పరిగి, నవంబర్ 15: ముప్పై సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేశా,పరిగిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతానని ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం మినీ స్టేడియంలో టిడిపి పార్టీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి కేసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.తాను ఇప్పుడు టిఆర్‌ఎస్ పార్టీలో చేరితే కేసిఆర్ ముఖ్యమంత్రి అయి తనకు ఏదో మంత్రి పదవి ఇస్తాడన్న ఆశతో పార్టీలో చేరలేదని తెలంగాణ సాధనకోసమే చేరానని కొప్పుల అన్నారు.రంగారెడ్డిజిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతుందని టిఆర్‌ఎస్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎ.చంద్రశేఖర్, పరిగి శాసనసభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణకు బలం లేదంటున్న సీమాంధ్ర నాయకులకు పరిగి బహిరంగ సభ చెంపపెట్టులాంటిదని అన్నారు. జిల్లా అంతట టిఆర్‌ఎస్ బలంగా ఉందని, ఈ సమావేశం సీమాంధ్రులకు వణుకు పుట్టిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రాంతప్రజలు అన్ని రంగాలలో వెనుకబడిపోయారని, తెలంగాణకు రావాల్సినవన్నీ సీమాంధ్రులు తన్నుకు పోయారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతం ఎప్పటినుంచో అణచివేతకు గురవుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్నది చంద్రబాబునాయుడేనని ఆరోపించారు. తన చివరి కోరిక తెలంగాణ రాష్ట్రం సాధించడమేనని చెప్పారు.
టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీమాంధ్రనాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుతగులతున్నారని, ఇక మన పని మనం చేయాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. హరీశ్వర్ టిఆర్‌ఎస్ పార్టీలో చేరడం వలన జిల్లాలోని అన్ని స్థానాలను టిఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ఎవరు అడ్డు తగిలినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరిగి నియోజకవర్గం టిఆర్‌ఎస్ నాయకులు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, సురేందర్‌కుమార్, ఎస్‌పి బాబయ్య, గోపాల్, యాదయ్యగౌడ్, సుధాకర్‌రెడ్డి, హరికృష్ణ, రూడమ్మ, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం
ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా పరిగిలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం కావడంతో టిఆర్‌ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. బహిరంగ సభకు ఆశించిన స్థాయి కంటే ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావడంతో నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలతో మిని స్టేడియం కిక్కరిసి పోయింది. రోడ్లపై ఎక్కడ చూసినా జనసందోహం కన్పించింది. గండ్వీడ్, కుల్కచర్ల, దోమ, పూడూరు, మండలాల నుంచి బహిరంగ సభకు నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. పరిగి అంతా గులాబి జెండాలతో నిండిపోయింది.
ముప్పై సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేశా
english title:
tdp to trs
Date:
Friday, November 16, 2012