కర్నూలు, నవంబర్ 20: ఆసియాలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందించాలన్న ఉద్దేశ్యంతో రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చేపట్టిన ‘్భగీరథ విజయయాత్ర’ ఉత్సాహంగా సాగుతోంది. కర్నూలు జిల్లా మల్యాల నుంచి ప్రారంభించిన ఈ యాత్ర అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకూ సాగనుంది. మంగళవారం పాదయాత్ర ముగిసే సమయానికి సుమారు 55 కిలోమీటర్లు పూర్తయ్యాయి. భగీరథ విజయయాత్రను మాల్యాల వద్ద ఆదివారం సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. రెండవరోజు ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సాంఘిక సంక్షేమ శాఖమంత్రి పితాని సత్యనారాయణ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. 3వ రోజు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ పాదయాత్రలో పాల్గొని కొద్ది దూరం నడిచారు. కాలువ వెంట ఉన్న పంప్ హౌస్‌లను యాత్రకు సంఘీభావం తెలుపుతూ వస్తున్న మంత్రులు, ఇతర నేతల చేత ప్రారంభింపజేస్తున్నారు. కాలువలో నీటి ప్రవాహానికి సంబంధించిన సమస్యలపై ఎప్పటికపుడు అధికారులతో చర్చిస్తూ, అవసరమైన సలహాలు ఇస్తూ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ముందుకు కదులుతున్నారు. రానున్న రోజుల్లో కూడా రోజూ ఒకరిద్దరు మంత్రుల చొప్పున రఘువీరాతో పాటు కొద్ది దూరం నడవనున్నట్లు సమాచారం. మల్యాల నుంచి అనంతపురం జీడిపల్లి జలాశయం వరకూ సుమారు 226 కిలోమీటర్లు కాలువ వెంట రఘువీరా పాదయాత్ర చేయనున్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేయడంలో రఘువీరా చూపిన చొరవను ఈ సందర్భంగా మంత్రులు, ఇతర నేతలు అభినందిస్తున్నారు. కృష్ణా జలాల్లో 40 టిఎంసిల నీటిని రాయలసీమ 4 జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగు నీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ పథకం రెండవ దశ కూడా పూర్తవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
చిత్రం... భగీరథ పాదయాత్రలో పాల్గొన్న మంత్రులు డిఎల్, రఘువీర, ఎంపిలు కెవిపి, ఉండవల్లి, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు