కూచిపూడి, నవంబర్ 16: ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు ఉషాకన్యగా పేరుగాంచిన పద్మశ్రీ డా. వేదాంతం సత్యనారాయణ శర్మ కన్ను మూయటంతో కూచిపూడి మూగవో యంది. ఆయన నృత్యానికి ఘల్లుమనే గజ్జెలు గొల్లున విలపించాయ. గురువారం అర్ధరాత్రి 12.45కి డా. వేదాంతం శ్రీ సిద్ధేంద్రయోగిలో ఐక్యమయ్యారు. కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్న ఈయనకు వారంరోజుల క్రితం ఆరోగ్యం విషమించటంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యనారాయణ వెంటిలేటర్ల ద్వారా కృత్రిమ శ్వాసతో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన కూచిపూడి నాట్యం రాష్ట్రానికే పరిమితం కాగా ఉషాకన్య పాత్రతో దేశం నలుమూలల ప్రదర్శనలిచ్చి ఆయన ప్రాచుర్యం కల్పించారు. భామాకలాపంలో భామగా, క్షీరసాగర మథనంలో మోహిని, లక్ష్మి, పార్వతీదేవిగా, విప్రనారాయణలో దేవదేవిగా ఆయా పాత్రల్లో లీనమై ఇచ్చిన ప్రదర్శనల ద్వారా ఆయన ప్రపంచంలో కోట్లాది మంది అభిమానుల మనస్సులు దోచుకున్నారు. వేదాంతం సత్యనారాయణ శర్మ మృతి పట్ల ముఖ్యమంత్రి డా. కిరణ్‌కుమార్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, కల్చరల్ కౌన్సిల్ చైర్మన్ ఆర్‌వి రమణమూర్తి, సాంస్కృతిక శాఖ గౌరవ సలహాదారులు డా. కెవి రమణాచారి, సంచాలకులు డా. ఆర్‌వి ప్రసాదరావు, కార్యదర్శి బలరామయ్య, కేంద్రీయ విశ్వవిద్యాలయం రీడర్ ఆచార్య జొన్నలగడ్డ అనూరాధ, పసుమర్తి రామలింగశాస్ర్తీ, తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత నృత్య శాఖాధిపతి డా. కె ఉమా రామారావు, నృత్య శాఖాధిపతులు డా. అలేఖ్య పుంజాల, భాగవతుల సేతురాం, డా. అరుణాబిక్షు, డా. కె రమాదేవి, డా. సుమిత్ర పార్థసారథి, పద్మవిభూషణ్ డా. రాజారెడ్డి, రాధారెడ్డి, పద్మశ్రీ సునీల్ కొటారి, పద్మశ్రీ వనశ్రీ జయరామారావు, పద్మభూషణ్ డా. స్వప్నసుందరి, పద్మవిభూషణ్ డా. యామిని కృష్ణమూర్తి, కర్ణాటక యక్షగాన అకాడమీ ఛైర్మన్ వైజయంతి కాశీ, కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ వెంపటి వెంకట్, నాట్యాచార్యులు ఏబి బాలకొండలరావు, వెంపటి రవిశంకర్, మంజుభార్గవి, డా. శోభానాయుడు, డా. స్మితాశాస్ర్తీ, డా. మొదలి నాగభూషణశర్మ, నర్తనం సంచాలకులు పురాణం మాధవి, సంగీత నాటక అకాడమీ కార్యదర్శి హెలెన్ ఆచార్య, ఛైర్మన్ లీలా శ్యాంసన్, కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ, అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్, భాగవతుల మేళ కార్యదర్శి తాడేపల్లి సత్యనారాయణశర్మ, చింతా రవి బాలకృష్ణ సంతాపం ప్రకటిస్తూ సందేశాలు పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డా. వేదాంతం సత్యనారాయణ శర్మ భౌతికకాయాన్ని ముముక్షుజన మాహాపీఠాధిపతులు ముత్తీవి సీతారాం గురుదేవులు, తుర్లపాటి ఆనంద్, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, పామర్రు ఎమ్మెల్యే డివై దాస్, మొవ్వ ఎఎంసి చైర్మన్ చీకటిమర్ల శివరామప్రసాద్, తహశీల్దార్ జి భద్రు, ఎండివో వై పిచ్చిరెడ్డి, సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత ఎండివిఎస్‌ఆర్ పున్నంరాజు, మాజీ సర్పంచ్ వైకెడి ప్రసాదరావు, వేదాంతం శ్రీరామశర్మ, పెనుమూడి కాశీవిశ్వనాథం, మద్దాల నాగభూషణరావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి అప్పారావు, ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యాం, భాగవతుల సేతురాం, వేదాంతం వెంకట నాగచలపతి, చింతా రవి బాలకృష్ణ, ఏలేశ్వరపు శ్రీనివాస్, పసుమర్తి శ్రీనివాస్, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, వేదాంతం సీతారామ శాస్ర్తీ, భాగవతుల కోదండపాణి, ఉమామహేశ్వరి, పసుమర్తి వెంకటేశ్వర శర్మ, రత్తయ్యశర్మ, మీర్జా హైదర్ అబ్బాస్ అలీ, యద్దనపూడి బాబూరావు, రాజులపాటి తారక బ్రాహ్మానంద మస్తాన్, పెదపూడి దిలీప్ కుమార్ తదితరులు సందర్శించి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
గొల్లుమన్న గజ్జెలు
english title:
vedantham passes away
Date:
Saturday, November 17, 2012