Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఈనెలాఖరు నాటికి పంట నష్టం అంచనాలు

$
0
0

ఒంగోలు, నవంబర్ 14: నీలం తుపాను నష్టం అంచనాలు ఈనెలాఖరు నాటికి జిల్లా యంత్రాంగం పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు జిల్లాలోని పలు మండలాల్లో సంయుక్తంగా నష్టం అంచనాలను తయారుచేసే పనిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 4,284 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదిక రూపొందించి ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అదేవిధంగా వరి, మొక్కజొన్న, మినుము, శనగ, పొగాకు, పత్తి పంటలు 37,140 హెక్టార్లలో నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. కాగా ఆ నష్టం అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా భారీ వర్షాలతో వరి పంట మునిగిపోవటంతో కొంతమేర కుళ్ళిపోయింది. వేరుశనగ పంట కూడా ఇమకబారి కొన్ని ప్రాంతాల్లో కుళ్ళిపోయింది. ఉన్న కొద్దిపాటి పంటను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఎరువులు, పురుగుమందులు, జిప్సం వంటి వాటిని వేస్తున్నారు. కాగా నీలం తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం త్వరలోనే పర్యిటిస్తుందని అందువల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లను తీసే పనిలో నిమగ్నమయ్యారు. కేంద్ర బృందం వచ్చేనాటికి నష్టపోయిన ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. దీంతో బృందం సభ్యులు కేవలం ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లపైనే ఆధారపడి నష్టం అంచనాలు వేసే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఏ విపత్తు జరిగినప్పటికీ కేంద్ర బృందం అంతా అయిపోయిన తరువాత పర్యటించటం ఆనవాయితీగా వస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉండగా నీలం తుపాను బాధిత ప్రాంతాల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు పర్యటించారు. బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాల ఆదుకోవాలని ఆయా రాజకీయపక్షాలకు చెందిన నాయకులు డిమాండ్ చేశారు. కాగా జిల్లా అంతటా భారీగా వర్షాలు కురవటంతో వాగులు, వంకలు, చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ప్రధానంగా జిల్లాలో వరి పంటను విస్తారంగా రైతులు సాగు చేస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరి పంట సాగుకు అనుకూలిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. మొత్తంమీద ఈనెలాఖరు నాటికి పంట నష్టం అంచనాల నివేదిక పూర్తిస్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం.

పర్చూరులో ఐటి దాడులు
బెంబేలెత్తిన వ్యాపారులు
పర్చూరు, నవంబర్ 14: మండల కేంద్రమైన పర్చూరులో బుధవారం చీరాల రోడ్డులోని ఓ ఫెర్టిలైజర్ షాపులో ఆదాయ పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు. దీంతో వ్యాపారులు బెంబేలెత్తి షాపులను మూసివేశారు. కాగా ఫెర్టిలైజర్ షాపు యజమాని ఇంటిలో సోదాలు, షాపులో రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ దాడులలో హైదరాబాద్, విజయవాడకు చెందిన ఐటి అధికారులు పాల్గొన్నారు.

282 మంచినీటి పథకాలకు 92కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులు
కందుకూరు, నవంబర్ 14: జిల్లా వ్యాప్తంగా 92కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులతో 282 మంచినీటి పథకాల నిర్మాణ పనులు జరుగుతున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. బుధవారం లింగసముద్రం మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో 24.46లక్షల ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన మంచినీటి ట్యాంకును మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతోందని, అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రపంచ బ్యాంకు నిధులతో మంచినీటి ట్యాంకులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 250 ట్యాంకుల నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నాయని, నియోజకవర్గంలో ఎనిమిది మంచినీటి ట్యాంకుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గుడ్లూరు మండలం మంచినీటి పథకానికి 15కోట్లు, ఉలవపాడు 12కోట్లు నిధులు ప్రభుత్వం కేటాయించిందని ఆయన తెలిపారు. భూగర్బ జలాల పెంపుదలకు రాష్ట్ర వ్యాప్తంగా మెగా వాటర్ షెడ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఐదు వాటర్‌షెడ్లు నిర్మాణానికి అనుమతులు లభించిందని, ఒక్కొక్క వాటర్ షెడ్ నిర్మాణానికి 5కోట్లు నిధులను ప్రభుత్వం కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. రాళ్ళపాడు ఆధునికీకరణ పనులు అధికారుల పర్యవేక్షణలో వేగవంతంగా జరుగుతున్నాయని తెలపారు. స్థానిక రైతులు రాళ్ళపాడు లోతట్టు ప్రాంతం నుండి మట్టి తోలకానికి అనుమతులు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి సమీపంలో ఉన్న ఆర్‌డిఓను క్రమబద్దీకరించి రైతులకు మట్టితోలకానికి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఆర్‌డిఓ టి బాపిరెడ్డి మాట్లాడుతూ లింగసముద్రం మండలంలో ప్రభుత్వ అస్సైన్డ్‌మెంట్ భూములను సాగు చేస్తున్న ఎస్సీ, బిసి రైతులను గుర్తించామని, ఈనెల 26న జరిగే అస్సైన్డ్‌మెంట్ కమిటీ సమావేశంలో వారికి డికె పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ ఆర్‌ఎంఆర్ దయాళ్, ఇఇ సాంబశివరావు, మండల పరిషత్ ప్రత్యేక అధికారి రాజేంద్ర, తహశీల్దార్ ప్రభాకరరావు, ఎంపిడిఓ గురునాథం, కాంగ్రెస్‌పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, శ్రీను, వెంకటేశ్వర్లు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

సిసి రోడ్డు, వంతెన ప్రారంభించిన మంత్రి
కందుకూరు, నవంబర్ 14: మండల పరిధిలోని మాచవరం గ్రామ సమీపంలో గుడ్లూరు-కందుకూరు రహదారిలో 2.16కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన వంతెనను, పట్టణ పరిధిలోని 30వ వార్డులో 1.10కోట్ల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా సిసి రోడ్డు సమీపంలో ఉన్న ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళల అభివృద్ధితోనే సమాజాభివృద్ధి అని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా గ్రూపుల ద్వారా మహిళలకు వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు అందిస్తోందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకొని మహిళలు అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. పేద ప్రజల సౌకర్యార్థం మహిళా గ్రూపుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్ర్తిశ్రమక్తి భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. ఈభవనాలలో పేదల వివాహ, ఇతర శుభకార్యాలను నిర్వహించుకోవచ్చని దీనిపై అధికారుల పెత్తనం ఏమాత్రం ఉండదని అన్నారు. ఈ భవనాల పరిధిలో ఉన్న మహిళాగ్రూపుల లీడర్లే ఈభవనాలను పర్యవేక్షిస్తుంటారని అయన తెలిపారు. అదేవిధంగా 100కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్‌ఎస్ ట్యాంకు నుండి వస్తున్న నీటికోసం ప్రజలు కుళాయి కనెక్షన్లు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం మహిళా గ్రూపులకు మంజూరైన 32లక్షల నగదు చెక్కులను ఆయా గ్రూపు మహిళలకు మంత్రి పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆర్‌డిఓ టి బాపిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఫల్గుణకుమారు, తహశీల్దార్ శ్యాంబాబు, ప్రజా ఆరోగ్యశాఖ డిఇ రహంతుజానీ, మెప్మా స్థానిక కోఆర్డినేటర్ జయకుమార్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు తోకల కొండయ్య, దారం మాల్యాద్రి, దారం కోటేశ్వరరావు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
ఒంగోలు అర్బన్, నవంబర్ 14: నెహ్రూ యువకేంద్ర ఫౌండేషన్ డే సందర్భంగా జిల్లా కార్యాలయంలో బుధవారం జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి జిల్లా నెహ్రూ యువకేంద్ర కో ఆర్డినేటర్ ఎన్ చంద్రమోహన్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని యువతను అభివృద్ధిపథంలో నడిపేందుకు నెహ్రూ యువకేంద్రం ఎంతో తోడ్పాటు అందిస్తోందన్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాలలోని యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామానికి తద్వారా దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. సమైఖ్య భావాలను దేశం అంతటా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యవకేంద్ర అకౌంటెంట్ బి శేషగిరిరావు, ఎన్‌వైసిలు అన్నంగి వెంకట్రావు, ఎన్ కృష్ణంరాజు, యు మాధవి, వై మహాలక్ష్మి, ఇ కిరణ్, శివకుమార్‌రెడి, ఇ ప్రభుదాస్, డి సురేంద్రం, ఎం చంద్రబాబు, సిహెచ్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

దొంగ ఓటర్లను తొలగించాలి
ఆర్‌డిఓకు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
ఒంగోలు అర్బన్, నవంబర్ 14: నగరంలో దొంగ ఓటర్లు, చనిపోయిన ఓటర్లను జాబితాల నుండి వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఒంగోలు ఆర్‌డిఓ ఎంఎస్ మురళిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జడా బాల నాగేంద్రయాదశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ ఓటర్లు, చనిపోయిన ఓటర్ల వివరాలను ఆర్‌డిఓకి అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఇప్పటికే 13 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. నగరంలో ఇంటి డోర్ నెంబర్లు సక్రమంగా లేవన్నారు. డోర్ నెంబర్లు వేసిన తరువాతనే ఓటర్ల జాబితా తయారుచేసి ప్రకటించాలని డిమాండ్ చేశారు. తద్వారా దొంగ ఓటర్లు, చనిపోయిన ఓటర్ల జాతకాలు బయటపడతాయన్నారు. ఒకే డోర్ నెంబర్‌లో ఉన్న కుటుంబ సభ్యులను వేరువేరుగా చేశారన్నారు. ఒక ఇంటిలో నలుగురు ఓటర్లు ఉండగా ఒకరు 1వ నెంబర్‌లో ఉంటే మిగతావారు వేరొక బూత్‌లలో ఉన్నారని వివరించారు. నగరంలోని చుట్టుపక్కల గ్రామాలలోని ఓటర్లను కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పథకం ప్రకారం డోర్ నెంబర్లు సక్రమంగా లేని ఇళ్ళల్లో ఓట్లు చేర్పించారని ఫిర్యాదు చేశారు. వరుస క్రమంలో ఇంటి డోర్ నెంబర్లు, ఇంటిలోని కుటుంబ సభ్యులను సరిదిద్దాలని కోరారు. ప్రతి బూత్‌లో దాదాపు 150 నుండి 200లకు పైగా బోగస్ ఓటర్లు ఉన్నారన్నారు. ఈ విషయాలను పరిశీలించి దొంగ ఓటర్లను జాబితాల నుండి తొలగించాలని కోరారు. ఈ విషయలపై స్పందించిన ఒంగోలు ఆర్‌డిఓ మురళి మాట్లాడుతూ క్షుణ్ణంగా అన్ని విషయాలను పరిశీలించి దొంగ ఓట్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పిసిసి సంయుక్త కార్యదర్శి అయినాబత్తిన ఘనశ్యాం, అద్దంకి మాజీ శాసనసభ్యుడు జాగర్లమూడి రాఘవరావు, ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, సూపర్‌బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, ఒంగోలు పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్‌కె కరీముల్లా, కాంగ్రెస్‌పార్టీ ఒంగోలు నగర మహిళా అధ్యక్షురాలు చెరుకూరి ఆదిలక్ష్మి, నాయకులు ఎండి ఆయూబ్, పసుపులేటి శ్రీనివాసరావు, జ్వాలాపతి, గాదె లక్ష్మారెడ్డి, పి దీపక్‌రెడ్డి, పర్రే నవీన్‌రాయ్, మహిళా నాయకులు చెంగలశెట్టి కుసుమకుమారి, సుబ్బరత్నం తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధం
* సిలిండర్ పేలి ఒకరికి తీవ్రగాయాలు
* రూ.3 లక్షల ఆస్తినష్టం
మార్కాపురంరూరల్, నవంబర్ 14: దీపావళి పండుగ మార్కాపురం పట్టణంలో మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. స్థానిక నాగులవరం రోడ్డులో ఓ సినిమా థియేటర్ పక్కన నివాసం ఉంటున్న మూడు కుటుంబాలవారు వీధిన పడ్డారు. మంగళవారం రాత్రి ఆ ప్రాంతంలో టపాసులు కాల్చారు. ప్రమాదవశాత్తు పాణ్యం లింగమ్మ పూరిగుడిసెపై తారాజువ్వల నిప్పులు పడ్డాయి. అర్ధరాత్రి 12గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో ఇంట్లో ఉన్న 50వేల రూపాయల నగదు, 50వేల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇతరత్రా సామాగి కాలి బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఉప్పులదినె్న నాగేశ్వరరావు ఇంటికి కూడా మంటలు అంటుకొని ఇంట్లో ఉన్న 5వేల రూపాయల నగదు, ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. పక్కనే ఉన్న బజినేపల్లి వెంకటసుబ్బయ్య ఇల్లు కూడా దగ్ధమైంది. ఇదేసమయంలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వెంకటసుబ్బయ్య కాళ్ళకు తీవ్రగాయాలు కావడంతో గుంటూరుకు తరలించారు. మార్కాపురం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం ఉదయం పార్టీ నాయకులతో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి ఓదార్చారు. ప్రభుత్వపరంగా వచ్చే సాయంతోపాటు తనవంతు సాయం కూడా అందిస్తానని ప్రకటించారు.

గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి
* ఎమ్మెల్యే కందుల
మార్కాపురంరూరల్, నవంబర్ 14: గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు దాతలు కూడా తమవంతు సహకారం అందించాలని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సూచించారు. బుధవారం మార్కాపురంలో 45వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రంథాలయంలో జాతీయజెండాను ఎగురవేశారు. యువత చదువుతోపాటు పుస్తకపఠనం కూడా అవసరమని, గ్రంథాలయాలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రంథపాలకుడు సజ్జా మధుసూదన్‌రావు మాట్లాడుతూ వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను శాఖాగ్రంథాలయంలో యువతకు ఉంచామని, వాటిద్వారా మంచి ఉద్యోగాలు పొందాలని కోరారు. బుధవారం జవహర్‌లాల్‌నెహ్రూ చిత్రపటాన్ని గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ప్రాథమిక పాఠశాలస్థాయి విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. కాగా గురువారం పుస్తక ప్రదర్శనను గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో సిబ్బంది వెంకటేశ్వరరెడ్డి, అక్బర్ పాల్గొన్నారు.

తుపాను బాధితులను ఆదుకోవాలి
సిపిఎం నేత పాటూరి రామయ్య డిమాండ్
ఒంగోలు, నవంబర్ 14: ఇటీవల సంభవించిన నీలం తుపానుకు నష్టపోయిన రైతులను, బాధిత ప్రజలను ఆదుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరి రామయ్య డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సుందరయ్య భవన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు నాగబోయిన రంగారావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన పాటూరి రామయ్య మాట్లాడుతూ ఈనెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో లక్ష ఎకరాలలో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. 50 వేల ఎకరాలలో పత్తి పంట దెబ్బతినగా 11 వేల ఎకరాలలో మిర్చి, 14 వేల ఎకరాలలో వరి, 8 వేల ఎకరాలలో మినుము, 8 వేల ఎకరాలలో మొక్కజొన్నతోపాటు ఇంకా పలు పంటలు దెబ్బతిన్నట్లు ఆయన తెలియజేశారు. 150 కోట్ల రూపాయలకు పైగా పంట నష్టం జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాలు లేక పంటలు వేయలేదని తెలిపారు. గత సంవత్సరం రైతులు పండించిన పంటలకు ధరలు లేక నష్టపోయినట్లు తెలిపారు. అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి వేసిన పంటలు నీలం తుఫాన్ కారణంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. నష్టపోయిన పంటలను వెంటనే ఎన్యూమరేషన్ చేసి పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు. ఎకరాకు 10 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, ఎండోమెంట్ కౌలు రద్దు చేయాలని, ముందుగా కౌలు వసూలు చేసిన భూయజమానులు పునరాలోచించి కౌలు తగ్గించాలని కోరారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు ఇందిరా ఆవాస్ కింద తిరిగి ఇళ్ళు కట్టించాలని, చేనేత కార్మికులకు, మత్స్యకార్మికులకు ఆర్థిక సహకారం అందించాలని, పునరావాస కేంద్రాలకు తరలించిన బాధితులకు తక్షణం ఆహారం అందించేందుకు తగిన నిధులు కేటాయించాలని రామయ్య డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు వై సిద్ధయ్య, జిల్లా కార్యదర్శి జాలా అంజయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పరాజు కోటయ్య, జివి కొండారెడ్డి, ఎస్‌డి హనీఫ్, ఎన్ ప్రభుదాసు, పూనాటి ఆంజనేయులు, ఎస్‌కె మాబు, అన్ని డివిజన్ల కార్యదర్శులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాలు నివారించాలి
కలెక్టర్ అనితా రాజేంద్ర సూచన
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, నవంబర్ 14: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర సూచించారు. బుధవారం సిపిఓ కాన్ఫరెన్స్‌హాలులో జరిగిన సమావేశంలో రోడ్డు భద్రతపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. గతంతో పోల్చుకుంటే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు కొంతవరకు తగ్గినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా రోడ్ల నిర్వహణ సరిగా లేనందున, మద్యం సేవించి వాహనాలు నడపడంవల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. రోడ్ల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయాశాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోడ్ల మధ్యలో గుంతలు పడితే వదిలి వేయకుండా వెంటనే మరమ్మతులు చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గింవచ్చన్నారు. ఒంగోలు - చీమకుర్తి రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఒంగోలు నుండి చీమకుర్తి వరకు రహదారిని నాలుగు లైన్‌లుగా విస్తరించడానికి చర్యలు తీసుకోవాలని రోడ్ల భవనాల శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పుల్లలచెరువు, యర్రగొండపాలెం మండలాలలో బస్సు సౌకర్యం తక్కువగా ఉన్నందున ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తున్నారని, ఆటోలు ఓవర్‌లోడ్‌తో వెళ్ళి ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. ఆయా మండలాలలో బస్సు సర్వీసుల పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్‌టిసి రీజనల్ మేనేజర్‌ను మహేశ్వర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఒంగోలుకు పల్లెల నుండి నడిపే బస్సులు బైపాస్ నుండి కాకుండా నగరంలోని ముఖ్య ప్రాంతాలైన రైల్వేస్టేషన్, కలెక్టరేట్, రిమ్స్ హాస్పటల్ మీదుగా బస్టాండ్‌కు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారిపై 12 మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చారని, వాటిని ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామచంద్రమూర్తిని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే సంవత్సరం మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు జాతీయ, రాష్ట్ర రహదారులు, నివాస ప్రాంతాలలో మద్యం షాపులు లేకుండా చూడాలన్నారు. పట్టణంలో ముఖ్యమైన ప్రాంతాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని, రోడ్డు విస్తరణ ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు తొలగించాలని, మున్సిపల్, ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. రిమ్స్ హాస్పటల్ వద్ద వృద్ధులు, వికలాంగులు, రోగులు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నారని, అక్కడ స్పీడ్‌బ్రేకర్ ఏర్పాటు చేయడంతోపాటు ఒక కానిస్టేబుల్‌ను నియమించాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘురాంరెడ్డిని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గంగాధర్‌గౌడ్, ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, ప్రాంతీయ రవాణాధికారి కృష్ణమోహన్, ముఖ్య ప్రణాళికాధికారి వెంకయ్య, డిఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్‌బాబు, వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, రిమ్స్ డైరెక్టర్ అంజయ్య, జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు
సమన్వయంతో కృషి చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఒంగోలు, నవంబర్ 14: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార దర్శినిని బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం బాలల హక్కుల వారోత్సవాలను కలెక్టర్ అనితా రాజేంద్ర జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనితా రాజేంద్ర మాట్లాడుతూ బాలల హక్కులను తల్లిదండ్రులు గుర్తించాలని కోరారు. వారి మనోభావాలను గౌరవించాలని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సహా వారిని ఎవ్వరు శారీరకంగా హింసించరాదని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు భంగం కలిగితే 1098కి గాని, సిడబ్ల్యుసికి గాని తెలియజేయాలని కోరారు. జిల్లాలో జాతీయ రహదారి వెంబడి అనేక ప్రాంతాలలో దాబా రెస్టారెంట్లు, చిన్నచిన్న టీ కొట్లతో బాల కార్మికులు పని చేస్తున్నారన్నారు. ఒంగోలు నగరంలో కూడా బాల కార్మికులు వివిధ వాణిజ్య సంస్థల్లో పని చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాలలో బాల కార్మికులు ఎక్కువగా ఉన్నారని, స్పిన్నింగ్ మిల్లుల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. పొలాల్లో పత్తి తీసేందుకు కూడా బాల కార్మికులను వినియోగిస్తున్నట్లు తమవద్ద సమాచారం ఉందని, అధికారులు దాడులు నిర్వహించి బాల కార్మికులను విడిపించాలని కోరారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను ఎలాంటి పనికి వినియోగించరాదని, అలాచేస్తే చట్టరీత్యా నేరమని కలెక్టర్ తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్లు, సిడిపిఓలు అన్ని గ్రామాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి విడిపించాలని, వారిని బడిలో చేర్చి వారి ఉజ్వల భవిష్యత్‌కు పునాదులు వేయాలని కోరారు. అనంతరం బాలిక శిశు సంరక్షణ పథకం కింద బాండ్లు, పది మంది మెమోరబుల్ బాలలకు అవార్డులు కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆర్ సూయజ్, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జి చక్రధరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె సుధాకర్‌బాబు, జాతీయ బాలకార్మిక సంస్థ ప్రాజెక్ట డైరెక్టర్ ఆదెన్న, కార్మికశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆఖిల్, సిడబ్ల్యుఎస్ చైర్మన్ రామ్మోహన్, డిఆర్‌డిఎ ఎపిడి శ్రీనివాసరావు, డూమా ఎపిడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెలాఖరు నాటికి పంట నష్టం అంచనాలు
english title: 
h

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>