పటన్‌చెరు, నవంబరు 15: పటన్‌చెరు మండలం అమీన్‌పూర్ గ్రామ పంచాయతి పరిధిలోని కోట్ల రూపాయల విలువైన అసైన్ భూములకు అక్రమంగా ఎన్‌ఓసి ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు హెచ్చరించారు. పటన్‌చెరు మండలం భానూర్ గ్రామ పంచాయతి పరిధిలోని ఒక రిసార్టులో గురువారం జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్బముగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటన్‌చెరు, రామచంద్రాపురం రెండు మండలాల పరిధిలోని భూములకు ఎలాంటి ఎన్‌ఓసి సర్ట్ఫికేట్లు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పాత తీదీలలో ఆర్‌డిఓ ఎన్‌ఓసిలు ఇచ్చినట్లు ఋజువైతే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పటన్‌చెరు మండలం అమీన్‌పూర్ గ్రామ పంచాయతి పరిధిలోని సర్వే నంబరు 630లో గల ఐదు ఎకరాల అసైన్ భూమికి సంగారెడ్డి ఆర్డిఓ రామచంద్రారావు ఎన్‌ఓసి ఇచ్చారని ఆయన దృష్టికి విలేఖర్లు తీసుకురావడంతో డిఆర్‌ఓ ప్రకాష్‌తో ఫోన్లో తగిన ఆదేశాలు జారీ చేసారు. అసైన్ భూమి ఎన్‌ఓసి విషయంలో తగిన విచారణ జరిపి ఆర్డిఓకు మెమో ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. తదనంతరము పూర్తి స్థాయిలో విచారణ జరపాలని తెలిపారు. 2009వ సంత్సరము నుండి అసైన్ భూములకు ఎలాంటి ఎన్‌ఓసిలు ఇవ్వడానికి వీలులేదని వివరించారు. అనంతరము జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు జిల్లా రిజిస్ట్రార్‌తో సైతం ఫోన్లో మాట్లాడారు. అమీన్‌పూర్ పంచాయతి పరిధిలోని 630 సర్వే నంబరులోని ఐదు ఎకరాల అసైన్ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు. ఇక ముందు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తన దృష్టికి వస్తే జిల్లా రిజిస్ట్రార్‌పైనా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడడంలో రెవెన్యూ అధికారుల భాద్యతారాహిత్యమైన చర్యలను ఎట్టి పరిస్థితులోను ఉపేక్షించేది లేదని ఆయన ఆగ్రహం వెలుబుచ్చారు. అమీన్‌పూర్ పరిధిలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంలో విఫలమైన మండల రెవెన్యూ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ ఆశీర్వాదం, ఇతర శాఖల జిల్లా అధికారులు, పటన్‌చెరు తహసీల్దారు యాదయ్య, ఆర్‌ఐలు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు జాగ్రత్తలు లేకే కార్మికులు మృతి
పటన్‌చెరు, నవంబరు 15: ఆక్టంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమలో గురువారం జరిగిన ప్రమాదానికి ఇద్దరు కార్మికులు నాగేందర్ సాహు గోవర్దన్ గౌడ్ బలి కావడం పారిశ్రామికవాడలో సంచలనానికి దారితీసింది. చుట్టుప్రక్కల గల పరిశ్రమల యజమానులు, కార్మికులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేసారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గత ఎనిమిది మాసాలుగా మూసి ఉంచిన ఆయిల్ ట్యాంక్‌లోకి కార్మికులు దిగడంలో ఇంతటి దుర్ఘటన చోటుచేసుకుంది. ట్యాంక్‌ను తెరిచిన వెంటనే దిగకుండా కొద్ది సేపు అందులోని చెడు వాయువులు బయటికి పోయిన తర్వాత దిగినట్లైయితే ఇంతటి ప్రమాదం సంభవించి ఉండేది కాదని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ అధికారులు తెలియచేసారు. ట్యాంక్‌లో ఆక్సిజన్ లెవల్ పూర్తిగా పడిపోవడంతో అందులోకి దిగిన కార్మికులకు ఊపిరాడలేదన్నారు. ట్యాంక్‌లోకి దిగిన కార్మికునికి నడుముకు తాడు కట్టి, ఏదైనా ప్రాణాపాయ పరిస్థితి సంభవించినప్పుడు పైన ఉన్న కార్మికులు తాడు ద్వార లోనికి దిగిన కార్మికులను లాగడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉండాల్సిందన్నారు. అలాంటి జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ప్రమాదం సంభవించిదని డిప్యూటి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ గంగాధర్‌గౌడ్ తెలిపారు.
నష్టపరిహారం చెల్లించాలి
మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం, టిడిపి, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ తదితర పార్టీలకు చెందిన నాయకులు డిమాండు చేసారు. కార్మికులు అకాల మరణానికి గురి కావడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు.
అతివేగం బలిగొంధి
దుబ్బాక, నవంబర్ 15: అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యవల్లే గురువారం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మూర్ నుంచి సిద్దిపేటకు వస్తున్న టాటా ఇండికా కారు వందకుపైగా స్పీడ్‌తో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్దారించారు. ఆర్మూర్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు సిద్దిపేటలో బంధువులను పరామర్శించేందుకు వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబలించింది. ఒకే కుటుంబానికి చెందిన రాజేశ్వరీ, అలేఖ్య, శివగౌతమ్ మృతి చెందగా శ్రీలేఖ్య, ఆపర్ణ పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ శ్రీ్ధర్ కూడా తీవ్ర గాయాలకు గురైనాడు. చెట్టుకు కారు ఢీకొనడంతో నుజ్జునుజ్జయి మృతదేహాలు బయటకు తీసేందుకు కష్టంగా మారింది. లారీల సాయంతో గంటకు పైగా పోలీసులు శ్రమించి కారులో ఇరుక్కపోయిన మృతదేహాలు, గాయపడ్డవారిని బయటకు తీశారు. ఈ సంఘటనను చూసిన ప్రతి ఒక్కరు తీవ్రంగా చలించి కంటతడి పెట్టడం కనిపించింది. కారు అతివేగమే ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమని చెప్పొచ్చు.
నాణ్యమైన పత్తితో మద్దతు ధర పొందాలి
మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
సిద్దిపేట, నవంబర్ 15 : రైతులు పరిశుభ్రమైన నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. స్థానిక పత్తి మార్కెట్‌యార్డులో గురువారం సిసిఐ పత్తికొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన పత్తికి ప్రభుత్వం 3900 రూపాయల మద్దతు ధర ప్రకటించిందన్నారు. రైతులు 8శాతం తేమలోపు పత్తిని తీసుకొచ్చి గిట్టుబాటు ధర పొందాలన్నారు. రైతులు పత్తిని 9గంటల లోపు యార్డుకు తీసుకరావాలన్నారు. 9-30గంటలకు యార్డు గేటు మూసివేస్తారని, 10గంటలకు పత్తికొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. నాణ్యమైన పత్తిని తీసుకొస్తే రైతులు గిట్టుబాటు ధర పొందవచ్చునన్నారు. మార్కెట్ కమిటి అసిస్టేంట్ డైరెక్టర్ ధన సంపత్ మాట్లాడుతూ రైతులు పత్తిని 8శాతం లోపు తీసుకవస్తేనే ప్రభుత్వం ప్రకటించిన 3900 ధర పొందవచ్చునన్నారు. 9శాతం తేమ వుంటే 1శాతం తగ్గించి, 10 శాతం వుంటే 2శాతం తగ్గించి మద్దతు ధర ప్రకటించారు. పత్తి 7శాతం లోపు తీసువస్తే మద్దతు ధరకు 1శాతం అధికంగా చెల్లిస్తారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్లు నాయిని నర్సింహరెడ్డి, పిడిశెట్టి నర్సింలు, సిసిఐ సెంటర్ ఇంచార్జీ భవాని ప్రసాద్, వ్యాపారులు నందిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చెరకు టన్ను ధర
రూ.2600 ప్రకటించిన
ఎన్‌డిఎస్‌ఎల్ యాజమాన్యం
మెదక్, నవంబర్ 15: మంబోజిపల్లి నిజాం దక్కన్ సుగర్స్ కర్మాగారం యాజమాన్యం చెరకు టన్ను ధర 2600 రూపాయలు ప్రకటించింది. కాగా ఈ ధరను చెరకు రైతులు ఏమాత్రం అంగీకరించడం లేదు. గురువారం ఎన్‌ఎస్‌ఎల్ అతిథిగృహంలో చెరకు రైతులు సమావేశమయ్యారు. జనరల్ మేనేజర్ నాగరాజు రైతుల వద్దకు చేరుకుని యాజమాన్యం నిర్ణయించిన ధరను తెలిపారు. ఇందుకు రైతులు అంగీకరించలేదు. టన్ను ధర 2800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మిట్లు సకాలంలో ఇవ్వాలని, బిల్లులు 15 రోజుల్లో చెల్లించాలని, డిసెంబర్ 15లోగా ఎరువులు సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిడిసి చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్ సిద్దిరాంరెడ్డి, జనార్దన్‌రావు, రైతు నాయకులు నాగిరెడ్డి, నర్సింహారెడ్డి, బాబన్న, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
ఐకెపి కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే మూడురోజుల్లో చెక్కులు పంపిణీ
ఆర్డీఓ నిఖిలారెడ్డి
సిద్దిపేట, నవంబర్ 15: మార్కెట్ యార్డుల్లో ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే 72 గంటల్లో రైతులకు చెక్కులు అందచేస్తున్నట్లు సిద్దిపేట ఆర్డీఓ నిఖిలారెడ్డి పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయమార్కెట్ యార్డులో రైతులకు చెక్కులు పంపిణీ చేసిన ఆనంతరం ఆమె మాట్లాడారు. మార్కెట్‌యార్డులో సివిల్ సప్లయ్, ఐకెపి సెంటర్లలో ధాన్యం విక్రయిస్తే 14రోజుల నుండి నెలరోజుల్లో చెక్కులు అందేవన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు త్వరగా డబ్బులు అందచేయాలనే ఉద్దేశంతో జిల్లాలో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు విక్రయించిన ధాన్యం వోచర్లను కంప్యూటర్ ద్వారా స్కాన్ చేసి సివిల్ సప్లయ్ డిఎంకు పంపించనున్నట్లు తెలిపారు. సివిల్ సప్లయ్ ధాన్యం వోచర్లను పరిశీలించిన ఆనంతరం రైతులు పేరిట బ్యాంకు పంపించనున్నట్లు తెలిపారు. బ్యాంకులు రైతుల పేరిట చెక్కులు అందచేయనున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యం విక్రయించిన మూడు రోజుల్లు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం ఐకెపి ద్వారా ధాన్యం విక్రయించిన ఐదుగురికి చెక్కులు అందచేసినట్లు తెలిపారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ నిరసన
మార్కెట్ యార్డులో చెక్కుల పంపిణీకార్యక్రమం చేపట్టిన తనకు కనీసం సమచారం ఇవ్వరా అని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఆర్డీఓ నిఖిలారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సివిల్ సఫ్లయ్ అధికారులు సమాచారం అందించలేదా ఆర్డీఓ ప్రశ్నించారు. తనకు, మార్కెట్ కమిటీ కార్యదర్శికి ఏవ్వరు సమాచారం అందించలేదని చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఐకెపి సెంటర్ నిర్వాకులను మార్కెట్ చైర్మన్ ప్రశ్నించగా అధికారులు సమాచారం ఇచ్చారని అనుకున్నానని ఇన్‌చార్జి విజయ తెలిపారు. ఈక్రమంలోనే ఆర్డీఓ నిఖిలారెడ్డి వెళ్లిపోయారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఇన్‌చార్జి కార్యదర్శి, ఎడి ధన సంపత్ పాల్గొన్నారు.