గాంధీనగర్, నవంబర్ 16: గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు ధ్వజమెత్తారు. శుక్రవారం సుందరయ్య భవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబానికి సంవత్సరానికి 6 సిలెండర్లు మాత్రమే ఇచ్చే నిబంధన, ధరల పెంపుతో ప్రజలపై భారాలు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గ్యాస్‌ను సంవత్సరానికి 6 సిలెండర్లు మాత్రమే ఇచ్చే నిబంధన విధించడంతో అన్ని తరగతుల ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు. ఇప్పుడు ఇస్తున్న గ్యాస్ సరఫరా సరిగాలేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ నిబంధన వల్ల గ్యాస్ మరింత టైట్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆరు సిలెండర్ల కంటే ఎక్కువ వాడుకునే వారు 950 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలను మరింత ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడమే అవుతుందన్నారు. గ్యాస్ సరిగా సరఫరా చేయకుండా డీలర్లు బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముకునే ప్రమాదం వుందన్నారు. ఈ విధమైన చర్యలు తీసుకుని ప్రజలకిచ్చే సబ్సిడీ నుండి ప్రభుత్వం వైదొలగాలని ప్రయత్నిస్తుందన్నారు. ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. అందుకే గ్యాస్‌పై నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా తీసుకునే కనెక్షన్‌లకు ఇప్పటి నుండే ఆంక్షలు పెట్టి కనెక్షన్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మరోపక్క గ్యాస్ ఏజెన్సీలు రెగ్యులేటర్ చెకప్ అని చెప్పి సంవత్సరానికి 60 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాయన్నారు. కొత్త కనెక్షన్‌లు ఇప్పటి నుండే కొత్త రేటు 950 పెట్టి కొనుగోలుచేయాలని ప్రభుత్వం చెబుతున్నదని, సంవత్సరానికి 12 సిలెండర్లు ఇవ్వాలని, పేదలకు సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పోరాడతామని చెప్పారు. ఈ ప్రెస్‌మీట్‌లో నగర కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
* సిపిఎం నగర కార్యదర్శి బాబూరావు ధ్వజం
english title:
gas subsidy
Date:
Saturday, November 17, 2012