విజయవాడ, నవంబర్ 16: అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలకులు సి. పార్థసారథి కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా శుక్రవారం జిల్లాకు విచ్చేసిన ఓటర్ల జాబితా పరిశీలకులు సి.పార్ధసారధి పెనమలూరు మండలం తాడిగడప, గన్నవరం మండలం కేసరపల్లి, విజయవాడ తూర్పు నియోజకవర్గం లబ్బీపేట ఓటర్ల జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ప్రాంతంలో నివాసం ఉంటూ ఓటరుగా నమోదై వివిధ కారణాల వలన వేరే ప్రాంతానికి బదిలీ అయినవారికి గతంలో వున్న ఓటును తొలగించడంలోను, యుక్తవయస్సు వచ్చి వివాహం అయి అత్తవారింటి వద్ద నివాసముంటున్న మహిళా ఓటర్లను తొలగించడంలో అధికారులు తీసుకుంటున్న చర్యలు ఇతర జిల్లాలవారికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. జాబితా నుండి తొలగింపునకు గల కారణాలు తెలియపరచి, సంబంధిత ఓటరుకు నోటీసును అందించడం, దానిపై అభ్యంతరాలు ఉంటే గడువులోపు అధికారులకు తెలియపరచే విధంగా ఆర్‌డివో స్థాయి అధికారి పర్యవేక్షణ కలిగివుండటం, ఎన్నికల జాబితాను రూపొందించడంలో పారదర్శకతకు నిదర్శనమన్నారు. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల వారికి ఓటర్ల జాబితాపై, తయారీపై బూత్‌స్థాయి ఏజెంటును నియమించుకుని జాబితాపై అభ్యంతరాలుంటే తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఏజెంట్లను నియమించి ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు సహకరించాలన్నారు. ఓటర్ల జాబితా పరిశీలనలో పార్థసారథి వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్, ఆర్‌డివో ఎస్. వెంకట్రావు, పెనమలూరు, గన్నవరం, విజయవాడ తహశీల్దార్లు, ఎన్. విజయకుమార్, ప్రసన్నలక్ష్మి, ఆర్. శివరామ్, ఆయా మండలాలకు చెందిన ఎలక్షన్ డెప్యూటీ తహశీల్దార్లు, బూత్ స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు
english title:
enrollment
Date:
Saturday, November 17, 2012