కడప, నవంబర్ 27: కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేషన్ షాపులు మూతపడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి చిదంబరం తాజాగా చేసిన ప్రకటన ఇందుకు బలం చేకూర్చుతోంది. ప్రస్తుతం రేషన్ షాపుల నుంచి సరఫరా అయ్యే బియ్యంతోపాటు నిత్యావసర వస్తువులు తీసుకుంటున్న లబ్ధిదారులకు నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు. నగదు బదిలీ పథకంలో లబ్ధిదారులు కిలో రూపాయి బియ్యం కొనుగోలు చేయడానికి కిలోకు 13 నుంచి 15 రూపాయలు చెల్లించనున్నది. బయట మార్కెట్‌లో ధర చూస్తే పేదలకు బియ్యం కొనుగోలు భారమవుతుంది. వివిధ రకాల పింఛన్లు, రైతులకు ఇచ్చే పంట నష్ట పరిహారాలు అనేక సంక్షేమ పథకాలకు నగదు బదిలీని అన్వయించడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీనితో పలువురు అధికారులు, సిబ్బంది తమ చేతి వాటానికి కూడా చెక్ పడనున్నది. నగదు బదిలీ ద్వారా ప్రస్తుతం ఉన్న అక్రమాలను అరికట్టేందుకు వీలు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కలిగిన కుటుంబాలకే ఈ పథకం వర్తింపజేయాలని యోచిస్తోంది. అయితే నగదు బదిలీ పథకం ప్రభుత్వం అంచనాలు ఎలావున్నా లబ్ధిదారుల్లోమాత్రం అనుమానాలు మొదలయ్యాయి. నగదు బదిలీ లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఉండాలని నిబంధనలు పెట్టడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఆధార్ కార్డులు ముఖ్యంగా ఓటరు గుర్తింపు కార్డులు రాజకీయ నాయకుల కనుసన్నల్లో జారీ అవుతున్నాయి. అర్హత ఉన్నా ఓటరు గుర్తింపు కార్డులు లేని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆధార్ కార్డుల పరిస్థితి అదే. వీరికి నగదు బదిలీ పథకం వర్తింపు అనుమానమే. ఇదిలావుండగా నగదు బదిలీ అమల్లోకి వస్తే ఒక్క కడప జిల్లాలోనే 741275 రేషన్ కార్డుదారులు పథకం పరిధిలోకి రానున్నారు. జిల్లాకు సంబంధించి రేషన్ బియ్యం సబ్సిడీ కింద ఏడాదికి రూ. 53.15 కోట్లు ప్రభుత్వం భరిస్తున్నది. ఈ పథకం అమలుతో 1714 ప్రభుత్వ చౌక దుకాణాలు, 19 స్టాకు పాయింట్లు, 18 కిరోసిన్ హోల్‌సెల్ డీలర్ల షాపులను మూత పడితే దానిపై ఆధారపడే వారి పరిస్థితి ప్రశ్నార్థకమవుతోంది. అసలు ఈ పథకం వల్ల ఎస్సీ, ఎస్టీ, బడుగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందో లేదోనని మేధావులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేషన్ షాపులు మూతపడనున్నట్లు
english title:
n
Date:
Wednesday, November 28, 2012