Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మూర్తి రాజు బౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

$
0
0

నిడమర్రు, నవంబర్ 14 : విద్యాదాత, గాంధేయ వాది, సర్వోదయ నాయకులు, మాజీ మంత్రి చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు భౌతిక కాయానికి బుధవారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఫత్తేపురం గ్రామంలో ఆయన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర నిర్వహించి అనంతరం అంతిమయాత్రను పెదనిండ్రకొలనులో ఆయన నిర్మించిన గాంధీభవన్‌కు తరలించారు. మూర్తిరాజుకు ఆయన మేనకోడలు భర్త పృధ్విరాజ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. మరణవార్త తెలిసిన వెంటనే సోమవారం అర్ధరాత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం మంత్రి పితాని సత్యనారాయణ, బోళ్ల బుల్లిరామయ్య, పాతపాటి సర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు, కనకరాజు సూరి, గన్ని వీరాంజనేయులు, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు జి జానకిరామరాజు, చెరకువాడ రంగనాధరాజు, సర్వోదయ రాష్ట్ర నాయకులు లవణం, మెంటే పద్మనాభం, గోకరాజు గంగరాజు, మంతెన సత్యనారాయణరాజు, సిపి ఎం జిల్లా కార్యదర్శి రుద్ర సత్యనారాయణరాజు, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ కొక్కిరగడ్డ జయరాజు, యర్రా నారాయణస్వామి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం మూర్తిరాజు అంత్యక్రియల్లో అధికారికంగా పిసిసి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, మంత్రి పితాని సత్యనారాయణ, యర్రా నారాయణస్వామి, పిసిసి మాజీ అధ్యక్షులు కె కేశవరావు, మాగంటి బాబు, కోటగిరి విద్యాధరరావు, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి, వావిలాల మహేశ్వరి, వై ఎస్ ఆర్ సిపి జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, సర్వోదయ రాష్ట్ర నాయకులు సి ఎ ఆచారి, సినీ నటుడు కృష్ణంరాజు, కొండ్రెడ్డి విశ్వనాధంలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సినీ నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ నేను ఇంతటి వాడిని కావడానికి హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదవడానికి ఆర్ధిక సహాయం చేసిన వ్యక్తి మూర్తిరాజన్నారు. ఒక రోజు నువ్వు సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకున్నావు, నువ్వు తెచ్చుకున్న పేరు చాలా గొప్పపేరు, నువ్వు పది మందిని సినిమా రంగంలో నవ్వించడం కాదు, నువ్వు పది మందికి ఉపయోగపడు, రాజకీయాల్లోకి రా నీకు మంచి భవిష్యత్తు వుందని ప్రోత్సహించారని కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ పిసిసి అధ్యక్షులు కె కేశవరావు మాట్లాడుతూ మూర్తిరాజుతో పనిచేయడం అదృష్టమన్నారు. నేను గాంధేయవాదిని, కానీ మూర్తిరాజు అంతటి గాంధేయవాదిని కాదు అన్నారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలి, అందరూ సుఖంగా వుండాలని ఆశించే వ్యక్తి మూర్తిరాజు అని అన్నారు. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. ఇటువంటి నాయకుడిని మరలా చూడలేమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే యర్రా నారాయణస్వామి మాట్లాడుతూ ఎంతోమంది ఈ రోజు ఉన్నతస్థాయిలో వున్నారంటే మూర్తిరాజు చలవేనన్నారు. గాంధీభవనానికి మూర్తి రాజు గాంధీభవన్‌గా మార్పు చేస్తే గాంధీతోపాటు మూర్తిరాజు పేరు చిరకాలం ఉండిపోతుందన్నారు. ఈ గాంధీభవనాన్ని రాష్టప్రతితో ప్రారంభోత్సవం చేయాలని ఎన్నో కలలు కన్నారని, కానీ ఆయన కలలు నెరవేరలేదని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నేనే స్వయంగా చంద్రబాబునాయుడును తీసుకువచ్చి ఆయనతో ప్రారంభోత్సవం చేయించి చిన్న శిలాఫలకాన్ని పెట్టించానన్నారు. మన దేశంలో గాంధీజీ పేరు విదేశాల్లో ఎంతో గొప్పగా చెప్పుకుంటారని, కానీ మన దేశంలో ఆయనపై పెద్దగా ప్రచారం జరగలేదని, కానీ మూర్తిరాజు కొల్లేరు తీర ప్రాంతాల్లో గాంధీజీ పేరును ఎంతో గొప్పగా ప్రచారం చేసి గాంధీ భవనాన్ని నిర్మించారన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య కుమార్తె మహేశ్వరి మాట్లాడుతూ మహిళలు ఈ రోజు విద్యావంతులు కావడం మూర్తిరాజు పెట్టిన బిక్షని, మహిళలు పురుషులతో సమానంగా చదువుకోవాలని ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ మూర్తిరాజు మంచి విద్యాదాత అన్నారు. పేదల కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు.
గూడెంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
ఆందోళ నకారుల రాస్తారోకో
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, నవంబర్ 14: స్థానిక యాగర్లపల్లి ఓవర్ బ్రిడ్జివద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా బుధవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ఆందోళనలో మాలమహానాడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాచు సూర్యారావు, బిఎస్‌పి నాయకుడు సత్యకృష్ణ, దళిత నాయకుడు పాతగొలుసు జయరాజు, మాలమహానాడు నాయకుడు విప్పర్తి ఆనందరావు, కెవిపిఎస్ నాయకుడు నీలం అశోక్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను పట్టుకుంటామని డిఎస్‌పి కె శ్రీనివాసరావు పేర్కొన్నారు. విగ్రహం ధ్వంసం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో ప్రాంతానికి వెళ్ళి ఆందోళనకారులతో చర్చించారు.
విగ్రహం ధ్వంసం చేయటం దారుణం : ఎమ్మెల్యే
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం దారుణమని ఎమ్మెల్యే ఈలి నాని పేర్కొన్నారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆందోళనకారులను శాంతపరిచి విగ్రహం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఆర్డీవో కె నాగేశ్వరరావు ఉన్నారు.
సహకార రంగం బలోపేతానికి కృషి చేయాలి:కలెక్టర్
ఏలూరు, నవంబర్ 14 : సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతులకు పూర్తి ప్రయోజనాలు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణీమోహన్ అన్నారు. స్థానిక డిసిఎంఎస్ కార్యాలయంలో బుధవారం సహకార వారోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ప్రాధమిక సహకార సంస్థల సభ్యులకు పూర్తి స్థాయిలో శిక్షణ అందించి రైతులకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. సహకార ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఖచ్చితంగా ఆడిట్ నిర్వహించడం, ఖాతాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం ఎంతో అవసరమన్నారు. రబీ పంటకు 80 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని వాటి సరఫరాకు ఎపి సీడ్స్, వ్యవసాయ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఈ విత్తనాలను ప్రాధమిక సహకార సంస్థల ద్వారా గరిష్ట స్థాయిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సీజన్‌లో విత్తనాల కొరతను దృష్టిలో ఉంచుకుని కొంత మంది బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే అవకాశాలున్నందున నాణ్యమైన విత్తనాలను మోసాలకు తావులేకుండా ప్రాధమిక సహకార సంస్థల ద్వారా అందించాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది 18 కోట్ల రూపాయల సబ్సిడీతో 50 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఆధునిక పరికరాలను అందించడం జరుగుతున్నదని ఇప్పటికీ నాలుగున్నర కోట్ల రూపాయల సబ్సిడీతో కూడిన ఆధునిక ఉపకరణాలను అందించడం జరిగిందన్నారు. అయితే కొన్ని యంత్రాలు పది లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకూ ధర ఉన్నందున చాలా మంది రైతులు స్ప్రేయర్లు, పది లక్షల లోపు యంత్రాలను తీసుకోవడం జరిగిందన్నారు. ఎక్కువ ధర ఉన్న వ్యవసాయ పరికరాలను వ్యవసాయ ప్రాధమిక సహకార సంస్థల సభ్యులు తీసుకుని ఆ గ్రామాలకు వాటిని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ విషయంలో సంబంధిత కమిటీ తీర్మానం చేసి వ్యవసాయ శాఖ జెడితో సమన్వయం చేసుకుని అవసరమైన యంత్రాలకు ప్రతిపాదనలను వారం రోజుల్లో అందించాలన్నారు. మహిళలు స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడి ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయని ఇవి కూడా గ్రామ మండల సమాఖ్యలు సహకార వ్యవస్థలో రిజిష్టరు అయి ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. ఇతర జిల్లాలతో పోలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో సహకార సంస్థ మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా ఉందన్నారు. ఇందుకు సంబంధిత అధికారులను కలెక్టరు అభినందించారు. అయినప్పటికీ జిల్లాలోని 240 ప్రాధమిక వ్యవసాయ సహకార సంస్థలను పరిశీలించి వాటి బాగోగులను గుర్తించి నివేదిక అందించాలని సహకార సంస్థ అధికారులను కలెక్టరు ఆదేశించారు. డిసి ఎం ఎస్ ఛైర్మర్ గోరింట్ల సీతారామరాజు మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకూ సహకార వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసి ఎం ఎస్ ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు సరసమైన ధరలకు విక్రయించడంతోపాటు టెస్ట్‌బుక్స్, దీపావళి పండుగకు బాణాసంచాలను ప్రజలకు తక్కువ ధరకు అందిస్తున్నామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెంలలో సూపర్ బజార్లు నిర్వహిస్తున్నామన్నారు. తాను ఛైర్మన్‌గా పదవి చేపట్టినప్పుడు నెలకు ఎనిమిది లక్షల రూపాయలు టర్నోవర్ ఉన్న వీటిని ప్రస్తుతం 50 లక్షల రూపాయలకు తీసుకురావడం జరిగిందన్నారు. డిసి ఎం ఎస్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తున్నామన్నారు. జిల్లా సహకార శాఖాధికారి రామ్మోహనరావు మాట్లాడుతూ 2012 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించారన్నారు. తొలుత జాతీయ జెండాను, సహకార పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సహకార రిజిస్ట్రార్ రవికుమార్, డిసి ఎం ఎస్ డి ఎం సత్యనారాయణ, సహకార సూపరింటెండెంట్లు శివనారాయణ, రవికుమార్, సబ్ డివిజినల్ సహకార అధికారులు కె నారాయణస్వామి, పి విజయకుమారి, బి కన్యాకుమారి పాల్గొన్నారు.
విలువలతో కూడిన జీవితం కోసం విద్యన నభ్యసించాలి
ఏలూరు, నవంబర్ 14 : విలువలతో కూడిన జీవితాన్ని గౌరవప్రదంగా సాగించేందుకు బాలబాలికలు విద్యనభ్యసించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ అన్నారు. ఏలూరు రూరల్ మండలం శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర సంక్షేమ గృహంలో బుధవారం నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొని పండిట్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యనభ్యసించాలని దానితోపాటు వృత్తి విద్యను పొందడం ద్వారా జీవితంలో మంచిగా స్థిరపడే అవకాశాలున్నాయన్నారు. విద్యతోపాటు క్రీడలవైపు కూడా మక్కువ పెంచుకోవాలన్నారు. బాలుర సంక్షేమ వసతి గృహంలో ఉన్న గ్రంధాలయానికి పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలతోపాటు నీతి కధలతోకూడిన పుస్తకాలను కూడా అందిస్తామన్నారు. కంప్యూటర్ శిక్షణ అందించేందుకు ఒక ఉపాధ్యాయునితోపాటు మరో రెండు కంప్యూటర్లను, విద్యా విషయాలకు సంబంధించిన సిడిలను అందిస్తామని కలెక్టర్ చెప్పారు. మంచి క్రీడాపరికరాలను, రెండు సోలార్ లైట్లను, మినరల్ వాటర్ ఫ్యూరిఫెయిర్‌ను సంక్షేమ వసతిగృహానికి అందిస్తామని చెప్పారు. బాలల సంక్షేమానికి నిర్ధేశించిన హక్కులను పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. ఎక్కడైనా బాలల హక్కులకు భంగం కలిగితే వాటిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం జాతీయ కమిషన్ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లక్ష్మీ శారద మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో బాలలకు ప్రాధమిక విద్య అందించవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై వుందని అన్నారు. ముఖ్యంగా ప్రాధమిక విద్య పొందే హక్కు పిల్లలకు ఉందని ఆ అవకాశాన్ని బాలలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని 14 సంవత్సరాల లోపు పిల్లలను అపాయకరమైన పనుల్లోకి తీసుకోకూడదన్నారు. బాలలకు ఏ విధమైన సమస్యలు ఎదురైతే వారికి ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందన్నారు. సమావేశంలో జిల్లా బాలల సంక్షేమ శాఖాధికారి సూర్యచక్రవేణి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు డాక్టర్ శర్మ, ప్రభుత్వ బాలుర గృహం సూపరింటెండెంట్ టి మధుసూధనరావు, రిటైర్డు డి ఎంహెచ్ ఓ రాజేశ్వరరావు, హెరాల్డ్‌బాబు, టి ఎన్ స్నేహన్, జి సుబ్బారావు, యు రాజ్‌కుమార్, రామారావు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పశ్చిమగోదావరి ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ముద్రించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ద్వారకాతిరుమలలో కన్నుల పండువగా దీపావళి మహోత్సవం
ద్వారకాతిరుమల, నవంబర్ 14 : శ్రీవారి ఆలయంలో దీపావళి మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. రాత్రి ఉభయదేవేరులతో శ్రీవారిని తొళక్కం వాహనంపై ఉంచి ప్రత్యేక అలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విశేష బాణసంచా మోతల నడుమ శ్రీవారి వాహనం తిరువీధులకు పయనమైంది. తిరువీధులకు వచ్చిన స్వామివారి వాహనం ఎదురుగా గ్రామస్తులు, భక్తులు టపాసులు, మందుగుండు సామాగ్రి కాల్చి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. అత్యంత వేడుకగా జరిగిన ఈ దీపావళి మహోత్సవంలో స్థానికులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
సోమేశ్వరునికి దీపావళి ప్రత్యేక పూజలు
భీమవరం, నవంబరు 14: పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామివార్ల ఆలయంలోని సోమేశ్వరస్వామివారికి దీపావళి సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహారుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకం తదితర పూజాకార్యక్రమాలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
దెందులూరు ఎమ్మెల్యేపై ఎస్సై ఫిర్యాదు
పెదవేగి, నవంబర్ 14 : సమాచారంతో కోడిపందాలు జరుగుతున్నాయని రైడింగ్‌కు వెళితే స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనపై దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించారని పెదవేగి ఎస్సై ఎ ఆనందరెడ్డి తెలిపారు. మంగళవారం దీపావళి పండుగ రోజున ఉదయం 11 గంటల సమయంలో మండలంలోని జగన్నాధపురంలోని విజయగార్డెన్స్‌లో కోడిపందాలు నిర్వహిస్తున్నారని స్థానికుల సమాచారంతో తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లగా ఎమ్మెల్యే, కొంతమంది కోడిపందేలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారని, ఈ లోపు తనను చూసిన ఎమ్మెల్యే దుర్భాషలాడుతూ తోసి తనపై దాడికి దిగారని అంతలోనే మరికొందరు అనుచరులు దాడి చేశారని ఎస్సై తెలిపారు. అదే విధంగా విజయగార్డెన్స్‌లో కాపలాదారునిగా ఉన్న న్యాయంపల్లి గ్రామానికి చెందిన కొమ్మిన సీతారామబ్రహ్మం తన అనుమతి లేకుండా పెదవేగి ఎస్సై, సిబ్బంది తోటలో పచార్లు చేస్తుండగా ఎందుకొచ్చారని అడుగగా మేము పోలీసులమని దుర్బాషలాడుతు దౌర్జన్యానికి దిగారని పెదవేగి ఎస్సై పై ఫిర్యాదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ బి సత్యనారాయణ తెలిపారు.
రూరల్ సిఐ వివరణ
మంగళవారం కోడిపందేలు జరుగుతుతున్నాయనే సమాచారంతో రైడింగ్‌కు వెళ్లిన ఎస్సై, ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరుగుతున్న సమాచారం అందడంతో ఏలూరు డి ఎస్‌పి రజని, సిఐలు ముగ్గురు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి పరిస్థితిని అదుపులోనికి తెచ్చి ఇరువురు ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని, దీనిపై త్వరలో విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామని సి ఐ సుధాకర్ తెలిపారు.

విద్యాదాత, గాంధేయ వాది, సర్వోదయ నాయకులు, మాజీ మంత్రి చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>