ధారూర్, నవంబర్ 15: రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ధారూర్ మెథడిస్ట్ 90వ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధారూర్ మండల కేంద్రానికి సమీపంలోని స్టేషన్ ధారూర్, దోర్నాల్ గ్రామాల మధ్య నుండి పారే కాగ్నా నదిఒడ్డున సుమారు 35 ఎకరాల స్థలంలో జాతరను ప్రతి ఏటా నవంబర్ మాసంలో నిర్వహిస్తారు. ఈ జాతర ఉత్సవాలకు క్రైస్తవులు సుమారు 10 లక్షల వరకు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. గత సంవత్సరం ఈ జాతర ఉత్సవాలకు సుమారు 9 లక్షల మంది హాజరై ప్రార్థనలు జరిపారని తెలిపారు. కాగ్నా నది ఒడ్డున గల ఇప్పచెట్టు వద్ద ఏర్పాటు చేసిన యేసు క్రీస్తు శిలువ దగ్గర ప్రార్థనలు జరిపితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. గురువారం బిషప్ కర్‌ఖరే, ధారూర్ మెథడిస్ట్ జాతర కార్యదర్శి అనంతయ్యలు, గ్యాబ్రిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి జాతర ఉత్సవాలను ప్రారంభించారు.
ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి
వికారాబాద్, నవంబర్ 15: ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అని బంటారం మండల విద్యాధికారి కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మోత్కుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృత్తినే దైవంగా భావించాలని, ప్రపంచంలో అత్యధిక పిల్లల జనాభా కలిగిన దేశం మనదని అన్నారు. పిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు చేపడుతున్నాయన్నారు. అందులో భాగంగానే మూడు సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం 6 నుండి 14 సంవత్సరాల పిల్లల కొరకు విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. అయినా ప్రతి 100 మంది పిల్లలకు 19 మంది బడిబయటే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేర్పించిన 100 మందిలో 70 మంది సెకండరీ స్థాయిలో డ్రాపవుట్ అవుతున్నారని అన్నారు. డ్రాపౌట్‌లో 66 శాతం మంది బాలికలున్నారన్నారు. కార్యక్రమానికి పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సి.హెచ్.వెంకటరత్నం అధ్యక్షత వహించగా గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్ 10వ తరగతి చదువుతున్న తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు 30 ఎస్‌ఎస్‌సి మోడల్ టెస్ట్ పేపర్లను అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసి వైస్ చైర్మన్ ఎల్.మాధవరెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
విద్యార్థి బి.మమత ప్రధానోపాధ్యాయురాలిగా, ఉపాధ్యాయులుగా మహేశ్వరి, పుష్పలత, సౌమ్య, యమున, ప్రేమ్‌కుమార్, మహేన్, మోహన్, ప్రశాంత్‌రెడ్డి వ్యవహరించారు.
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
కుత్బుల్లాపూర్, నవంబర్ 15: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చేనేత, జౌళిశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ సూచించారు. గురువారం కుత్బుల్లాపూర్ మునిసిపల్ గ్రౌండ్‌లో కుత్బుల్లాపూర్ ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడలను మంత్రి ప్రసాద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించే విధంగా తయారుచేయాలని సూచించారు.క్రీడలకోసం ప్రతిఏటా రాష్ట్రప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో రాణించాలన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు తగిన శిక్షణ ఇస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి గ్రూప్ అధినేత మల్లారెడ్డి, ఎంఎల్‌ఆర్‌ఐటి అధినేత లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ రికగ్నైజ్‌డ్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివయ్య, కార్పొరేటర్లు జగన్, శేషగిరి, గౌరీష్‌తో పాటు ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
మరింతగా వికారాబాద్ అభివృద్ధి: మంత్రి ప్రసాద్
వికారాబాద్, నవంబర్ 15: వికారాబాద్ పట్టణ రూపురేఖలు రోజు రోజుకు మారుతున్నాయని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అనంత్ డీలక్స్ లాడ్జిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం కొద్ది కాలంలోనే మరింతగా అభివృద్ధి చెందనుందన్నారు. లాడ్జి యజమాని అనంత్‌రాంలుగౌడ్ మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
ప్రభుత్వాసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలి
వికారాబాద్ ఏరియా ఆసుపత్రిలో రోగుల కోసం మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాజశేఖర్ కోరారు. గురువారం మంత్రి ప్రసాద్‌కుమార్‌కు ఆయన అందజేసిన వినతిపత్రంలో ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కొరత సమస్యను తీర్చాలని కోరారు. స్పందించిన మంత్రి ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ ప్లాంటు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇస్తూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో లోక్‌సభ ప్రధానకార్యదర్శి సంతోష్‌కుమార్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాఘవేందర్‌గౌడ్, ప్రధానకార్యదర్శులు ప్రమోద్‌కుమార్, ఏసయ్య, పర్వేజ్, జంగయ్య, మతిన్, లాలయ్య, హరిదాస్, హన్మంతు, పోచయ్య పాల్గొన్నారు.