వికారాబాద్, నవంబర్ 15: ఆరో విడత భూపంపిణీలో భూమిని అనర్హులు పొందినట్లయితే వాటిపై చర్యలు తీసుకుంటామని వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. గురువారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గంలో ఆరో విడత భూ పంపిణీ కింద 1166 మంది లబ్దిదారులకు 1715 ఎకరాల భూమిని పంపిణీ చేసినట్టు తెలిపారు. కొన్ని మండలాల్లో అనర్హులకు భూపంపిణీ జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయని, వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగా భూమిని పొందిన వారి జాబితాలు తహశీల్దార్, పట్వారీ, గ్రామ సేవకుల చేతుల్లో ఉన్నాయని వాటిని చూసి అనర్హులెవలో తెలపాలన్నారు. అభ్యంతరం వచ్చిన వాటిపై విచారణ చేపడతామన్నారు. వ్యవసాయం చేసుకోకుండా ఇతర పనులకు వాడటం, అమ్మకం లాంటివి చేసినా, నిబంధనలు పాటించకపోయినా ఇచ్చిన భూమిని వెనక్కి లాక్కుంటామన్నారు. అర్హులైన పేదలు భూమి సాగుచేస్తూ పట్టాలు పొందకపోతే సప్లిమెంటరీలో భూమిని పంపిణీ చేస్తామన్నారు. ఐదెకరాల భూమిని కలిగి ఉండి తిరిగి భూమి పొందిన వారు అనర్హులవుతారని, భూమిలేని పొరుగు గ్రామం వారైనా అర్హులవుతారన్నారు.
ఆరో విడత భూపంపిణీలో భూమిని అనర్హులు పొందినట్లయితే
english title:
6th phase
Date:
Friday, November 16, 2012