మచిలీపట్నం , నవంబర్ 16: విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందని ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. శుక్రవారం బందరు మండలం రుద్రవరం గ్రామంలో 7కోట్ల 35లక్షల రూపాయలతో నిర్మించిన సాంఘిక సంక్షేమ పాఠశాల, వసతిగృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 1984లో గురుకుల విద్యా వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించిందని, దీనిద్వారా రుద్రవరం గురుకుల పాఠశాల నుండి ఎందరో వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లుగా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు మ్యాథ్స్ ఒలింపియాడ్, సైన్సు ఫెయిర్‌లలో పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శించారని, అదే స్ఫూర్తితో ప్రస్తుత విద్యార్థులు రాణించాలన్నారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించటం ఒక వరమన్నారు. ఈ పాఠశాల, కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన నైపుణ్యం, అనుభవం, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, వారి సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రుద్రవరం గురుకుల పాఠశాలలో 550 మంది విద్యార్థులకు వసతి కల్పించే విధంగా భవనాలు నిర్మించామని, ఇందులో విద్యార్థులకు వైద్య సౌకర్యం నిమిత్తం ఒక డిస్పెన్సరీ భవనాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో విద్యార్థులకు అవసరమైన వైద్యసేవలు అందించే డాక్టర్ నియామకానికి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. కళాశాల ప్రాంగణంలో అవసరమైన ప్రదేశాలకు వెళ్ళేందుకు సిమెంటు రోడ్డు నిర్మాణం నిమిత్తం శాసనసభ్యుని గ్రాంటు నుండి నిధులు అందచేస్తానని, ఈ నిధులతో 10రోజులలో పనులు ప్రారంభించి వెంటనే పూర్తిచేయాలని నాని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎ ఐజక్‌బాబు, పంచాయతీరాజ్ డిఇ, ఎలక్ట్రికల్ ఎడిఇ వెంకటేశ్వర్లు, ఎంపిడివో సూర్యనారాయణ, మార్కెట్ యార్డు చైర్మన్ మోకా భాస్కరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విఠల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లంకా సూరిబాబు, పరింకాయల శ్రీనివాసరావు, స్థానిక నాయకులు బేతపూడి రవి, అంబేద్కర్, శ్రీను, కేశవ తదితరులు పాల్గొన్నారు.
* ప్రభుత్వ విప్ పేర్ని నాని
english title:
vidya dwaarane gowravam
Date:
Saturday, November 17, 2012