విజయవాడ, నవంబర్ 16: సహకార సంఘాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవలసిన అవసరముందని జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. స్వయంప్రతిపత్తి, నిర్ణయాధికారం కలిగిన సహకార సంఘాలు చేపట్టే నిర్ణయాలు సభ్యులకు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ఆమె సూచించారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా సహకార అధికారి వివి ఫణికుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 425కు పైగా సహకార సంఘాలున్నాయన్నారు. సహకార సంఘాల నిర్వహణలో జవాబుదారీతనం అవసరమన్నారు. సంఘం తమదే అన్న భావన ప్రతి సభ్యునిపై ఉండాలన్నారు. సంఘాల ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయడంతోపాటు, చేతి వృత్తి కార్మికులకు సహకారం అందించి వారి ఆర్థిక పురోగతి సాధించేలా చూడాలన్నారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు కంచి రామారావు మాట్లాడుతూ ధరల నియంత్రణలో సహకార సంఘాలదే కీలకపాత్ర అన్నారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే సహకార సంఘాలు నిర్వహిస్తున్న వ్యాపారం తక్కువైనప్పటికీ, కృత్రిమ కొరతను నివారించడానికి, ధరలు నియంత్రించేందుకు సహకార సంఘాలు వ్యాపారం నిర్వహించి సమాజానికి ఎంతో సేవలందిస్తున్నాయన్నారు. సమావేశంలో రాష్ట్ర సహకార గ్రామీణ నీటిపారుదల కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ నెల్లూరి వెంకటరెడ్డి, కెడిఎల్‌ఓ అధ్యక్షులు లక్ష్మణస్వామి, విజయవాడ, గుడివాడ, నూజివీడు, మచిలీపట్నం, డివిజనల్ కో ఆపరేటివ్ అధికారులు సయ్యద్ మస్తాన్ వలి, కె. భాస్కరరావు, ఎల్. తొలిచ్చా, కెఎస్ నాగేశ్వరరావు, సహకారశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సహకార సంఘాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా
english title:
merugaina sevalu
Date:
Saturday, November 17, 2012