Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కోకాపేట్ సెజ్ భవనాలకు ప్లాన్ అనుమతివ్వండి

$
0
0

హైదరాబాద్, నవంబర్ 20: కోకాపేట్ సెజ్‌ల్లో నిర్మించే భవనాలకు త్వరగా ప్లాన్ అనుమతులు ఇవ్వాలని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హెచ్‌ఎండిఏ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన ఐటి అధికారులతో సమీక్షించారు. అలాగే ఈ నెలాఖరుకు ఇఎస్‌డిఎం క్లస్టర్‌లోని హార్డ్‌వేర్ పార్కుకు సంబంధించి ప్రాధమిక ప్రాజెక్టు ప్రతిపాదనలను అందించాలని ఐపిఐఐసిని ఆదేశించారు. డిసెంబర్ చివరి నాటికి 150 మీ-సేవా కేంద్రాలను ప్రతి జిల్లాలో ఏర్పాటుచేసేందుకు, వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రతి జిల్లాలో 200 మీ-సేవా కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, కార్పోరేట్ సర్వీసుల డైరెక్టర్ పునీత్‌కుమార్, డిఎస్‌ఎం ఇండియా సర్వీసుల ప్రతినిధి మనీష్ మంత్రిని కలిసి చర్చించారు. ఈ భేటీలో ఐటి కార్యదర్శి సంజయ్‌జాజు, ఐటి ప్రత్యేక కార్యదర్శి అనూప్‌సింగ్, ఎపిటిఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, అమరనాధ్‌రెడ్డి, పార్ధసారధి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
.........................
ఆత్మస్థైర్యం లేనివారే
పార్టీని వీడుతున్నారు: జెసి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 20: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామన్న ఆత్మస్థైర్యం లేని వారే కాంగ్రెస్‌ను వీడుతున్నారని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు వెళ్ళిపోవడంపై జెసి దివాకర్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వారిపై వారికే నమ్మకం లేకనే వెళుతున్నారని తెలిపారు. పార్టీపై నమ్మకం ఉన్న వారు ఎవరూ పార్టీని వీడలేదని ఆయన చెప్పారు. వెళ్ళిన వారిని పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా మంది పార్టీని వీడుతున్నారు కదా? అని ప్రశ్నించగా, పార్టీకి, ప్రభుత్వానికి ఏమీ కాదని ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు కదా? అని ప్రశ్నించగా, గత సార్వత్రిక ఎన్నికల ముందు సినీ నటులు బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చినా చివరకు ఫలితాలు ఎలా వచ్చాయో మీ అందరికీ తెలుసునని అన్నారు. ప్రభుత్వంలో, పార్టీలో ఏవైనా తప్పిదాలు ఉంటే సరిచేసుకుంటామన్నారు. కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాసిన లేఖను చూడలేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాట వేశారు.
పార్టీని వీడను: ఆకుల
తాను పార్టీని వీడనని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ తెలిపారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
............................
టిఆర్‌ఎస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
అభ్యర్థిగా పాతూరి ఎంపిక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 20: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డిని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మంగళవారం ప్రకటించారు. చైతన్యవంతులైన ఈ జిల్లాల ఉపాధ్యాయులు అపార అనుభవం కలిగిన పాతూరిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలా ఉండగా, తనను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మరో ప్రకటనలో పాతూరి కెసిఆర్‌కు కృతృజ్ఞతలు తెలియజేశారు. పాతూరి అభ్యర్థిత్వానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోన్నట్టు పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ (పిఆర్‌టియు) అధ్యక్షుడు హర్షవర్థన్ పేర్కొన్నారు.
..............................
కోమటిరెడ్డి తెలంగాణ ద్రోహి
టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఫొటో పెట్టుకొని దీక్ష చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉద్యమానికి ద్రోహం తలపెడుతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేలా మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్ర పార్టీలో చేరడం తెలంగాణకు ద్రోహం చేసినట్టేనని విమర్శించారు. కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ జగన్ జపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర పార్టీలకు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని హెచ్చరించారు. సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని, ఆ పార్టీల్లోని నేతలంతా టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతుంటే, తమ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమను రాజకీయంగా దెబ్బతీసే ఉద్దేశంతోనే కొందరు కుట్ర పన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు. తాను ఎట్టిపరిస్థితిలో పార్టీ మారే ప్రసక్తే లేదని ఏనుగు ఖండించారు.
......................
‘టన్ను చెరకుకు
రూ.3 వేలు ఇవ్వండి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో టన్ను చెరకుకు మూడువేల రూపాయలు ఇచ్చేలా ప్రయత్నించాలని చక్కెర పరిశ్రమల యజమాన్యాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి దాసరి శ్రీనివాసులు కోరారు. చెరకు ధరపై చర్చించేందుకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్‌ఎఫ్‌సి) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టన్ను చెరకుకు రూ.3వేలు చెల్లించాలంటూ రైతులు కోరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కర్నాటక, మాహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో టన్ను చెరకుకు 2,500 రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు. కాగా, రాష్టవ్య్రాప్తంగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు కలిసి టన్ను చెరకుకు కనీసం 2,600 రూపాయలైనా చెల్లించాలని షుగర్ కమిషనర్ బెన్-హర్ ఎక్కా పేర్కొన్నారు. ఈ ధర చెల్లిస్తే రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, చెరకు విస్తీర్ణం కూడా పెరుగుతుందని వెల్లడించారు. గత రెండేళ్ల నుండి తగ్గిన చెరకు విస్తీర్ణం ఇప్పుడిప్పుడే మళ్లీ పెరుగుతోందని, రైతులకు మంచి ధర లభిస్తే ఇతర పంటల వైపు వెళ్లబోరని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కేన్ కమిషనర్ పి.వీరాస్వామి తదితరులు కూడా పాల్గొన్నారు.

హెచ్‌ఎండిఎకు మంత్రి పొన్నాల ఆదేశం
english title: 
koka

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles