ఏలూరు, నవంబర్ 19 : జిల్లాలోని గ్రామ పంచాయితీల్లో ఆక్రమణలు తొలగించి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయితీ కార్యదర్శులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ డిపివో నాగరాజును ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణపై చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ పంచాయితీ కార్యదర్శి మురళికి మెమో ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఫ్రజావాణిలో వందలాది మంది ప్రజలు తమ వినతిపత్రాలను కలెక్టర్‌కు స్వయంగా అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా పల్లెసీమల్లో ఆక్రమణలు, పంచాయితీ కార్యదర్శుల నిర్లక్ష్యం, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలని పలు ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ స్పందిస్తూ పల్లె ప్రాంతాలలో సంపూర్ణ పారిశుద్ధ్య పరిస్థితులు కల్పించాలని ఆదేశించారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ కార్యదర్శి బి ఎం మురళీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఫిర్యాదును కలెక్టర్ తీవ్రంగా పరిగణిస్తూ తక్షణం ప్రగడవరం గ్రామ కార్యదర్శికి మెమో జారీ చేసి రెండు రోజుల్లో సంజాయిషీ కోరాలని ఇందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని డిపివో నాగరాజును ఆదేశించారు. ప్రగడవరం గ్రామ పంచాయితీలో పదిహేను వేల మంది జనాభా ఉన్నారని 14 గ్రామాల ప్రజలు ఏడు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్నారని అయితే ఈ పంచాయితీలో వీధి లైట్లు పనిచేయవని మంచినీరు సక్రమంగా సరఫరా లేదని రోడ్లు, డ్రైన్లు పరిశుభ్రత పట్టించుకునే నాధుడే లేరని అధ్వాన్నంగా ఉన్న ప్రగడవరం పంచాయితీని పరిశుభ్ర పంచాయితీగా తీర్చిదిద్దేందుకు కొత్త కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు కలెక్టరును కోరారు. కామవరపుకోట గ్రామానికి చెందిన మురళీ గత ఏడేళ్ల నుండి పంచాయితీ కార్యదర్శిగా ఉంటూ ఇష్టానుసారం పంచాయితీకి వస్తున్నారని దీనివల్ల అతని కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆకివీడు పంచాయితీ ధర్మాపురం గ్రామంలో మంచినీటి చెరువు గట్లపై పక్కా నిర్మాణాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించడం లేదని గ్రామ కార్యదర్శికి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం ఆక్రమణలకు గురైన స్థలాన్ని కూడా చూడలేదని ధర్మాపురం గ్రామానికి చెందిన కటికతల సత్యం ఆరోపించారు. ఈ విషయంపై కూడా సమగ్ర విచారణ జరిపి తగు నివేదిక సమర్పించాలని డిపివోను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఏ పంచాయితీలోనైనా పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని ఫిర్యాదులు వస్తే ఆయా కార్యదర్శులే బాధ్యత వహించాల్సి వుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.500 పెన్షన్ ఇచ్చేలా చూడాలని కలెక్టర్ డిఆర్‌డిఎ పిడి రామకృష్ణను ఆదేశించారు.
ఏలూరులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు
డిఐజి సూర్యప్రకాశరావు
ఏలూరు, నవంబర్ 19 : ఏలూరు నగరం అంతకంతకు విస్తరిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు జఠిలమవుతోందని, దీన్ని క్రమబద్ధీకరించడానికి చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డిఐజి జి సూర్యప్రకాశరావు అన్నారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం డి ఐజి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. సౌకర్యాలపై ఆరా తీశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సిబ్బందిని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీనితోపాటు నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. ఏలూరు కార్పొరేషన్ అధికారుల సహకారంతో నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటగామని అన్నారు. అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డి ఐజి మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఏలూరు డిఎస్‌పి ఎం రజనీ, సి ఐ వైవి రమణ, సిసి ఎస్ సిఐ ఎన్ సూర్యచంద్రరావు, రూరల్ సి ఐ సుధాకరరావు, ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.