భూదాన్‌పోచంపల్లి, నవంబర్ 15: భూదాన్‌పోచంపల్లిలో గురువారం జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు ఆకస్మికంగా తనిఖీచేశారు. రాత్రి వరకు సుమారు మూడు గంటలపాటు జరిపిన తనిఖీ సందర్బంగా ఆయన ఆయాశాఖల పనితీరును తెలుసుకున్నారు. తొలుత పర్యాటక కేంద్రాన్ని సందర్శించిన ఆయన కేంద్రం పురోగతిని తెలుసుకొని పర్యాటకులను రప్పించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దారు ఎ. కుమార్‌తో సమీక్ష జరిపారు. పిల్లాయపల్లి కాలువ వేగవంతం కోసం సాంకేతికమైన అనుమతులను తీసుకుంటున్నామన్నారు. నీలం తుఫాను జిల్లాను కుదుపేయగా, ఆప్రభావంతో రంగుమారిన ధాన్యమైనా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటైన ఐకెపి కేంద్రాలద్వారా జరుగుతున్న కొనుగోలు వివరాలను అధికారులనడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే పరిష్కరించాలన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఏఇ నర్సింగ్‌రావు కలెక్టర్‌కు వివరించారు. మండలంలో 2,664 ఇళ్లు మంజూరికాగా, 1132 ఇళ్లు పూర్తికాగా, 1326 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదని వారికి నోటీసులను అందిస్తు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయనకు తెలుపగా, కలెక్టర్ సంతృప్తిని వ్యక్తంచేశారు. వచ్చేనెలలో తిరుపతిలో జరుగనున్న తెలుగు మహాసభల సందర్బంగా గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయిలో సభలను నిర్వహిస్తున్నామన్నారు. ఇకపై తెలుగు భాషకు ప్రాధాన్యతనివ్వడానికి, అమలుజరుగడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. అయితే మేధావులు,కవులు అన్ని వర్గాలవారు చేయూతనివ్వాలని ఆయన కోరారు. అనంతరం స్థానిక నారాయణగిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న మోడల్‌స్కూల్ పనులను సందర్శించారు. నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తిచేయాలన్నారు. కలెక్టర్ పర్యటనలో తహసీల్దారుతో నాగేశ్వర్‌రావు, విఆర్‌ఓలు సుదర్శన్, నాగేందర్, గృహనిర్మాణ ఏఇ నర్సింగ్‌రావు, చిన్నపాక సైదులు, ఆయాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎటిఎం ఇంటి దొంగల అరెస్టు
26.74లక్షల నగదు స్వాధీనం
ఎస్పీ నవీన్‌గులాటీ
నల్లగొండ, నవంబర్ 15: సంచలనం రేపిన నల్లగొండ పట్టణంలోని ఐసిఐసిఐ ఏటిఎం చోరి గుట్టును నల్లగొండ పోలీసులు రెండు రోజుల్లోనే చేధించి చోరికి పాల్పడిన ఇంటిదొంగలను అరెస్టు చేసి చోరి సొత్తు 26లక్షల 74,600నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నవీన్‌గులాటి గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏటిఎం చోరికి పాల్పడిన నిందితులు అనగంటి రామలింగస్వామి, ఉయ్యాల మల్లేష్‌ను హాజరుపరిచి స్వాధీనం చేసుకున్న సొమ్మును కూడా చూపారు. ఎస్పీ కథనం మేరకు చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన రామలింగస్వామి ఐసిఐసిఐ ఏటిఎం నగదు బదిలీ బాధ్యతలు నిర్వహిస్తున్న రైటర్ సేఫ్ గార్డు ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో క్యాష్ కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఏటిఎం చోరికి 15రోజుల ముందు తన వద్ధ ఉన్న ఏటిఎం డోర్ తాళం చెవి పోయిందని సంస్థ మేనేజర్‌కు తెలిపాడు. దీనిపై సంస్థ అధికారులు అంతగా దృష్టి పెట్టకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న రామలింగస్వామి, ఉరుమడ్ల గ్రామానికి చెందిన ఉయ్యాల మల్లేష్‌తో కలిసి ఏటిఎం చోరి చేసి దర్జాగా బ్రతుకాలని పథకం వేశాడు. దీపావళీ రోజు ఏటిఎంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెడుతారని తెలిసి అదే రోజు మల్లేష్‌తో కలిసి ఏటిఎం చోరికి పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న తాళం చెవితో స్వామి ఏటిఎం డోర్ తెరచి తనకు తెలిసిన పాస్‌వర్డ్‌ను ఉపయోగించి అందులోని నాలుగు బాక్సుల్లో ఉన్న 26లక్షల 90,900నగదును చోరి చేశాడు. అప్పటికే ఏటిఎం బయట పరిసరాలను గమనిస్తు మోటార్ సైకిల్‌పై సిద్ధంగా ఉన్న మల్లేష్‌తో కలిసి లింగస్వామి బైక్‌పై సొమ్ముతో పరారయ్యారు. మార్గమధ్యలో నగదు నిల్వ బాక్సులను ఓ వ్యవసాయ బావిలో పడవేసి నగదును లింగస్వామి తన ఇంట్లో భద్రపరుచుకున్నాడు. ఏటిఎం నిర్వాహణ సంస్థ మేనేజర్ ఇటుకల రాజు ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన టూటౌన్ పోలీసులు ఏటిఎం తాళం చెవి పోయిన విషయంపై దృష్టి సారించి లింగస్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరి మిస్టరీ వీడిపోయింది. లింగస్వామిని, మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్‌కు పంపించారు. కాగా ఏటిఎం చోరి కేసును రెండు రోజుల్లో చేధించిన టూటౌన్ సిఐ టి.మనోహర్‌రెడ్డి, ఎస్‌ఐ కె.శ్రీనివాస్, మహ్మద్ మసియుద్ధిన్, కె.నర్సంహ్మరెడ్డి, వి.సత్తయ్య, ఎన్. సైదులు, ఎండి.అఖిల్, అమీరుద్ధిన్, సలీమ్‌ను ఎస్పీ గులాటీ, ఎఎస్పీ సిద్ధయ్యలు అభినందించారు.
నల్లగొండ కాంగ్రెస్ నూతన సారధిగా తూడి
బొత్స ప్రకటన
నల్లగొండ, నవంబర్ 15: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జి అధ్యక్షుడిగా తాత్కాలిక అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డిని నియమిస్తూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత డిసిసి అధ్యక్షుడు నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన పిదప ఉపాధ్యక్షుడిగా ఉన్న తూడి రెండేళ్లుగా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిసిసి ఇన్‌చార్జి బాధ్యతలను తూడికి అప్పగించడంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల నుండి ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం ఆయన నియామకానికి అనుకూలంగా మారింది. బిసిలకు ఇవ్వాలన్న వాదన వినబడినప్పటికీ చివరకు తూడికే అందరి ఆమోదం లభించడంతో బొత్స ఆయన నియామకాన్ని ఖారారు చేశారు. తూడి దేవేందర్‌రెడ్డి హాయంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నిర్మాణం జరుగాలన్న ఆకాంక్ష కూడా డిసిసి సారధిగా ఆయన ఎంపికకు కలిసివచ్చింది. ప్రస్తుతం తూడి రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసొసియేషన్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తెలుగు మహాసభల విజయవంతానికి కృషి చేయాలి
* కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు
నల్లగొండ రూరల్, నవంబర్ 15: తిరుపతిలో డిసెంబర్ 27 నుండి జరుగనున్న ప్రపంచ తెలుగు మహసభలను కవులు కళాకారులు, రచయితలు కలిసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు కోరారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుభాషా, సంస్కృతి సాంప్రదాయాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని కవులు, కళాకారులందరూ ఒకే వేధికగా ఏర్పాడి యువతరానికి, విద్యార్థులకు జిల్లా ఔనత్వాన్ని చాటి చేప్పేలా ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో తెలుగు భాషా సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్రపై విద్యార్థులకు పోటీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని కోరారు. పానగల్ ఉత్సవాల నిర్వాహణపై చర్చించారు. సమావేశంలో జెసి హరిజవహర్‌లాల్, అదనపు జెసి నీలకంఠం, డిఆర్‌డిఎ పిడి జె.రాజేశ్వర్‌రెడ్డి, డిఇవో జగదీష్, ఆర్‌విఎం పివో బాబు భూక్యా ఐసిడిఎస్ పిడి ఉమాదేవి, జిల్లా యువజన సంక్షేమాధికారి అంజయ్య, ఆర్ ఐవో భాస్కర్‌రెడ్డి, డిపిఆర్‌వో జె. పవన్‌కుమార్, ప్రముఖ కవి రచయిత, విమర్శకులు వేణుసంకోజుతోపాటు పలువురు కవులు, కళాకారులు, నాటక రంగ ప్రముఖులు, రచయితలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తో బడుగు, బహీనవర్గాల అభ్యున్నతి
* పార్టీని వీడే ప్రస్తావన లేదు
* శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్
నల్లగొండ టౌన్, నవంబర్ 15: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల భర్తీలో ఎక్కువగా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరడం జరిగిందన్నారు. త్వరలో ఈ విషయమై జిల్లా నాయకులతోవెళ్లి మరోసారి సిఎం ను కలుస్తానన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే తాను పనిచేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తిలేదని ఆయన స్పష్టం చేశారు. అన్నివర్గాల నాయకులకు కాంగ్రెస్ పార్టీలోనే తగిన అవకాశాలు దక్కుతాయన్నారు. పనిచేసే కార్యకర్తలను, నాయకులను అధిష్టానం ఏదో ఒకరోజు తప్పక గుర్తిస్తుందన్నారు. 2014 లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేసేదిశగా జిల్లా నుంచి బలమైన ఎంపిలను పార్లమెంట్‌కు పంపించేలా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్నిప్రాంతాల అభ్యున్నతికి కృషి చేస్తాన్నారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కత్తుల కోటి, మల్లేష్, కొండేటి మల్లయ్య, బాషాపాక హరికృష్ణ, మునస వెంకన్న, పెరిక వెంకటేశ్వర్లు, బంగరయ్య, బిసి సంఘం నేతలు వైద్యం వెంకటేశ్వర్లు, దుడుకు లక్ష్మీనారాయణ, చోల్లేటి రమేష్, గండిచెర్వు వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
2014లోపే తెలంగాణ
* మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి
తిరుమలగిరి, నవంబర్ 15: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీద పూర్తి విశ్వాసం ఉందని 2014లోపే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ఉద్యానవనశాఖ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ జడ్పీటిసి పాలకుర్తి రాజయ్య కుమార్తె వివాహానికి హాజరైన గురువారం స్థానిక మార్కెట్ కార్యాలయం అతిధి గృహాంలో తన సోదరుడు, సూర్యాపేట శాసనసభ్యుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియాగాంధీ ఆంధ్ర, రాయలసీమ నాయకులను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేస్తుందన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేయగానే మొట్ట మొదట వ్యతిరేకించింది చంద్రబాబేనని విమర్శించారు. ఎవరు ఎమన్నప్పటికి 2014లోపు రెండు రాష్ట్రాల ఏర్పాటు తథ్యమన్నారు. యువకులు ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చివద్దని కోరారు. ముస్లిం మైనార్టీ సోదరులు కాంగ్రెస్‌కు మొదటనుంచి మద్దతు ఇస్తు అండగా ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్ని యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కొత్త పథకాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు జలప్రభ పథకం ద్వారా బీడు భూములను సాగులోకి తేవాడానికి నిధులు వెచ్చించామన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచు పెట్టుకుపోతుందన్నారు. గతంలో టిడిపిలో ఉన్నప్పుడు వైకాపాను దూషించిన సంకినేని వెంకటేశ్వరరావు స్వార్ధ ప్రయోజనాల కోసమే అదే పార్టీలో చేరాడని ఎద్దెవా చేశారు. అంతకుముందు మంత్రి వెంకట్‌రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డిలకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మార్కెట్ మాజీ చైర్మన్ చెవిటి వెంకన్న, ఖమ్మం మార్కెట్ చైర్మన్ రాధకిషోర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి గుడిపాటి నర్సయ్య, మండలపార్టీ అధ్యక్షుడు పాలెపు చంద్రశేఖర్, మాజీ ఉపసర్పంచ్ కొండల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి తనయుడు సర్వోత్తమ్‌రెడ్డి, నాయకులు ప్రతాపరావు, రాంబాబు, నరేష్, సత్తయ్య, వీరమల్లు, కిరణ్‌లు పాల్గొన్నారు.
నల్లగొండ సైకిల్ సారధి ఎవరో !
నేడు చంద్రబాబు ప్రకటన
వంగాల మార్పునకు నిర్ణయం
నల్లగొండ, నవంబర్ 15: నల్లగొండ జిల్లా టిడిపి నూతన అధ్యక్షుడు ఎవరన్నది నేడు తేలిపోనుంది. ప్రస్తుత అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ కొనసాగింపుపై జిల్లా పార్టీ రెండువర్గాలుగా చీలిపోవడంతో గతనెలలో జరుగాల్సిన ఎన్నిక వాయిదా పడగా ఈ వివాదం చంద్రబాబు చెంతకు చేరింది. పెండింగ్‌లో ఉన్న జిల్లా అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని తేల్చేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం తన పాదయాత్ర మధ్యలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడెం వద్ద బస్సులో నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుత అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్‌ను మార్చాల్సిందేనంటు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీమంత్రి, భువనగిరి శాసనసభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్‌రావులతో పాటు మెజార్టీ నాయకులు బాబును గట్టిగా కోరగా మరో ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాత్రం వంగాల స్వామిగౌడ్‌ను కొనసాగించాలని కోరారు. తర్జన భర్జనల అనంతరం స్వామిగౌడ్ మార్పుకు చంద్రబాబు అంగీకరించగా కొత్త అధ్యక్షుడు ఎవరన్నదానిపై మళ్లీ పేచి నెలకొంది. ఉమా, చందర్‌రావులు ఓసి సామాజిక వర్గం నుండి రెగట్ట మల్లిఖార్జున్‌రెడ్డిని, బిసి నుండి సిలివేరు కాశీనాథ్‌ను సూచించగా, మోత్కుపల్లి మాత్రం జిల్లాపార్టీ మాజీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ పేరును సూచించారు. అటు ఎస్టీ కోటాలో దేవరకొండకు చెందిన ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బిల్యానాయక్ పేరు చర్చకు వచ్చింది. ఎవరికి వారు తమ వర్గానికి చెందిన వారినే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని చంద్రబాబువద్ద తమ వాదనలు వినిపించారు. ఇరువర్గాల అభిప్రాయలు, వాదనలు విన్న చంద్రబాబు జిల్లా పార్టీ నూతన అధ్యక్షుడి పేరును నేడు శుక్రవారం వీలు చూసుకుని పాదయాత్ర మధ్యలో ప్రకటిస్తానని చెప్పి సమావేశాన్ని ముగించారు. తెలంగాణలో అదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని ఎస్టీలకు అప్పగించిన చంద్రబాబు నల్లగొండ జిల్లా అధ్యక్ష స్థానాన్ని కూడా వారికే ఇస్తారా అన్నది ప్రశ్నార్ధకమే. అయితే జిల్లా పార్టీలోని గ్రూపుల నేపధ్యంలో చంద్రబాబు బిల్యా సారథ్యంకే మొగ్గుచూపుతున్నారని అంచనా. అలాగే మాజీ అధ్యక్షుడు బడుగు లింగయ్య యాదవ్‌కు కూడా అవకాశం దక్కవచ్చని భావిస్తున్నా హైదరాబాద్, నెల్లూరులలో యాదవ్‌లకు అవకాశం కట్టబెట్టడం ఆయనకు ప్రతికూలంశం. రాష్ట్రంలో టిడిపి జిల్లా అధ్యక్ష పదవుల్లో పద్మశాలి వర్గానికి ఎక్కడ అవకాశం దక్కనందున నల్లగొండ జిల్లాలో కాశీనాథ్ ఎంపికతో ఆలోటు భర్తీ చేయవచ్చని మరో వాదన. ఏదిఏమైన అధినేత చంద్రబాబు మనసులో జిల్లా సైకిల్ సారధిగా ఎవరి పేరు ఉందోనన్న విషయం నేడు ఆయన ప్రకటనతో తేలిపోనుండగా జిల్లా పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరన్నదానిపై తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుండటం విశేషం.
17న జిల్లా హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక
నల్లగొండ టౌన్, నవంబర్ 15: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17, బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమాన్ని ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు జిల్లాస్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి పి.ప్రసాద్‌రావుగురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమానికి క్రీడాకారులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులచే ధ్రువీకరించిన పత్రాలతో హాజరుకావాలని కోరారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్స్ వలిగొండ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 15,16, 17 తేదీల్లో రాష్టస్థ్రాయి స్కూల్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ప్రసాదరావు తెలిపారు. జిల్లాలోని అండర్-17 విభాగంలో ఈనెల 22,23 తేదీల్లో చెరుకుపల్లి, కేతేపల్లి మండలంలో జిల్లా జట్టు ఎంపిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
21 నుంచి బిఇడి సప్లమెంటరీ పరీక్షలు
నిర్వహణాధికారి అంజిరెడ్డి
నల్లగొండ టౌన్, నవంబర్ 15: ఎంజి వర్సిటీ పరిధిలోని బిఇడి కళాశాలలకు ఈనెల 21నుంచి డిసెంబర్ 7వరకు సఫ్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నల్లగొండలోని మహాత్మా గాంధీ వర్సిటీ అడిషనల్ పరీక్షల నిర్వహణాధికారి ప్రొఫెసర్ కె.అంజిరెడ్డి గురువారం తెలిపారు. బిఇడి కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని సూచించారు.
పరీక్షల సమయాలు
ఈనెల 21న పేపర్ -1 ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, 23న పేపర్ -2 క్లాస్‌రూం మెనేజ్‌మెంట్, 26న పేపర్ -3 స్కూల్ మేనేజ్‌మెంట్, 28న పేపర్ -4 ఎడ్యుకేషన్ ఎవాల్యూషన్, 30న పేపర్ 5(ఎ) మెథాడ్స్ ఆఫ్ టీచింగ్ -1 (గణితం, జీవశాస్త్రం, సాంఘిక), డిసెంబర్ 3న పేపర్ 5(బి) మెథాడ్స్ ఆఫ్ టీచింగ్ -2(్భతిక శాస్త్రం), డిసెంబర్ 5న పేపర్ 5(సి) మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డిసెంబర్ 7న పేపర్ -6 మెథాడ్స్ ఆఫ్ టీచింగ్ (ఇంగ్లీష్, తెలుగు, ఉర్దు, హిందీ, మరాఠీ) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని పరీక్షలు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. ఈ అంశాలను విద్యార్థులు గ్రహించి పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.