Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భార్యా హంతకుడికి జీవిత ఖైదు

$
0
0

మహబూబాబాద్, నవంబర్ 15: భార్యను గొడ్డలితో నరికి చంపిన సంఘటనలో నిందితుడైన భర్తకు జీవితఖైదు విధిస్తూ మహబూబాబాద్‌లోని జిల్లా ఆరవ అదనపు జడ్జి వై. గణపతిరావు గురువారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 2009 డిసెంబర్ 22న రిక్షా కార్మికుడైన బానోతు కిషన్‌నాయక్.. భార్య బానోతు బుజ్జిని హతమార్చాడు. ఖమ్మం జిల్లా గౌరారం మండలం కిష్టాపురానికి చెందిన బుజ్జితో కిషన్‌కు 15సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. పనికి వెళ్లకుండా కిషన్ నిత్యం తాగి భార్యను వేధించేవాడు. దీంతో విసిగి వేసారిన బుజ్జి 2009 డిసెంబర్ 20న తన పిల్లలతో కలిసి బాబాగుట్ట కాలనీలో ఉండే తన అన్న మాలోతు హరి ఇంటికి వెళ్లిపోయింది. ఆ మరుసటి రోజే అక్కడికి వెళ్లిన కిషన్ బతిమిలాడి భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ రోజు రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ చెలరేగింది. 22వ తేదీ ఉదయం నిద్రిస్తున్న భార్యను కిషన్ గొడ్డలితో నరికి చంపాడు. అప్పటి సిఐ ప్రభాకర్‌రావు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. 18మంది సాక్షులను విచారించిన జిల్లా జడ్జి తీర్పునిస్తూ కిషన్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు 200 రూపాయలు జరిమానా విధించారు.

మావోల బంద్ విఫలం
ఏటూరునాగారం, నవంబర్ 15: గ్రీన్‌హంట్‌కు నిరసనగా సిపిఐ మావోయిస్టు ఉత్తర తెలంగాణ కమిటీ ఇచ్చిన 48గంటల బంద్ పిలుపుమేరకు మొదటిరోజు గురువారం మండలకేంద్రంలో బంద్ పూర్తిగా విఫలమయింది. మండల కేంద్రంలోని వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్‌బంక్‌లు, సినిమాహాళ్లు, హోటల్లు, పాన్‌షాపులు యాథావిధిగా నడిచాయి. అంతేకాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక ఎస్సై సంజీవరావు తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
మంగపేట మండలంలో...
మంగపేట: మావోయిస్టుల పిలుపు మేరకు మంగపేట మండలంలో బంద్ పూర్తిగా విఫలమయింది. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని వ్యాపార, వాణిజ్య వర్గాలు యథావిధిగా నడవగా, ఆర్టీసీ బస్సులు కూడా రోజూ మాదిరిగానే తిరిగాయి. మండలంలో బంద్ ప్రభావం ఏమాత్రం కనపడకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

నిత్యావసరాలు ప్రియం!
డోర్నకల్, నవంబర్ 15: ప్రస్తుతం అన్ని రకాల ధరలు రెట్టింపు అయ్యాయి. పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు ధరలు విపరీతంగా పెరిగాయి. చెక్కర, బెల్లం ధరలు మరితం చేదెక్కాయి. నూనెల ధరలు భగభగమంటున్నాయి. డీజిల్, పెట్రోల్ ధరల పెంపు పుణ్యమా అని ఇప్పటికే కూరగాయలు, బియ్యం, చింతపండు, ఉల్లి, వెల్లుల్లిలపై పడి ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్య జీవితంలో ఈ భారాన్ని మోయకతప్పట్లేదని పలువురు మహిళలు వాపోతున్నారు. ఇక పేద వర్గాల పరిస్థితి చెప్పనక్కరలేదు. ధరలు పెరగడానికి కొందరు హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరిగాక సరకులు మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారని వినికిడి. ఇదే అదునుగా భావించి చిల్లర వ్యాపారులు వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు. అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించాల్సిన ప్రభుత్వ శాఖలు పట్టించుకోకపోవడమే ప్రస్తుత ధరల దుస్థితికి కారణమవుతుందని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. తుపాన్ వర్షాల తరువాత కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని రకాల కూరగాయలు ఒక్క రోజు తేడాతోనే రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి సరకు దిగుమతి కాకపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్ వర్గాలు చెబుతుండగా.. రవాణా ఖర్చులు తడిసి మోపెడవడంతో ధరలు పెంచాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. పల్లీ నూనె ప్రస్తుతం రూ. 106కు చేరింది. అదేవిధంగా సన్‌ఫ్లవర్ రూ. 81, పామాయిల్ రూ. 55, నెయ్యి రూ. 305, మినపప్పు కిలో రూ. 68, కందిపప్పు రూ. 76, పెసరపప్పు రూ. 76, శనగపప్పు రూ. 75, పుట్నాలు రూ. 100, పల్లీలు రూ. 120, బియ్యం కిలో ఒక్కంటికి రూ. 32 నుంచి రూ. 36 వరకు, బెల్లం రూ. 50, పంచదార రూ.40, శనగపిండి రూ. 70, గోధుమపిండి రూ. 25, మైదా పిండి రూ.30, ఇడ్లీ రవ్వ రూ.30, ఉప్మా రవ్వ రూ. 30, నువ్వులు రూ. 130, చింతపండు రూ. 80, ఎండుమిర్చి రూ. 100, టమోటా కిలో రూ. 20, పచ్చిమిర్చి రూ. 40, వంకాయ రూ. 20, కాకరకాయ రూ. 30, బీరకాయ రూ. 30, బెండకాయ రూ. 24, దోసకాయ రూ. 12, చిక్కుడు రూ. 32, క్యాబేజి రూ. 20, దొండకాయ రూ. 15, ఆలు రూ. 20, క్యారెట్ రూ.40, ఉల్లి రూ.30 ఈ విధంగా ధరలు డోర్నకల్ మార్కెట్‌లు కొనసాగుతున్నాయి. వీటిని కొనేందుకు పేద, మధ్యతరగతి కుటుంబాలు చాలా అవస్థలు పడుతున్నారు.

ఓరుగల్లు పోలీసులకు ఇక హెల్మెట్ తప్పనిసరి
వరంగల్, నవంబర్ 15: వరంగల్ అర్బన్ పోలీసు జిల్లా, రూరల్ పోలీసు జిల్లా పరిధిలో పనిచేసే పోలీసు సిబ్బంది ఇక తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలసి ఉంటుంది. ఈ మేరకు అర్బన్, రూరల్ జిల్లాల ఎస్పీలు గురువారం ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్లు పూర్తిస్థాయిలో వినియోగించడానికి రెండురోజుల అవకాశం కల్పించారు. బుధవారం సాయంత్రం వరంగల్ నగరంలోని నయింనగర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటం, ఆయనను ఆసుపత్రికి తరలించేలోగా మరణించడం పోలీసు సిబ్బందిని తీవ్రంగా కలచివేసింది. తలకు బలమైన గాయం తగిలిన కారణంగా ఆ కానిస్టేబుల్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. తలకు హెల్మెట్ లేని కారణంగా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం గమనించిన అర్బన్, రూరల్ ఎస్పీలు ఒకరినొకరు చర్చించుకుని పోలీసు సిబ్బంది అందరూ శనివారం నుంచి హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీలు జారీ చేసిన ఆదేశాల ప్రకారం పూర్తిస్థాయిలో హెల్మెట్లు ఉపయోగించేందుకు రెండురోజులు అవకాశం ఇస్తారు. అప్పటికీ హెల్మెట్లు ధరించకుంటే మొదటిసారి హెచ్చరిక చేస్తారు. పరిస్థితిలో మార్పు లేకుంటే హెల్మెట్లు ధరించని పోలీసు సిబ్బందికి జరిమానా విధిస్తారు. అయినా కూడా పద్దతి మార్చుకోకుండా పోలీసు సిబ్బంది హెల్మెట్ లేకుండా తిరిగితే వారి టిఎ బిల్లులు నిలిపివేస్తారు. అప్పటికీ కూడా హెల్మెట్లు ధరించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హెల్మెట్లు ధరించకుండా విపరీతమైన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులై నగరంలో గత కొంతకాలంగా చాలామంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం జరిగిన ఘటనతో స్పందించిన జిల్లా అధికారులు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా మొదట పోలీసుశాఖ సిబ్బంది నుంచే హెల్మెట్లు పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు ప్రారంభించారు. పోలీసులంతా హెల్మెట్ల వినియోగం జరిపితే ఆ తరువాత వరంగల్ నగరంలో, అనంతరం జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సామాన్య ప్రజలకు కూడా హెల్మెట్ల వినియోగాన్ని విధిగా అమలుచేసేందుకు అర్బన్, రూరల్ జిల్లాల పోలీసు యంత్రాంగం సన్నాహాలకు ఉపక్రమించింది.

ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో.. మృతదేహాలకు పోస్టుమార్టం
కేసముద్రం, నవంబర్ 15: కేసముద్రం మండలం ఇంటికనె్న రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం లభించిన ఇద్దరు విద్యార్థినులు బానోతు అనూష, జాటోత్ వనిత మృతదేహాలకు గురువారం వరంగల్ ఎంజిఎంలో కాకతీయ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ హేమంత్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు రైల్వేట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించగా ఈ విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. మహబూబాబాద్ డిఎస్పీ రమాదేవి స్వయంగా రంగంలోకి దిగి క్లూస్‌టీం, జాగిలాలను సంఘటనా స్థలికి రప్పించడంతో మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం తరువాత సంఘటనా స్థలాన్ని నుంచి కదిలించారు. ఫలితంగా మృతదేహాలు వరంగల్ చేరేసరికి రాత్రి కావడంతో బుధవారం పోస్టుమార్టం నిర్వహించలేకపోయినట్లు సమాచారం. దీనికితోడు మృతులిద్దరు మహిళలు కావడంతో మహిళా డాక్టర్ పర్యవేక్షణ అవసరం కావడంతో పోస్టుమార్టం గురువారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం డాక్టర్ హేమంత్ సారధ్యంలో మహిళా డాక్టర్ విద్యార్థినుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జిఆర్‌పి డిఎస్పీ దక్షిణామూర్తి, సిఐ రవికుమార్, ఎస్సై శంకర్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణను ముమ్మరం చేసే అవకాశాలున్నాయి.

జిపి కార్మికుల వినూత్న నిరసన
తొర్రూరు, నవంబర్ 15: చాలిచాలని వేతనాలతో దుర్భర జీవితాన్ని గడుపుతూ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు కొనసాగిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు ఆరోపించారు. అమరవీరుల స్థూపం వద్ద దీక్షలు చేస్తున్న పంచాయతీ కార్మికులకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మికులు గుండ్లు కొట్టించుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. నిత్యావసర ధరలు పెరిగాయని, దీనికి అనుగుణంగా వేతనాలు లేక కార్మికులు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మేకల కుమార్, జీపి కార్మికులు కొమ్ము దేవేందర్, వెంకట్రాంనర్సయ్య, కుమార్, బొల్లం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మానుకోట మున్సిపాలిటీకి 2 కోట్లు విడుదల
మహబూబాబాద్, నవంబర్ 15: మహబూబాబాద్ మున్సిపాల్టీకి రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు విడుదల చేసిందని స్థానిక ఎమ్మెల్యే మాలోతు కవిత వెల్లడించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నిధులలో 50 లక్షల రూపాయలను వెచ్చించి మున్సిపాల్టీ కార్యాలయ భవన నిర్మాణం చేపడతామని తెలిపారు. మిగతా కోటి 50 లక్షల రూపాయలతో పట్టణంలో అవసరమున్న చోట రోడ్లు, సైడు కాల్వల నిర్మాణం చేపడతామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీలు, నగర పంచాయితీల పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం 34 కోట్ల రూపాయలను విడుదల చేయగా అందులో భాగంగానే మహబూబాబాద్‌కు రెండు కోట్ల రూపాయలు విడుదలైనట్లు ఎమ్మెల్యే వివరించారు. కాగా మహబూబాబాద్ మున్సిపాల్టీ ద్వారా ట్రాన్స్‌కోకు రెండు కోట్ల రూపాయలు బకాయి పడగా తాను చొరవ తీసుకుని కోటి రూపాయలు చెల్లింపచేశానని అన్నారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, మల్గిరెడ్డి సుధ, ముత్యం వెంకన్న, ఇక్బాల్, మెడికల్ బాబు తదితరులు పాల్గొన్నారు.

నిధుల సేకరణ కోసమే ఉత్సవాలు వాయిదా
* మంత్రి సారయ్య
వరంగల్ బల్దియా, నవంబర్ 15: కాకతీయ ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించడానికి అవసరమైన నిధుల సేకరణ కోసం ఉత్సవాలను డిసెంబర్ నెలకు వాయిదా వేశామని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం నగరంలోని వరంగల్ రైల్వేగేటు వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి స్థలాన్ని మంత్రి సారయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సారయ్య విలేఖరులతో మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాలను త్వరలోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాకతీయుల కళా వైభవాన్ని ప్రతిభింబించే విధంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. మేడారం జాతరకు అధిక నిధులను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. నగరంలో పేరిణి నృత్య ఉత్సవాలను వైభవంగా నిర్వహించిందని చెప్పారు. కాకతీయ ఉత్సవాల నిర్వహణపై ఎటువంటి అపోహాలకు తావులేదని అన్నారు. సాంకేతిక కారణాలతో ఉత్సవాలను వాయిదా వేసిందని తెలిపారు. వరంగల్ రైల్వేగేటు వద్ద ఆర్వోబి నిర్మాణం చేస్తామని మంత్రి సారయ్య స్పష్టం చేశారు. ప్రజలు, వ్యాపారుల మనోభావాలు దెబ్బతినకుండా ఆర్వోబిని నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వివేక్‌యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వ్యతిరేకులను తరిమికొట్టాలి
* ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ పిలుపు
వరంగల్, నవంబర్ 15: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు తపిస్తున్న నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను కాదని కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర విషయంలో కాంగ్రెస్‌తోపాటు టిడిపి, సిపిఎం పార్టీలు కుమ్మక్కై తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని కకావికలం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గురువారం రాత్రి వరంగల్ నగరానికి చేరుకున్న బస్సుయాత్ర సందర్భంగా హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ప్రభుత్వం నాన్చుడుధోరణి అవలంభించడం చేత తెలంగాణలో 700మందికిపైగా విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, దీనికి కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు కాంగ్రెస్, సిపిఎం, టిడిపి పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో కరువు అంటూ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆటలు ఆడుకుంటున్నాయని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో వేలాది హెక్టార్ల ఎకరాలలో నీలం తుఫాన్‌తో రైతులు అష్టకష్టాలు పడుతుంటే ఏ నాయకుడు కూడా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని పరామర్శించలేదని చెప్పారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆంధ్రలో ప్రజాసంక్షేమం కోసం చేపట్టిన పాదయాత్ర కేవలం స్వార్థపూరితంగా ఉన్నదేనని అంటూ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ కోవలోనే నడుచుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్ధాల తరబడి ఉద్యమాలు నిర్వహిస్తున్నా కనీసం పాలకులు ఎటువంటి చలనం లేకుండా వ్యవహరిస్తూ ఉండటం చేత తెలంగాణలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్రంలోని యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ డిసెంబర్ తొమ్మిదవ తేదీన చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండకుండా మాట తప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు, మేథావులు, కవులు, కళాకారులు ఐక్య ఉద్యమాలను నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎల్‌డిపి జిల్లా అధ్యక్షుడు రియాజ్, నాయకులు వర్థన్, శోభారాణి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

* జిల్లా ఆరవ అదనపు జడ్జి తీర్పు
english title: 
life term

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>