తోట్లవల్లూరు, నవంబర్ 16: పంటలపై అధ్యయనం చేయాలంటే ఎంతో ఓర్పు ఉండాలని గుంటూరు లాంఫామ్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్ వీరరాఘవయ్య అన్నారు. మండలంలోని భద్రిరాజుపాలెం కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం సాయంత్రం రైతుసదస్సు నిర్వహించారు. బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులు వివిధ రకాల సాగు పద్ధతుల గురించి తెలుసుకునేలా స్టాళ్లు ఏర్పాటు చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాలకు చెందిన సుబ్బయ్య, డాట్ సెంటర్ కోఆర్డినేటర్ మహేశ్వరప్రసాద్, డాట్ శాస్తవ్రేత్తలు అనురాధ, సుజాత, అపర్ణ, ఎఎస్ రావు సందర్శించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. పని అనుభవం శిక్షణలో భాగంగా బాపట్ల విద్యార్థినులు నేర్చుకున్న అనుభవాలను రైతు సదస్సులో వివరించారు. కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, చాగంటి సాంబిరెడ్డి, ఇతర రైతులు పాల్గొన్నారు.
సముద్రంలో మత్స్యకారుడి గల్లంతు
అవనిగడ్డ, నవంబర్ 16: నాగాయలంక మండలం ఎలిచేట్లదిబ్బ గ్రామానికి చెందిన తమ్ము హరిశ్చంద్ర (29) అనే మత్స్య కార్మికుడు శుక్రవారం ఉదయం సముద్రంలో గల్లంతయ్యాడు. అదే గ్రామానికి చెందిన తమ్ము రాంబాబు, చెన్ను ధర్మారావు, తమ్ము భర్మేశ్వరరావు, నాగిడి పెదబ్రహ్మం రెండు రోజుల క్రితం సముద్రంలోకి వేటకు వెళ్ళారు. శుక్రవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా అలల ధాటికి హరిశ్చంద్ర గల్లంతవగా మిగిలిన నలుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు.
హరిశ్చంద్రకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఫిషరీస్ అధికారి చెన్ను నాగబాబు గ్రామానికి చేరుకుని విచారణ జరిపి మూడు నావల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. నాగాయలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.