Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కక్షతోనే జగన్‌ను జైల్లో పెట్టారు

$
0
0

మహబూబ్‌నగర్, నవంబర్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోనే జగన్మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టిందని, జగన్ బయట ఉంటే ఆటలు సాగవని భయపడిన కాంగ్రెస్ నాయకులు జైల్లో జగన్ ఉన్నా వైకాపాకు పెరుగుతున్న ఆదరణతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని వైకాపా తిరుపతి ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం వైకాపా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం క్రౌన్ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా మరో వారం రోజుల తర్వాత పాదయాత్ర ఉంటుందని, ఆ పాదయాత్రను జిల్లా ప్రజలందరు కలిసి విజయవంతం చేయాలని కోరారు. వైకాపా కార్యకర్తలు, నాయకులు సమష్టి కృషితో షర్మిల పాదయాత్రలో పాల్గొని పెద్దఎత్తున ప్రజలు యాత్రలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ విధానాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, రాజకీయంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు. అయినప్పటికినీ కేసులకు భయపడేది లేదని, న్యాయబద్ధంగా ఎదుర్కొంటున్నారని, అయితే వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రజలకు రోజురోజుకు అభిమానం పెరుగుతోందని, ఈ విషయం కాంగ్రెస్ పెద్దలకు వణుకు పుడుతోందని అన్నారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు అమలు కావాలంటే వైకాపా అధికారంలోకి రావాలని, తిరిగి రాజన్న రాజ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా పెద్దఎత్తున వైకాపాలోకి వలసలు పెరుగుతున్నాయని, రాజకీయంగా జిల్లాలో బలమైన శక్తిగా వైకాపా ఎదగనుందని, షర్మిల పాదయాత్రతో జిల్లా రాజకీయాలే తారుమారు కానున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్సార్ అభిమానులు కోట్లాది మంది ఉన్నారని, వారంతా జగన్మోహన్‌రెడ్డికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగు భారీ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పనులు ప్రారంభించారని, అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నాన్చడంతో రైతులకు సాగునీరు రావడం లేదని ఆరోపించారు. జిల్లా సస్యశ్యామలం కావాలంటే జగన్మోహన్‌రెడ్డి సిఎం కావాల్సిందేనని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, వైకాపా జిల్లా ఇన్‌చార్జి బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, నాయకులు బాలమణెమ్మ, జిట్టా బాలకిష్టారెడ్డి, రవిప్రకాష్, బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల ధర్నా
మహబూబ్‌నగర్, నవంబర్ 15: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐకెఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెజి రాంచందర్ మాట్లాడుతూ రైతాంగం సమస్యలను పరిష్కరించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తే మేలు జరుగుతుందని అన్నారు. రైతాంగం వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారని, పంటలు నాటినప్పటి నుండి చేతికొచ్చే దాకా కష్టాలు ఉంటాయని, పండిన పంటను మార్కెట్‌కు తీసుకువెళ్తే మరెన్నో ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం కాకుండా రాజకీయ నాయకుల కోసం మేలుచేసే కార్యక్రమాలను చేస్తున్నాయని అన్నారు. కోట్లాది రూపాయలు దేశ సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రైతు పండించిన పంటకు ధరను నిర్ణయించే అధికారం రైతులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వ్యవసాయేతర ఎరువులు మొదలుకొని అన్ని వస్తువులు కంపెనీ యజమానుల ఉత్పత్తుల, మార్కెట్ ధరలు నిర్ణయిస్తారని, 40 లక్షల మంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో పని చేస్తున్నా ఉత్పత్తికి, ఖర్చులకు 16 రెట్లు పెరిగిపోయాయని, కానీ మద్దతు ధర 27శాతం కూడా పెరగలేదని అన్నారు. పంటపై రైతుకు అయిన ఖర్చుల ప్రాతిపదికపైన గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఎత్తివేశారని, దాంతో రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడిపోతున్నారని అన్నారు. అప్పులు పెరిగాయని, దాంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రోజురోజుకు రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయే తప్ప లాభం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాము, అరుణ్‌కుమార్, సలీం, వెంకట్రాములు, భగవంతు, చెన్నప్ప, నర్సిములు, వెంకటేష్, అంబదాసు, సాంబశివుడు, వెంకట్, జ్యోతి, రాము తదితరులు పాల్గొన్నారు.

వృత్తి నైపుణ్యంతోనే ఉపాధి
* కలెక్టర్ గిరిజాశంకర్
మహబూబ్‌నగర్, నవంబర్ 15: వృత్తి నైపుణ్యం ద్వారానే ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందవచ్చని కలెక్టర్ గిరిజాశంకర్ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని పూర్వపు జిల్లా సైన్స్ మ్యూజియంలో డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కంప్యూటర్, ఇంగ్లీష్ పనుల సంసిద్ధత శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. శిక్షణకు హాజరైన యువతీ, యువకులను ఉద్దేశించి కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకోవటాన్ని లక్ష్యంగా ఎంచుకోవాలని అన్నారు. ఏదైనా వృత్తిలో నైపుణ్యం పొందడం వల్లే ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందవచ్చని, ఇంగ్లీష్ తెలిసిన వారికి ఉద్యోగాలు పొందడం సులువన్నారు. ఇంగ్లీష్ అనేగానే విద్యార్థులు భయపడుతున్నారని, తెలుగుతో పాటు ఇంగ్లీష్‌పై కూడా నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరమన్నారు. మాతృభాష మాదిరిగానే కృషి చేస్తే ఇంగ్లీష్ కూడా సులభంగా వస్తుందని తెలిపారు. మంచి అవకాశాలు, ఉద్యోగాలు కావాలనుకునే వారు రోజుకు 16 గంటలు శ్రమించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కొత్తూరు మండలంలో ప్రాక్టర్ కంపెనీలో దాదాపు 150 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జీవితంలో స్థిరపడాలంటే మనస్సులో భయాన్ని విడిచిపెట్టాలని అన్నారు. గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి మాత్రమే అవకాశాలు ఉన్నాయని, పల్లెలను వీడి పట్టణాల వైపు వెళ్తే కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ తదితర రంగాలలో ఉపాధి పొందవచ్చని అన్నారు. స్వశక్తితో నిలబడేందుకు ముందుగా ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగం ఏదో ఒక దానిలో చేరాలని సూచించారు. ఉద్యోగాలు లేక ఎంతోమంది యువతీ, యువకులు సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, పైచదువులు చదవలేని వారు మధ్యలోనే చదువు మానేసిన వారికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించి శిక్షణను ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శిక్షణలో నైపుణ్యం సాధిస్తే కచ్చితంగా ఉద్యోగావకాశాలు పొందవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖర్‌రెడ్డి, జాబ్స్ మేళా జిల్లా మేనేజర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం
* మంత్రి డికె అరుణ వెల్లడి
గద్వాల, నవంబర్ 15: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లాప్పుడు కట్టుబడి ఉంటుందని అందు కోసం అనేక రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డికె అరుణ వెల్లడించారు. గురువారం ధరూరు మండలం వెంకటాపురం సమీపంలో గల పాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సంబరాల్లో రాష్టస్థ్రాయి బండలాగుడు పోటీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. రైతులకు సుఖఃసంతోషాలతో ఉండాలనే విధంగా సాగునీటి సౌకర్యం, ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, యంత్రాలు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా జాతరలు, ఉత్సవాలు జరిగే సమయంలో రైతులు కష్టాన్ని మర్చిపోయే విధంగా కుటుంబ సభ్యులతో పాటు పోటీలను తిలకించి ఆనందోత్సాహాల మధ్య జాతర జరుపుకునేందుకు ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, మొదటి ఫేస్ ద్వారా గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను నింపడం జరిగిందని, త్వరలోనే రెండవ లిఫ్ట్ ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్‌ను నింపి వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీటిని అందించేందుకు అధికారులపై ఒత్తిడి పెంచామన్నారు. నియోజకవర్గానికి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన జూరాల తాగునీటి పథకంలో పైపులైన్ల లీకేజీ కావడంతో సకాలంలో నీటిని అందించలేక పోయామని, పైపులైన్లను మార్చి త్వరలోనే డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మంత్రిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. వెంకటాపురం గ్రామంలో వాల్మీకి కమ్యూనిటి హాల్ నిర్మాణానికి మంత్రి శిలాఫలకం ఆవిష్కరించారు. నాలుగు విభాగాలలో ఏర్పాటు చేసిన ఈ పోటీలు నాలుగు రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
పాగుంట వెంకన్నను దర్శించుకున్న మంత్రి
పాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మంత్రి డికె అరుణ వెంకటాపురం గ్రామానికి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు, నిర్వాహకులు పూర్ణకుంభతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం నెట్టెంపాడు గ్రామంలోని బసవలింగేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠకు మంత్రి హాజరై దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీఠాధిపతులు మంత్రిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపిపి శారదపద్మారెడ్డి, నాయకులు జయసింహారెడ్డి, సంజీవ్‌భరద్వాజ్, రాంచంద్రారెడ్డి, సీతారాంరెడ్డి, డిటిడిసి నర్సింహ, శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలవి దాగుడు మూతలు
* ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి

కొడంగల్, నవంబర్ 15: కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు దాగుడు మూతలు ఆడుతున్నాయని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేయలేదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌పైన ఎంఐఎం, ఎంఐఎంపై కాంగ్రెస్ పార్టీ పెత్తనం చెలాయించుకోవడానికి పాట్లు పడుతున్నాయని ఆరోపించారు. గతంలో టిడిపి తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఎంఐఎం అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేసిందని, అలాగే లోక్‌సత్తా పార్టీ ఎమ్మెల్యే జయప్రకాష్‌నారాయణ ఓటు లేదని అన్నారు. స్పష్టమైన వైఖరితో తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి ముందుకు వచ్చిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పార్టీలతో మనుగడ కొనసాగిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎంఐఎం చెబుతుందని, అయితే మద్దతు విషయం రాష్టప్రతి, లోక్‌సభ స్పీకర్‌లకు తెలపాల్సి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ ఆటలు ఆడుతున్నారని అన్నారు. ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకను దృష్టిలో పెట్టుకుని మద్దతు విషయంలో ఎంఐఎం తీసుకున్న నిర్ణయం సబబేనని అన్నారు. అందుకు టిడిపి అభినందిస్తుందని చెప్పారు. గత తొమ్మిది సంవత్సరాల టిడిపి ప్రభుత్వంలో హైదరాబాద్‌లో ఎలాంటి మత ఘర్షణలు, అల్లర్లు జరగలేవని అన్నారు. అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా ఘర్షణలు చెలరేగుతున్నాయని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల, రక్షణకు సైతం నోచుకోలేకపోయిందని ఆయన విమర్శించారు. మైనారిటీలకు అన్ని విధాలుగా గత టిడిపి ప్రభుత్వం సహకరించిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో సంపూర్ణంగా తెగతెంపులు చేసుకుని ముందుకువస్తే తెలుగుదేశం పార్టీ వారికి సహకారం అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, చచ్చిన శవంలా ఉందని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడం ఖాయమని చెప్పారు. విలేఖరుల సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు యూసుఫ్, నాయకులు నందారం ప్రశాంత్, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

నవజాత శిశువు చికిత్సా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
* కలెక్టర్ గిరిజాశంకర్
మహబూబ్‌నగర్, నవంబర్ 15: జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నవజాత శిశువు చికిత్సా కేంద్రాన్ని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోవాలని, అందుకు విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ ఆదేశించారు. గురువారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంస్థ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 2500 గ్రాముల కన్నా తక్కువ బరువుతో పుట్టిన ప్రతి బిడ్డను తప్పనిసరిగా కనీసం వారం రోజుల పాటు నవజాత శిశువు చికిత్సా కేంద్రంలో ఉంచాలని సూచించారు. నెల రోజుల తర్వాత బిడ్డను తిరిగి ఆసుపత్రికి తీసుకువస్తే పౌష్టికాహార పునరావాస కేంద్రంలో ఉంచి ఉచితంగా చికిత్స అందించడం జరుగుతుందని, అంతేకాక తల్లికి వంద రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుందన్న విషయాలను జిల్లాలోని ప్రజలందరికీ తెలియజేయాలని అన్నారు. నవజాత శిశువు చికిత్సా కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించగా ఈ కేంద్రాన్ని అతితక్కువగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అంతేకాక పౌష్టికాహార లోపం కారణంగా గ్రామాలలో అనేక మంది శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రిలోని నవజాత శిశువు చికిత్సా కేంద్రానికి పంపాలని ఐసిడిఎస్ పిడి మోహన్‌రెడ్డిని ఆదేశించారు. ప్రస్తుతం బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించి 130 మంది పిల్లలను శని, ఆదివారాలలో జిల్లా ఆసుపత్రికి పంపి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పిడిని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో ఔట్ పేషెంట్లను సంఖ్యను పెంచాలని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో ల్యాబ్ పరికరాలు, శస్త్ర చికిత్సలకు సంబంధించిన పరికరాల కొనుగోలుకు, సిటి స్కానింగ్ చార్జీలను తెల్లకార్డు దారులకు రూ. 500, మిగతా వారికి రూ. 800 వసూలు చేసేలా కమిటీ తీర్మానించింది. కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను కొనసాగించేందుకు, మరికొంత మంది జీతాలను పెంచేందుకు కమిటీ అంగీకరించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అబ్రహం, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ
గోపాల్‌పేట, నవంబర్15: వనపర్తి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి గురువారం మండల పరిధిలోని బండరావిపాకులలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజచేశారు. బండరావిపాకుల గ్రామంలో రూ.1.50కోట్లతో చేపట్టిన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన మెటిరియల్ సిద్ధంగా ఉందని, 45రోజులలో సబ్ స్టేషన్ పనులు పూర్తిచేసి ప్రజలకు విద్యుత్ అందించాలని ఎడి రాంరెడ్డిని ఆదేశించారు. సబ్‌స్టేషన్ పూర్తయి దాని ద్వారా బండరావిపాకుల, కొంకల్‌పల్లి, ఏదుల, అనంతాపూర్, వెనకెర్ల తదితర గ్రామాలకు నాణ్యవంతమైన విద్యుత్ సరఫరా అవుతుందని అయన అన్నారు. సమీప గ్రామాలైన చెన్నారం, రేవల్లిలోని విద్యుత్ సబ్‌స్టేషన్లపై వోవర్‌లోడ్ తగ్గి ఆ సబ్‌స్టేషన్లద్వారా సరఫరా అవుతున్న గ్రామాలకు కూడా విద్యుత్ నాణ్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం బండరావిపాకుల, నాగపూర్ గ్రామాల మధ్య జరుగుతున్న పైపులైను పనులను పరిశీలించారు. పనులువెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రూ.4కోట్ల అంచనాతో చేపడుతున్న బండరావిపాకుల రామన్‌పాడు నీటిపథకానికి ఎమ్మెల్యే రావుల భూమిపూజ చేశారు. అనంతరం రామన్ పాడు పథకం ద్వారా ప్రస్తుతం అందుతున్న గ్రామాలకు అదనంగా మిగిలిన గ్రామాలకు శాశ్వత తాగునీరు అందించడంలో బండరావిపాకుల, రామన్‌పాడు నీటి పథకాన్ని అందిస్తున్నామని, వీటి ద్వారా మిగిలిన గ్రామాలన్నింటికి శాశ్వతంగా తాగునీటి సరఫరా అవుతుందన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ డి ఇ రాములు గౌడును పనులను అడిగితెలుసుకున్నారు. నాణ్యవంతంగాపూర్తిచేయాలని డి ఇని కోరారు. అనంతరం నేరుగా చాకల్‌పల్లికి చేరుకున్న రావుల బుధవారం ఆత్మహత్యకుపాల్పడ్డ ఇంటర్ విద్యార్థి రాము కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి తండ్రి రత్నయ్యకు రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు. గోపాల్‌పేటకు చేరుకుని మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో చేపట్టిన సిసిరోడ్డు పనులను పరిశీలించారు. సిసిరోడ్డుపై క్యూరింగ్ సక్రమంగా చేయడంలేదని, కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆర్ అండ్ బి అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా ప్రజాఫ్రజాపరిషత్ పాఠశాలను సందర్శించగా పాఠశాలకు ప్రహరిగోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పిడి కుమార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పక్కనే ఉన్న బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించగా పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం సుమిత్ర పాఠశాలకు రెగులర్ హెచ్‌యం కావాలని, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, బాలికలకు స్వంత భవనం ఏర్పాటుచేయాలని రావుల దృష్టికి తెచ్చారు. ప్రమాదాలు జరుగకుండా బస్టాండు సమీపంలో ఏర్పాటుచేస్తున్న సిసిరోడ్డు పనులను విశాలంగా వేయాలని అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ తాను ప్రధానంగా ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం తాగునీరు, రోడ్లు, విద్యుత్ సమస్యలపై దృష్టి సారిస్తున్నానని అన్నారు. ప్రమాదాలు జరుగకుండా రోడ్లు ఏర్పాటుచేయాలని, నాణ్యవంతమైన విద్యుత్ సరఫరా చేయాలని కృషిచేస్తున్నాని తెలిపారు. రావుల వెంట మండల దేశం నాయకులు శాంతన్న, సీనియర్ నాయకులు అచ్చుతరామారావు, గోపాల్‌పేట మాజీ సర్పంచ్ దానీలు, బుద్దారం మాజీ సర్పంచ్ శామ్లా నాయక్, మాజీ మండల ఉపాద్యక్షులు రఘురామారావు, నాయకులు గాజుల కోదండం, గోపాల్ తదితరులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
వనపర్తి, నవంబర్15: వనపర్తి పాలకేంద్రం సమీపంలోగురువారం మధ్యా హ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోవర్థనగిరి గ్రామానికిచెందిన ఈదన్న (40), నాచహళ్లి గ్రామానికిచెందిన అశోక్(18) మృతిచెందగా రాజుకు తీవ్ర గాయాలుకాగా, లక్ష్మి స్వల్పంగా గాయపడింది. వనపర్తి నుండి ఎపి22వై 5451అనే ట్రాలీ ఆటో పెబ్బేరుకు వెళుతుండగా పెబ్బేరునుండి ప్యాసింజర్‌ను ఎక్కించుకుని వస్తున్న ఎపి04యు 7559 అనే జీపుఢీకొట్టడంతో జీపులో ప్రయాణిస్తున్న ఈదన్న అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అశోక్, రాజు స్వల్పంగా గాయపడిన లక్ష్మిని అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా అశోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రాజును మహబూబ్‌నగర్ ఆసుపత్రికి రిఫర్‌చేయగా స్వల్పంగా గాయపడిన లక్ష్మికి వనపర్తిలోనే చికిత్సలు జరుపుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష
ఆమనగల్లు, నవంబర్ 15: అత్యాచారం, చీటింగ్, కిడ్నాప్ కేసులలో ఓ నిందితుడికి మహబూబ్‌నగర్ ఏడవ అదనపు కోర్టు న్యాయమూర్తి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ గురువారం తీర్పును ఇచ్చారని ఆమనగల్లు ఎస్సై మనోజ్‌కుమార్ తెలిపారు. 2011 సంవత్సరంలో ఆమనగల్లు పట్టణానికి చెందిన బొడ్డుపల్లి రమేష్ అనే నిందితుడు ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదు కాగా తొమ్మిది మంది సాక్షులను న్యాయమూర్తి విచారించిన అనంతరం గురువారం న్యాయమూర్తి నర్సిములు తుది తీర్పును ఇచ్చారని ఎస్సై తెలిపారు. రమేష్ నిందితుడు అని తేలడంతో ఆయనకు పదేళ్ల జైలుశిక్షతో పాటు 11వేల రూపాయల జరిమానా విధించారని ఎస్సై తెలిపారు.

హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం
* విశ్వహిందూ పరిషత్
చిన్నచింతకుంట, నవంబర్ 15: హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని, హిందూ జాతిమేల్కొని హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని విఎస్‌పి జిల్లా కార్యదర్శి సంగు విశ్వనాథ్ తెలిపారు. గురువారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరై ఆయన మాట్లాడుతూ సామాజికంగా రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన అమాయక హిందువులను వెత్తుకుని మతమార్పిడిలు చేస్తున్నారని, అలాంటి వారిపై హిందూ జాతి యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. గోవధలను నిషేదించాలని, ప్రభుత్వాలు చట్టాలను తీసుకువచ్చినా వాటిని పకడ్బందీగా నిర్వహించకపోవడం చేత దేశంలో గోవధలు విపరీతంగా పెరిగిపోయిందని, ప్రాణకోటికి జీవనాధారమైన గోవును వధించడం వల్ల పర్యావరణం, దెబ్బతింటుందని, గోవులను పూజించే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని మతాలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన తెలిపారు. రామాయణాన్ని ప్రతి ఒక్కరు పారాయణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని,ప్రతి హిందువుకు ఆదర్శప్రియుడైన రాముడిని ఆదర్శంగా తీసుకుని జీవించాలని కోరారు. హిందూ సమాజాన్ని విదేశీ సంస్కృతి దోచుకుంటున్న విధానాన్ని బిఎస్పీ జిల్లా సహాయకార్యదర్శి శ్రీరాం సుధాకర్ ఎండగట్టారు. హిందూ జాతిలోని యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని ఆదర్శ భారతాన్ని నిర్మాణం చేయాలని ఆయన కోరారు. అనంతరం పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. ఈ సమావేశంలో ఆత్మకూర్ ప్రఖండ గౌరవాధ్యక్షులు వెంకటనర్సింహరావు, మండల అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి, భజరంగదళ్ ప్రముఖ్ శివశంకర్ వరప్రసాద్, గోరక్షక్ ప్రముఖ్ కోట్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

* షర్మిల యాత్రను జిల్లాలో విజయవంతం చేయాలి * వైకాపా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి
english title: 
sharmila yathra

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>