Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి పెద్దపీట

$
0
0

బోధన్, నవంబర్ 15:కాంగ్రెస్ సర్కారు హాయంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరిగిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం బోధన్ మండలం సాలూరా గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కల్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చక్కని ఉపాధిగా మారిందని అంతేకాకుండా మంచి లాభాలు పంచిపెడుతోందన్నారు. తమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుల అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత నివ్వడమే కాకుండా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తున్నాయన్నారు. ఈ ధరల వలన రైతులు అభివృద్ది పథంలో పయనిస్తున్నారని వివరించారు. ప్రస్తుతానికి 120 శాతం ధరలను పెంచి ఇస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఈ ధరలను మరింత పెంచనున్నామని మంత్రి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖా మంత్రిగా బోధన్ మండలంలో సాగునీటికి సంబంధించి అనేక రకాల పథకాలు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. మంజీరా ఎత్తిపోథల పథకం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉందని తన హాయంలో ఈపథకం ద్వారా రైతులు సాగునీళ్లు తీసుకోగలుగుతున్నారని అన్నారు. మంజీరా చివరి ఆయకట్టులో ఉన్న కల్దుర్కి ఆ ప్రక్క గ్రామాలకు కూడా సాగునీళ్లు అందించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తున్నానని అవసరమైతే మంజీరా నుండి డి 28 ద్వారా నీళ్లను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సాలూరా గ్రామంలో నిరుపేదలకు ఇళ్ల స్థనాలు పంపిణీ చేయనున్నామని ఇందుకోసం స్థలాలు కొనుగోలు చేసి వారికి పంపిణీ చేస్తామన్నారు. అలాగే అర్హులైన వికలాంగులకు పెన్షన్‌లు ఇచ్చేలా తాను అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. తనకు సహకరించినా, సహకరించక పోయినా అభివృద్ది విషయంలో ప్రజల కోసం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ గంగాశంకర్, కాంగ్రెస్ నాయకులు గంగాధర్ రావ్ పట్వారీ, గ్రామాభివృద్ది కమిటి సభ్యులు అల్లె సాయన్న, గ్రామ మాజీ సర్పంచ్ రాజేశ్వర్ పటేల్, మాజీ ఎంపిటిసి బుద్దె రాజేశ్వర్, తహశీల్దార్ రాజేశ్వర్, ఎంపిడివో మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెయ్యి రూపాయల పెన్షన్
సాధించుకునే వరకు ఉద్యమించాలి
*ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
రెంజల్, నవంబర్ 15: వృద్ధ్దులు, వితంతువులు వేయి రూపాయల పెన్షన్‌ను సాధించుకునే వరకు ఉద్యమించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం రెంజల్ మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వృద్ధులు ప్రస్తుతం ఇస్తున్న రెండు వందల రూపాయల పెన్షన్ ఏ మాత్రం సరిపోదన్నారు. ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోయాయని ఇటువంటి పరిస్థితుల్లో సర్కారు ఇచ్చే పెన్షన్‌తో వారు ఏ విధంగా గడుపుతారని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలలో వేయి రూపాయల పెన్షన్‌లు ఇస్తున్నా ఇక్కడి ప్రభుత్వం రెండు వందల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. వికలాంగులు, వృద్దులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో వాగ్ధానాలు ఇచ్చిన కాంగ్రెస్ నేడు వారిని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కూడా ఎమ్మార్పీఎస్ ఉద్యమంతోనే వచ్చిందన్నారు. కావున వేయి రూపాయల పెన్షన్ కోసం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. ఈ ఉద్యమంలో అన్ని వర్గాలకు చెందిన వృద్దులు, వితంతువులు పాల్గొని తమ డిమాండ్‌ను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాణిక్కోల గంగాధర్, దుర్గాప్రసాద్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

అక్రమాలను ఆధారాలతో సహా ప్రస్తావించి
అధికారులను ఇరకాటంలో పెట్టిన ఎమ్మెల్యేలు
*వాడివేడిగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం *మీ-సేవా, ఇజిఎస్ అక్రమాలను ఎండగట్టిన సభ్యులు *సమగ్ర విచారణ కోసం కమిటీల నియామకం
నిజామాబాద్, నవంబర్ 15: జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో గురువారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. వివిధ పథకాల అమలులో లెక్కకుమిక్కిలి చోటుచేసుకుంటున్న అక్రమాల గురించి సమావేశంలో ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా ప్రస్తావిస్తూ అధికారులను ఇరకాట స్థితికిలోను చేశారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో అవకతవకలు, మీ సేవా కేంద్రాల నిర్వహణలో అక్రమాలపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. దీంతో సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. జహీరాబాద్ ఎంపి సురేష్‌శెట్కార్, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, యెండల లక్ష్మినారాయణ, ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, కలెక్టర్ క్రిస్టీనా తదితరులు పాల్గొన్న సమావేశంలో, మొదటగా గత సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై తీసుకున్న చర్యల గురించి అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యను కామారెడ్డి ఎమ్మెల్యే అడిగినట్టు యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌లో పేర్కొనడం పట్ల ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మినిట్స్ బుక్‌ను రాసే అధికారికి చార్జ్‌మెమో జారీ చేసి వివరణ కోరాలని ఎంపి మధుయాష్కీ కలెక్టర్‌కు సూచించారు. బిఆర్‌జిఎఫ్ పనులపై చర్చ జరుగుతుండగా, 2012-13వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో నాలుగైదు నెలల కాలం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ నిజామాబాద్, మెదక్ జిల్లాలకు ఇంతవరకు నిధులు విడుదల కాకపోవడానికి కారణమేమిటని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. ఆడిట్ రిపోర్ట్, యుసిలను సమర్పించని కారణంగానే కేంద్రం నుండి నిధులు మంజూరు కాలేదని ఆక్షేపించారు. దాదాపు 22కోట్ల రూపాయల నిధులు నిలిచిపోవడం వల్ల జిల్లాలో అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జడ్పీ ఇంచార్జ్ సిఇఓ సురేష్‌బాబు వివరణ ఇస్తూ, తాము గత అక్టోబర్ మాసంలోనే ఆడిట్ రిపోర్టు, యుసిలను సమర్పించామని, అయినప్పటికీ నిధులు విడుదల కాలేదని, ఈ విషయమై కమిషనర్ కార్యాలయం నుండి సైతం స్పష్టమైన సమాధానం రావడం లేదని పేర్కొనడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ఆలస్యంగా గత అక్టోబర్ మాసంలో ఆడిట్ నివేదికలు పంపించడం ఏమిటని, అధికారులు తప్పిదాలు చేస్తూ తమను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పోచారం ఆగ్రహం ప్రదర్శించారు. నిధుల మంజూరీ విషయమై కమిషనర్‌తో తానే స్వయంగా మాట్లాడతానని కలెక్టర్ క్రిస్టీనా పేర్కొనడం శాంతించారు. కాగా, మీ-సేవా కేంద్రాల మంజూరీ, నిర్వహణలో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎందుకు మిన్నకుండిపోతున్నారని ప్రభుత్వ విప్ అనిల్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను ఆక్షేపించారు. భిక్కనూరు మండలంలో శ్యాంసుందర్ అనే వ్యక్తి ఒకే చోట రెండు కేంద్రాలను మంజూరు చేయించుకున్నాడని, రాజంపేటలో తండ్రి పేరిట మరో మీ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఫొటోలను ప్రదర్శించారు. మీ సేవా కేంద్రాలు కరప్షన్ సెంటర్లుగా మారాయని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. డిఆర్‌ఓ జగదీశ్వరాచారి వివరణ ఇస్తూ, నిబంధనలకు అనుగుణంగానే మీ సేవా కేంద్రాలను మంజూరు చేశామని, అక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 28 కేంద్రాలను తొలగించామని, గాంధారిలో ఆపరేటర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయించామని సభ్యుల దృష్టికి తెచ్చారు. ఈ విషయమై ఎంపి మధుయాష్కీ మాట్లాడుతూ, ఎంతో విస్తృత ప్రయోజనాలను ఆశిస్తూ ఏర్పాటు చేసిన మీ సేవా కార్యక్రమాన్ని నా సేవగా మార్చుకోవడాన్ని ఎంతమాత్రం ఉపేక్షించరాదని, ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం ఉపాధి హామీపై చర్చ జరుగగా, ఈ పథకంలో 8.65కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్టు సామాజిక తనిఖీ బృందాల పరిశీలనలో వెల్లడైనప్పటికీ, వాస్తవంగా 1.33కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టు ఆధారాలు లభ్యమయ్యాయని డ్వామా పి.డి పేర్కొన్నారు. దీనిపై ఎంపి మధుయాష్కీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సోషల్ ఆడిట్‌లో పెద్దఎత్తున నిధులు గల్లంతైనట్టు తేలితే, ఆ మొత్తాన్ని మీరు ఏ ప్రాతిపదికన తగ్గించారని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన ఎంపిడిఓలు, ఎఇలు, ఇతర ఉన్నతాధికారులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా, కేవలం కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగంతో 17మంది ఎంపిడిఓలకు ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణ జరిగినప్పటికీ, ఇంకనూ వారు దర్జాగా విధుల్లో కొనసాగుతున్నారని అన్నారు. ఈ తీరును చూస్తుంటే అక్రమార్కులను చట్టపరమైన చర్యల నుండి కాపాడేందుకు అధికారులే అండదండలు అందిస్తున్నట్టుగా ఉందని మండిపడ్డారు. ఇజిఎస్ అక్రమాలపై సమగ్ర విచారణ కోసం ప్రభుత్వ విప్ అనిల్, ఎమ్మెల్యే పోచారంలతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఎంపి మధుయాష్కీ ప్రకటించారు. గ్రామాల్లో చేతిపంపుల మరమ్మతులపై దృష్టిని కేంద్రీకరించాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలను త్వరితగతిన జరిపించి నీటి వసతి కల్పించాలని, కామారెడ్డి డివిజన్‌కు తాగునీటిని అందించేందుకు 140కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పథకంలో లొసుగులను తెలుసుకునేందుకు సుదీర్ఘకాలం పాటు ట్రయల్న్ జరిపించాలని సమావేశంలో నిర్ణయించారు.
కాంగ్రెస్‌కు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు
*27న జిల్లాలో ‘బాబు’ పాదయాత్ర *టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం
కంఠేశ్వర్, నవంబర్ 15: ఎంఐఎం మద్దతు ఉపసంహరణతో మైనార్టీలోపడ్డ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో కొనసాగే నైతికత ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బల నిరూపణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. గురువారం టిడిపి జిల్లా సర్వసభ్య సమావేశం నగర శివారులోని అమృతగార్డెన్‌లో నిర్వహించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ, అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్సార్‌సిపి, టిఆర్‌ఎస్ పార్టీలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి, అవినీతి పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా అధికారం కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ అవలంభిస్తున్న తప్పుడు విధానాలను వ్యతిరేకిస్తూ ఎంఐఎం పార్టీ సైతం ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడినందువల్ల నైతికబాధ్యతగా అధికారం నుండి తప్పుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వాన్ని బల నిరూపణకు గవర్నర్ ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు అధికార పార్టీతో వైఎస్సార్‌సిపి, టిఆర్‌ఎస్‌లు కుమ్మక్కై, మరోవైపు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనేక డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. వైఎస్ హయాంలో టిఆర్‌ఎస్‌ను చీల్చడానికి ప్రయత్నించిన హరీష్‌రావుకు టిడిపి విశ్వసనీయతపై మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్, పార్లమెంట్‌లో సమైక్యవాద ప్లకార్డ్ ప్రదర్శించిన వైఎస్సార్‌సిపి పార్టీలను టిఆర్‌ఎస్ నాయకులు విమర్శించకుండా తెలుగుదేశంపై తప్పుడు ప్రచారం చేయడం శోచనీయం అన్నారు. చంద్రబాబు పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి ఇతర పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని అన్నారు. అందువల్లే సహనం కోల్పోయి టిడిపిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. టిడిపి హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించాలని సవాల్ విసిరారు. అన్ని పక్షాలను కలుపుకుపోయి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించాల్సిన టిఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణకు అనుకూలంగా ఉన్న టిడిపిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో తెలంగాణపై రాజకీయ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లం అవుతుందని అన్నారు. కాగా, టిడిపి అధినేత చేపట్టిన ‘వస్తున్నా-మీ కోసం’ పాదయాత్ర ఈ నెల 27న జిల్లాలో ప్రవేశించనుందని కడియం శ్రీహరి తెలిపారు. జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో ఏడు రోజుల పాటు పాదయాత్ర కొనసాగి డిసెంబర్ 5న బాసర వద్ద అదిలాబాద్ జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుందన్నారు.
జుక్కల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, బాన్సువాడ నియోజకవర్గానికి ఆర్మూర్ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణ, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, బోధన్ నియోజకవర్గానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డిలను నియమించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడటానికే తమ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్న మీకోసం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌గౌడ్, అర్కల నర్సారెడ్డి, ఎమ్మెల్యేలు అన్నపూర్ణ, హన్మంత్‌సింధే, టిడిపి నాయకులు యూసుఫ్‌అలీ, మోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌బాబు, వేణుగోపాల్, నరేందర్‌గౌడ్‌తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ముగ్గురు మృతితో విషాదఛాయలు
ఆర్మూర్, నవంబర్ 15: మెదక్ జిల్లా దుబ్బాక మండల శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన ముగ్గురు మరణించడంతో ఇక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మరణించిన వారిలో అలేఖ్య(21), శివగౌతం(11), రాజరాజేశ్వరి(70)లు ఉండగా, గాయపడిన వారిలో అపర్ణ, శ్రీలేఖ్యలు ఉన్నారు. వివరాలు ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలోని పెద్దబజార్‌లో నివాసం ఉండే ప్రభుత్వ ఉద్యోగి నగేష్ శర్మ తల్లి రాజరాజేశ్వరి, భార్య అపర్ణ, కుమార్తెలు అలేఖ్య, శ్రీలేఖ్య, కుమారుడు శివగౌతం గురువారం మెదక్ జిల్లా దుబ్బాక మండలం హబీపూర్ గ్రామానికి కారులో బయలుదేరి వెళ్లారు. హబీపూర్ గ్రామానికి కొద్దిదూరంలో కారు ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన రాజరాజేశ్వరి, అలేఖ్య, శివగౌతం మరణించగా, అపర్ణ, శ్రీలేఖ్యలకు గాయాలయ్యాయి. మరణించిన అలేఖ్య ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతుండగా, శివగౌతం విజయ్ హైస్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

మైనార్టీలను కాంగ్రెస్‌కు దూరం చేసేందుకు కుట్ర
*ఎంపి మధుయాష్కీ
నిజామాబాద్, నవంబర్ 15: ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసేందుకు రాష్ట్రంలోని పలు రాజకీయ పక్షాలు కుట్రలు చేస్తున్నాయని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ విమర్శించారు. ఇందులో భాగంగానే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌ను మతతత్వ పార్టీగా పేర్కొనడం జరిగిందని, ఇది ఎంతమాత్రం సరికాదన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, గడిచిన చాలాకాలం నుండి అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం పార్టీ మద్దతును ఉపసంహరించుకోవడం బాధాకర పరిణామమని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని మతతత్వ పార్టీగా ఆరోపించడం శోచనీయమన్నారు. రాజకీయ కారణాల వల్ల ఎంఐఎం కాంగ్రెస్‌ను వీడి, ఇతర పార్టీలకు చేరువ కావాలని భావిస్తే అది వారి ఇష్టమని, అంతమాత్రాన కాంగ్రెస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ అభాండాలు వేయడం ఏమేరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్‌సిపితో జత కట్టేందుకే ఎంఐఎం కాంగ్రెస్‌కు దూరమైందన్న ప్రచారం జరుగుతోందని, జైలులో ఉన్న జగన్‌ను అసదుద్దీన్ ఒవైసి కలవడం, సన్నిహితంగా మెలగడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోందన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వాస్తవానికి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తోందని, ఇతర వర్గాలతో సమానంగా మైనార్టీలను అభివృద్ధిలోకి తేవాలనే సంకల్పంతో ముందుకెళ్తోందని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే సచార్ కమిటీని ఏర్పాటు చేశామని, ప్రధానమంత్రి 20 సూత్రాల పథకం అమలుతో పాటు, ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ పార్టీకే దక్కిందని గుర్తు చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ వెంటే ఉంటారని అన్నారు. కాగా, తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ను మార్చే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వదంతులపై ఎంపి మధుయాష్కీ ఆచితూచి స్పందించారు. యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నిర్ణయం పైనే సిఎం మార్పు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. సిఎంను మార్చాలా, వద్దా అన్నది సోనియా నిర్ణయిస్తారు తప్ప, కాంగ్రెస్ అనుబంధ (మిత్రపక్షాలు) పార్టీలు డిమాండ్ చేసినంత మాత్రాన మార్పులు, చేర్పులు ఉండవని స్పష్టం చేశారు. ఎంఐఎం మద్దతును ఉపసంహరించుకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని, తమ ప్రభుత్వం మైనార్టీలో పడలేదని అన్నారు.
ఒకవేళ అధిష్ఠానం తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువరిస్తే, ప్రభుత్వం మైనార్టీలో పడి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుందని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు.

* మంత్రి సుదర్శన్‌రెడ్డి
english title: 
minister

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>