Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పదిరోజుల సెలవులో హౌసింగ్ పిడి

$
0
0

ఏలూరు, నవంబర్ 12: జిల్లా గృహనిర్మాణసంస్ధ ప్రాజెక్టు డైరెక్టరు ఆర్‌వివి సత్యనారాయణ పదిరోజులపాటు శెలవుపై వెళ్లారు. ఆయన స్ధానంలో ఇన్‌ఛార్జి పిడిగా ఏలూరు ఇఇ ఇ శ్రీనివాసరావును నియమిస్తూ కలెక్టరు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ పిఎస్‌గా ఆర్‌వివి సత్యనారాయణ వెళ్లనున్నారన్న ఊహాగానాలు గత కొద్దికాలంగా ఊపందుకున్న విషయం తెల్సిందే. ఈనేపధ్యంలోనే ఆర్‌వివి పదిరోజులపాటు శెలవులో వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి వద్ద ఓఎస్‌డిగా పనిచేస్తున్న కె కన్నబాబుకు ఇటీవల ఐఎఎస్‌గా పదోన్నతి లభించటంతో ఆయన జాయింట్ కలెక్టరుగా బదిలీ కానున్నారు. దీంతో మంత్రి ఓఎస్‌డిగా ప్రస్తుతం ఆయన వద్దే పిఎస్‌గా పనిచేస్తున్న డాక్టరు అమరేంద్ర వెళతారని, పిఎస్ పోస్టు ఖాళీకానుండటంతో ఆ స్ధానంలో ఆర్‌వివి సత్యనారాయణ నియమితులవుతారని తెలుస్తోంది. అయితే ఆకస్మాత్తుగా ఆర్‌వివి శెలవుపై వెళ్లడం కొంత చర్చకు దారితీస్తోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా హౌసింగ్ పిడిగా పనిచేస్తున్న జి సత్యనారాయణ జిల్లాకు పిడిగా వస్తారని తెలుస్తోంది.

కేంద్రం నుండి నిధులు తెస్తా
*వరద బాధితులను ఆదుకుంటాం*కేంద్ర మంత్రి చిరంజీవి భరోసా
నగరంలో విస్తృత పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, నవంబర్ 12 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టానికి కేంద్ర ఫ్రభుత్వం నుండి తగిన నిధులు తీసుకునివచ్చేలా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని కేంద్ర పర్యాటక శాఖామంత్రి కె చిరంజీవి అన్నారు. వరద నష్టాల పరిశీలన పర్యటనలో భాగంగా జిల్లాలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు మండలం పోణంగిలోని వై ఎస్ ఆర్ కాలనీలో వరద బాధిత కుటుంబాలకు 20 కేజీల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్‌ను మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాధితులనుద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా తన స్వంత జిల్లాకు ఈ విధమైన పర్యటనకు రావడం తనకు చాలా బాధగా వుందన్నారు. వరద బాధితులను పరామర్శించి వారికి మానసిక స్థైర్యం కలిగించేందుకు తన వంతు కృషి చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమన్నారు. వరద సమయంలో తాను లండన్ పర్యటనలో ఉన్నప్పటికీ ప్రతీ రోజూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడానని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వరద సహాయక చర్యలు గురించి ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో వరద సహాయక చర్యలు గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నానన్నారు. వరద కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకున్నదని, తడచిన ధాన్యం ఆఖరి గింజ కూడా కొనడం జరుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. అదే విధంగా నష్టపోయిన ప్రతీ కౌలు రైతుకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. రబీ సీజన్‌లో విత్తనాలు, ఎరువులకు ఎటువంటి కొరత రాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నదన్నారు. అంతేకాక వరద కారణంగా తడిసి, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి రైతులలో మనోధైర్యాన్ని నింపారన్నారు. వరదల కారణంగా జరిగిన పంట నష్టం అంచనాకు గ్రామ, మండల స్థాయి సర్వే బృందాలను నియమించడం జరిగిందని, ఈ బృందాల ద్వారా పంట నష్టం అంచనాలు అందిన వెంటనే పరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వరదల కారణంగా చేనేత, మత్స్య కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకుంటామన్నారు. ఏలూరు నగరం తమ్మిలేరు వరద ముంపునకు గురి కాకుండా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పితాని సత్యనారాయణ ఏలూరులోనే బస చేసి, జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఏలూరు పట్టణానికి పెద్ద ప్రమాదాన్ని తప్పించారన్నారు. వరద సమయంలో ప్రాణ, ఆస్థి నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు వై ఎస్ ఆర్ కాలనీలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారి ప్రాణాలను కాపాడారని, సకాలంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ వాణిమోహన్‌ను మంత్రి చిరంజీవి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఏలూరు నగరం తమ్మిలేరు వరద ముంపునకు గురికాకుండా తమ్మిలేరుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం నిమిత్తం 70 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైతే వంద కోట్ల రూపాయలైనా సరే అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానన్నారు.
నేను వరద బాధితుడ్నే
తన స్వంత ఊరు మొగల్తూరు అని, 1969 సంవత్సరంలో 4వ తరగతి చదివే సమయంలో తమ గ్రామంలో వరద కారణంగా తాము ఉన్న ఇల్లు, ఆరు ఎకరాల పంట పొలాలు మొత్తం ముంపునకు గురయ్యాయని, ఆ సమయంలో తినడానికి తిండి లేక, వరద నీటిలో ఇల్లు మునిగిపోయి, తన తమ్ముళ్లు, చెల్లెళ్లతో తాను ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నానని, తాను వరద బాధితుడనేనని కేంద్ర పర్యాటక శాఖామంత్రి కె చిరంజీవి చెప్పారు. ఆ సమయంలో చీకటిలో చలికి వణుకుతూ ఎంతో బాధపడ్డానని, వరద ముంపు బాధను తాను ప్రత్యక్షంగా అనుభవించానని, ఆ బాధ తనకు తెలుసన్నారు. అందుకే వరద బాధితులను పరామర్శించి వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు తాను పర్యటిస్తున్నానన్నారు. దెబ్బతిన్న ఇళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకువచ్చి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని, ఈ విషయంలో బాధితులు ధైర్యంగా వుండాలని అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో వరద కారణంగా లక్షలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి బాధితులకు తగిన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్, జిల్లా ఎస్పీ ఎం రమేష్, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, గృహ నిర్మాణ సంస్థ పిడి ఆర్‌వివి సత్యనారాయణ, ఆర్డీవో కె నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఘంటా మురళీరామకృష్ణ, మరడాని రంగారావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, పిసిసి కార్యదర్శి రాజనాల రామ్మోహనరావు, పోలవరం ఎ ఎంసి ఛైర్మన్ జెట్టి గురునాధరావు, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వై సాంబశివరావు, అద్దేపల్లి శ్రీను, పటగర్ల రామ్మోహనరావు, మోర్త రంగారావు, యల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాధితులకు 20 కేజీల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్‌ను మంత్రి చిరంజీవి పంపిణీ చేశారు.
కేంద్రమంత్రిగా చిన్ననాటి ఇంట్లో చిరు..
మొగల్తూరు, నవంబర్ 12: మొగల్తూరు గ్రామానికి చెందిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మెగాస్టార్ చిరంజీవి సోమవారం తన సొంత జిల్లాలో జరిపిన తొలిరోజు పర్యటన అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా సాగింది. మంత్రి చిరంజీవి తొలుత తన సొంత ఇంటి సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చిరంజీవి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాలినడకన తన చిన్ననాటి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న తన చిన్ననాటి ఫొటోను జిల్లా కలెక్టర్‌కు, మంత్రి పితానికి చూపించి అబ్బురపడ్డారు. మంత్రి చిరంజీవి మాట్లాడుతూ తాను మొగల్తూరు గ్రామంలో ఈ ఇంట్లోనే పెరిగి, ఇక్కడే విద్యాభ్యాసం చేశానని, మొగల్తూరు గ్రామమంటే తనకు ఎంతో ప్రేమానురాగాలని వారికి ఎంతో ఉద్వేగభరితంగా తెలియచేయడంతో చిరంజీవికి తన స్వగ్రామంపై ఉన్న మక్కువకు స్థానికులు నివ్వెరపోయారు.
రంగుమారిన ప్రధాన పంట కాలువలు
*కలుషిత జలాలతో రైతుల ఇక్కట్లు*ఆక్సిజన్ అందక తేలుతున్న చేపలు
నిడమర్రు, నవంబర్ 12: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధాన కాలువలు కాపవరం కాలువ, పందికోడు, నిండ్రకొలను కాలువ, తోకలపల్లి డ్రైన్లు మరియు పంట కాలువలు పూర్తిగా నలుపురంగులోకి మారాయి. దీని వల్ల కాలువల్లో నీరు ఊలివాసన రావటం, కాల్వల్లో ఆక్సిజన్ అందక చేపలు పైనే తేలియాడుతున్నాయి. ప్రధానంగా ప్రతీ పంట కాలువ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైతులు కాలువల్లోకి దిగి వ్యవసాయ పనులు చేపట్టాలంటే భయపడుతున్నారు. కాల్వల్లోకి దిగితే దురదలు వచ్చి పుండ్లు పడుతున్నాయని రైతులు తెలియజేస్తున్నారు. తేలిన చేపలను కొంతమంది పిల్లలు కాల్వలోకి దిగి కొడవలితో నరికి ఇంటికి పట్టుకువెళుతున్నారు. అలా నరికిన పిల్లలకు కూడా చర్మవ్యాధులు వ్యాపిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పందికోడు, తోకలపల్లి డ్రైన్, నిండ్రకొలను కాలువలు కొల్లేరులో కలుస్తాయి. దీనివల్ల రంగుమారిన నీరు కొల్లేరులో కలవటం వల్ల చేపలు కూడా ఎక్కువగా బతికి ఉండవని, నల్ల చేపలు కొరమేను, మట్టగొరసలకు శరీరంపై పుళ్లు పడుతున్నాయని చేపలు పట్టేవారు తోకలపల్లి గ్రామస్థులు తెలియజేస్తున్నారు. దీనివల్ల చేపలు పట్టేవారికి జీవన ఉపాధి కోల్పోతున్నారు. ఈ రంగుమారిన నీరు కొల్లేరులో అధికంగా వుండటంవల్ల విదేశీ పక్షులు కూడా ఎక్కువగా రావని రైతులు తెలియజేస్తున్నారు.

మహాదాత మూర్తిరాజు
*మరణ వార్తతో జిల్లాలో విషాద ఛాయలు
*రేపు గాంధీ భవన్ వద్ద అంత్యక్రియలు
నిడమర్రు, నవంబర్ 12: మహాదాత, ప్రముఖ గాంధేయ వాది, మాజీ మంత్రి చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు (93) మరణ వార్తతో జిల్లా అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం సాయంత్రం నిడమర్రు మండలం చిననిండ్రకొలను గ్రామంలోని నివాస గృహంలో మూర్తిరాజు కన్నుమూశారు. ఆయన సతీమణి కూడా ఇటీవలే కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే కొద్ది రోజులు భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తూవచ్చారు. ఆయన అంత్యక్రియలు బుధవారం గాంధీభవన్ వద్ద నిర్వహిస్తారని మూర్తిరాజు సన్నిహితులు తెలిపారు.
శాసనసభ్యునిగా, మార్కెటింగ్, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు చెందిన వందలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. బాపిరాజు ధర్మసంస్థల పేరిట రాష్టవ్య్రాప్తంగా 72 విద్యాసంస్థలను స్థాపించారు. వీటిలో ఐదు జూనియర్ కళాశాలలు, ఐదు డిగ్రీ కళాశాలలు, మూడు ఓరియంటల్ కళశాలలు, ఒక వ్యాయామ కళాశాల, పలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. బాలబాలికలంతా ఉన్నత విద్యావంతులు కావాలనే ఆశయంతో కొల్లేరు తీరప్రాంతంలో పలు పాఠశాలలను స్థాపించారు. ఆయన స్థాపించిన పాఠశాలల్లో చదువుకున్న వేలాది మంది ఇప్పుడు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. తన యావదాస్తిని దాన ధర్మాలకే వెచ్చించిన మహా మనీషి. పేదలకు 1800 ఎకరాల భూమిని దానం చేశారు. కొల్లేరు తీరప్రాంతంలో ముంపునకు గురై ప్రజలు పడుతున్న అవస్థలను చూడలేక గాంధీ భవన్ పేరుతో ఒక భారీ భవంతిని నిర్మించి, బాధితులకు పునరావాస కేంద్రంగా ఉపయోగించేవారు. తదనంతరం దాన్ని గాంధీ మ్యూజియంగా మార్చారు. 1960లో కొల్లేరు తీరప్రాంతంలో ఉన్న ప్రజలకు గృహ నిర్మాణం కల్పించాలనే సంకల్పంతో మొదటగా ప్రతీ గ్రామంలోనూ హరిజనులకు కాలనీలు నిర్మించారు. కొల్లేరు అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు.

నాచుగుంటలో సర్వోదయ సమ్మేళనం
ఉంగుటూరు: ఉంగుటూరు శివారు నాచుగుంటలో 1961లో అఖిల భారత స్థాయిలో సర్వోదయ సమ్మేళనం నిర్వహించిన ఘనత మూర్తిరాజుకే దక్కింది. దేశంలోని ప్రముఖులందరినీ సర్వోదయ సమ్మేళనంలో పాల్గొనేలా చేశారు. భారత మొదటి రాష్టప్రతి బాబూరాజేంద్రప్రసాద్ సహా అనేక మంది గాంధేయవాదులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల ఈ సమ్మేళనంలో పాల్గొనేలా ఆయన కృషి చేసారు. నాచుగుంట నుంచి బాదంపూడి వరకు రైల్వే కాలువ సందులో వేలాదిగా జనాలు తరలివచ్చే విధంగా తాటాకు పందిళ్ళు నెలకొల్పారు. ఈ సభకు గాన గంధర్వుడు ఘంటసాల కూడా వచ్చారు. రైల్వేస్టేషన్ ప్రత్యేకంగా సభాస్థలి వద్ద రైళ్ళన్నీ ఆగేలా చేసారు. విద్యుత్ కాంతులతో అనేక రకాలైన అంగళ్ళు నెలకొల్పారు. ఆనాటి సర్వోదయ సమ్మేళనం బొంబాయిని మరిపించేలా ఉందని స్వాతంత్య్ర సమరయోధులు ఈనాటికి చెపుతూవుంటారు. జిల్లాలో సర్వోదయ పేరు చెబితే మూర్తిరాజే గుర్తుకువస్తారు. ఆయన ఉంగుటూరు నియోజకవర్గం మొదటి శాసనసభ్యుడుగా 1967లో ఎన్నికయ్యారు. 1972లో ఏకగ్రీవంగా ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వటం విశేషం. తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం 1983లో కంఠమణి శ్రీనివాసరావు చేతిలో ఓడిపాయారు. నారాయణపురంలో వివేకానంద జిల్లా పరిషత్ హైస్కూల్‌ను నెలకొల్పారు. అరవింద శతజయంతి బి ఇడి కళాశాలను, మహాత్మాగాంధి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మూర్తిరాజే స్థాపించారు. సువిశాలమైన 6 ఎకరాల స్థలంలో బాపిరాజు స్టేడియం నెలకొల్పారు. విద్యా సంస్థలు నెలకొల్పడంతో గ్రామీణ ప్రాంతంలో వేలాదిమంది విద్యావంతులుగా మారే అవకాశం గ్రామీణ ప్రాంత యువకులకు దక్కింది. ఈనాటికీ మూర్తిరాజు దయవల్లే తాము డిగ్రీలు పొందామని గ్రామీణ ప్రాంత యువకులు చెప్పటం విశేషం. మూర్తిరాజు అకాల మరణంతో ఉంగుటూరు ప్రాంతంలో ఆయనతో పరిచయమున్న వ్యక్తులందరూ దిగ్భాంతికి లోనయ్యారు. ఆయన లేని లోటు తీరనిదని పలువురు పేర్కొన్నారు. నారాయణపురం సెంటర్‌లో వున్న మూర్తిరాజు విగ్రహానికి లయన్స్‌క్లబ్ ఆఫ్ చేబ్రోలు అధ్యక్షుడు బొమ్మిడి అప్పారావు, నారాయణపురం మాజీ ఉపసర్పంచ్ అడపా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ బిసి సెల్ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గురువెల్లి రాజారావులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఉంగుటూరు మండలంలో ఎక్కడ చూసినా మూర్తిరాజు మరణం గురించే చర్చించుకోవటం కనిపించింది.

కార్తీక మాసానికి ఏర్పాట్లు పూర్తి
* సోమేశ్వరాలయ ఇఒ రాధాకృష్ణ
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 12: కార్తీక మాసంలో భక్తులకు స్వామివారి దర్శనం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లూ పూర్తిచేస్తున్నామని సోమేశ్వరాలయ ఇఒ ఎస్‌టిపి రాధాకృష్ణ తెలిపారు. స్థానిక సోమేశ్వరాలయంలో సోమవారం పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులతో కార్తీకమాస ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. దూరప్రాంతాల నుండి వచ్చే యాత్రికులకు స్వామివారి దర్శనం కలిగేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. యాత్రికుల కోసం కార్తీక అన్నసమారాధన కమిటీ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ శాఖ చెత్తకుండీలను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ ఏర్పాటుచేస్తున్న బస్సులు సోమగుండం చెరువు వద్ద పార్కింగ్ చేసుకునేలా పోలీసు శాఖ సహకరిస్తుందని, భక్తులంతా స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. సమావేశంలో పట్టణ సిఐ రామవర్మ, నందమూరి తాతాజి, నల్లం వెంకటేశ్వరరావు, నల్లం నాగేశ్వరరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

గండి ప్రాంతాన్ని పరిశీలించిన చిరు
ఏలూరు, నవంబర్ 12 : ఏలూరు మార్కెట్ యార్డు వద్ద తమ్మిలేరుకు గండికొట్టకపోతే వేలాది పేద జీవితాలు వరదపాలయ్యేవని కేంద్ర పర్యాటక శాఖామంత్రి కె చిరంజీవి అన్నారు. తమ్మిలేరుకు కొట్టిన గండి ప్రాంతాన్ని సోమవారం చిరంజీవి పరిశీలించారు. గత మూడు నెలల నుండి వరుసగా భారీ వర్షాలు, వరదలు రావడంతో తమ్మిలేరు రిజర్వాయరు పూర్తి సామర్ధ్యంలో నీటితో నిండి ఉందని ఈ స్థితిలో నీలం తుఫాన్ బీభత్సానికి ఏలూరు నగరం ముంపు బారిన పడకుండా మార్కెట్ యార్డు వద్ద తమ్మిలేరుకు గండికొట్టడం వల్ల వేలాది పేద జీవితాలు తమ్మిలేరు వరద పాలు కాకుండా నివారించగలిగినట్లు చిరంజీవి చెప్పారు. ప్రతీ ఏటా తమ్మిలేరు వరద భయంతో హేలాపురి ప్రజలు బిక్కుబిక్కుమని జీవిస్తున్న దుస్థితి నుండి శాశ్వత వరద నివారణా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అత్తిలిలో..
అత్తిలి: నీలం తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరిచేలను పరిశీలించడానికి వచ్చిన కేంద్రపర్యాటకశాఖామంత్రి చిరంజీవి పర్యటన అత్తిలి మండలంలో వడివడిగా సాగటంతో పలువురు అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఉదయం 11.30 గంటలకు వరిగేడు గ్రామంలో చిరంజీవి పర్యటిస్తారని అధికార్లు ప్రకటించడంతో అప్పటినుండి వేచియున్న రైతులకు, ఇతర ప్రజానీకానికి మంత్రి నిరాశపరిచారు. సుమారు 3 గంటలు ఆలశ్యంగా వచ్చిన ఆయన గ్రామ ప్రముఖుడు అడ్డాల స్వామినాయుడు విగ్రహానికి పూలమాల వేసి వెళ్ళిపోవటంతో నాయకులు, రైతులు డీలాపడ్డారు. దెబ్బతిన్న వరిదుబ్బులను కొందరు రైతులు చిరంజీవికి చూపించారు. తిరుపతిపురం గ్రామం వద్ద నీలం తుఫాన్‌కు నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ.6వేలు సహాయం సరిపోదని గ్రామ నీటిసంఘం సభ్యుడు వడ్డి రామచంద్రరావు మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళతానని చిరంజీవి హామీ ఇచ్చారు. బల్లిపాడు ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టిన చిరంజీవి స్థానికులకు అభివాదం చేసారు. అత్తిలి పెద్ద వంతెన వద్ద చిరంజీవి రాకకోసం వేచియున్న ప్రజానీకానికి అభివాదం చేసి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ జెండాతో అలంకరించిన ఎడ్లబండిపై చిరంజీవిని ఊరేగించాలన్న స్థానికుల కోరిక నెరవేరలేదు. అత్తిలి నుండి ఎక్కడా ఆగకుండా సరాసరి పెనుమంట్ర మండలం వెళ్ళిపోవటం పట్ల పలువురు నొచ్చుకున్నారు. చిరంజీవి వెంట ఎంపి కనుమూరి బాపిరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని తదితరులు ఉన్నారు. కేంద్రమంత్రి చిరంజీవికి మద్దాల నాగేశ్వరరావు, బుద్దరాశి భరణిప్రసాద్, హబీబుద్దీన్ అత్తిలిలో స్వాగతం పలికారు. వరిగేడులో అడ్డాల బాబ్జి, అనంతబాబు, వెంకటరత్నంనాయుడు, బల్లిపాడులో దాసం తాతాజీ, పండుస్వామి తదితరులు స్వాగతం పలికారు.

మంత్రి, కలెక్టర్‌పై చిరు ప్రశంసల జల్లు
ఏలూరు, నవంబర్ 12 : నీలం తుఫాన్ వల్ల అపార ప్రాణ నష్టం జరగకుండా నిరోధించడంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్, మంత్రి పితాని సత్యనారాయణ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల పట్ల కేంద్ర పర్యాటక శాఖామంత్రి కె చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. పోణంగి వై ఎస్ ఆర్ కాలనీలో వరద బాధితులను పరామర్శించడానికి సోమవారం వచ్చిన చిరంజీవికి జిల్లాలో వరద నష్టం వివరాలను కలెక్టరు వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చిరంజీవి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వాణిమోహన్ వరద ప్రమాదాన్ని ముందుగానే ఊహించి అధికార యంత్రాంగాన్ని ఒకవైపు అప్రమత్తం చేస్తూ మరోవైపు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగు సమాచారాన్ని అందిస్తూ ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కలెక్టర్ కృషి అభినందనీయమన్నారు. ఎక్కడికక్కడే ప్రత్యేకాధికారులను నియమించి ఎటువంటి విపత్కర పరిస్థితినైనా సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు అనువుగా కలెక్టర్ వరద సంభవించే ప్రాంతాలలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసిన ఫలితంగా ప్రాణనష్టాన్ని నివారించడం జరిగిందని ఈ విషయంలో కలెక్టర్ చూపిన చొరవ, పడిన శ్రమ ఎంతో గొప్పదని చిరంజీవి అన్నారు. తమ్మిలేరు వరదనీటి ప్రవాహాన్ని ముందుగా అంచనా వేసి ఏలూరు నగరాన్ని వరద ముంపు నుంచి కాపాడటంలో డాక్టర్ జి వాణిమోహన్ కృషి ప్రశంసనీయమని చిరంజీవి కలెక్టర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నీలం తుఫాను పరిస్థితిని తెలుసుకుని వెంటనే ఏలూరు చేరిన మంత్రి పితాని సత్యనారాయణ జిల్లా యంత్రాంగాన్ని చైతన్యపరచి అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రాణనష్టం బాగా తగ్గిందని చిరంజీవి మంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. జరగబోయే ఉపద్రవాన్ని ముందుగానే ఊహించి ప్రజలను అప్రమత్తం చేసిన ఫలితం వల్ల జిల్లాలో నీలం తుఫాను ప్రాణనష్టాన్ని నివారించగలిగిందని చిరంజీవి చెప్పారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు నీలం తుఫాన్ సంభవించిందన్న వార్త తెలుసుకుని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రితో ఫోన్‌లో పరిస్థితిని తెలుసుకున్నానని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో సమర్ధతతో పనిచేస్తే ఇటువంటి పెను తుఫాన్‌ల వల్ల ప్రాణనష్టాన్ని నివారించగలుగుతామనడానికి జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. తన స్వంత జిల్లా కాబట్టి వరద బాధితులను పరామర్శించి అన్ని విధాలా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రప్రధమంగా ఏలూరు చేరుకున్నానని బాధితులను అన్ని విధాలా ఆదుకుంటానని చిరంజీవి చెప్పారు. జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, జిల్లా ఎస్‌పి రమేష్‌లు సమన్వయంతో జిల్లాను అన్ని రంగాలలో ముందంజ వేయడానికి మరింత కష్టపడి పనిచేయాలని చిరంజీవి కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఎ ఎంసి ఛైర్మన్ జెట్టి గురునాధరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఏలూరు ఆర్డీవో కె నాగేశ్వరరావు, తహశీల్దార్ ఎజి చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గోధుమ వర్ణంలో సోమేశ్వరుడు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 12: పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ ఉమాసోమేశ్వర, జనార్దనస్వామివార్ల దేవస్థానంలోని సోమేశ్వరుడికి సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి శే్వతవర్ణంలోనూ, అమావాస్యకు గోధుమ వర్ణంలోనూ దర్శనమివ్వడం స్వామివారి ప్రత్యేకత. ఇక్కడి లింగాన్ని సాక్షాత్తూ చంద్రుడే ప్రతిష్ఠించాడని, అందుకే అమావాస్యకు, పౌర్ణమికి శివలింగం రంగులు మారుతూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. అమావాస్య ఘడియలు సమీపిస్తుండడంతో స్వామివారు ఇలా గోధుమ వర్ణంలో దర్శనమిచ్చారు.

8 లక్షల విలువైన గంజాయి పట్టివేత
* టాటా ఏస్‌లో అక్రమ రవాణా* యజమానితో సహా డ్రైవర్ అరెస్టు
జంగారెడ్డిగూడెం, నవంబర్ 12: టాటా ఏస్ వాహనంలో అక్రమ రవాణా అవుతున్న 8 లక్షల రూపాయల విలువైన 520 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు స్థానిక డియ్యస్పీ టి.రామకృష్ణారావు వెల్లడించారు. ముందుగా అందిన పక్కా సమాచారం మేరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.మురళీరామకృష్ణ తమ సిబ్బందితో స్థానిక అశ్వారావుపేట రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిఘావేసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న టాటా ఏస్ వాహనాన్ని పట్టివేసినట్టు తెలిపారు. ఎపి 05టిబి 2756 నంబర్‌గల వాహనంలో 27 పాలిథిన్ సంచులలో 520 కిలోల గంజాయి లోడు చేసి, ఎవరికీ అనుమానం రాకుండా సంచులపైన 1,820 కిలోల మొక్కజొన్నపొత్తులు లోడు చేసినట్టు తెలిపారు. ఈ నెంబర్ వాహనంపై పక్కా సమాచారం ఉండటంతో సి.ఐ వాహనంలోని మొక్కజొన్న పొత్తులు తొలగించి పరీశీలించగా గంజాయి గోతాములు బయటపడ్డాయని డియ్యస్పీ తెలిపారు. వాహనంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వరంగల్‌కు చెందిన రాయుడు శ్యామ్, తూర్పుగోదావరి జిల్లా నెడిగట్లకు చెందిన డ్రైవర్ కోసూరి మాధవరావులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ టాటా ఏస్‌తో కలిపి 12 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ గంజాయిని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుండి శ్యామ్ ఖమ్మం రవాణా చేస్తున్నాడని తెలిపారు. ఇది ఖమ్మం నుండి వేరే వాహనంలో వరంగల్ లేక హైదరాబాద్, అక్కడి నుండి రాష్ట్రం దాటవేసి ముంబాయికి రవాణా చేస్తున్నట్టు సమాచారం ఉందని చెప్పారు. భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సి.ఐ మురళీరామకృష్ణ, ఐ.డి పార్టీ హెచ్.సిలు బి.రమణ, దిలీప్, కానిస్టేబుల్స్ ఎస్.వెంకటేశ్వరరావు, టి.యర్రయ్య, ఎం.వి.రాయుడు, రాజేంద్ర, డ్రైవర్ మురళిలను డియ్యస్పీ అభినందించారు. వారికి రివార్డుల కోసం ఉన్నతాధికార్లకు సిఫార్స్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సి.ఐ మురళీరామకృష్ణ, ఎస్సై బి.ఎన్.నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సెన్సార్ బోర్డు దిష్టిబొమ్మ దగ్ధం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 12: విద్యార్థులు, యువకుల మనోభావాలు దెబ్బతినే విధంగా ద్వంద్వార్ధాలతో కూడిన సంభాషణలతో నిర్మించిన బస్‌స్టాప్ సినిమాలోని సంభాషణలను తొలగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) డివిజన్ కమిటీలు డిమాండ్ చేశాయి. ఈమేరకు స్థానిక పోలీస్ బొమ్మ సెంటర్ నుంచి విద్యార్థులు, యువకులు ర్యాలీగా బయలుదేరి బస్‌స్టాప్ సినిమా ప్రదర్శిస్తున్న పద్మాలయ సినిమా థియేటర్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం సెన్సార్ బోర్డు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కుటుంబ సమేతంగా చూడలేని సినిమాలు సర్వసాధారణమైపోయాయని విమర్శించారు. అశ్లీల, ద్వంద్వార్ధాలతో కూడిన చిత్రాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.అవినాష్, ఎం.కేతారామ్, బాబి, వెంకటేష్, ఉదయ్, రాజేష్, అశోక్, మహేష్, శిరీష, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

*ఇన్‌ఛార్జిగా ఇఇ శ్రీనివాసరావు*కొత్త పిడిగా సత్యనారాయణ!
english title: 
fg

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>