ఆచంట, నవంబర్ 19: మండల కేంద్రం ఆచంటలోని ఒక వ్యాపారి ఇంట్లో సోమవారం పట్టపగలు భారీ చోరీ జరిగింది. తలుపులకు వేసిన తాళాలు పగులగొట్టి, లోనికి ప్రవేశించిన ఆగంతకులు బీరువా తాళాలను సైతం పగులగొట్టి భారీగా ఆభరణాలు, నగదు దోచుకున్నారు. వివరాలిలావున్నాయి... ఆచంటకు చెందిన కిరాణా వ్యాపారి నంబూరి లక్ష్మీనారాయణ గ్రామంలోని సెంటర్‌లో షాపు నిర్వహిస్తుంటారు. సోమవారం ఉదయం ఆయన షాపునకు వెళ్లిపోగా, అనంతరం ఆయన భార్య ఇంటికి తాళంవేసి, షాపునకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె తిరిగి ఇంటికి వచ్చినపుడు, తలుపులు తెరిచివుండటాన్ని గమనించారు. లోనికి వెళ్లిచూడగా, బీరువా తెరచి, సామానంతా చిందరవందరగా పడివున్నాయి. బీరువాలోని 15 కాసుల బంగారు ఆభరణాలు, సుమారు మూడు కిలోల వెండి వస్తువులు, రూ.25వేల నగదు అపహరణకు గురయ్యింది. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు నరసాపురం డిఎస్పీ రఘువీర్‌రెడ్డి సంఘటనాస్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీంను రప్పించి, 24 గంటల్లోగా దొంగలను పట్టుకుంటామని డిఎస్పీ తెలిపారు. పాలకొల్లు సిఐ రమణ ఆధ్వర్యంలో ఆచంట ఎస్సై మూర్తి కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
రైతులను ఆదుకోవాలి
ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందాలి: నీలం నష్టాలపై చర్చించిన ఎంపి ఉండవల్లి
ఏలూరు, నవంబర్ 19: నీలం తుపాను వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు పంటల బీమా పరిహారం కూడా అందేటట్లు అవసరమైన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని రాజమండ్రి లోక్‌సభ సభ్యులు ఉండవల్లి అరుణకుమార్ అధికారులను కోరారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో తుపాను నష్టాలపై ఎంపి చర్చించారు. ఈవిషయంలో సంబంధిత అధికారులు పరిశీలించి ఏమేరకు చర్యలు తీసుకుంటే పంట నష్టపోయిన రైతాంగానికి మేలు జరుగుతుందో తగు సూచనలు అందించాలన్నారు. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నీలం తుపాను వల్ల దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్లు, పిఆర్ రోడ్లు పనులకు 21కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత మరమ్మత్తు పనులు చేపట్టడానికి తగు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. 46 ఇరిగేషన్ పనులకు 50లక్షల రూపాయలతో తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టాలని ఆయన కోరారు. అరికిరేవుల వద్ద 16కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పధకం పైపులైన్ల పనులు పెనకనమెట్ల గ్రామంలో పొలాల మధ్య నుండి వెళుతున్నందున కొందరు అడ్డుపడుతున్నారని, దీనివల్ల పధకలక్ష్యం నిలిచిపోయే పరిస్ధితి రాకుండా చూడాలని కోరారు. జిల్లా కలెక్టరు జి వాణిమోహన్ మాట్లాడుతూ రహదారులు బాగా దెబ్బతిన్నాయని, అధిక నిధులు సమకూర్చడానికి కృషి చేయాలని కోరారు. అరికిరేవుల ఎత్తిపోతల పధకం పైపులైన్ల పనులు ఆగకుండా తగుచర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పంచాయితీరాజ్ ఎస్‌ఇ అనందం, జడ్పీ సిఇఓ డి నారాయణ, ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటేశ్వర్లు, అర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.