ఏలూరు, నవంబర్ 14 : తల్లి తినిపించే గోరు ముద్దలతో ఆకలి తీర్చుకుని ఆవరణలోనే ఆటాపాటా సాగించుకోవాల్సిన వయస్సులో వారంతా బాలుర హోంలో చిక్కుకున్నారు. మనస్సు తల్లికోసం అల్లాడుతుండే పరిస్థితులు హోంకు పరిమితమయ్యాయి. పొరపాటో గ్రహపాటో గానీ వారు బాలుర గృహంలో నివసించాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అమ్మప్రేమ వారిని నిలువనీయలేదు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ బాలుర గృహాన్ని సందర్శించగానే అమ్మ ప్రేమపట్ల వారికున్న మమకారం ఒక్కసారిగా పెల్లుబుకింది. ఆమెను చూడగానే వారి తల్లులు గుర్తుకువచ్చారేమోగానీ వారంతా కన్నీరు మున్నీరవుతూ అమ్మకావాలంటూ అడగడం కలెక్టర్‌నే కాకుండా అక్కడున్న వారినందరినీ కదిలించి వేసింది. అయితే పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి అమ్మను తేలేకపోయినా అమ్మప్రేమ పంచేందుకు నేనున్నానని స్వయంగా కలెక్టర్ ముందుకు రావడంతో ఆ చిన్నారుల మోములో కొద్దిపాటి ఆనందం వెల్లివిరిసింది. ఎప్పుడు అమ్మకావాలని అనిపించినా తనకు ఫోన్ చేయవచ్చునని చెప్పి ఆమె తన ఫోన్ నెంబరు కూడా వారికి అందజేశారు. ఏలూరు మండలం శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర గృహంలో బుధవారం బాలల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గృహంలో వున్న బాలురతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏమైనా సమస్యలుంటే చెప్పండి పరిష్కరిస్తానని కలెక్టర్ అడగడం ఆ తరువాత బాలురతో మాటామంతీ పెరగడంతో వారిలో కొంతమంది తమకు అమ్మకావాలని కన్నీటి పర్యంతం కావడం కలెక్టర్‌ను కూడా కదిలించివేసింది. వారిని కలెక్టర్ ఓదార్చి ఇప్పటికిప్పుడు అమ్మను తీసుకురావడం సాధ్యం కాకపోయినా అమ్మ ప్రేమను పంచుతానని చెప్పి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాలుర గృహంలో ఈ ఘటనతో వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. మిగిలిన వారి పిల్లల తల్లిదండ్రులు ఏదో ఒక సమయంలో పలకరించి వెళుతున్నారని, తమ తల్లిదండ్రుల ఆచూకీ మాత్రం లేకుండా పోయిందని ఆ చిన్నారులు కలెక్టర్ వద్ద వాపోయారు. మద్యం తాగి తండ్రి నాగేశ్వరరావు తన తల్లి లక్ష్మిని పెట్టే బాధలు చూసి భరించలేక ఇంటిలోనుంచి పారిపోయి వచ్చానని, ఇప్పుడు వారెక్కడున్నారో, తన ఊరేమిటో కూడా తెలియని పరిస్థితుల్లో బాలుర గృహంలో ఉండిపోయానని ఎనిమిదేళ్ల శ్రీకాంత్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అయితే తోటి విద్యార్ధుల తల్లిదండ్రులు వారిని అప్పుడప్పుడు పలకరిస్తున్నారని, అయితే అమ్మప్రేమకు దూరమై తల్లిని చూడలేక అల్లాడుతున్నానని అతను కలెక్టర్‌కు వివరించడంతో కలెక్టర్ చలించిపోయి ఆ బాలుడిని అక్కున చేర్చుకుని నీకు అండగా నేనుంటా ఏ కష్టం వచ్చినా నాతో చెప్పు బాబూ అంటూ తన సెల్‌ఫోన్ నెంబర్‌ను ఇచ్చి ఆ బాలుడిని ఆమె ఓదార్చారు. ఈ సందర్భంగా బాలుర గృహంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఆట వస్తువులను ఏర్పాటు చేసేందుకు తక్షణం రెండు లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించడంతో బాలురు హర్షం వ్యక్తం చేశారు. ఈ విధంగానే ఏ సమస్య వున్నా తనతో పంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగానే బాలుర గృహం సూపరింటెండెంట్ పి మధుసూధనరావుకు అక్షింతలు తప్పలేదు. గృహంలో వున్న బాలుర పరిస్థితిని ఎప్పడికపుడు పరిశీలిస్తూ వారిని ఆప్యాయంగా పలకరిస్తుంటే వారిలో మనోవేదన ఉండదని చెప్పారు. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులు, వ్యాధులకు గురై మరణించిన వారి పిల్లలను కూడా చేరదీస్తున్నందున గృహంలో మంచి బోధన అందించి వారికి వృత్తి విద్యలపట్ల కూడా అవగాహన పెంపొందించి జీవితంలో వారి కాళ్లపై వారు నిలబడే విధంగా చూడాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. అవసరమైతే చిన్నారులు అమ్మకావాలని మారాం చేస్తే తన బంగ్లాకు తీసుకురావాలని కూడా కలెక్టర్ చెప్పారు. గృహంలోని బాలుర మానసిక ఉల్లాసం కోసం పర్యాటక కేంద్రాలను కూడా చూపించి తీసుకురావాలని, వారిలో మంచి పరివర్తన వచ్చే విధంగా పాటుపడినప్పుడే తీసుకుంటున్న జీతానికి సార్ధకత వుంటుందని టీచర్లనుద్దేశించి కలెక్టర్ పేర్కొన్నారు.
1
*చిన్నారులను ఓదార్చిన కలెక్టర్*బాలురు హోంకు రూ. 2 లక్షలు మంజూరు
english title:
a
Date:
Thursday, November 15, 2012