ఏలూరు, జనవరి 28: జిల్లాలో ఐకెపి కేంద్రాలు ధాన్యం సేకరణలో ఎన్నో విజయాలు సాధించిన కొన్ని అపశృతులు మాత్రం తప్పలేదు. అయితే ఇవి మొత్తం విజయాలను మసకబారేలా చేయటంతో అధికారులు పలుమార్లు ఇప్పటికే విచారణలు చేశారు. అయినప్పటికీ నిజాలు నిగ్గు తేలక దోషులు ఎవరన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలింది. ఈనేపధ్యంలో ఇటీవల జరిగిన డిఆర్‌డిఎ పాలకవర్గ సమావేశంలో రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ ఆదేశాల మేరకు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో చోటుచేసుకున్న అవకతవకలను నిగ్గు తేల్చేందుకు జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు రంగప్రవేశం చేస్తున్నారు. ఈనెల 31న పెంటపాడు తహసిల్దార్ కార్యాలయంలో ఐకెపి కేంద్రంలో చోటుచేసుకున్న కుంభకోణంపై ప్రత్యేక విచారణ జరపనున్నారు. సంబంధిత అధికారులు, ఐకెపి బృంద సభ్యులను హాజరుకావాలని ఇప్పటికే శ్రీముఖాలు పంపారు. డిఆర్‌డిఎ పిడి, డిసిఓ, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టరు, సివిల్ సప్లయిస్ డిఎం, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు ఆర్డీవో, పెంటపాడు తహసిల్దార్లతోపాటు ఐకెపి సభ్యులు కూడా ఈ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. విచారణను త్వరితగతిన పూర్తి చేసి నివేదికను జిల్లా కలెక్టరుకు సమర్పించటం జరుగుతుందని జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు శనివారం 3ఆంధ్రభూమి ప్రతినిధి2కి తెలిపారు.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలకు
ఏర్పాట్లు పూర్తి
ఆర్డీవో వెంకటసుబ్బయ్య
నరసాపురం, జనవరి 28: ఈ నెల 30 నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరగనున్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య తెలిపారు. శనివారం వలందర రేవులో ఉత్సవ ఏర్పాట్లను ఆర్డీవో వెంకటసుబ్బయ్య, డిఎస్పీ రఘువీరారెడ్డి, కమిషనర్ పిఎం సత్యవేణి, తహసీల్దార్ దాసిరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఈ ఏడాది డెల్టా ఆధునికీకరణ కారణంగా లాంచీలు తిరగవన్నారు. దీంతో నరసాపురం ఆర్టీసీ డిపో నుండి 45బస్సులు నడుపుతున్నామన్నారు. అలాగే మాధవయ్యపాలెం ఫెర్రీలో అదనంగా మరోపంట్‌ని, పది బోట్లను ఏర్పాటుచేశామన్నారు. బోట్లకు లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే సామర్థ్యానికి మించి ప్రయాణికులను వాహనాల్లో అనుమతించవద్దన్నారు. నరసాపురం, పాలకొల్లు రైల్వే, బస్‌స్టేషన్లు, ఫెర్రీపాయింట్ల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేయాలని, తాగునీరు, పారిశుద్ధ్యం చర్యలకు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ఆర్డీవో అధికారులను ఆదేశించారు.
పట్టాలుతప్పిన రైలింజన్
నర్సపూర్ ఎక్స్ ప్రెస్
నాలుగు గంటలు ఆలస్యం
నరసాపురం, జనవరి 28: నరసాపురం రైల్వేస్టేషన్‌లో శనివారం సాయంత్రం రైలింజను పట్టాలు తప్పింది. లూప్ లైన్‌లో ఉన్న రెండు బోగీలను మరో ట్రాక్‌పైకి తీసుకువచ్చే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం విశాఖపట్నం నుండి నరసాపురం స్టేషన్‌కు వచ్చిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్ బోగీలను 1వ నంబర్ ప్లాట్‌ఫారంపై వదిలింది. లూప్‌లైన్‌లో ఉన్న బోగీలను మరో ట్రాక్‌పైకి తీసుకురావాలని రైల్వేసిబ్బంది ఇంజన్‌ను పంపారు. లూప్‌లైన్‌లో ఉన్న రెండుబోగీలను మరోట్రాక్‌పైకి తీసుకువస్తున్న సమయంలో ఇంజన్ వెనుక చక్రాలు పట్టాలు తప్పాయి. దీంతో అప్రమత్తమైన ఇంజన్ డ్రైవర్ రైలును నిలిపివేశారు. ఈ ప్రమాద సంఘటనపై అధికారులు విజయవాడలోని రైల్వే అధికారులకు సమాచారమందించారు. దీంతో రైల్వేరిలీఫ్ టీం విజయవాడ నుండి హుటాహుటిన నరసాపురం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఇక్బాల్ అహ్మద్, అశోక్‌కుమార్, షకీల్, ఇంజనీర్ల పర్యవేక్షణలో రిలీఫ్ టీం మూడుగంటలపాటు శ్రమించి ఎట్టకేలకు ఇంజన్ చక్రాలను పట్టాలపైకి తీసుకువచ్చారు.
నాలుగు గంటలు ఆలస్యంగా..
నరసాపురం రైల్వేస్టేషన్‌లో రైలింజను పట్టాలు తప్పడంతో సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ నాలుగుగంటలు ఆలస్యంగా బయల్దేరింది. నిర్ణీత సమయం ప్రకారం సాయంత్రం 6.45గంటలకు బయల్దేరవలసిన సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి 10 గంటలకు వదిలారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా రైలింజను ప్రమాదంపై రైల్వేబోర్డు విచారణకు ఆదేశించింది.