ఏలూరు, నవంబర్ 19 : జిల్లాలో ఇంత వరకూ ఒక లక్షా 18 వేల హెక్టార్లలో పంట నష్ట ఎన్యూమరేషన్ జరిగిందని మిగిలిన పంట నష్ట ఎన్యూమరేషన్ ఈ నెల 22వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి వ్యవసాయ, బ్యాంకు రుణాలు తదితర అంశాలపై కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నాటికి ఎన్యూమరేషన్ పూర్తి చేసి 25వ తేదీ నాటికి నివేదిక అందజేయాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఇప్పటి వరకూ ఎన్యూమరేషన్ చేసిన పంట లక్షా 33 వేల మంది రైతులకు చెందిన భూమి ఉందని వారిలో ఎంత మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నవీ, లేనివీ పరిశీలించి బ్యాంకు ఖాతాలు లేని రైతులతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలన్నారు. ఎన్యూమరేషన్ చేసిన సమాచారాన్ని కంప్యూటరీకరణ త్వరితగతిన పూర్తి చేసేందుకు మరిన్ని కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులందరూ మంగళవారం ఆయా మండలాల్లో పర్యటించి ఎన్యూమరేషన్ నిర్వహణ, కంప్యూటరీకరణ, రైతుల బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం అంశాలపై ప్రత్యేక పరిశీలన చేయాలన్నారు. మూడు వేల 183 స్వయం సహాయక గ్రూపులకు 74 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు అందించేందుకు డాక్యుమెంటేషన్ పూర్తి చేశామని వీటికి రుణాలు మంజూరు త్వరితగతిన చేయాలన్నారు. డిసెంబరులోగా వివిధ సంక్షేమ పధకాలకు యూనిట్లు మంజూరు, స్థాపన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు జెసి ఎంవి శేషగిరిబాబు, డి ఆర్‌డి ఎ పిడి వై రామకృష్ణ, జడ్పీ సి ఇవో డి నారాయణ, ఎల్‌డి ఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇందిర జీవితం ప్రపంచానికే ఆదర్శం:కలెక్టర్
ఏలూరు, నవంబర్ 19 : భారతదేశ సమగ్రత కోసం జాతీయ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన వీరవనిత స్వర్గీయ ఇందిరాగాంధీ జీవితం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జాతీయ సమగ్రత దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. సమాజంలో ప్రతీ ఒక్కరి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడుతూ మానవ జాతి అంతా ఒక్కటేనన్న భావాన్ని ప్రతీ ఒక్కరిలో కలిగించాలని కలెక్టర్ కోరారు. భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ బాధ్యతలు చేపట్టి పేదరిక నిర్మూలనకు అనేక విప్లవాత్మాకమైన నిర్ణయాలు చేపట్టారని, దాని ఫలితంగానే దేశంలో ఆర్ధిక ప్రగతి వేగవంతంగా జరిగిందని ముఖ్యంగా బ్యాంకుల జాతీయకరణ వలన పేద వర్గాలకు రుణాలు అందే సౌకర్యం కలిగిందని కలెక్టర్ చెప్పారు. తొలుత స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జెసి ఎంవి శేషగిరిబాబు, డి ఆర్‌వో ఎం మోహనరాజు, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టరు రాఘవరావు, నిక్‌నెట్ సైంటిస్టు గంగాధరరావు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకరరావు, బిసి సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, గృహ నిర్మాణ శాఖ ఇన్‌ఛార్జి పిడి శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో సత్యనారాయణ, సూపరింటెండెంట్లు ఎంహెచ్ మణి, శేషగిరి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.