Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఒకేరోజు 1400 పాస్‌పోర్టు దరఖాస్తుల స్వీకరణ

$
0
0

విశాఖపట్నం, నవంబర్ 12: పాస్‌పోర్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలోని మర్రిపాలెం పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రత్యేక కౌంటర్ల’ సేవలకు విశేష ఆదరణ లభిస్తోంది. దీనిలోభాగంగా సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 1400మందికి పైగా అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేసారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన ప్రత్యేక కౌంటర్ల సేవల్లో భాగంగా ఈ నెల 8న ఐదు జిల్లాల అభ్యర్థుల నుంచి 1856 దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి అభ్యర్థి దరఖాస్తుతోపాటు, 1500 రూపాయల ఫీజు, అవసరమైన పత్రాలను సమర్పించారు. అన్నీ సక్రమంగా ఉంటే పోలీసు విచారణ తరువాత 40 రోజుల వ్యవధిలో పాస్‌పోర్టు అభ్యర్థులకు అందుతోంది. ప్రత్యేక కౌంటర్ల సేవ తొలిరోజు ఈ నెల 8వ తేదీన అభ్యర్థుల తోపులాట, లాఠీచార్జి మధ్య దరఖాస్తుల స్వీకరణను నిర్వహించారు. ఈ గందరగోళం కారణంగా ఈ కార్యక్రమాన్ని 20వ తేదీ వరకు పొడిగించారు. ప్రతిరోజు జిల్లాల వారీగా దీనిని నిర్వహిస్తుండటంతో సోమ, బుధవారాల్లో తూర్పు గోదావరి జిల్లాలకు నిర్వహించదలిచారు. ఇంతవరకు ఐదు జిల్లాల్లో కొంతమంది, పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థులు తమ దరఖాస్తులు అందివ్వగలిగారు. ఇక శ్రీకాకుళం, విజయగనరం, విశాఖపట్నం జిల్లాలున్నాయి. వీటికి వరుసగా నిర్వహించిన పెద్ద మొత్తంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆ తరువాత వీటన్నింటినీ సమీపంలోనున్న పాస్‌పోర్టు సేవా కేంద్రం (పిఎస్‌సి)లో కంప్యూటరీకరణ చేస్తారు. తదుపరి పత్రాల పరిశీలన, పోలీసు విచారణ వంటివి ఉంటాయి. విదేశాలకు వెళ్తున్న వారిలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వలస కార్మికులే అధికమని, వ్యవసాయం కలిసి రాక, ఉన్నచోట ఉపాధి లేక తప్పనిసరి పరిస్థితులు తరలివెళ్లిపోతున్నట్టు పాస్‌పోర్టు అధికారి ఐటి మూర్తి తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు పడకుండా నేరుగా దరఖాస్తులు చేసుకునేందుకుగాను తాము ఈ సౌకర్యాన్ని కల్పించామన్నారు.

పర్యాటకులకు ఆహ్లాదకరంగా బీచ్

విశాఖపట్నం (జగదాంబ), నవంబర్ 12: పర్యాటకులను అన్ని విధాల ఆకర్షించే విధంగా బీచ్‌ను తీర్చిదిద్దుతామని కమిషనర్ ఎంవి.సత్యనారాయణ చెప్పారు. సోమవారం ఉదయం వెహికల్ ఫ్రీ జోన్‌లో సైక్లింగ్ చేసిన అనంతరం సాండ్ బీచ్‌లో నడిచి బీచ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గురించి పరిశీలించారు. సాండ్‌బీచ్ మొత్తం పర్యటించిన కమిషనర్ బీచ్‌లో ఎటువంటి చెత్త లేకుండా ఎప్పటికప్పుడు చెత్త ఏరివేయడానికి ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. అదే విధంగా రాత్రిపూట కూడా సందర్శకులు వెళ్లిపోయిన వెంటనే చెత్త ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాలని తద్వారా ఉదయానే్న బీచ్‌కు వచ్చే వారికి బీచ్ పరిశుభ్రంగా కనపడేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. బీచ్ పరిధిలో ఉన్న బొమ్మలకు కూడా రంగులు వేయించి పునర్జీవనం కల్పించాలన్నారు. ఎస్‌టిపి పూర్యయ్యే లోగా సముద్రంలో నేరుగా కలిసే మురుగునీటిని ప్రస్తుతమున్న మురుగునీటి డైవర్షన్ బ్లాక్‌కు అనుసంధానింప చేయాలని, బీచ్‌లో పర్యటించే సందర్శకులకు మురుగు నీరు వల్ల అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా బీచ్‌కు ఎదురుగా ఉన్న నివాస, వాణిజ్య భవనాల యజమానులు కార్పొరేషన్‌కు సహకరించి సందర్శకులను ఆకట్టుకునే విధంగా వారి వారి భవనాలకు రంగులు వేయించి సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి ఆయా భవన యజమానులకు బీచ్ సందర్శనపై అవగాహన కల్పించి వారి వారి భవనాలకు పెయింటింగ్‌లు వేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. వైఎంసిఎ ఎదురుగా ఉన్న చిల్డ్రన్ పార్క్‌ను ఆధునీకరించి బొమ్మలకు రంగులు వేయడంతో పాటు, పాడైన ఆట వస్తువులను పునరుద్ధరించి నవంబర్ 14న పిల్లలకు కానుకగా అందించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్లు ఎస్.కృష్ణమూర్తి, కె.రమేష్, పి.పూర్ణచంద్రరావు, ప్రధాన ఇంజనీరు బి.జయరామిరెడ్డి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ పివి.రమణమూర్తి, యుసిడి పిడిఎం ఎన్‌ఎ.పాత్రుడు, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బాణసంచా భారం
కొనలేం...కాల్చలేం
* సామాన్యులకు ధరల షాక్
విశాఖపట్నం, నవంబర్ 13: ఈ ఏడాది వాతావరణ అనుకూలించిన బాణాసంచా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భారీగానే దుకాణాలు వెలిసినా వీటి వద్ద వినియోగదారుల్లేక బోసిపోయాయి. వెయ్యి రూపాయలిచ్చిన పాలిథన్ కవర్ బాణాసంచా రావడంలేదంటే వీటి ధరలు ఏ మేరకు చేరాయో తెలుస్తూనే ఉంది. అసలే విపరీతంగా పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో బెంబెలెత్తిపోతున్న సగటు కుటుంబం దీపావళి సందర్భంగా బాణాసంచా కొనలేక వెనుదిరుగుతున్నారు. కొందరైతే వాటి జోలికే వెళ్ళడంలేదు. దాదాపు 25 లక్షలు కలిగి ఉన్న జివిఎంసి పరిధిలో పాత జైలురోడ్డు చుట్టూ దాదాపు 250 బాణా సంచా దుకాణాలు వెలిసాయి. ఇవి కాకుండా గోపాలపట్నంలో 30, కరాసాలో 16, మర్రిపాలెంలో పది, బుచ్చిరాజుపాలెంలో ఆరు, గాజువాకలో 30కిపైగానే బాణాసంచా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. గత మూడు రోజులుగా వాతావరణ అనుకూలించడంతో అగ్నిమాపక, పోలీసుశాఖలతోపాటు జివిఎంసిల నుంచి అనుమతులు పొందిన స్టాల్ యజమానులు శివకాశి నుంచి తీసుకువచ్చిన బాణాసంచాలను విక్రయిస్తున్నా, వీటి పల్చగానే వినియోగదారులు కనిపిస్తున్నారు. ఎంత అమ్మినా మంగళవారం ఒక్కరోజేనంటూ వ్యాపారులు చెబుతున్నారు. పిండ వంటలు చేసుకుందామంటే గ్యాస్, కాగుతున్న నూనెల ధరలు సామాన్యులకు మరింత భారమవుతున్నాయి. ఆయిల్ ప్యాకెట్ కోసం కనీసం 90 రూపాయలు చెల్లించాల్సిందే. చక్కెర కిలో 45 రూపాయలు, నూనెలు, పప్పుల ధరలు ఏమాత్రం అందుబాటులో లేకుండా ఉన్నాయి. కూరల సంగతి చెప్పనక్కర్లేదు. ఉల్లిపాయలు కిలో 22 రూపాయలు కాగా, వంకాయలు, టమాటో, బెండకాయలు, బీరకాయ, చిక్కుళ్ళు, క్యాబేజీ, క్యారెట్, బీట్‌రూట్ తదితర అనేక కూరలు కిలో 30రూపాయలకు మించి ఉన్నాయి. ఆకుకూరలు కనీసం పది రూపాయలిచ్చిన లభించడంలేదు. కోడిగుడ్డు, మాంసం ధరలు చెట్టెక్కి కూర్చున్నాయి. ఒక గుడ్డు నాలుగు రూపాయలిస్తే తప్ప దొరకడంలేదు. మేక మాంసం కిలో రూ. 500లకు చేరుకోగా, కోడి మాంసం రూ. 150లకు మించింది. ఏదీ అందుబాటులో లేని పరిస్థితుల్లో దీపావళిని ఏ విధంగా చేసుకుంటామంటూ సామాన్యులు విలవిల్లాడుతుండగా, ఏవీ కొనలేం, తినలేమంటూ సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. నాణ్యతలేని, కొలతల్లో వ్యత్యాసం ఉండే రైతుబజార్లలో సరుకులు జోలికి వెళ్ళలేక, బహిరంగ మార్కెట్‌ల్లో షాక్‌నిస్తున్న నిత్యావసర సరుకులను కొనుగోలు చేయలేకపోతున్న పరిస్థితులు మునుపెన్నడూ లేవంటూ మహిళలు అంటున్నారు.
15 నుంచి నేవీ మేళా
విశాఖపట్నం, నవంబర్ 12: ఈ నెల 15వ తేదీ నుంచి 19వరకు ఐఎన్‌ఎస్ శాతవాహన ఆధ్వర్యంలో సెయిలర్ ఇనిస్టిట్యూట్ సమీపానున్న మేళా గ్రౌండ్స్‌లో నేవీ మేళాను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఈస్ట్రన్ ఫ్లీట్, లోకల్ ఫ్లోటిల్లా, సబ్‌మెరైన్ మెయింటినెన్స్ యూనిట్ నేవల్ డాక్‌యార్డు సబ్‌మెరైన్ బెస్ ఐఎన్‌ఎస్ వీరబాహు, ఐఎన్‌ఎస్ కళింగ, ఐఎన్‌ఎస్ సర్కార్, నేవల్ ఆర్మోమెంట్ డిపోట్, ఐఎన్‌ఎస్ డేగ, నేవల్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సంకల్ప్‌ల వద్ద దీనిని నిర్వహిస్తారు. భారీ స్థాయిలో, ఘనంగా నిర్వహించే ఈ మేళాలో ప్రైవేటు, వాణిజ్య, వాణిజ్యేతర సంస్థలు, ఏజేన్సీలు పాల్గొంటాయి. వీటితోపాటు ఆర్థిక సంస్థలు, ఎలక్ట్రానిక్స్ డీలర్లు, ఎన్‌జిఓలు, ఐటి రంగం, విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటాయి. నేవీ మేళాలో అమ్యుజిమెంట్ పార్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సందర్భంగా సాయంత్రం నుంచి గ్రౌండ్స్‌లో పలు పోటీలు, ఆర్కెస్ట్రా వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నేవీ నిర్వహించనుంది. ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తారు.

అనుమతుల్లేని లేఅవుట్ల స్థలాలకు సౌకర్యాలుండవు
* వుడా వీసీ శశిధర్
విశాఖపట్నం, (జగదాంబ) నవంబర్ 12: వుడా పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లలో లేని లే అవుట్లలో కొనుగోలు చేసే స్థలాలకు వౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావని, వుడా, స్థానిక సంస్థలు ఎప్పటికీ వాటిని అభివృద్ధి చేయవని సంస్థ ఉపాధ్యక్షులు కోన శశిధర్ స్పష్టంచేశారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసిన వారికి అనుమతుల జారీ కోసం సోమవారం వుడా కార్యాలయంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో దరఖాస్తుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ వుడా పరిధిలో వుడా నుంచి, వుడా పరిధికి వెలుపల డైరెక్టర్ ఆప్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపి) నుంచి చట్టబద్ధమైన ఆమోదం లేకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అభివృద్ధి చేసే లేఅవుట్లలో స్థలాలు కొంటే మోసపోయినట్టేనని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ స్కీము కింద స్థలాల క్రమబద్ధీకరణ కూడా కొన్ని పరిమితులకు లోబడే చేస్తున్నట్టు వివరించారు. సోమవారం నాటి ఎల్‌ఆర్‌ఎస్ స్పెషల్ డ్రైవ్‌లో 600 దరఖాస్తులకు అనుమతులు జారీ చేశారు. స్థలాల క్రమబద్ధీకరణ కోసం వుడాకు ఇంత వరకు 19149 దరఖాస్తులు అందగా వాటిలో 6988 దరఖాస్తులకు పూర్తిస్థాయి అనుమతులు జారీ చేశారు. వివిధ కారణాల వల్ల అర్హత లేని 4023 దరఖాస్తులను తిరస్కరించగా ఇంకా 8138 దరఖాస్తులకు అనుమతి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని వీసీ శశిధర్ తెలిపారు. వీటిలో 7500 దరఖాస్తుల వరకు ఇంకా పత్రాలు, రుసుములు చెల్లించాల్సినవి కాగా 638 దరఖాస్తులకు సంబంధించిన స్థలాలు ప్రభుత్వ భూముల ద్వారా అప్రోచ్ రోడ్డు అంశంతో ముడిపడి ఉన్నాయని వివరించారు. ఎల్‌ఆర్‌ఎస్ కింద అనుమతులు జారీ చేసే ప్రక్రియలో అనేక సాంకేతికపరమైన అంశాలు క్షేత్రస్థాయిలో నిర్ధారణలు, భూ యాజమాన్య హక్కు వంటి అత్యంత కీలకమైన విషయాలను ఖరారు చేయల్సి ఉన్నందున దరఖాస్తులన్నింటినీ సత్వరం పూర్తి చేయలేక పోతున్నట్టు వీసీ పేర్కొన్నరు. ఆయా జిల్లాల రెవిన్యూ అధికారుల నుండి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించి సాధ్యమైనంత వేగవంగా దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పూర్తి సమాచారాన్ని వుడా వెబ్‌సైట్‌లో పొందుపరచామని, దరఖాస్తుదారులు వుడాకు రానవసరం లేకుండానే వాటి వివరాలను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులందరికీ న్యాయం చేయాలన్నదే వుడా ధ్యేయమని, అయితే నిబందనలకు విరుద్ధంగా ఉండే దరఖాస్తుల విషయంలో నమీ చేయలేమన్నారు. వీసీ శశిధర్ స్వీయ పర్యవేక్షణలో జోన్లవారీగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని, వుడా చీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్‌జె విద్యుల్లత తెలియజేశారు. కాగా స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా దరఖాస్తుదారుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న వీసీని కార్యక్రమానికి హాజరైన పలువురు అభినందించారు. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్లు ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. వుడా ఇన్‌చార్జి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న చీఫ్ ఎకౌంట్స్ ఆఫీసర్ డి.విజయభారతి, చీఫ్ ఇంజనీర్ ఐ.విశ్వనాథరావు, డిఎఫ్‌ఒ బివిఎ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వరద బాధితులందరికీ ప్రభుత్వం చేయూత: మంత్రి బాలరాజు

విశాలాక్షినగర్, నవంబర్ 12: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు రేషన్‌కార్డులు, రుణ అర్హతకార్డులు లేకున్నా జిల్లాలో వరద బాధితులందరికీ వరద సహాయం అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.బాలరాజు జిల్లా ప్రభుత్వశాఖల అధికారులకు ఆదేశించారు. జిల్లాలో తుఫాన్, అధికవర్షాలకు సంభవించిన వరదనష్టాలు, ప్రజలకు అందుతున్నా ప్రభుత్వ సహాయంపై సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భారీవర్షాల వలన త్వరితగతిన అంచనా వేయాలని ఆదేశించారు. ఈ అంచనాలను ప్రభుత్వానికి నివేదిక పంపాలని అన్నారు. వరద బాధితులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందించాలని కోరారు. వరదల కారణంగా దెబ్బతిన్న మండలాలకు తక్షణ సహాయం పునరావాస కార్యక్రమాల్లో భాగంగా 20 లక్షల రూపాయలు ఖర్చు చేయాలని అధికారులకు మంత్రి బాలరాజు ఆదేశించారు. పునరావాస కార్యక్రమంలో భాగంగా సర్వం కోల్పోయిన వారిని ప్రభుత్వశాఖలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తక్షణమే సంబంధిత అంశాలు, సమస్యలను అధికారులు తనదృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, శాసనసభ్యులు డాక్టర్ మళ్ళ విజయప్రసాద్, పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి, జివింసి కమిషనర్ ఎంవి.సత్యనారాయణ పలు ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.

‘డయల్ యువర్ కలెక్టర్’కు విశేష స్పందన

విశాఖపట్నం (జగదాంబ), నవంబర్ 12: సాధారణ నిధుల వినియోగంలో పంచాయతీ ప్రత్యేక అధికారులపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి అభిప్రాయపడ్డారు. ఇందుకై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమానికి ప్రజల నుండి పెద్దఎత్తున స్పందన వచ్చింది. పలువురు ఫోన్ చేసి కలెక్టర్‌కు నేరుగా వారి సమస్యలను నివేదించుకున్నారు. నక్కపల్లి పంచాయితీలో నిధులు పెద్దఎత్తున దుర్వినియోగం అవుతున్నాయని, ఆరోపిస్తూ వచ్చిన ఫోన్‌కాల్‌కు కలెక్టర్ స్పందిస్తూ ఈ ఆరోపణపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. అదే పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లకు అధికారులు మద్దతిస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని వచ్చిన ఫోన్‌కాల్‌పై ఆయన స్పందిస్తూ అనధికార లేఅవుట్లను వెంటనే నిలిపివేయాలని అన్నారు. ఈ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామ రెవిన్యూ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణకు అతన్ని విధుల నుండి సస్పెండ్ చేసినా అతని స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోలేదనే ఫిర్యాదుపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. బుచ్చయ్యపేట, నక్కపల్లి మండలాల్లో ఓబిసి పత్రాల జారీలో తహశీల్దారు ఎక్కువకాలం జాప్యం చేస్తున్నారని, దీనివల్ల విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని వచ్చిన ఆరోపణపై వెంటనే తగు చర్య తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు దరఖాస్తులు మండలాభివృద్ధి అధికారులకు అందజేస్తే అర్హతను బట్టి ప్రాధాన్యత క్రమంలో కనెక్షన్లు మంజూరు చేస్తారని కలెక్టర్ తెలిపారు.
అనంతరం వందరోజుల కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రణాళిక ప్రకారం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. అనివార్య కారణాలవల్ల వాయిదా పడుతున్న డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమాన్ని ఈ నెల మూడవ మంగళవారం, 20వ తేదీన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డ్వామా అధికారులు పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ప్రజావాణికి 320 దరఖాస్తులు: సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలనుండి మంచి స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా పలువురు కలెక్టరేట్‌కు వచ్చి సమస్యలను విన్నవించు కున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పలు ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి స్వయంగా వినతులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో డిర్‌ఓ వెంకటేశ్వర రావు, జెడ్పీ సిఇఓ డి.వి. రెడ్డి, గృహనిర్మాణ సంస్థ పి.డి. ప్రసాద్, డిఇఓ కృష్ణవేణి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

తుపాను నష్టాలపై కచ్చితమైన అంచనా
* నిజమైన బాధితులకు
న్యాయం చేకూర్చాలి
* కలెక్టర్ ఆదేశం
విశాఖపట్నం, నవంబర్ 12: ఇటీవల సంభవించిన నీలం తుపాను నష్టాలపై ఖచ్చితమైన అంచనాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో ఇళ్ళ నష్టం, పంట నష్టం అంచనాల సర్వేపై ప్రత్యేధికారులు, తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. తుపానుతో నష్టపోయిన ప్రతిఒక్కరికీ నష్టపరిహారం అందే విధంగా వివరాలు నమోదు చేయాలన్నారు. తప్పుడు సమాచారంతో పరిహారాన్ని దుర్వినియోగపరిచే విధంగా ఉంటే దానికి ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, బాధ్యులు అవుతారన్నారు. ఎటువంటి ఓత్తిళ్ళకు లోనుకాకుండా నిబంధనల మేరకు నిజమైన బాధితులకు న్యాయం చేకూర్చాలన్నా రు. నష్టాల వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందరికీ తెలిపే లా ప్రదర్శించాలన్నారు. వాటిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం పూర్తి పారదర్శకంగా జాబితాను పైఅధికారులకు పంపించాలన్నారు. ఒకటి, రెండు రోజులు జాప్యం జరిగినా పరిశీలించి పూర్తి వివరాలతో జాబితా తయారుచేయాలన్నారు. ఇళ్ళు పాక్షికంగా, పూర్తిగా, తీవ్రంగా నష్టపోయినవి, పంట నష్టం, పశువుల నష్టాలను వివరంగా పొందుపర్చాలన్నారు. నష్టపోయిన ఇళ్ళు పంట ఫొటోలను కుటుంబ యజమానితో సహా తీసుకుని పదిలపర్చాలన్నారు. ఎటువంటి ఆక్షేపణలకు తావివ్వనిరీతిలో పూర్తి ఆధారాలను గుర్తించాలన్నారు. ఒకసారి జాబితాను ప్రభుత్వానికి పంపించిన తరువాత సరిదిద్దేందుకు అవకాశం ఉండదని, క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలతో జాబితాను తయారు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏర్పాటుచేసిన గ్రామస్థాయి కమిటీలు ఇంటింటికీ తిరిగి, పంటలను పరిశీలించే విధంగా వారికి ఆదేశాలిచ్చి తనిఖీలు నిర్వహించాలన్నారు.
బాధిత కుటుంబాలకు అవసరమైన బియ్యం సరఫరా చేయాలని కలెక్టర్ అన్నారు. ముంపునకు గురికాని మత్స్యకార కుటుంబాలకు వారు వేటకు వెళ్ళే అవకాశం లేనందున జీవనభృతి అందజేయాలన్నారు. నేత పనివారికి కూడా జీవన భృతి ఇవ్వాలన్నారు. అంతకు ముందు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు మండలాల వారీగా అమలు జరుగుతున్న సహాయక చర్యలు, బియ్యం సరఫరా, అంచనాల సర్వేలను గురించి వివరంగా సమీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో విశాఖ, నర్సీపట్నం, పాడేరు రెవెన్యూ డివిజనల్ అదికారులు రంగయ్య, వసంతరాయుడు, గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు యుసిజి నాగేశ్వరరావు, విజయసారధి, విజయలక్ష్మి, షరీఫ్, మండలాల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎమ్‌పిడిఒలు, అధికారులు పాల్గొన్నారు.

గోవాడ సుగర్స్‌లో 19న బాయిలర్ పూజలు
చోడవరం, నవంబర్ 12: గోవాడ సుగర్స్‌లో ఈఏడాది క్రషింగ్ సీజన్ ప్రా రంభంకాగా, ఈనెల 19వ తేదీన బాయిలర్ పూజ నిర్వహించడానికి నిర్ణయించామని ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం ఎస్ భగవాన్ తెలిపారు. సోమవారం మండలంలోని పి.ఎస్.పేట కాటావద్ద వరద పరిస్థితి ప్రభావం వలన రైతాంగానికి ఏమేరకు నష్టం వాటిల్లింది, చెర కు రవాణాకు రహదారులు అనువుగా ఉన్నదీ లేనిదీ రైతులతో, ఫ్యాక్టరీ సిబ్బందితో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఏడాది క్రషింగ్ సీజన్‌ను నవంబర్ నెలాఖరులోగా ప్రారంభించడానికి నిర్ణయించామన్నారు. తుఫాన్ ప్రభావంతో రైతులు కళ్లాలకు వెళ్లే రహదారులతోపాటు ప్రధాన మార్గాలకు గండ్లు ఏర్పడటం, వంతెనలు దెబ్బతినడం వలన ఫ్యాక్టరీకి చెరకు రవాణా ఇబ్బందికరంగా ఉం టుందన్నారు. అందుచే ఆయా రహదారులకు తాత్కాలిక మరమ్మతులను రైతుల సహకారంతో ఏమేరకు చేపట్టవచ్చన్న విషయాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల పరిధిలోగల రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని కోరామన్నారు. ఈ ఏడాది క్రషింగ్ సీజన్‌ను సజావుగా నిర్వహించేందుకు కృషిచేస్తామని చెప్పా రు. ఫ్యాక్టరీ వ్యవసాయాధికారి ప్రసా ద్, లేబర్ ఆఫీసర్ పివి రమణమూర్తి, కార్మికనాయకులు కె.్భస్కరరావు, తలారి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఆత్మహత్య చేసుకుంటాం..
అనుమతి ఇవ్వండి
* కలెక్టర్‌కు వృద్ధ దంపతుల వినతి
* న్యాయం చేస్తాం: మంత్రి బాలరాజు
విశాఖపట్నం, నవంబర్ 12: రాజకీయ పెద్దలు కాజేయాలని చూస్తున్న తమ భూములను రక్షించుకోలేని తాము ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామస్థులు వజ్జా రాఘవయ్య, వెంకటసుబ్బమ్మ సోమవారం కలెక్టర్ వి.శేషాద్రికి వినతిపత్రం సమర్పించారు. తరువాత అక్కడే ఉన్న రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి పసుపులేటి బాలరాజుకు తమ గోడు వినిపించారు. దీనికి స్పందించిన మంత్రి త్వరలో పూర్తిస్థాయిలో విచారణ జరిపించి న్యాయం జరిపిస్తామని, ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని సూచించారు. మిత్రునితో వ్యాపార లావాదేవీలు నిర్వహించేటప్పుడు 1952లో మండలంలో కేశవరం, శ్రీరాంపురం రెవెన్యూలో 600 ఎకరాల భూమిని తంగేడు రాజుల నుంచి కొనుగోలు చేశామన్నారు. 1990లో కొందరు స్వార్థ రాజకీయ నాయకుల దాష్టికంతో ఇది బంజరుభూమి అంటూ చుట్ట్టుపక్కల గ్రామస్థులను రెచ్చగొట్టి ఆక్రమించారన్నారు. దానిపై హైకోర్టులో తాము కేసు వేయగా, అప్పటి సబ్ కలెక్టర్ సలహాతో కేసు ఉపసంహరించుకుని రాజీ పడ్డామన్నారు. తమకు 40 ఎకరాల భూమి ఇస్తామని నమ్మించి 35 ఎకరాల భూమిని తమ కుటుంబ సభ్యులందరి పేరున ఇస్తూ అది కూడా డి-్ఫరం పట్టాగా ఇచ్చారన్నారు. ల్యాండ్ డిక్లరేషన్ సమయంలో చాలామంది వారి అనుయాయుల పేరు పెట్టుకుని తదుపరి అమ్ముకుని లాభపడ్డారని తెలిపారు. తాము నిజాయితీగా రెవెన్యూ అధికారుల మాటలు నమ్మి ఇచ్చిన భూమిని అప్పటి నుండి తామే సాగు చేసుకుంటున్నామన్నారు. నాటి నుండి వెంకటనగరం, రాజానగరం గ్రామస్థులు తమ భూమిని కాజేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు.
ఈ భూమిలో జీడిమామిడితోటను కుటుంబ అవసరాల కోసం మూడేళ్ళు జీడిపిక్కలు ఏరుకోవడానికి పాయకరావుపేట, రాంబిల్లి మండలం వాడ నర్సాపురానికి చెందిన వారికి లీజుకు ఇచ్చామన్నారు. గతనెల 27వ తేదీన వారు పిండి తీసుకోవడానికి తోటలోకి వస్తే వెంకటనగరం గ్రామానికి చెందిన దౌర్జన్యకారులు వారిని కులంపేరుతో దూషించి తమపై దాడికి దిగారని వృద్ధ దంపతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, వీరి వెనుక బడా రాజకీయనేతులు ఉండి నడిపిస్తున్నారన్నారు. తమ భూములను కాజేసి ప్రజలకు పంచాలని చూస్తున్నారని, విసుగెత్తిన తాము ఆత్మహత్య శరణ్యంగా భావిస్తున్నామన్నారు. వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్ దీనిపై పూర్తి వివరాలు సేకరించి తగిన న్యాయం చేస్తామన్నారు.

రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
* ఏడుగురు నిందితుల అరెస్ట్
* రెండు వాహనాలు స్వాధీనం
గూడెంకొత్తవీధి, నవంబర్ 12: ఒడి శా నుండి మైదాన ప్రాంతానికి అక్రమం గా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను సోమవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నా రు. గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంజాయితో పాటు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రెండు బొలొరా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సి.ఐ.రామకృష్ణ, ఎస్సై నర్సింగరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా నుండి మైదాన ప్రాంతానికి రెండు వాహనాలపై సుమారు కోటి రూపాయల విలువైన గంజాయిని ఏడుగురు వ్యక్తులు తరలిస్తుండగా, పక్కా సమాచారంతో గూడెంకొత్తవీధి పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. గతకొంతకాలంగా గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకుంటున్నారు. గంజాయి వ్యాపారులు మారుమూల గ్రామాల్లో గంజాయి కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోలేని పరిస్థితుల్లో ఏదోరకంగా మైదాన ప్రాంతానికి తరలించాలని సిద్ధపడ్డారు. ఆదివారం సాయంత్రం సుమారు 300 కేజీలకు పైగా గంజాయిని వాహనాలపై నింపుకొని ఏడుగురు వ్యక్తులు మైదాన ప్రాం తానికి తరలించేందుకు సిద్ధపడ్డారు. తెల్లవారుజామున సీలేరు నుండి వస్తున్న గంజాయి వాహనాలను పట్టుకుని రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన వీరన్‌గౌండర్‌సెల్వన్(42), సెల్లకాని ప్రభాకర్(27), దొరస్వామి పాలుపాండిన్(31), సరాయిదేవర కృష్ణన్( 46), తూర్పుగోదావరికి చెందిన జగ్గు భీమారాజు(43),పాడేరుకు చెందిన కరదేశి పండన్న(38), హుక్కుంపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ రజాక్ (38)లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

నలుగురు మిలీషియా సభ్యులు అరెస్ట్
గూడెంకొత్తవీధి, నవంబర్ 12: మండలంలోని సంపంగిగొంది, కొత్తపల్లి గ్రామాలకు చెందిన నలుగురు మిలీషియా సభ్యులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సంపంగిగొందికి చెందిన వంతల కృష్ణారావు, గుంటా అర్జున్, కిముడు రాముతోపాటు కొత్తపల్లికి చెందిన కిల్లో చిన్నను అరెస్ట్ చేశామని ఎస్సై నర్సింగరావు తెలిపారు. వీరికి ఎటువంటి కేసులు పెట్టకుండా మరోసారి తప్పులు చేయకుండా హెచ్చరించి బైండోవర్ కేసులు పెట్టి వదిలిపెడుతున్నట్లు ఎస్సై నర్సింగరావు తెలిపారు. మరోసారి మావోయిస్టులకు సహాయం చేసినా, కరపత్రాలు వెదజల్లినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించి వారిని వదిలిపెట్టినట్లు ఎస్సై తెలిపారు.

గ్రంథాలయ వారోత్సవాలకు
రూ. మూడు లక్షల కేటాయింపు
పాయకరావుపేట, నవంబర్ 12: జిల్లాలో ఈనెల 14 నుంచి 20వతేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించేందుకు మూడు లక్షల రూపాయలు కేటాయించినట్లు జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ తోట నగేష్ తెలిపారు. వారోత్సవాల బ్యానర్‌ను సోమవారం స్ధానిక ఎ.సి. గ్రంథాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా తో ట నగేష్ మాట్లాడుతూ నీలం తుపాను వల్ల జిల్లాలో చాలా నష్టం జరిగిన కారణంగా వారోత్సవాలు సాధారణంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది దాతల సహకారం తక్కువగా ఉందని తెలిపారు. వారోత్సవాల ప్రారంభం రోజున ఎం.వి.పి. కాలనీ, మురళీనగర్‌లలో నూతన గ్రంథాలయాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూటూరు శ్రీనివాసరావు, బోయిడి రాజబాబు, పెం కే శ్రీను, గ్రంథాలయాధికారి ఎన్.మరిడయ్యరావు పాల్గొన్నారు.

ఒకేరోజు 1400 పాస్‌పోర్టు దరఖాస్తుల స్వీకరణ
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>