అజిత్‌సింగ్‌నగర్, నవంబర్ 16: ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పోలింగ్ బూత్ స్థాయిలోనే తగిన జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి పొరపాట్లు జరుగకుండా అర్హులైన అందరినీ ఓటర్లుగా చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా పరిశీలకుడు సి పార్ధసారథి రెవెన్యూ అధికారులకు సూచించారు. జిల్లాలో బూత్ స్థాయి కేంద్రాలను పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూత్‌లెవల్ సెంటర్లలో తీసుకున్న జాగ్రత్తలు, నూతన ఓటర్ల నమోదు, యువతను ఓటర్లుగా నమోదుచేసే ప్రక్రియలో తీసుకున్న చర్యలు, సాఫ్ట్‌వేర్ సమస్యలు, బూత్‌లెవల్ ఏజెంట్ల నియామకం, వంటి విషయాలపై విస్తృతంగా సమీక్షించిన ఆయన పలు సూచనలు చేసారు. ఎన్నికల సమయంలో ఓట్లు గల్లంతు అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బూత్‌లెవల్ ఏజెంట్ల నియామకం వల్ల మంచి ఫలితాలు వస్తాయని, ఇందుకు రాజకీయ పక్ష నేతలను చైతన్యపర్చి వారి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారులు తీసుకున్న చర్యల వల్ల ఓటర్ల నమోదు ప్రక్రియలో ముందంజలో ఉండటం హర్షనీయమన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని బూత్‌లెవల్ కేంద్రాలను సందర్శించానని తెలిపారు. ఇతర జిల్లాలో కేవలం 40 నుంచి 45 శాతం మాత్రమే ఓటర్ల నమోదు కాగా జిల్లాలో 70శాతం కావడం అభినందనీయమన్నారు. జనాభా లెక్కల ప్రకారం మహిళలు తక్కువగా ఉన్నప్పటికీ ఓటర్లుగా మహిళలు ఎక్కువగా ఉండటం గమనార్హమని, జనాభా లెక్కల ప్రకారం స్ర్తి, పురుష ఓటర్ల నిష్పత్తి ఉండాలని ఆయన సూచించారు. ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలను అమలుచేస్తూ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ ఎం జ్యోతి పరిశీలకునికి వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి ఉషారాణి, మున్సిపల్ కమిషనర్ అబ్ధుల్ అజీమ్, డిఆర్‌ఓ ఎల్ విజయ్‌చందర్, ఆర్డీవో ఎస్ వెంకట్రావ్, టి సుబ్బారావు, ఐ వెంకటేశ్వరరావు, రంజిత్‌బాషా, తహశీల్దార్లు పాల్గొన్నారు.
* ఎన్నికల కమిషన్ పరిశీలకుడు పార్థసారథి
english title:
elections commission
Date:
Saturday, November 17, 2012