పాలకొల్లు, జనవరి 28: జిల్లా జడ్జి జస్టిస్ పి రమేష్ దంపతులు శనివారం పంచారామ క్షేత్రమైన క్షీరారామాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట పాలకొల్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బాలకృష్ణయ్య, మెజిస్ట్రేట్ దీప దైవకృప, సిఐ వెంకటరమణ, ఎస్‌ఐ కృష్ణకుమార్‌లు ఉన్నారు. అంతకుముందు ఆలయ కార్యనిర్వహణాధికారి చల్లపు సూర్యచంద్రరావు, అర్చకులు జిల్లా జడ్జికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ద్వారకాతిరుమలలో వాకింగ్ మిషన్లు
ద్వారకాతిరుమల, జనవరి 28 : శ్రీవారి క్షేత్రానికి వచ్చే భక్తుల లెక్కింపును అధికారికంగా తెలుసుకునేందుకు ఆలయంలో నూతనంగా వాకింగ్ మిషన్లను ఏర్పాటుచేశారు. గతంలో ప్రసాదాలు, ఇతర టిక్కెట్ల వినియోగం ఆధారంగా ఆలయానికి వచ్చే భక్తుల లెక్కింపు అధికారులకు ఒక అంచనాకు వచ్చేది. అయితే ఈ లెక్కింపు యంత్రం వచ్చిన తరువాత భక్తుల లెక్క కచ్చితంగా తెలుస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6 గంటల వరకు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 8356 మందిగా తెలుస్తోంది. ఈ యంత్రాన్ని ఆలయ ఆవరణలో దర్శనానంతరం బయటకు వచ్చి భక్తులు తీర్ధం తీసుకునే ప్రాంతం వద్ద ఏర్పాటు చేశారు.
అటవీ బీట్ ఆఫీసర్ అరెస్టు
జీలుగుమిల్లి, జనవరి 28: సస్పెండ్ అయిన దర్భగూడెం అటవీ బీట్ ఆఫీసర్ ఎం.నాగేశ్వరరావును శనివారం జీలుగుమిల్లి ఎస్సై టి.శ్యామ్ సుందర్ అరెస్ట్ చేసారు. దర్భగూడెం టేకు ఫ్లాంటేషన్‌కు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ విచారణ పూర్తయిన వైనం విదితమే. ఈ టేకు ఫ్లాంటేషన్ నుండి రాజమండ్రి అటవీ టింబర్ డిపోకు రవాణా అవుతుండగా టేకు దుంగలు పక్కదారి పట్టిన కేసులో ట్రాక్టర్ డ్రైవర్లను నిందితులుగా పేర్కొంటూ బీట్ ఆఫీసర్ ఎం.నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అటవీ ఉన్నతాధికార్ల ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేసినప్పటికీ తరువాత అటవీ అధికార్లు ఇచ్చిన శాఖాపరమైన దర్యాప్తు నివేదికలలో నాగేశ్వరరావు కలప అక్రమాలకు పాల్పడినట్టు రుజువు కావడంతో పోలీసు దర్యాప్తులో కూడా అతనిపై అభియోగాలు రుజువయ్యాయి. దీనితో ఐపిసి సెక్షన్లు 406, 409, 379రెడ్ విత్ 34 ఐపిసిల క్రింద నాగేశ్వరరావును అరెస్ట్ చేసినట్టు ఎస్సై తెలిపారు. ప్రభుత్వ ఆస్థులను కొందరితో కలసి దోచుకోవడం, ట్రాక్టర్ డ్రైవర్లపై తప్పుడు కేసులు పెట్టడం వంటి నేరాల క్రింద అరెస్ట్ చేసినట్టు వివరించారు.
జిల్లా జడ్జి జస్టిస్ పి రమేష్ దంపతులు శనివారం పంచారామ క్షేత్రమైన క్షీరారామాన్ని దర్శించి ప్రత్యేక పూజలు
english title:
kshira ramaanni darsinchina
Date:
Sunday, January 29, 2012