Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

లక్ష్మింపేట దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం

$
0
0

విజయనగరం(టౌన్), నవంబర్ 12 : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మింపేట గ్రామ దళితులుపై ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ దిళత ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లక్ష్మింపేట దళిత పోరాట సంఘీభావ కమిటీ ఆధ్యర్యంలో జరుగుతున్న దశల వారీ ఆందోళనలో భాగంగా జిల్లా స్థాయిలో ఎపి రైతుకూలీ సంఘం, దళిత సంఘాలు ధర్నాజరిపాయి. లక్ష్మింపేట దళితులపై హత్యాకాండ జరిగి నాలుగు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. గ్రామంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దళితులపై జరిగిన దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. మండువలన రిజర్వాయర్ మిగులు భూములను దళితులకే కేటాయించాలని, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కొండ్రు మురళీలను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో ఎపి రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వర్మ, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్ రామకృష్ణ, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా. ఎంటి రాంజీ, రాయవపు పైడిరాజు, టి.సురేష్, దళిత జెఎసి చైర్మన్ ఉదయ బాస్కర్, జిల్లా దళిత సంక్షేమ సంఘం నాయుడు జి. సత్యన్నారాయణ ప్రసంగించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌కు నినతి పత్రం అందజేసారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు స్పందన కరువు
విజయనగరం (కంటోనె్మంట్), నవంబర్ 12: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు స్పందన కరువైంది. జిల్లా అదనపు ఎస్పీ టి.మోహనరావు నిర్వహించిన ఈ గ్రీవెన్స్, డయల్‌యువర్ ఎస్పీ కార్యక్రమానికి కేవలం రెండు ఫిర్యాదులు అందాయి. విజయనగరం పట్టణం సాయినగర్‌కు చెందిన గౌరీశ్వరికి చెందిన ఖాళీ స్థలంలో శ్రీరాముల రెడ్డి రోడ్డు ఇవ్వాలని, మద్యం సేవించి వచ్చి గొడవ చేస్తున్నట్లు ఎ.ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే వేపాడ మండలం చామలాపల్లి గ్రామానికి చెందిన జాకబ్ కుమార్తె అయిన గౌరీలక్ష్మిని ఇంట్లో పనిచేయించేందుకు అదే గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ న్యూఢిల్లీ తీసుకుని వెళ్ళినట్లు, అచ్చట నుంచి తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్నారని, న్యాయం చేయాల్సిందిగా ఫిర్యాదు చేశారు.
సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్ధుల ధర్నా
విజయనగరం(టౌన్), నవంబర్ 12 : తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాల విద్యార్ధులు ఉత్తరాంధ్ర మాల మహానాడు ఆద్వర్యంలో కలక్టరేట్ ఎదుట సోమవారం శాంతి యుత ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మాలమహానాడు అధ్యక్షుడు బుడుమూరు శంకరరావు మాట్లాడుతూ వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్ధులకు భోజనం తయారీకి ఇస్తున్న వంటగ్యాస్‌పై పాత పద్ధతులోనే సబ్సిడీ కోనసాగించాలని, కిలోబియ్యం సబ్సిడీతో రూపాయికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
27 నుంచి జిల్లా స్థాయి గ్రిగ్ పోటీలు
విజయనగరం (కంటోనె్మంట్), నవంబర్ 12: జిల్లా స్థాయి గ్రిగ్ పోటీలను ఈ నెల 27 నుంచి జోన్లు వారీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు దనాన తిరుపతిరావు తెలిపారు. రాజీవ్ క్రీడామైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ డిఇఒ నాగమణి ఆదేశాల మేరకు ఈ పోటీలను జోన్-1 విజయనగరం, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ, గంట్యాడ మండలాలకు ఈ నెల 27,28,29 తేదీల్లో విజయనగరం కస్పాపాఠశాలలో, జోన్-2 శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, జామి మండలలాకు ఈ నెల 27,28,29 తేదిలలో బోనంగి జెడ్పీపాఠశాలలో, జోన్-3 చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల, నెల్లిమర్ల మండలాలకు ఈనెల 28,29,30 తేదీల్లో కెల్ల జెడ్పీ పాఠశాలలో, జోన్-4 గజపతినగరం, దత్తిరాజేరు, రామభద్రపురం, బొండపల్లి, మెంటాడ మండలాలకు ఈ నెల 28,29,30 తేదీల్లో గజపతినగరం జెడ్పీ పాఠశాలలో, జోన్-5 బొబ్బిలి, బాడంగి, తెర్లాం, సాలూరు, పాచిపెంట, బల్జిపేట, మక్కువ మండలాలకు ఈ నెల 27,28,29 తేదీల్లో పెరుమాలీ జెడ్పీ పాఠశాలలో, జోన్-6 పార్వతీపురం, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, సీతానగరం మండలాలకు ఈ నెల 28,29,30 తేదిలలో పార్వతీపురం గర్ల్స్ హైస్కూల్‌లో నిర్వస్తున్నట్లు తెలిపారు. జోన్ల వారీగా జరిగే ఈ పోటీల్లో విజేతలైన వారికి డిసెంబర్ 4,5,6 తేదిలలో సెంట్రల్ జోన్ పోటీలను డెంకాడ మండలం జొన్నాడ జెడ్పీ పాఠశాలలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు ఇతర సంస్థల యాజమాన్యాల్లో పనిచేస్తున్న అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన దలిచే పాఠశాలల వివరాలను ఈ నెల 20 తేదిలోగా జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి టి.బి గాంధికి అందజేయాలని కోరారు. బాలికల గ్రిక్ పోటీలకు సంబంధించి తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
కార్యక్రమాల నిర్వహణకు మారుతీ ధ్యాన మందిర్ ఏర్పాట్లు
విజయనగరం (తోటపాలెం), నవంబర్ 12: పట్టణంలోని పూలబాగ్ ప్యాలస్ సమీపంలో గల హనుమాన్ నగర్‌లో నిర్మించిన మారుతీ ధ్యాన మందిర ఆలయ కార్యక్రమాలు ఈ నెల 14 నుండి 16 తేది వరకూ నిర్వహించనున్నందున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని మారుతీ సేవా సంఘం అధ్యక్షులు గోకవరపు శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఆలయ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందిచేందుకు ఈ ద్యాన మందిరాన్ని నిర్మించామన్నారు. కార్యవర్గ ఫౌండర్ ట్రస్టీ గోకవరపు అప్పలరాజు సలహాల ప్రకారం మారుతీ ఆలయాన్ని నిర్మించామన్నారు. రాబోవు రోజుల్లో అబివృద్ధి పరిచి అందరికి ఉపయోగపడేలా తయారు చేస్తామన్నారు. ఈ నెల 14 తేదిన పట్టణంలోని పెద్దవీధి రామమందిరం నుండి గంటస్థంబం, మూడు లాంతర్లు, పూలబాగ్ మీదుగా మారుతీ ఆలయం వరకూ ఊరేగింపు జరుగుతుందన్నారు. అనంతరం ఆంజనేయస్వామికి విశేష పూజలు జరుగుతాయన్నారు. అదే విదంగా 15 తేదిన యంత్ర, యోగ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ, రామస్థూప ప్రతిష్ఠ, అన్న సమారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఈ దైవ కార్యక్రమాలకు భక్తలు అధిక సంఖ్యలో హాజరయి ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠను విజయవంతం చేయాలని కోరారు. ఆ సేవా సంఘం కార్యదర్శి గాదె వెంకట సుబ్బయ్య, కోశాధికారి గోకవరపుపద్మప్రియ, కృష్ణాజీ, బ్రహ్మాజీ, చెరుకూరి శ్రీ్ధర్, తదితరులు పాల్గొన్నారు.
‘15లోగా పంట నష్టం వివరాలు సేకరించాలి’
గజపతినగరం, నవంబర్ 12 : నీలం తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలు, నష్టం వివరాలు సక్రమంగా ఉండాలని స్థానిక మండల వ్యవసాయాధికారి మోపాడ ఉమామహేశ్వరనాయుడు అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రామ రెవెన్యూఅధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంటనష్టం సర్వేలో అక్రమాలకు తావివ్వకుండా సేకరించాలన్నారు. ఈ నెల 15వ తేదీలోగా నష్టం వివరాలు సేకరించి అందచెయ్యాలని సూచించారు. 50 శాతంకుపైగా పంటకు నష్టం వాటిల్లితే వివరాలు సేకరించాలన్నారు. గ్రామంలోని పెద్దలు, విఆర్‌ఒ, ఆదర్శ రైతు కలసి పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. పత్తి పంటకు సంబంధించి క్రాసింగ్ పంట నష్టపరిహారం ప్రభుత్వం అందజేయదని రైతలు సాధారణంగా పండించే పంట ఎమైనా దెబ్బతింటే సేకరించాలన్నారు. కూరగాయలు, మిరప పంటలకు నష్టం వాటిల్లితే ఉద్యానవన శాఖ అధికారులకు వివరాలు అందజేయాలని తెలిపారు. సేకరించిన వివరాలు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద వేలాడదీయాలన్నారు. డిప్యూటీ తహశీల్ధార్ కె. జయరాం, కె.లక్ష్మణరావు, ఎఎస్‌ఓ శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐలు సత్యనారాయణ, రమణారావు తదితరులు పాల్గొన్నారు.
‘శిశు మరణాల సంఖ్య తగ్గించాలి’
గజపతినగరం, నవంబర్ 12 : గ్రామ స్థాయిలో మార్పు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని స్థానిక సిహెచ్‌ఎన్‌సి వైద్యాధికారి డా. ఎమ్ చామంతి కోరారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక సిహెచ్‌ఎన్‌సి కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్పు కార్యక్రమం ద్వారా గర్భిణుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టి డెలివరీలోగా 4సార్లు తనిఖీలు నిర్వహించాలన్నారు. పిల్లలకు ఇమ్యూనైజేషన్ టీకాలు సకాలంలో వేయాలన్నారు. తదితర 20 కార్యక్రమాలు చేపట్టి మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించాలన్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల లక్ష్యాన్ని సాధించాలన్నారు. మార్పు అమలు కార్యక్రమానికి గజపతినగరం క్లస్టర్ కేంద్రానికి చైర్మన్‌గా జిల్లా జలయాజమాన్య సంస్థ ప్రాజెక్టు అధికారి రెడ్డి శ్రీరాములునాయుడును నియమించినట్లు చెప్పారు. సిబ్బంది ఈ విషయాలను గమనించాలని కోరారు. సిహెచ్‌ఓ ఎస్ లక్ష్మణరావు, హెల్త్ ఎడ్యుకేటర్ గిరిబాబు, వివిధ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

‘గ్యాస్ సబ్సిడీ అందించకుంటే
ఉద్ధృతంగా ఆందోళన’
బొబ్బిలి, నవంబర్ 12: గ్యాస్‌ను సబ్సిడీ అందించాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని అఖిల పక్ష కమిటీ సభ్యులు ఐద్వా జిల్లా కార్యదర్శి ఇందిర, ఎస్‌ఎఫ్‌ఐ జగన్మోహన్, సిటు కార్యదర్శి కృష్ణ హెచ్చరించారు. స్థానిక సిటు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ, హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకానికి పూర్తిస్థాయిలో గ్యాస్‌ను అందించాలని లేనిపక్షంలో 15న కలెక్టరేట్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. గ్యాస్ సిలెండర్ల కొరత వల్ల పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు సతమతమవుతున్న నేపథ్యంలో తాజాగా గ్యాస్ కొరతను విధించడం బావ్యం కాదన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు, విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించి వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని, పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా, సిటు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీను, ఈశ్వరరావు పాల్గొన్నారు.
డిడిపై చర్యలు తీసుకోవాలని ధర్నా
పార్వతీపురం, నవంబర్ 12: గిరిజన సంక్షేమశాఖ డిడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సోమవారం పార్వతీపురం ఐటిడిఎ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి, జిల్లా అధ్యక్షుడు ఎస్.మురళీమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.రాము తదితరులు మాట్లాడుతూ పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. గిరిజన ఉపాధ్యాయులను జీవో 342 ప్రకారం బిఇడి ట్రెనింగ్ కోసం ఆన్‌డ్యూటీపై పంపాలన్నారు. ఎల్‌ఎఫ్‌ఎల్ ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో సీనియర్లను కాదని జూనియర్లకు పదోన్నతులు ఇచ్చారని వీటిని సరిచేయాలన్నారు. జిపియస్ టీచర్ల సర్వీసులను రెగ్యులర్ చేయాలని, సీనియారిటీ లిస్టును సరిచేసి విడుదల చేయాలన్నారు. ఇంకా పలుసమస్యలు పరిష్కరించాలని నాయకుడు డిమాండ్ చేశారు. ఈధర్నా అనంతరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి అర్ అంబేద్కర్‌ను సమస్యలపై కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పీవో అంబేద్కర్ మాట్లాడుతూ డిడిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ దృష్టికి చర్యలు కోసం తీసుకువెళతామన్నారు. తన పరిధిలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈధర్నా కార్యక్రమంలో యుటి ఎఫ్ కార్యదర్శులు ఎన్ శ్రీరాములు, జి.నిర్మల, టి.రమేష్‌లతో పాటు గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పిఅప్పన్నదొర, గిరిజన సంఘం కార్యదర్శి కె.అవినాష్, గిరిజన సంక్షేమ సంఘ అధ్యక్షుడు పి.రంజిత్‌కుమార్, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు బిడ్డక తమ్మయ్య, గిరిజన విద్యార్థిసంఘ అధ్యక్షుడు ఎస్ గణపతి తదితరులు పాల్గొన్నారు.
‘ఎస్‌టిఎం భూములు పేదలకు పంచాలి’
పార్వతీపురం, నవంబర్ 12: పార్వతీపురం మండలంలోని సంగంవలస ప్రాంతంలో గల ఎస్టీయం భూములు పేదలకు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం నాయకుడు బి.నర్సింగరావు ఆధ్వర్యంలో నిరుపేదలు పార్వతీపురంలోని సబ్ రిజిస్ట్రార్, తహశీల్దారు కార్యాలయాల ముందు ధర్నానిర్వహించారు. ఈసందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ఎస్టీయం భూముల్లో కొంత డి పట్ట్భాములు ఉన్నాయని, అలాగే టేకు ప్లాంటేషన్ హక్కులు కూడా కలిగిన వారు కొందరు ఉన్నారని వీరందరికీ కాదని యాజమాన్యం ఇతరులకు భూములు అమ్మకం రిజిస్ట్రేషన్ చేయడం వల్ల అసలైన టేకుప్లాంటేషన్ హక్కు దారులు నష్టపోతున్నారని తెలిపారు. అదేవిధంగా డి.పట్ట్భాములు కూడా కొన్ని ఉండడం వల్ల నిరుపేదలకు ఆ భూములన్నీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పలువురు నిరుపేదలు, గిరిజనులు పాల్గొన్నారు.అనంతరం పార్వతీపురం డిప్యూటీ తహశీల్దారు అప్పలరాజుకు వినతి పత్రం అందించారు.
‘శ్రీరంగపాడు వద్ద చెక్‌డ్యామ్ నిర్మించాలి
పార్వతీపురం, నవంబర్ 12: గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పార్వతీపురం ఐటిడిఎ కార్యాలయంలో పీవో అంబేద్కర్ నిర్వహించిన గ్రీవెన్సులో పలువురు గిరిజనులు కోరారు. ఈ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం మండలంలోని నోండ్రుకోన పంచాయతీ రెల్ల నుండి కల్టటి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని భారత్ నిర్మాణ కార్యకర్తలు కోరారు. అలాగే శ్రీరంగపాడు వద్ద చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టాలని దీనివల్ల 50 ఎకరాలకు సాగునీటి వసతి కలుగుతుందని ఆ ప్రాంత గిరిజనులు కోరారు.స్థానిక బైపాస్ కాలనీ వాసులు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు, కాలువలు బాగుచేయించాలని కోరారు. ఇంకా పలు గిరిజన ప్రాంతాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా పీవో అంబేద్కర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఈనెల 19నుండి 24వరకు ట్రైకార్ కింద అర్హులైన గిరిజన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఐకెపి ఎపిడి ఎస్.లక్ష్మీదేవిని ఆదేశించారు. ఇందుకోసం గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. అలాగే 26నుండి 30లోగా లబ్ధిదారుల గ్రౌండింగ్ కూడా చేపట్టాలన్నారు. పిటిజి గిరిజనులకు కల్పించాల్సిన వౌలిక సదుపాయాల గురించి తగిన నివేదికలు ఇవ్వాలని పీవో అధికారులను ఆదేశించారు. ఈగ్రీవెన్సు కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ ఎడి ఆర్.మురళీధర్, జిసిసి డివిజనల్ మేనేజర్ జోగేశ్వరరావు, డిప్యూటీ డి ఎం హెచ్ ఒ డాక్టర్ భాస్కరరావుతదితరులు పాల్గొన్నారు.

రేపటి నుండి జాతీయ
గ్రంథాలయ వారోత్సవాలు
విజయనగరం(తోటపాలెం), నవంబర్ 12 : గ్రంథాలయాలను ప్రజలు విరివిగా వినియోగించుకునేలా పోత్సహించాలనే లక్ష్యంతో జిల్లా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈనెల 14 నుండి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి జమ్ము బంగారం అన్నారు. స్థానిక పంచాయతీ రాజ్‌ఛాంబర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో గ్రంథ పఠనం పై ఆసక్తి పెంపోందించడం, సామాజిక ప్రగతికి కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా పలు యువజన, మహిళా, స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, జిల్లా శాఖ ఆద్వర్యంలో సదస్సులు ప్రదర్శనలు పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాల పట్ల బాలబాలికలను ఆకర్షితులయ్యే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. గ్రంథాలయాను విజ్ఞాన సర్వస్వాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అబ్ధుల్ రవూఫ్, ఎస్ హరి తదితరులు పాల్గొన్నారు.
‘సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం’
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 12: జిల్లాలో మధ్యాహ్నభోజన పథకం నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు హెచ్చరించారు. మధ్యాహ్నభోజన పథకం నిర్వాహకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఇక్కడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల నుంచి పాఠశాలల్లో మధ్యాహ్నభోజనాలు తయారు చేస్తున్న నిర్వాహకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయితే వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ్ద చూపడంలేదన్నారు. పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలకు అనుగుణంగా మెనూఛార్జీలు పెంచడంలేదన్నారు. దీనివల్ల భోజనపథకం నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్యాస్‌ధర తగ్గించి సబ్సిడీపై సరఫరా చేయాలన్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినందున మెనూ ప్రాథమిక పాఠశాలల్లో 8 రూపాయలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10 రూపాయలు పెంచాలన్నారు. అదేవిధంగా పాత వంట గదులకు మరమ్మతులు చేయడంతోపాటు కొత్తగా వంటగదులను నిర్మించాలన్నారు. మధ్యాహ్నభోజన పథకం నిర్వాహకులకు ఒక్కొక్కకి నెలకు మూడువేల రూపాయల గౌరవవేతనం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎం.మురళీధరరావు, జిల్లా కోశాధికారి ఎస్.రంగరాజు పాల్గొన్నారు.
‘గ్రీవెన్స్’లో వినతుల వెల్లువ
విజయనగరం(టౌన్), నవంబర్ 12 : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాటి గ్రీవెన్స్ సెల్‌కు సామాజిక సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా అందాయి. జిల్లా కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ పిఎ శోభ వినతులు స్వీకరించారు. సుమారు 200 వినతులు అందాయి జిల్లాలోని 24 గ్రామాల్లో నివసిస్తున్న బుడగ జంగాల కులస్థులమైన తాము తెలంగాణ నుండి 30 సంవత్సరాల క్రితం వచ్చామని, తమ పిల్లలకు ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ బుడగ జంగాల సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు వినతినిచ్చారు. తమ గ్రామంలో గిరిజనులందరకీ ఇందిరమ్మఇల్లు మంజూరు చేయాలని పాచిపెంట మండలం సిరిగుట్టి గ్రామానికి చెందిన జి.లక్ష్మయ్య తదితరులు కోరారు. కోమరాడ మండలం జోప్పంగి గ్రామానికి చెందిన తమకు అంత్యోదయ రేషన్ బియ్యం ఇప్పించాలని పలువురు గిరిజనులు కోరారు. మామిడి చెట్ల నరికివేతపై సమగ్ర దర్యాప్తు జరపాలని భోగాపురం మండలం గూడెపువలసకు చెందిన బి.గురువులు తదితరులు వినతినిచ్చారు. వికలాంగ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని మెంటాడ మండలం కొంటినవలసకు చెందిన ఎన్ సింహాచలం, నిలిపివేసిన పింఛను పునరుద్ధరించాలని గరివిడికి చెందిన బి లక్ష్మణ, వికలాంగ పించన్ మంజూరు చేయాలని ఎస్‌కోట మండలానికి చెందిన ఆర్ మహేశ్వరరావు కోరారు. మత్స్య సోసైటీలో నిధుల ఖర్చుల విషయమై ప్రశ్నించినందుకు తనపై కుల బహిష్కరణ విధించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయనగరం కమ్మవీధికి చెందిన వెంకటకృష్ణారావుకోరారు.
‘తుఫాన్ బాధితులను ఆదుకోవాలి’
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 12: జిల్లాలో తుఫాన్ బాధితులను ఆదుకోవాలని భారత ఐక్య కమ్యూనిస్టు పార్టీ (యుసిపిఐ) ప్రాంతీయ అధ్యక్షుడు కనకం కృష్ణారావు, కార్యదర్శి నల్లా బాబాజీ కోరారు. ఈ మేరకు సోమవారం ఇక్కడ జిల్లా కలెక్టర్‌కు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ తుఫాన్ వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పంట రైతులకు ఎకరానికి 10వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలన్నారు. కోతలు కోసి నీటిపాలై మొక్కలు మొలిచిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. రంగుమారిన, తడిచిన ధాన్యానికి మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు పంటరుణాలను మాఫీ చేయాలని, కొత్తరుణాలు మంజూరు చేయాలని వారు కోరారు. కౌలురైతులను పూర్తిస్థాయిలో గుర్తించి పంటల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ పంటరుణాలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అవసరమైనంతమేరకు సకాలంలో అందించాలన్నారు. చిన్న మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలని వారు కోరారు. రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుసిపిఐ జిల్లా నాయకులు వాదా ప్రసాదరావు, రీసు సత్యనారాయణ, నక్క శ్రీరాములు, కోరాడ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన జిల్లా స్థాయి పైకా పోటీలు
విజయనగరం (కంటోనె్మంట్), నవంబర్ 12: రెండు రోజులుగా రాజీవ్ క్రీడామైదానంలో జరిగిన జిల్లా స్థాయి పైకా పోటీలు సోమవారంతో ముగిశాయి. గత రెండురోజులుగా ఉత్సాహ భరితంగా జరిగిన ఈ పోటీల్లో వందలాది మంది విద్యార్థులు తమ క్రీడా ప్రతిభను కనబరిచారు. రెండవ రోజు జరిగిన ఈ పోటీలను జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి కె.మనోహర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, హాకీ, బాక్సింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్‌డిఓ మనోహర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం పైకా కింద క్రీడాపోటీలను నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీల నిర్వహణ కోసం మండలానికి 90 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులను కేటాయించినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో రెండురోజుల పాటు అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, హాకీ, బాక్సింగ్, ఖోఖో, ఆర్చరీ, ఫుట్‌బాల్, త్వైకాండో, వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. విజేతలకు ప్రభుత్వం తరుపున ప్రత్యేక బహుమతలను అందజేస్తామని చెప్పారు. వివిధ మండలాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
దారి మళ్ళిన వేతనదారుల బీమా సొమ్ము!
సీతానగరం, నవంబర్ 12: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు బీమాకు వసూలు చేసిన మొత్తాలను ఆ శాఖాధికారులు స్వాహా చేసిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. సుమారు నాలుగు నెలల క్రితం ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, వేతనదారుల నుంచి 120 రూపాయలు చొప్పున వసూలు చేశారు. అన్ని పంచాయతీల్లో వసూలు చేసిన మొత్తాలను కలిపి ఫీల్డ్ అసిస్టెంట్‌లు అప్పటి ఎపిఒకు అందజేశారు. సుమారు 3 లక్షల రూపాయలు వసూలు కాగా అందులో కొంత మొత్తాన్ని ఫీల్డ్ అసిస్టెంట్‌లు వేతనదారులకు బీమా చేయించగా సుమారు 60 వేల రూపాయలు నగదును ఎపిఒ తన వ్యక్తిగత ఖాతాలో వేసుకున్నారు. ఆమె ప్రసూతి సెలవుపై వెళ్ళడంతో 3 నెలలుగా బీమా సొమ్ము విషయం ప్రస్తుత ఎపిఒకు తెలియజేయలేదని సిబ్బంది చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బీమా చేస్తామని చెప్పి వేతనదారుల నుంచి వసూలు చేసిన మొత్తాలను రాబట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని వేతనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఎంపిడిఒ వెంకటరమణను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని పాత ఎపిఒ నుంచి ఈ సొమ్మును రాబట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. వేతనదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికీ రెండు రోజుల్లో బీమా చేయిస్తామని స్పష్టం చేశారు. ఉపాధిహామీలో అవినీతికి పాల్పడిన ఎపిఒపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే జయమణి తెలిపారు. బీమా పేరుతో వేతనదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును వసూలు చేస్తామన్నారు. కష్టించి పనిచేసే కూలీల వద్ద నుంచి వసూళ్లుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

పంట నష్టాన్ని పరిశీలించిన
ప్రత్యేకాధికారి
దత్తిరాజేరు, నవంబర్ 12 : మండలంలోని నీలం తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను, తుఫాన్ పునరావాసా ప్రత్యేకాధికారి, రాష్ట్ర డి.ఎ.డి సర్వీసు అధికారి బి. వెంకటేశ్వరరావు సోమవారం, చుక్కపేట, మరడాం గ్రామంలో నష్టపోయిన పత్తి పంట, ఉద్యానవన పంటపైన కేబేజి, మిరప, చిక్కుడు పంట నష్ట నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, పంటనష్ట పరిహారం మంజూరుకు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా రైతలు తమ గ్రామంలో 32 మంది రైతులకు సంబందించిన 35 ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా పోయింద, ఎకరాకు 25 వేల రూపాయలు చొపున పెట్టుబడులు పెట్టామని తమని ఆదుకోవాలని ప్రత్యేకాధికారి అధికారి రైతులు వేడుకున్నారు. అలాగే మరడాంలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన 122 మంది రైతులకు సంబంధించి ఉద్యాన వన పంటలైన కేబేజి,మిరప,చిక్కుడు పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టంపై అంచనాలు వేసి నివేదిక తయారు చేస్తామని, నష్టపరిహారం అందించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి శోభ, పార్వతీపురం ఆర్‌డిఓ వెంకటరావు, ఉద్యానవన ఎడి లక్ష్మణప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, ఎడి లచ్చన్న, తహశీల్ధార్ జి అప్పలనర్సయ్య, ఎంపిడిఓ సుబ్రహ్మణ్యం, ఎఓ కె తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా పంట నష్టం అంచనాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 12: నీలం తుపాను కారణంగా సంభవించిన నష్టాలను పారదర్శకంగా అంచనావేయాలని ప్రత్యేకాధికారి బి.వెంకటేశ్వర రావు అధికారులను ఆదేశించారు. తుపాను నష్టంపై జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఇతర అధికారులతో మినీకాన్ఫరెన్స్ హాల్ నందు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను అంచనావేసి, ప్రభుత్వానికి నివేదించడంతో పాటు బాధిత కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తుపాను కారణంగా జిల్లాలో పంట, ఆస్తి నష్టాలు సంభవించినప్పటికీ ప్రాణనష్టం లేకుండా జిల్లా యంత్రాంగం సకాలంలో చర్యలు చేపట్టడాన్ని ఆయన అభినందించారు. జాతీయ విపత్తుల విభాగం సూచించిన ప్రత్యేక ఫార్మాట్‌లోనే నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. పంట, ఆస్తినష్టం వివరాలను సేకరించిన తర్వాత గ్రామంలో వాటిని ప్రదర్శించాలని, అభ్యంతరాలు ఉంటే మార్పు చేయాలని సూచించారు. అర్హులకు పూర్తి న్యాయం జరగడంతో పాటు అనర్హులకు మేలు చేకూరే విధంగా చర్యలు తీసుకోరాదని, ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ సేకరించిన సమాచారం మేరకు తుపాను నష్టం 205 కోట్ల రూపాయలుగా ప్రాధమిక అంచనాకు వచ్చినట్టు వెల్లడించారు. 2099 గృహాలు దెబ్బతిన్నాయని, 49 లక్షల రూపాయల మేర పరిహారం మంజూరు కాగా ఇప్పటి వరకూ 10 లక్షల రూపాయలు చెల్లించినట్టు వివరించారు. వరద కారణంగా జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్టు గుర్తించామని, వీరికి మూడు లక్షల రూపాయల మేర ఎక్స్‌గ్రేషియామంజూరైందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు650 వరకూ మైనర్ ఇరిగేషన్ చెరువులు దెబ్బతిన్నాయని తెలిపారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ పి.ఎ.శోభ, డిఆర్‌ఓ బి.హెచ్.ఎస్.వెంకటరావు ఆర్డీఓలు రాజకుమారి, వెంకటరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పంట నష్టం అంచనాలకు బృందాలు
* 25 నాటికి ప్రభుత్వానికి నివేదిక
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 12: నీలం తుపాను కారణంగా నీట మునిగిన పంటల వివరాలతో నివేదికలను తయారు చేసేందుకు గ్రామస్థాయి బృందాలు తలమునకలయ్యాయి. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గ్రామస్థాయిలో విఆర్వో, వ్యవసాయ విస్తరణాధికారి, అభ్యుదయ రైతులతో సర్వేలు నిర్వహిస్తున్నారు. నీలం తుపాను కారణంగా జిల్లాలో 15,980 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్టు ఇప్పటికే అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. దీనిలో వరి 11వేల హెక్టార్లు, పత్తి 4,099 హెక్టార్లు, మొక్కజొన్న 1775 హెక్టార్లు, వేరుశెనగ 366 హెక్టార్లతో పాటు అపరాలు 67హెక్టార్లలో నష్టపోయినట్టు ప్రాధమికంగా గుర్తించారు. గ్రామాల్లో పరిశీలనా బృందాలు ఈనెల 15లోగా తమ నివేదికలను మండల స్థాయి అధికారులకు ఇవ్వాల్సి ఉంది. మండల స్థాయిలో తహశీల్దారుతో పాటు వ్యవసాయాధికారి నివేదికలను పరిశీలించి జిల్లా యంత్రాంగానికి నివేదిస్తారు. పరిశీలన పూర్తయిన తర్వాత మండల కార్యాలయాల్లోను, గ్రామ సచివాలయాల్లోను పంట నష్టం వివరాలు, అర్హుల జాబితాలు ప్రదర్శిస్తారు. వీటిపై అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 25ను తుది నివేదికను ప్రభుత్వానికి పంపుతారు.
పంటనష్టపోయిన రైతాంగానికి 50శాతం ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు కోరుతూ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నారు. వరి, వేరుశెనగ, పత్తి, చెరకు పంటలకు హెక్టారుకు 6000 రూపాయలు, మొక్కజొన్నకు 5000 రూపాయలు, అపరాలు, ఇతర ఉద్యాన పంటలకు 3750 రూపాయల వంతున ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ప్రకటించే ఇన్‌పుట్ సబ్సిడీ నష్టపోయిన రైతుకు ఏవిధంగా సరిపోదని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఎకరాకు కనీసం 10 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

డిఎస్‌డిఒ తీరుకు నిరసనగా పిఇటిల ఆందోళన
విజయనగరం (కంటోనె్మంట్), నవంబర్ 12: జిల్లా క్రీడా సాధికారిక సంస్థ అధికారి తీరును నిరసిస్త్తూ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లా స్థాయి పైకా పోటీలు నిర్వహించకుండా బాయ్‌కాట్ చేశారు. దీంతో సుమారు రెండు గంటల ఆలస్యంగా ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. దీంతో పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులకు, జిల్లా క్రీడా సాధికారిక సంస్థ అధికారికి మధ్య వాదన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ధనాన తిరుపతి మాట్లాడుతూ క్రీడాసాధికారిక సంస్థ ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి పైకా పోటీల్లో పాల్గొనాల్సిందిగా ఆదేశిస్తూ వ్యాయామ ఉపాధ్యాయులకు ఎటువంటి ఆన్ డ్యూటీ ఆర్డర్లు ఇవ్వనందున పోటీల్లో ఎలా పాల్గొంటామని ప్రశ్నించారు. జిల్లా స్థాయిలో చేపట్టే ఈ క్రీడాపోటీలు ఏర్పాటు తీరుపట్ల కూడా వీరు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు కనీస వసతులు కల్పించడంలో కూడా జిల్లా క్రీడల అధికారి నిర్లక్ష్యం వహించారంటూ మండిపడ్డారు. దీంతో జిల్లా క్రీడల శాఖ అధికారి కె.మనోహర్ పి.ఇ.టిలతో చర్చింది ఆన్‌డ్యూటీ ఆర్డర్లు ఒక గంటలోగా ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు క్రీడాపోటీలను నిర్వహించారు.

లక్ష్మింపేట దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
english title: 
f

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>