ఆచంట, నవంబర్ 19: పడవ ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం కావడంతో సోమవారం ఆచంట మండలం పల్లెపాలెం వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. గాలింపు బృందాలు ఒక్కొక్క మృతదేహాన్ని వెలికి తీసుకువస్తున్నప్పుడు మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆదివారం సాయంత్రం పడవ బోల్తా దుర్ఘటనలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు సోమవారం సాయంత్రానికి లభ్యమయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరి నుండి వచ్చిన జాతీయ విపత్తు నివారణ బృందం ( ఎన్‌డిఆర్‌ఎఫ్) నాయకుడు చౌహాన్ ఆధ్వర్యంలో 30 మంది సోమవారం ఉదయం నుండి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి మృతిచెందినవారిలో అయోధ్యలంక గ్రామానికి చెందిన కొల్లి శ్రీలక్ష్మి (25), పెరవలి మండలం ఖండవల్లి శివారు లంకమాలపల్లికి చెందిన కొల్లి గవమరమ్మ (30), తూర్పుగోదావరి జిల్లా మలికిపురం గ్రామానికి చెందిన షేరు జ్యోతి అనే జ్యోత్స్న (18) మృతదేహాలు లభ్యమయ్యాయి. అయోధ్యలంకకు చెందిన కొప్పాడి నాగసత్యవతి (22), కొప్పాడి దుర్గ్భావాని (11) మృతదేహాలు పెదమ్మలం మాచేనమ్మ దేవాలయ సమీపంలో దొరికాయి. జిల్లా ఎస్పీ రమేష్ పర్యవేక్షణలో గాలింపుచర్యలు ముమ్మరం చేశారు. సోమవారం రాత్రికి గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభించడంతో జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. తెల్లవారుజాము నుండి అయోధ్యలంకకు చెందిన వందలాదిమంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి బంధువుల ఆర్తనాదాలతో పల్లెపాలెంలో విషాదం నెలకొంది. తనవారు చూస్తుండగానే మునిగిపోయారంటూ పడవ ప్రమాదం నుండి బయటపడినవారు విలపించడం అందరినీ కలిచివేసింది. గోదావరి నుండి తీస్తున్న మృతదేహాలను చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుల్లో కొల్లి శ్రీలక్ష్మికి భర్త దుర్గారావు, ఇద్దరు పిల్లలున్నారు. వారంతా ప్రమాద సమయంలో అదే పడవలో ఉన్నారు. భర్త, పిల్లలు ప్రమాదం నుండి బయటపడగా, శ్రీలక్ష్మి మాత్రం గల్లంతయ్యింది. మరో మృతురాలు కొప్పాడి నాగసత్యవతికి భర్త పోశయ్య, కుమార్తె ఉన్నారు. వీరంతా కూడా ప్రమాద సమయంలో పడవలో ఉండగా భర్త, కుమార్తె బయటపడగా, నాగసత్యవతి మాత్రం గల్లంతై కన్నుమూసింది. అలాగే మరో మృతురాలు గవరమ్మకు భర్త పోశయ్య ఉన్నారు. మలికిపురం నుండి చుట్టపుచూపుగా వచ్చిన మృతురాలు షేరు జ్యోతి అనే జ్యోత్స్నకు ఇంకా వివాహం కాలేదు. దుర్గ్భావాని అయోధ్యలంక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది.
సంఘటనాస్థలంలోనే పోస్టుమార్టం
జిల్లా కలెక్టర్ వాణీమొహన్ ఆదేశాల మేరకు మృతదేహాలకు సంఘటనాస్థలం వద్ద టెంట్లు వేసి పోస్టుమార్టం నిర్వహించారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్ శకుంతల పర్యవేక్షణలో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి వైద్యులు నళినీదేవి, నారాయణ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు మృతదేహాలు అప్పగించారు. కాగా సంఘటనాస్థలానికి అయోధ్యలంక నుండి వందలాదిమంది తరలిరావడంతో రెవెన్యూ అధికార్లు వారందరికీ భోజన సౌకర్యం కల్పించారు. జెసి బాబూరావు నాయుడు సంఘటనాస్థలంలో ఉండి సహాయక చర్యలకు రెవెన్యూ యంత్రాంగాన్ని సమాయత్తంచేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని నరసాపురం ఆర్డీవో వసంతరావు, ఆచంట తహసీల్దార్ తిరుపతిరావును అదేశించారు.
తీరప్రాంతాల్లో జాగ్రత్తలు అవసరం:ఎస్పీ రమేష్
తీరప్రాంతాల్లో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నా ప్రజలు ఇంకా పాతకాలం పద్ధతులే అనుసరిస్తున్నారని ఎస్పీ రమేష్ అన్నారు. పల్లెపాలెం ప్రమాద సంఘటనను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. మృతదేహాలను గాలించే చర్యల్లో ఆయన కూడా పాల్గొన్నారు. గల్లంతైన ఐదుగురి మృతదేహాలు దొరికాయన్నారు. పడవపై ప్రయాణం చేసే సమయంలో ప్రభుత్వ అధికార్ల సలహాలు, సూచనలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవన్నారు. తీరప్రాంతాల్లో పడవ ప్రయాణం చేసటప్పుడు లైఫ్ జాకెట్ ధరించడం తప్పనిసరన్నారు. పడవల్లో సామర్ధ్యానికి మించి ఎక్కించుకుని నడిపేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణీకులు సైతం పడవ ప్రయాణం చేసేముందు ఆలోచించాలని ఎస్పీ కోరారు. ఆయన వెంట నరసాపురం డిఎస్పీ రఘువీర్‌రెడ్డి, పాలకొల్లు సిఐ రమణ, ఆచంట, పోడూరు, పాలకొల్లు ఎస్సైలు ఉన్నారు.
రూ.5 లక్షల వంతున పరిహారం ఇవ్వాలి
పడవ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల వంతున పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. సోమవారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన పడవ ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల అంత్యక్రియల ఖర్చు ప్రభుత్వమే భరించాలని కోరారు. మృతుల కుటుంబాలకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
నలుగురు తహిసీల్దార్లకు ఆర్డీవోలుగా పదోన్నతి
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, నవంబర్ 19: జిల్లాకు చెందిన నలుగురు తహసిల్దార్లకు రెవిన్యూ డివిజనల్ అధికారులుగా పదోన్నతి లభించింది. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ బి నారాయణరెడ్డి, పెనుమంట్ర తహసీల్దార్ రామచందర్, ఆచంట తహసీల్దార్ తిరుపతిరావులతోపాటు ప్రస్తుతం కృష్ణాజిల్లా నందిగామ తహిసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌లకు ఆర్డీవోలుగా పదోన్నతి లభించింది. తహిసీల్దార్లకు పదోన్నతి కల్పించేందుకు ఉద్దేశించిన డిపిసి సమావేశం ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో రాష్టవ్య్రాప్తంగా 62మంది తహసీల్దార్లకు పదోన్నతి లభించింది.
త్వరలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని వీరందరికి ఆర్డీవో పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.