కొత్తపట్నం, నవంబర్ 27: అధికారులు పార్టీలకు అతీతంగా ప్రజలకు పనులు చేసి వారి మన్ననలు పొందాలని ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారిణి రజని అధ్యక్షతన ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియజేశారు. కొత్తపట్నం గ్రామ సమస్యలను స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తంబి కాంతారావు, తంబి సురేష్, చెరుకూరి వీరరాఘవులు, గౌరవరపు శివాజీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళారు. కొత్తపట్నం రెవెన్యూ సర్వే నెంబర్ 1379లో 2008వ సంవత్సరం నందు 133 మందికి ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలు మంజూరు చేశారని, వారిలో 87 మందికి పొజిషన్ చూపించి మిగిలినవారికి పొజిషన్ చూపించడంలో రెవెన్యూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని తెలియజేశారు. దీనితో మండల తహశీల్దార్ ఎం రాజ్‌కుమార్ కల్పించుకొని త్వరలో లబ్ధిదారులందరికి పొజిషన్ చూపిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రంగాయపాలెం పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 816/డిలో ఒక ఎకరా 50 సెంట్లు డికె భూమిని ఒక వ్యక్తి ఇళ్ళ ప్లాట్లు వేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్న వ్యవహారాన్ని మండల తహశీల్దార్ దృష్టికి తీసుకువచ్చినా స్పందన లేదని ఎమ్మెల్యే ఎదుట వెల్లడించారు. ఆ వివాదస్పద భూమిలో ఎవరు ప్రవేశించరాదంటూ ఉత్తర్వులు జారీ చేస్తానని శాసనసభ్యునికి తహశీల్దార్ తెలిపారు. గవండ్లపాలెం మాజీ సర్పంచ్ బలగాని వెంకటనారాయణ తమకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను తన ఇంట్లో ఉంచుకొని మమ్ములను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని గవండ్లపాలెం గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ విషయాన్ని విచారించి గ్రామస్థులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందేలా చూస్తానని తహశీల్దార్ తెలియజేశారు. అదేవిధంగా కొత్తపట్నంలోని హైస్కూల్ ఎదురుగా ఉన్న బాలమురళీ కాలనీకి వెళ్ళే రోడ్డు మార్గాన్ని ఒక వ్యక్తి అక్రమంగా దున్నించి స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకుంటామని ఎంపిడిఓ కుసుమకుమారి గ్రామస్థులకు తెలియజేశారు. వీటితోపాటు ఆయా గ్రామాల నుండి వచ్చిన రైతులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుకొచ్చారు. ఈసందర్భంగా తహశీల్దార్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ మీసేవ అమల్లోకి వచ్చిన తరువాత కొన్ని గ్రామాలలోని సర్వే నెంబర్లు కంప్యూటరీకరణ కాలేదని, దీనితో సమస్యలు తలెత్తుతున్నాయని, త్వరలో కంప్యూటీకరణ పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ఈకార్యక్రమంలో గృహ నిర్మాణశాఖ ఎఇ శ్రీనివాసరావు, మండల పశువైద్యాధికారి బ్రహ్మయ్య, ట్రాన్స్‌కో ఎఇ రమేష్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బాలినేని హితవు
english title:
balineni
Date:
Wednesday, November 28, 2012