ఏలూరు, నవంబర్ 19: ఇటీవల జిల్లాలో కురిసిన భారీవర్షాలు, నీలం తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో మంగళ, బుధవారాల్లో ప్రత్యేక కమిటీ పర్యటించనుంది. కేంద్ర క్వాలిటీ కంట్రోల్ సెల్ అసిస్టెంటు రీజనల్ జాయింట్ డైరెక్టరు, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టరు, ఎఫ్‌సిఐ అసిస్టెంటు జనరల్ మేనేజరు, సివిల్ సప్లయిస్ రాష్ట్ర కార్యాలయ మేనేజరులతో కూడిన ఈ కమిటీ ఏలూరు, కొవ్వూరు, నర్సాపురం డివిజన్ల పరిధిలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని పరిశీలిస్తారు.
అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను ఈ కమిటీ సమర్పించనుంది. మంగళవారంనాడు దెందులూరు మండలం కొవ్వలి, నిడమర్రు మండలం నిడమర్రు, గణపవరం మండలం అర్ధవరం, పెంటపాడు మండలం పరిమెల్ల, తాడేపల్లిగూడెం మండలం నందమూరు, నిడదవోలు మండలం తాళ్లపాలెంలలో కమిటీ సభ్యులు పర్యటిస్తారు. బుధవారంనాడు తణుకు మండలం దువ్వ, తేతలి, ఉండ్రాజవరం మండలం కాల్దరి, సూర్యరావుపాలెం, పెనుమంట్ర మండలం మమూడూరు, భీమవరం మండలం భీమవరం, యనమదుర్రు, గునుపూడిలలో పర్యటిస్తారు. అనంతరం ఏలూరులో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమవుతారు.
విద్యార్థినిని చితకబాదిన టీచరు:తల్లిదండ్రుల ఆందోళన
కామవరపుకోట, నవంబర్ 19 : తడికలపూడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామవరపుకోట పంచాయితీలోని ప్రైవేటు పాఠశాలలో ప్రగడ లక్ష్మీదుర్గకు కంప్యూటర్ క్లాసులో తక్కువ మార్కులు వచ్చాయని క్లాస్ మాస్టర్ కొట్టడంతో ఇంటి వద్ద స్పృహతప్పి పడిపోయింది. దీంతో విద్యార్ధిని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాఠశాల ఆవరణ బయట బస్సులను నిలిపివేసి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ప్రైవేటు స్కూలు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంఇవో కె ప్రభాకరరావుకు ఫిర్యాదు చేయగా ఎంఇవో, ఎం ఆర్‌పిలు స్కూల్ ప్రాంగణానికి చేరుకుని ప్రధానోపాధ్యాయురాలును పిలిపించి జరిగిన విషయంపై వివరణ అడిగారు. అప్పటికే విద్యార్ధిని తల్లిదండ్రులు పాఠశాలకు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ మరియపాల్ విద్యార్ధిని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. విద్యార్ధినిని శిక్షించిన ఉపాధ్యాయులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, పాఠశాలపై కూడా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయినిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎం ఇవోకు చెప్పారు. దీంతో రాకపోకలను పునరుద్ధరించి ఉపాధ్యాయినిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖాధికారి హామీ ఇచ్చారు.