Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఓరుగల్లులో దీపావళి సందడి

$
0
0

వరంగల్, నవంబర్ 12: వెలుగుల పండుగ దీపావళికి ఓరుగల్లు ముస్తాబైంది.. తిమిరాన్ని పారద్రోలే దీపపుకాంతులను విరజిమ్మేందుకు నగరం సిద్దమైంది..పండుగకు ముందే నగరం దివ్వెలను వెదజల్లుతోంది. మంగళవారం జరిగే పండుగ సందర్బంగా వివిధ రకాల కొనుగోళ్లతో అంతా సందడిగా కనిపిస్తోంది. దీపావళి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని వస్త్ర, వాణిజ్య దుకాణాల్లో అమ్మకాలు సోమవారం రాత్రి బాగా పొద్దుపోయేవరకు జరిగాయి. ప్రత్యేకించి లక్ష్మీపూజలను పురస్కరించుకుని బంగారం అమ్మకాల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. దీపావళి సందర్బంగా బంగారం కొనుగోళ్లపై నగరంలోని ప్రముఖ బంగారు, జ్యువెల్లరీ అమ్మకందారులు ఆఫర్లు ప్రకటించారు. లక్ష్మీప్రతిమ ఉన్న బంగారు నాణేలతోపాటు, వివిధ రకాల డిజైన్ల ఆభరణాల తయారీలో తరుగు, మజూరి లేకుండా కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. బంగారం ధర పది గ్రాములకు 32వేల రూపాయలకు చేరినా..ఆఫర్లతో ఆభరణాల అమ్మకాల దుకాణాల్లో కస్టమర్ల రద్దీ విపరీతంగా ఉంది. అమావాస్య రోజు చీకట్లను పారద్రోలే దీపావళి రోజే నోములు, కేదారీశ్వర వ్రతాలు ఉండడంతో పూజాసామాగ్రి కొనుగోలులో ప్రజలు నిమగ్నమై ఉన్నారు. హన్మకొండలోని కుమార్‌పల్లి, టైలర్‌స్ట్రీట్ రోడ్, అశోకా జంక్షన్, సుబేదారి, వరంగల్ నగరంలోని హెడ్‌పోస్ట్ఫాస్, పోచమ్మమైదానం, ఎంజిఎం జంక్షన్, బట్టలబజార్ రోడ్డు, వరంగల్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో బంతిపూలు, మామిడి ఆకులు, దీపపుప్రమిదలు, వొత్తుల ప్యాకెట్ల అమ్మకాలతో శోభాయమానంగా కనిపిస్తోంది. బంతి, చేమంతి, మల్లె తదితర పూల ధరలు ఆకాశాన్నంటినా కొనుగోలు చేస్తున్నారు. దీపాలను అంటించి వెలుగులు పంచేందుకు రకరకాల దీపపుప్రమిదలు మార్కెట్లోకి వచ్చాయి. మట్టి ప్రమిదల్లో భిన్న ఆకృతులను తీర్చిదిద్దారు. ఇంకోవైపులక్ష్మీప్రతిమలకు అనుబంధంగా నాలుగేసి దీపపుప్రమిదలను రంగుల్లో తయారుచేసి అమ్మకాలు చేస్తున్నారు. వీటికి కూడా బాగానే డిమాండ్ ఉంది. దీపావళితోపాటు రెండవ శని, ఆదివారాలు రావడంతో సోమవారం సెలవు పెట్టుకుని కొంత మంది ముందే ఊళ్లకు వెళ్లిపోగా మరోవైపు సోమవారం వరంగల్- విజయవాడ, వరంగల్-సికింద్రాబాద్ మార్గాలలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపించింది. దూరప్రాంతాల నుండి స్వస్థలాలకు వచ్చేవారితో ఇంకోవైపురైళ్లు, ఆర్టీసి బస్సులు కిటకిటలాడుతున్నాయి. అయితే కోస్తా, ఆంధ్రాప్రాంతంలో ఇటీవల నీలం తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు ఇప్పటికీ కూడా ఆలస్యంగా సాగుతుండడంతో ప్రయాణికులు కొంత అవస్థ పడుతున్నారు.
భారీగా పెరిగిన మతాబుల ధరలు
ఇదిలా ఉండగా, దీపావళి సందర్బంగా మతాబుల అమ్మకాల ధరలు పెరిగిపోయాయి. నగరంలోని హన్మకొండ హయగ్రీవాచారి మైదానం, వరంగల్ పోచమ్మమైదానం ప్రాంతాల్లో మతాబుల అమ్మకాల దుకాణాలను ఈ పర్యాయం పెద్దఎత్తున ఏర్పాటుచేశారు. అయితే గత మూడు రోజులుగా మతాబుల అమ్మకాలు పెద్దగా లేకపోగా వ్యాపారులు డీలా పడ్డప్పటికీ సోమవారం నుండి లక్షల్లో మతాబుల అమ్మకాలు సాగుతుండడంతో వ్యాపారులు ఆనందపడుతున్నారు.
తగ్గిన పూల ధరలు
కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పూల ధరలు తగ్గాయి. దీపావళి పండుగ పుణ్యాన నాలుగు డబ్బులు వెనకేసుకుందామని ఆశపడిన పూల వ్యాపారులకు నిరాశ మిగిలింది. సాధారణంగా నరక చతుర్థశి ఒకరోజు, మరుసటి రోజు దీపావళి రావడం సహజం కాగా, ఈసారి నరక చతుర్థశి సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై మంగళవారం తెల్లవారుజాముతో ముగియడం, ఆ వెంటనే అమావాస్య మొదలు అవుతోంది. ఒకరోజు హారతుల గిరాకీ, మరోరోజు నోములు, పూజల గిరాకీ కారణంగా పూల వ్యాపారుల పంట పండేది. గత ఏడాది బంతిపూలు 80 నుంచి 100 రూపాయలు పలకడంతో వ్యాపారులు భారీగా లాభపడ్డారు.
ఈసారి కూడా పండుగ అమ్మకాలతో లాభాలు పొందవచ్చని భావించిన వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున హారతులు, అదేరోజు నోములు, పూజలు ఉండడంతో పూల అమ్మకాలు తగ్గాయి. బంతిపూలు 40నుంచి 60రూపాయలకు లభించగా, చామంతి పూలు 150రూపాయల నుంచి 250రూపాయలకు కేజి చొప్పున అమ్మకాలు జరిగాయి. ప్రధాన వీధుల్లో పూలరాసులు భారీగా కనిపించినా అమ్మకాలు మాత్రం అంతంత మాత్రమేనని.. ఈసారి తమకు నష్టమేనని పూల వ్యాపారులు వాపోతున్నారు.

చెత్తకుప్పలో పసికందులు
వరంగల్ బల్దియా, నవంబర్ 12: మానవత్వం మంట కలిసిపోతోంది.. అమ్మతనం మచ్చుకైనా కనిపించకుండా పోతోంది.. అందుకు నిదర్శనంగా ఇద్దరు పసికందులను చెత్తకుప్పలో పడవేసిన సంఘటన సోమవారం నగరంలోని కొత్తవాడలో వెలుగుచూసింది. మట్టెవాడ పోలీసుల వివరాల ప్రకారం... ఏ తల్లి కన్నదో తెలియదు కానీ ఇద్దరు పసికందులలో అందులో ఒకరు ఆడ, మరొకరు మగ శిశువులను కొత్తవాడలోని వార్త కార్యాలయం పక్కనే చెత్తకుప్పలో పడవేసి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి వెంటనే మట్టెవాడ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు మృత శిశువులను పరిశీలించారు. అయితే, ఇద్దరు పసికందులను మృతిచెందిన తరువాత పడవేశారా? లేకుంటే తెలియక చేసిన తప్పుకు పసికందులు బలయ్యారా? అనేది తెలియకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎవరెలా చేసినా మాతృత్వానికి మచ్చ తెచ్చారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
గిరిజన రైతు ఆత్మహత్య
నెల్లికుదురు, నవంబర్ 12: నీలం తుపానుతో పంట నష్టపోవడం తట్టుకోలేక గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వావిలాల శివారు దారావత్‌తండాలో సోమవారం చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇస్లావత్ లక్‌పతి (40) తన రెండు ఎకరాల భూమిలో వరి, మూడు ఎకరాల్లో పత్తి పంటలను సాగుచేశాడు. ఇటీవల కురిసిన నీలం తుపానుతో పంటలు అక్కరకు రాకుండా పోవడంతో సాగుకోసం తెచ్చిన అప్పు ఎలా తీర్చాలనే బెంగతో ఆదివారం బావి వద్ద పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నివాసం ఉండకపోతే స్వాధీనం
గృహకల్ప లబ్ధిదారులకు హెచ్చరిక
హన్మకొండ రూరల్, నవంబర్ 12: రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు వారికి కేటాయించిన గృహాల్లో ఉండకపోతే ఆ గృహాలను స్వాధీనం చేసుకుంటామని గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నర్సింహరావు సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉర్సు శివారు సర్వె నెంబర్ 767, 437,438లో రాజీవ్ గృహకల్ప ఫేస్-2, ఫేస్-3 క్రింద 37బ్లాకులలో శాయంపేట పరిసర ప్రాంతాల్లో 1184 గృహాలను నిర్మించినట్లు తెలిపారు. కానీ కొందరు లబ్ధిదారులు వారికి కేటాయించిన గృహాల్లో ఉండడం లేదని, ఇప్పటికే అనేకమార్లు నోటీసులు జారీచేసినా వారు ఆ గృహాల్లో ఉండడం లేదని చెప్పారు. అలాంటి వారి గృహాలను ఈనెల 20వ తేదీలోగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెం.185 ప్రకారం నివాసం ఉండని లబ్ధిదారుల ప్లాట్ల మంజూరు కూడా రద్దుపరిచి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.

వైజ్ఞానిక ప్రదర్శనలు స్ఫూర్తి కావాలి
* విద్యార్థులకు కలెక్టర్ సూచన

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, నవంబర్ 12: విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో విజయాలను సాధించాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జా తెలిపారు. సోమవారం హన్మకొండలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలోని ప్రయోగాలను ప్రయోగాలకే పరిమితం చేయకుండా వారి నిజజీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే ఉపయోగమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, నీటి పొదుపు, విద్యుత్ పొదుపు వంటివి విద్యార్థులు, విద్యాసంస్థలు ఆచరణలో చూపించాలని తెలిపారు. సామాజిక, ఆర్థిక సమస్యలను వైజ్ఞానికశాస్త్రం పరిష్కరాలను చూపిస్తోందని అన్నారు. విజ్ఞానాన్ని సాధించినప్పుడు సామాజిక అసమానతలు తొలగిపోతాయని చెప్పారు. గతంలో అభివృద్ధికి పర్యావరణాన్ని విధ్వంసం చేయడానికి వెనుకాడేవారు కాదని, కానీ నేడు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. గతంలో సైన్స్‌ఫేర్‌లలో అతితక్కువ పాఠశాలలు పాల్గొనేవని పేర్కొన్నారు. భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని, కానీ నేడు నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనలో పాఠశాలలు పెద్దఎత్తున పాల్గొంటున్నాయని చెప్పారు. మూడురోజులపాటు జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో 40వేల మంది విద్యార్థులు పాలుపంచుకున్నారని తెలిపారు. నేడు సైన్స్ ప్రదర్శనలో పర్యావరణ పరిరక్షణ, ఇంధనాల పొదుపు, నీటి పొదుపు, గణితశాస్త్రానికి సంబంధించిన అంశాలను ప్రదర్శించారని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలో బోధించే అంశాలను ప్రయోగాత్మకంగా నిరూపించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని అన్నారు. 915ఎగ్జిబిట్లు ఈ ప్రదర్శనలో ఉంచారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి పాల్గొన్న ఉపాధ్యాయులకు, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.రాజవౌళి, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌బాబు, డిప్యూటీ డిఇఓ వాసంతి, వెంకట్రామిరెడ్డి, సెయింట్ పీటర్స్ పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

టిడిపి జిల్లా అధ్యక్షుడిగా బస్వారెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, నవంబర్ 12: ఎట్టకేలకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఏర్పడిన వివాదానికి తెరపడింది. టిడిపి జిల్లా అధ్యక్షునిగా పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ బస్వారెడ్డిని ఎంపిక చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష పదవి కోసం చివరి వరకు ప్రయత్నాలు చేసిన తెలుగు యువత మాజీ అధ్యక్షుడు, వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఈగ మల్లేశంను ప్రధాన కార్యదర్శిగా నియమించి బుజ్జగించారు. ఈ మేరకు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎంపి నామా నాగేశ్వురావు కొత్తగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్లను సోమవారం రాత్రి జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. గత నెలలో జిల్లా కమిటీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు నిర్వహించగా బస్వారెడ్డి, ఈగ మల్లేశం పోటీపడ్డారు. పార్టీలో వివాదం లేకుండా అధ్యక్ష ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు పలువురు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ప్రయత్నించినా రంగం నుంచి తప్పుకునేందుకు ఇద్దరు నేతలు ససేమిరా అంటూ మొండికేశారు. పార్టీలోని మెజారిటీ నాయకులు బస్వారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచినా, రాష్టస్థ్రాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈసారి జిల్లా అధ్యక్ష పదవిని ఈగ మల్లేశంకు కట్టబెట్టి బిసిలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రజల్లోకి వెళ్లాలని మరికొందరు నాయకులు కోరుతూ వచ్చారు. అధ్యక్ష పదవికి పోటీపడిన ఇద్దరు నాయకుల మధ్య రాజీ కుదరకపోవడంతో సమస్య పరిష్కారం వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబుకు వదిలిపెడుతూ జిల్లా నాయకత్వం నిర్ణయం తీసుకుంది. బస్వారెడ్డికి మద్దతుగా కొందరు, ఈగ మల్లేశంకు మద్దతుగా మరికొందరు నాయకులు పాదయాత్రలో ఉన్న చంద్రబాబు వద్దకు రాయబారాలు కూడా నడిపారు. ప్రస్తుత జిల్లా పరిస్థితులు, 2014లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా టిడిపి నాయకత్వ బాధ్యతలను బస్వారెడ్డికి అప్పగించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న ఈగ మల్లేశంకు ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో కలసి 115మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపి నామా నాగేశ్వర్‌రావు తెలిపారు. కొత్త కమిటీని జిల్లా నాయకులతో సంప్రదించి ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు త్వరలో ప్రకటిస్తారని చెప్పారు.

వృత్తి నైపుణ్యం అవసరం
* పోలీసులకు వరంగల్ రేంజ్ డిఐజి విక్రమ్‌సింగ్ మాన్ పిలుపు

బాలసముద్రం, నవంబర్ 12: పోలీసు సిబ్బంది వృత్తిరీత్యా కూడా నైపుణ్యాన్ని చాటుకోవాలని వరంగల్ రేంజ్ డిఐజి విక్రమ్‌సింగ్ మాన్ పోలీసు సిబ్బందికి సూచించారు. సోమవారం జిల్లాలో నిర్వహించిన ఒకరోజు వరంగల్ రేంజ్ డ్యూటీ మీట్‌ను వరంగల్ రేంజ్ డిఐజి ప్రారంభించారు. ఒకరోజు నిర్వహించే ఈ పోలీసు డ్యూటీ మీట్ సందర్భంగా వరంగల్ రేంజ్‌కు చెందిన వరంగల్ రూరల్, అర్బన్, ఖమ్మం జిల్లాలకు చెందిన సిఐ, ఎస్సై, ఎఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో కేసు దర్యాప్తు సందర్భంగా అధికారులు సిబ్బంది చేపట్టే ప్రక్రియలకు సంబంధించి అధికారులకు, సిబ్బందికి పోటీలను నిర్వహిస్తారు. ఈ డ్యూటీ మీట్‌లో ఫింగర్ ప్రింట్స్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, ఐఓ ఫొటోగ్రఫీ నేరస్థుల పరిశీలన, ప్రొఫిషినల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీతో యాంటీ సబతేజ్ చెక్ మొదలైన విభాగాలలో సిబ్బందికి పోటీలను నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన సిబ్బంది త్వరలో నిర్వహించే స్టేట్ డ్యూటీమీట్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ కేసుల పరిష్కారం కోసం వృత్తిలో సిబ్బంది తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు రాజేష్‌కుమార్, ఎస్.శ్యాంసుందర్, అడిషినల్ ఎస్పీ కె.శ్రీకాంత్, కాజీపేట ఎఎస్పీ కోయ ప్రవీణ్, ఎఆర్ కమాండెంట్ ప్రభాకర్‌తోపాటు డిఎస్పీలు, సిఐలు, ఎస్సై, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వెలుగుల పండుగ దీపావళికి ఓరుగల్లు ముస్తాబైంది..
english title: 
o

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>