వ వారోత్సవాలను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసారు. రామకృష్ణాపురంలోని శ్రీ కళ్ళేపల్లి శేషంరాజు స్మారక శాఖా గ్రంథాలయం, మధురానగర్ గ్రంథాలయం, పటమట గ్రంథాలయం, రామవరప్పాడు లలోని జిల్లా శాఖా గ్రంథాలయాలు సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయ.

నీలం తుఫాన్ బాధితులను ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>