Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళల సహా ముగ్గురి దుర్మరణం

$
0
0

పాల్వంచ, నవంబర్ 14: జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వళితే దీపావళి పండుగ రోజున రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన ఆయా కుటుంబాలలో విషాదాన్ని నింపింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోనియానగర్‌లో నివాసం ఉంటూ డ్రైవర్ ఉద్యోగం చేసుకుని జీవనం గడుపుతున్న జువ్వాల వెంకటనారాయణ, లోకిరెడ్డి మహేష్ రెడ్డి తమ భార్యలు జువ్వాల గీత, లోకిరెడ్డి చైతన్యతో కలిసి పాల్వంచకు వచ్చి సినిమా చూసి తిరిగి టాటా మ్యాజిక్ ఆటోలో సోనియా నగర్‌కు వెళ్తున్నారు. మార్గం మధ్యలో నవభారత్ ప్రాంతంలో ఆటో ఆదుపుతప్పి మూలమలుపులో ఉన్న కల్వర్టును ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జువ్వాల గీత(22), లోకిరెడ్డి చైతన్య(22) అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ శేగడపు కిషోర్‌తో పాటు వెంకట్‌రెడ్డి, మహేష్‌రెడ్డిలకు గాయాలయ్యాయి. పాల్వంచ పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుండాల గ్రామంలో..
భద్రాచలం రూరల్: మండల పరిధిలోని గుండాల గ్రామం వద్ద బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పి వెంకటేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనా ప్రాంతంలో తీవ్ర రక్తస్రావం కావడంతో బలమైన గాయాలే తగినట్లు తెలుస్తోంది.

గ్రానైట్ సంప్‌లో పడి
కార్మికుడి మృతి
ముదిగొండ, నవంబర్ 14: మండల కేంద్రమైన ముదిగొండలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ సంప్‌లో పడి గ్రానైట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా భైరమ్‌పూర్ గ్రామానికి చెందిన రాథోడు సీటు (20) ముదిగొండలోని పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీశ్రీ సాయి బాలాజీ గ్రానైట్ ఫ్యాక్టరీలో పాలిష్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుఝామున మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన సీటు నిద్రమత్తులో ఫ్యాక్టరీ ఆవరణలోని సంప్‌లో పడి మృతి చెందాడు. మృతదేహానికి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రానైట్ ఫ్యాక్టరీ యజమాని చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ముదిగొండ ఎస్‌ఐ సర్వయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నర్సరీల్లో అక్రమాలు
కొణిజర్ల, నవంబర్ 14: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ వన నర్సరీల్లో అవినీతి చోటుచేసుకుంది. 1.7.2011 నుంచి 31.8.2012 వరకు జాతీయ ఉపాథి హామీ పథకం కింద మండలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులలో సామాజిక తనిఖీ జరిగింది. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఓపెన్ ఫోరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో తనిఖీ నిర్వహించిన జిల్లా రిసోర్స్ పర్సన్స్ నివేధికలను సభ ముందుంచారు. పలు పంచాయతీలలో కొలతలలో తేడాలున్నట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. కొన్ని చోట్ల ఫ్రీ మెజర్‌మెంట్స్ చేయకుండానే వేతనాలు చెల్లించారు. మరికొన్ని చోట్ల పూర్తి చేసిన పనులకు సంభందించి ఎంబి రికార్డ్స్ అడిగినా టెక్నికల్ అసిస్టెంట్లు ఇవ్వలేదని తనిఖీ బృందాలు అధికారులకు పిర్యాదు చేశాయి. కొండవనమాలలో సంబంధం లేని వ్యక్తికి ఫించన్ ఇస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. పల్లిపాడు, పెద్ద మునగాలలో జాతీయ ఉపాథి హామీ పథకం కింద చేపట్టిన వన నర్సరీలలో అక్రమాలు వెలుగు చూశాయి. దేవళ్ళ
రమాదేవి 40 రోజులు పని చేసినట్లు ఎంబి రికార్డుల్లో నమోదు చేశారు. దీనికి గాను 5,600 రూపాయలు చెల్లించారు. తనిఖీ బృదం ఆమెను విచారించగా రెండు రోజులు మాత్రమే పనికి వెళ్ళానని అవికూడ తనకు ఇంకా డబ్బులు ఇవ్వలేదని తనిఖీ బృందానికి తెలిపింది. అదేవిధంగా లక్షా 53వేల మొక్కలు పెంచినట్లు రికార్డులో నమోదు కాగా వాస్తవానికి 20 వేల మొక్కలే పెంచినట్లు తనిఖీలో వెల్లడైంది. లక్షా 33 వేల మొక్కల విషయమై సంబంధిత నర్సరీ అధికారులను తనిఖీ బృందం వివరణ కోరగా రైతులకు పంపిణీ చేశామని చెప్పారని వాటికి సంబంధించిన ఎటువంటి రికార్డులు లేవన్నారు. రెండు నర్సరీలో సుమారు 2.35లక్షలు అవకతవకలు జరిగినట్లు నివేధికల ఆధారంగా అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా డ్వామా పిడి శ్రీనివాస్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇస్తామన్నారు. అనంతరం చట్ట పరంగా ఆర్‌ఆర్ యక్ట్ కింది నిధులను రికవరీకి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా అంబుడ్స్‌మెన్ శేషగిరిరావు, జిల్లా విజిలెన్స్ అధికారి రమేష్‌బాబు, స్టేట్ రిసోర్స్ పర్సన్ జమీర్, ఎపిడి దేవదాసు, ఎంపిడివో రాజేశ్వరీ, ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఎపివో అప్పారావు, పిఆర్, హౌజింగ్ ఏఇలు కృష్ణారెడ్డి, శోభన్‌కుమార్ స్మాట్‌కార్డ్ కోఆర్డినేటర్ పవన్‌లు పాల్గొన్నారు.
రేపు డిఆర్‌సి సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, నవంబర్ 14: జిల్లా సమీక్ష సమావేశం (డిఆర్‌సి) ఈ నెల 16వ తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనున్నది. గత నెల రోజుల్లో రెండుసార్లు వాయిదా పడిన ఈ సమావేశం ఈ సారి మాత్రం ఖచ్ఛితంగా జరిగే అవకాశం ఉంది. గతేడాది జూన్ 30వ తేదీన జరిగిన సమావేశం ఇంత వరకు జరగలేదు. సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈ సమావేశం జరగాల్సి ఉండగా, ఏడాదిన్నర అయిన జరగకపోవటం పట్ల ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఆర్‌సి ఏర్పాటు చేయాలంటూ సిపిఐ, తెలుగుదేశంపార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు పలుమార్లు అధికారులకు వినతిపత్రాలుకూడా అందించారు. ఈ క్రమంలో గత నెల 22వ తేదీన డిఆర్‌సి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినా ఆ రోజు దుర్గాష్టమి కావటం, ఉద్యోగ సంఘాలు కూడా డిఆర్‌సిని వాయి వేయాలని కోరిన నేపథ్యంలో ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే అనుకోకుండా నీలం తుఫాన్ రావటం, తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నష్టం జరిగిన నేపథ్యంలో నష్టాన్ని పరిశీలించేందుకు అదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు రావటంతో మరో సారి వాయిదా పడింది. దీంతో ఈ ఏడాది డిఆర్‌సి ముహూర్తం సరిగా లేదనే వ్యంగ్యాస్త్రాలు వచ్చాయి. ప్రభుత్వానికి కూడా సమావేశం నిర్వహించాలనే చిత్తశుద్ధి లేదని, దానికి తోడు అవాంతరాలు ఎదురవుతున్నాయని ప్రతిపక్షపార్టీల నాయకులు ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన డిఆర్‌సి జరగనున్నది. ఈ సమావేశంలో జిల్లాలోని పలుప్రధానమైన సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ఇందుకోసం ఎవరికి వారు కసరత్తు కూడా ప్రారంభించారు. ఈ సారి ఏ కారణం చేతైన సమావేశం వాయిదా పడితే మాత్రం ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి ఈ సారి ఖచ్ఛితంగా నిర్వహించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించటం గమనార్హం.

10 లక్షల విలువ చేసే
గంజాయి స్వాధీనం
వైరా, నవంబర్ 14: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. బుధవారం స్థానిక రింగ్‌రోడ్డులో వైరా డిఎస్పీ మోకా సత్తిబాబు ఆధ్వర్యంలో కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించేందుకు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలో భాగంగా కార్లను తనిఖీ చేస్తున్న తరుణంలో ఒరిస్సా నుంచి మహారాష్ట్ర వైపు తరలిస్తున్న టాటా సఫారీ వాహనంలో 10లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా ఈ గంజాయిని పోలీసులు పట్టుకోగలిగారు. ఒక వేళ బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించే చట్టం అమల్లోకి రాకపోతే ఇటువంటి గంజాయి ఎన్ని క్వింటాళ్ళు ప్రభుత్వం కళ్ళు కప్పి నిందితులు అక్రమ రవాణా చేసేవారోనని పోలీసులు భావిస్తున్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వైరా, కొణిజర్ల ఎస్‌ఐలు గోపి, కరుణాకర్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
తెలుగుభాషను పరిరక్షించుకునేందుకు
కృషి చేయాలి
* ఇన్‌చార్జి కలెక్టర్ ఎంఎం నాయక్
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, నవంబర్ 14: తెలుగుభాషను పరిరక్షించుకునేందుకు గ్రామస్థాయి నుంచి కృషి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఎంఎం నాయక్ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులు, జిల్లా సాంస్కృతిక మండలి సభ్యులతో బుధవారం తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో చర్చించారు. తెలుగుభాషకు విశిష్ట సేవలందించిన వ్యక్తులను గుర్తించాలన్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో తెలుగుమహాసభల ప్రాధాన్యతపై వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 19న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రార్థన సమయంలో డిసెంబర్ 27,28,29వ తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రాధాన్యతను విద్యార్థులకుర వివరించాలని, ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులకు సూచించారు. ఈ నెల 19నుంచి 29వ తేదీ వరకు పాఠశాలల్లో జరిగే ప్రార్థన సమయాల్లో విద్యార్థులచే ఒక ప్రముఖ తెలుగు కవి రచించిన పద్యంతో పాటు దాని తాత్పర్యాన్ని చెప్పించాలన్నారు. డివిజన్ స్థాయిలో ర్యాలీలు, సదస్సులు జరపాలన్నారు. ఇంటింటికి తెలుగు మహాసభల ప్రచార కరపత్రాలు, స్టిక్కర్లు, పోస్టర్లు చేర్చేందుకు ఎంఇఓలు, తహశీల్దార్లను సంయుక్తంగా బాధ్యతతో తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డిఆర్వో జయచందర్, డిఇఓ వెంకటరెడ్డి, డిపిఆర్వో వై వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక శాఖాధికారి సుమన్ చక్రవర్తి, డిప్యూటీ డిఇఓ వెంకటనర్సమ్మ, జిల్లా సాంస్కృతిక మండలి సభ్యులు నాగబత్తిన రవి, హెచ్‌విఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాపోటీల్లో బాహాబాహి
గార్ల, నవంబర్ 14: మండల పరిధిలోని గోపాలపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన పివైఎల్ మండల స్థాయి క్రీడాపోటీల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొని గోపాలపురం గ్రామంలో పోలీస్ పహారాలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మంగళవారం ప్రారంభించిన క్రీడాపోటీల సందర్భంగా న్యూడెమోక్రసీ, సిపిఎం సై అంటే సై అని కాలు దువ్వటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా బుధవారం పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. క్రీడా పోటీల్లో భాగంగా గోపాలపురంలో బాలాజీపేట జట్ల మధ్య కబడ్డీ పోటీ జరుగుతున్న క్రమంలో బాలాజీతండా జట్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని గోపాలపురం జట్టు ఆరోపిస్తూ బాహాబాహీకి దిగగా పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో గార్ల ఎస్‌ఐ జె వసంత్‌కుమార్ పోలీస్ బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని కొంత మేరకు అదుపులోకి తీసుకొని రాగా బుధవారం తిరిగి పునరావృతమైంది. దీంతో ఇల్లెందు రూరల్ సిఐ సాయిబాబా పర్యవేక్షణలో గార్ల, బయ్యారం ఎస్‌ఐలు వసంత్‌కుమార్, శ్రీనివాస్ గట్టు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా పరస్పరదాడులకు పూనుకున్న న్యూడెమోక్రసీ, సిపిఎం పార్టీ కార్యకర్తలు వేర్వేరుగా గార్లలో ప్రదర్శన, నెహ్రూ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. పోటాపోటీగా ప్రదర్శనలు, రాస్తారోకోలు చేయటంతో వాహనాల రాకపోకలకు రెండు గంటల పాటు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా పరస్పర దాడులకు పాల్పడి గ్రామంలో విచ్ఛిన్నకర వాతావరణం సృష్టించిన 30మందిపైగా బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వసంత్‌కుమార్ తెలిపారు.

అగ్ని ప్రమాదంలో లక్ష ఆస్తి నష్టం
ఖానాపురం హవేలి, నవంబర్ 14: ఖమ్మం అర్బన్ మండల పరిధిలోని కొర్లబోడుతండాలో రెండు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మంగళవారం అర్థరాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బాణోతు బీమా, బాణోతు లక్ష్మిలకు చెందిన ఇళ్ళల్లో నుంచి మంటలు రావటంతో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేసేలోగా జరగాల్సిన నష్టం పూర్తిస్థాయిలో జరిగిందన్నారు. బీమా ఇంట్లో ఉన్న సుమారు 7 క్వింటాళ్ల పత్తితో ఇంట్లోని క్వింటా బియ్యం, దుస్తులు, టివి తదితర వస్తువులు కాలిపోయాయి. బీమాకు ఒక కుమార్తె, ఇద్దరు కుమార్తెలున్నారు. తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో రెండు ఎకరాల్లో పత్తి వేయగా తీసిన పంట దగ్ధమైందని, మిర్చి తోట ఇటీవల వర్షాలకు తీవ్రస్థాయిలో నష్టం చేకూర్చుందని, తనను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరారు. రెండు ఇళ్ళల్లో కలిపి సుమారు లక్ష రూపాయల వరకు నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన విఆర్వో
బుధవారం రాత్రి ఇళ్ళు దగ్ధమైన విషయాన్ని తెలుసుకున్న విఆర్వో ఖాసీం జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించి, ప్రభుత్వ పరంగా వచ్చే పరిహారాన్ని అందేలా చూస్తానన్నారు.

లొంగిపోయే నక్సలైట్లకు పూర్తి రక్షణ:డిఐజి
ఇల్లెందు, నవంబర్ 14: అజ్ఞాతంలో బతుకు సాగిస్తున్న నక్సలైట్లు జీనజీవనస్రవంతిలో కలిస్తే వారికి అన్ని రకాల రక్షణకల్పించటంతో పాటు ప్రభుత్వపరంగా ఆర్థిక సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తామని వరంగల్ రేంజ్ డిఐజి విక్రమ్‌సింగ్ మాన్ అన్నారు. బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రాత్రి ఇల్లెందు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ సిబ్బందితో కొద్దిసేపు మాట్లాడటంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో అనుసరించాల్ని విధి, విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ నక్సల్స్ కార్యకలాపాలను ప్రతిఘటించేందుకు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. నక్సలైట్ల బెదిరింపులకు భయపడాల్సింది లేదని, ఎలాంటి బెదిరింపులు లేఖలు వచ్చినా పోలీసులను సంప్రదించాలని డిఐజి సూచించారు. భార్య, బిడ్డలకుదూరంగా ఉండి అజ్ఞాతంలో ఉండి సాధించేది ఏమి లేదని, జనంలో కలవాలని నక్సలైట్లకు డిఐజి సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్, పోలీస్ క్వార్టర్ల నిర్మాణాలకు సంబంధించి అవసరమైన నిధుల విషయంలో జిల్లా ఎస్పీతో మాట్లాడి త్వరలో కార్యచరణ చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతలపరిరక్షణకు తోడ్పాటునందించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డిఎస్పీ సత్తిబాబు, సిఐ రవీంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

టిడిపి జిల్లా అధ్యక్షునిగా కొండబాల?
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, నవంబర్ 14: తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు నియమితులు కానున్నారు. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం గత నాలుగేళ్ళుగా కమిటీ లేకుండా ఉన్న జిల్లా పార్టీకి నూతన కమిటీని ఏర్పాటు చేసేందుకు అధినాయకత్వం నిర్ణయించింది. జిల్లా అధ్యక్షుడితో పాటు నియోజకవర్గ కన్వీనర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. పాలేరు నియోజకవర్గానికి మద్దినేని స్వర్ణకుమారి, భద్రాచలంకు ఫణికుమారి, అశ్వారావుపేటకు తాటి వెంకటేశ్వర్లును ఇప్పటికే ఖరారు చేయగా, వైరాకు మాత్రం పోట్ల నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందులలో పార్టీ ఎమ్మెల్యేలే నియోజకవర్గ బాధ్యతలను కూడా చూస్తారు.అయితే జిల్లా అధ్యక్షుడి విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరటం లేదు.
ముందుగా ప్రస్తుత జిల్లా కన్వీనర్, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షుడిగా నియమితులవుతున్నట్లు ప్రచారం జరిగినా ఆయన చంద్రబాబు ఎదుటనే సున్నితంగా ఆ పదవిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో బాలసాని లక్ష్మి నారాయణ, కొండబాల కోటేశ్వరరావుల పేర్లు తెరపైకి రాగా, కొండబాలను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కొండబాలను పార్టీ అధ్యక్షుడిగా నియమించవద్దంటూ అదే తరహాలో బాబుకు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. తుమ్మల నాగేశ్వరరావునే నియమించాలని, లేనిపక్షంలో ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకైనా ఇవ్వాలంటూ పలువురు నేతలు ఇప్పటికే అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఈ క్రమంలో తుమ్మల నాగేశ్వరరావు ఉంటే పార్టీకి విజయ అవకాశాలు దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయని వారు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలం వరకు ఎంపి నామ నాగేశ్వరరావు వర్గంలో ఉన్న కొండబాల ఒక్క సారిగా తుమ్మల నాగేశ్వరరావు వర్గంలోకి మారినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఇటీవల కాలం వరకు విభేధాలతో వర్గాలను నడిపిన తుమ్మల,నామాలు ఏకమై పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటుండటం, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతుండటం విశేషం. అయితే జిల్లాలో పార్టీకి ప్రధాన నాయకులుగా ఉన్న నామ నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావులు ఇరువురు కలిసి ఉంటే గెలుపు సులభమవుతుందని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో కొండబాల కోటేశ్వరరావుకు జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వటం పట్ల తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

దుర్మరణం
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>