ఆసిఫాబాద్, నవంబర్ 15: ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. తొలుత పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మార్కెట్‌కు తరలి వచ్చిన పత్తిని పరిశీలించారు. రైతులు తేమశాతం లేకుండా పత్తిని మార్కెట్‌కు తీసుక రావాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులకు న్యాయం చేసేందుకు జిల్లాలో సిసిఐ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. క్వింటాలు పత్తికి రూ. 3,900 చెల్లించి సిసిఐ కొనుగోలు చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ చిలువేరు వెంకటేశ్వర్లు, కాటన్‌పర్చేస్ అధికారి మురళి, తహశీల్దార్ సురేష్ కదం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అసద్, షబ్బీర్, మెకర్తి కాశయ్య, దత్తు, వైరాగరే శ్రీనివాస్, టేకం కమల, బిజెపి నాయకుడు ఈదులవాడ మారుతి, ట్రేడర్లు రఫీక్, తాటిపల్లి అశోక్, సాయిని కేదారి తదితరులున్నారు.
ప్లాస్టిక్ బ్యాగులతో పర్యావరణానికి ముప్పు
* వర్క్‌షాప్‌లో కలెక్టర్ అశోక్
ఆదిలాబాద్, నవంబర్ 15: పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ వస్తువులను నిరోధించి సంప్రదాయ చేతి వృత్తులను ఆదరించాలని జిల్లా కలెక్టర్ అశోక్ అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని లక్ష్మీరెసిడెన్సి హోటల్‌లో ఏర్పాటు చేసిన జనపనార వస్తువుల వర్క్‌షాప్‌లో 21 రోజుల పాటు మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయి అనేక అనర్థాలకు దారితీస్తుందని, జనపనారతో తయారు చేసిన బ్యాగులను వాడి ముందు తరాలకు స్ఫూర్తినివ్వాలన్నారు. ఇందు కోసం క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం కొనసాగాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం ముందు దృష్టితోనే ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని నిషేధించిందని, పర్యావరణం కోసం సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు. జనపనారతో ఫ్యాన్సీ వస్తువులు, బ్యాగులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, వీటి వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరం వుందన్నారు. మహిళా సంఘాలు, సెల్ఫ్‌హెల్ఫ్‌గ్రూపులు, చేతివృత్తి మహిళలకు ఇలాంటి శిక్షణ ఇవ్వడం పట్ల కలెక్టర్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ జూట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సెల్ఫ్‌హెల్ఫ్ గ్రూపుల సహకారంతో జిల్లాలోను ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే వరకు ఉద్యమం చేపట్టాలన్నారు. జ్యూట్ బోర్డు ఆధ్వర్యంలో శిక్షణ అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి బాటను ఎంచుకోవాల్సిన అవసరం వుందని కలెక్టర్ పేర్కొన్నారు. కాగా ఈ శిక్షణలో 25 మంది మహిళలు హ్యాండ్ బ్యాగులు, ఫ్యాన్సీ వస్తువులు తయారు చేసి అందరిని ఆకట్టుకొని ప్రదర్శనను ఏర్పాటుచేయడం పట్ల కలెక్టర్ ప్రశంసించారు. ప్రజలు ఆకర్షణీయమైన ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగులపై మక్కువ చూపుతున్నారని, దీని వల్ల గిరాకీ పెరగడమేగాక, ఉపాధి రంగాలను మరింత ప్రోత్సహించడానికి అవకాశం ఏర్పడిందన్నారు. చేతి వృత్తుల దుకాణాలు జిల్లాలో లేని లోటును పూడ్చేందుకు ప్రత్యేకంగా మహిళలు జనపనార వస్తువులను తయారుచేస్తే మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రభుత్వపరంగా ప్రోత్సహిస్తామన్నారు. శిక్షణ పొందిన మహిళలకు డిఆర్‌డిఎ, బ్యాంక్‌ల ద్వారా రుణాలందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లాలో 2013 జనవరిలో నిర్వహించే జనపనార చేతివృత్తుల శిక్షణ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ కోరారు. మెప్మా నిర్వహకులురాలు పద్మ, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ చేతివృత్తుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జి రాములు, బూత్ సర్వీసు ఇన్‌చార్జి ఎ వీరభద్రయ్య పాల్గొన్నారు.
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు పూర్తికాదు
కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికే ప్రాజెక్టు ప్రారంభం* సిర్పూర్ ఎమ్మెల్యే సమ్మయ్య
కాగజ్‌నగర్, నవంబర్ 15: ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదని తెలంగాణ ప్రజలను మోసగించడానికే ఈ ప్రాజక్టును ప్రారంభించారని సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అన్నారు. గురువారం స్థానిక పద్మశాలి భవనంలో జరిగిన టిఆర్‌ఎస్ సిర్పూర్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకుల అభివృద్ధికి కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికే ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించారని ఆయన అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న భూములను నాశనం చేయడానికి, ఇక్కడి ప్రజలను రోడ్డుమీదికి తేవడానికి వై ఎస్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ప్రాణహిత-చేవేళ్ళ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తికాదని, ఈప్రాజెక్టు పూర్తికావాలంటే కరీంనగర్ జిల్లాలోని రామగుండంలోని ఎన్టీపిసి లాంటి 3 ఎన్టీపిసిలు నిర్మించాలని ఇది సాధ్యం కాదన్నారు. పేదల భూములు పోయాయని, నష్టపరిహారం రాలేదని, పంటలు లేక రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రాణహిత-చేవేళ్ళ ప్రాజెక్టు విషయంలోనే ఆంధ్ర వలసవాదుల దోపిడీ రుజువైందన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ళకు బిల్లులు లేవని, విద్యుత్ కోత, విద్యుత్ చార్జీల పెంపు, గిట్టుబాటు ధరలేదన్నారు. ఈ నెల 23న నల్గొండ జిల్లా సూర్యాపేటలో లక్ష మందితో కెసిఆర్ బహిరంగ సభ ఉందని దీన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 29న కాగజ్‌నగర్‌లోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో వెయ్యిమందితో నిరాహార దీక్ష చేపట్టగలమని, డిసెంబర్ 9న బ్లాక్‌డేగా పాటించాలని, తెలంగాణవాదులు నల్లబ్యాడ్జీలను ధరించాలన్నారు. ఈ నెల 30 నుండి జనవరి 10 వరకు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని, ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు దుర్గం విక్రం, కాగజ్‌నగర్ మండల అధ్యక్షుడు గజ్జివాసుదేవ్, మాజీ కౌన్సిలర్ రాజవౌళి, మహిళా నాయకురాలు మామిడాల మమత, దహెగాం, కౌటాల, బెజ్జూర్ మండలాలకు చెందిన నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజక వర్గంలోని 5 మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
మలేరియా, ఇతర జ్వరాలు అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు
ఆదిలాబాద్, నవంబర్ 15: జిల్లాలో దోమల వల్ల విజృంభిస్తున్న మలేరియా, ఇతర జ్వరాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని కలెక్టర్ అశోక్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ మండలం అనుకుంట గ్రామంలో 3వ విడత రాపిడ్ ఫీవర్ సర్వేను కలెక్టర్ అశోక్ ప్రారంభించారు. ఈ నెల 24 వరకు ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్ళి పరీక్షలు జరిపి వ్యాధి చికిత్సలు నిర్వహించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కలెక్టర్ అన్నారు. వ్యాధులు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోమల బారి నుండి నివారించేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు దోమల బారి నుండి కాపాడేందుకు ఇంటి ఆవరణలో నీళ్ళ కుండిలు, బావుల వద్ద నీరు నిల్వ వున్న చోట దోమలు గుడ్లు పెట్టి లక్షల కొద్ది దోమలు వృద్ధి పెరిగి అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు. దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులని వివిధ వ్యాధులు వస్తాయని అన్నారు. ఇందుకు గాను ప్రజలు కూడా నివారణ చర్యలు చేపట్టాలని, శుభ్రత పాటిస్తూ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. అలాగే జిల్లాలో ఎక్కడా డెంగీ వ్యాధి లేదని అక్కడక్కడ మలేరియా జ్వరాలు వున్నాయని వాటి నివారణకు జిల్లలో లక్షల రక్త పరీక్షల కిట్స్ అందుబాటులో వుంచి రక్తపరీక్షలు నిర్వహించి వైద్య సిబ్బంది మందులు ఇచ్చి పరీక్షిస్తున్నారని తెలిపారు. 617 గ్రామాల్లో దోమల నివారణకు ఐఆర్‌ఎస్ స్ప్రే చేయించామన్నారు. గిరిజన గ్రామాల్లో వారికి అర్థంఅయ్యే అవగాహన కోసం ప్రచారం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ గోపిడి జితేందర్‌రెడ్డి, డిఎంహెచ్‌ఓ మాణిక్యరావు, డిఎంఓ అల్హం రవి, డిపిఓ పోచయ్య, అంకోలి వైద్యాధికారిణి కౌస్తుబా, సహాయ మలేరియా అధికారి వెంకటేష్, గ్రామ మాజీ సర్పంచ్ ఆశన్న, వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.
ఆపదలో ఆదుకుంటేనే సమాజ ఆదరణ
* ఎంపీ రాథోడ్
ఆదిలాబాద్, నవంబర్ 15: ఆపత్కాలంలో పేదలను ఆదుకోవడం ద్వారా సమాజంలో సముచిత గుర్తింపు సాధించి వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతామని ఎంపీ రమేష్ రాథోడ్ పేర్కొన్నారు. గురువారం టిడిపి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల శంకర్ ఆధ్వర్యంలో అత్యవసర రోగుల కోసం రెండు అంబులెన్సులను ఎంపీ రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాయల శంకర్ ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్దికి స్వచ్చంధంగా చేయూతనందించడం పట్ల ఎంపీ రాథోడ్‌తో పాటు ఎమ్మెల్యేలు జోగు రామన్న, గోడం నగేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ రాథోడ్ మాట్లాడుతూ సామాజిక సేవల ద్వారానే రాజకీయాల్లో నేతలకు గుర్తింపు వుంటుందని, రాజకీయాలు తాత్కాలికమే అయినా, సామాజిక సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర రోగుల కోసం ప్రత్యేకంగా రెండు అంబులెన్సులను ఏర్పాటు చేయడం పట్ల పాయల శంకర్‌ను అభినందించారు. గతంలో నియోజకవర్గంలో పలు చోట్ల తాగునీటికి అనేక ఇబ్బందులు ఎదురైతే శంకర్ సేవాదృక్పథంతో ట్యాంకర్లను ఏర్పాటుచేసి శ్రామికవాడల్లో దప్పిక తీర్చి ఉదారతను చాటుకున్నారన్నారు. రిమ్స్‌లో 24 గంటల పాటు అందుబాటులో వుంచడమేగాక, మెరుగైన వైద్య చికిత్సల కోసం మహారాష్ట్ర, యావత్‌మాల్, నాగ్‌పూర్ వెళ్ళేందుకు ఈ అంబులెన్సులు దోహదపడ్తాయన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో గుర్తింపు పొందుతున్న పాయల శంకర్ కృషిని కొనియాడారు. కొందరు డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొంటే ఆశించిన దానిలో కొంతైనా వెచ్చించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామమన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గోడం నగేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గంలో అణగారిన వర్గాల కోసం పాయల శంకర్ చేస్తున్న కృషిని కొనియాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించి రోగుల ప్రాణాలు కాపాడేలా ముందుకు రావాలని కోరారు. అఖిలపక్ష నాయకుడు బి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ ధన సంపాదనతో పాటు ధైర్యంతో పేదల పక్షాన అండగా నిలిచే శంకర్ ఆశయాలు మిగతా వారికి స్ఫూర్తినిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ శశిధర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్, సిపిఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సిపిఐ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు అనీల్, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తగ్గిన నక్సల్స్ ప్రభావం
* కరీంనగర్ డిఐజి
భైంసా, నవంబర్ 15: కరీంనగర్ రేంజ్ పరిధిలో నక్సల్స్ ప్రభావం తగ్గిందని కరీంనగర్ రేంజ్ డిఐజి ఆర్‌బి నాయక్ అన్నారు. గురువారం భైంసా పట్టణ పోలీస్టేషన్‌ను తనిఖీ చేసిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాటి కూడా ఉన్నారు. కరీంనగర్ రేంజ్ పరిధిలో ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా మిగితా ప్రాంతాల్లో నక్సల్స్ అలజడి లేదన్నారు. నక్సల్స్ ప్రభావం తగ్గిందన్నారు. ఎస్ ఐ పోస్టుల నియామకం కోసం ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయన్నారు. 240 పోస్టులకు గాను సుమారు పది వేల మంది పోటీ పడుతున్నారని ఆయన తెలిపారు. మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. 40 మహిళా ఎస్‌ఐ పోస్టులకు ఆరు వందల మంది మహిళలు పోటీ పడుతున్నట్లు ఆయన వివరించారు. భైంసా పట్టణంలో అన్ని పండగలు ప్రశాంతంగా జరుగడం పట్ల ఆయన పట్టణ ప్రజలను అభినందించారు. పోలీసులు కూడా సక్రమంగా విధులు నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మొదట కరీంనగర్ రేంజ్ డిఐజి ఆర్‌బి నాయక్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రంలో భైంసా డి ఎస్పీ దేవదాస్ నగుల్, పట్టణ సిఐ పురుషోత్తం, రూరల్ సిఐ సీతారాములు, పట్టణ ఎస్ ఐలు అమృత్‌రావు, నరేష్‌బాబు పాల్గొన్నారు.
మావోయిస్టుల బంద్ ప్రశాంతం
ఆదిలాబాద్, నవంబర్ 15: పోలీసులు సాగిస్తున్న గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ ఇచ్చిన ఉత్తర తెలంగాణ బంద్ పిలుపు జిల్లాలో అంతగా ప్రభావం చూపలేదు. మావోయిస్టు కీలక నేతలను ఎన్‌కౌంటర్ పేరిట మట్టుబెడుతూ పోలీసులు నిర్బంధ కాండకు పూనుకోవడాన్ని నిరసిస్తూ 15,16 తేదీల్లో రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇటీవల వరుసగా ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్ల నేపధ్యంలో బంద్ దృష్ట్యా పోలీసులు జిల్లా సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటుచేశారు. మావోయిస్టులు ఉనికి కోసం ఏలాంటి చర్యలకైనా పాల్పడే అవకాశం వున్నందున పోలీసులు బంద్ సందర్భంగా అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టు కదలికలు పెరిగిన నేపధ్యంలో ప్రాణహిత, గోదావరి నదీతీరం వెంట, కోల్‌బెల్ట్ ఏరియాల్లో కూంబింగ్ ముమ్మరం చేయగా, మావోయిస్టుల కూపీ లాగేందుకు మాజీలతో పాటు 55 మంది నక్సల్స్ సానుభూతిపరులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకొని కార్యకలాపాలపై ఆరాతీశారు. నక్సలైట్ల సమాచారాన్ని రాబట్టేందుకు వ్యూహాత్మకంగా పోలీసులు ముందడుగు వేయడం గమనార్హం. బెల్లంపల్లికి చెందిన ఉత్తర తెలంగాణ ఉన్నత క్యాడర్, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటుకం సుదర్శన్‌తో పాటు 20 మంది నక్సలైట్లు ఇటీవల దహెగాం మండలంలో ప్లీనరి ఏర్పాటుచేశారన్న సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టి గాలించారు. జిల్లాలో ప్లీనరిలో జరుగుతుండడం నక్సల్స్ కార్యకలాపాలు పెరగడంపై పోలీసు అధికారులు ప్రత్యేక కార్యాచరణకు సన్నద్ధమైనట్లు తెలిసింది. కాగా నక్సల్స్ బంద్ పిలుపు ఆదిలాబాద్ జిల్లాలో తొలి రోజు ఎలాంటి ప్రభావం చూపక పోగా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిలిపీలుకున్నారు. జిల్లాలో గురువారం అకస్మికంగా పర్యటించిన కరీంనగర్ రేంజీ డిఐజి భీమ్లానాయక్ నక్సల్స్ కార్యకలాపాలపై ఆరాతీస్తూ నిఘా ముమ్మరం చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఆదిలాబాద్, భైంసా స్టేషన్లను సందర్శించిన డిఐజి
కరీంనగర్ రేంజి డిఐజి ఆర్ భీమ్లానాయక్ గురువారం ఆకస్మికంగా జిల్లాలో పర్యటించి పోలీసుల పనితీరును ఆరా తీశారు. ముందుగా భైంసా పోలీసుస్టేషన్‌ను సందర్శించి అక్కడ కేసుల నమోదు, శాంతి భద్రతల పరిస్థితి గురించి, పోలీసులు అనుసరిస్తున్న చర్యల గురించి ఆరాతీశారు. సాయంత్రం ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌ను సందర్శించడమేగాక, పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో అస్తవ్యస్తంగా వున్న ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దడమేగాక కూడళ్ల వద్ద ప్రత్యేకంగా ట్రాఫిక్ సిగ్నల్స్, పాఠశాల విద్యార్థులకు జిబ్రాలైన్లను ఏర్పాటుచేయాలని, ట్రాఫిక్ పోలీసులు పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. డిఐజి వెంట ఎస్పీ త్రిపాఠి, డిఎస్పీలు కె మహేశ్వర్‌రాజు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.