నల్లగొండ, జనవరి 27: ప్రభుత్వం గ్రామీణ పశు వైద్య ఉప కేంద్రాలను అప్‌గ్రేడేషన్ చేయడంతో ఇకమీదట పశుసంవర్థక శాఖ సేవలు మెరుగవుతాయన్న ఆశలకు పశువైద్యుల నియామకాల సమస్య గండికొట్టేదిగా తయారైంది. అప్‌గ్రేడేషన్ చేస్తున్న పశువైద్యశాలలకు అర్హులైన డాక్టర్లను నియమించాల్సివుండగా ఈ దిశలో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు కూడా అవసరమైన వైద్యుల భర్తీ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 609పశువైద్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో 500గ్రామీణ పశువైద్య ఉప కేంద్రాలను ఆప్‌గ్రేడేషన్ చేయనుండగా జిల్లాలో 32పశువైద్య ఉప కేంద్రాలు అప్‌గ్రేడేషన్‌తో మండల పశువైద్య కేంద్రాలుగా రూపుదిద్ధుకోనున్నాయి. ఇప్పటిదాకా ఉప కేంద్రాల్లో పారమెడికల్ వెటర్నటి సిబ్బందితో రోజులు నెట్టుకొచ్చిన ప్రభుత్వం అప్‌గ్రేడేషన్ జరిగిన పశువైద్య కేంద్రాలకు అర్హులైన డాక్టర్లను నియమించాల్సివుంది. జిల్లాలో ఇప్పటికే 93మండల పశువైద్య కేంద్రాలు ఉండగా వీటిలో 6చోట్ల డాక్టర్లు లేకపోగా అప్‌గ్రేడేషన్ కానున్న 32కేంద్రాలకు సైతం కొత్తగా డాక్టర్లను నియమించాల్సివుంది. మొత్తం జిల్లాలో 38మంది అర్హులైన డాక్టర్లను నియమించాల్సివుండగా ఈ దిశలో అర్హులైన అభ్యర్థుల కొరత ఆటంకంగా మారనుంది. ప్రభుత్వం 609పశువైద్యుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌కు అర్హులైన విద్యార్హత గల వైద్యుల కొరత ఉంది. ఈ నేపధ్యంలో జిల్లాకు కొత్తగా 38మంది డాక్టర్లను భర్తీ చేయాల్సివున్న క్రమంలో కేవలం 10నుండి 12మంది వరకే కొత్త డాక్టర్ల నియామకం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పశువైద్య కేంద్రాల అప్‌గ్రేడేషన్ జరిగినప్పటికి ఆ స్థాయిలో ఈ వైద్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ల కొరత రైతులకు ఎదురుకానుందన్నది సుస్పష్టం. రాష్ట్రంలోనే డెయిరీ యూనిట్ల ఏర్పాటులో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా రైతాంగానికి పశువైద్యుల కొరత సమస్యగా మారకుండా అప్‌గ్రేడేషన్ చేసిన పశువైద్య కేంద్రాలతో పాటు అన్ని కేంద్రాల్లో అవసరమైన డాక్టర్ల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాడి రైతులు కోరుతున్నారు.
పశువైద్యుల నియామకాలకై ఎదురుచూపులు
english title:
veterinary doctors
Date:
Saturday, January 28, 2012