భోజనాన్ని పెరుగుతోనో, మజ్జిగతోనో ముగించమనేది తరచూ వైద్య నిపుణులు చెప్పే మాట. పూర్వీకులు తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించేవారు. ఫాస్ట్ఫుడ్ కల్చర్ వచ్చాక ఈ విషయం మరుగున పడిందనే అనాలి. పెరుగు, మజ్జిగల ప్రస్తావన లేకుండానే ఈ రోజుల్లో భోజనం చేసి చేతులు కడిగేస్తున్నారు.
మనిషి జీర్ణవ్యవస్థలో చేరే చెడు బాక్టీరియాను సంహరించే శక్తి పెరుగుకి వుంది. యాంటీ బయాటిక్ మందులు జీర్ణవ్యవస్థలోని మేలుచేసే బాక్టీరియాను అంతం చేస్తాయి. అలా అంతమైన ప్రయోజనకర బాక్టీరియాను తిరిగి అందించేది పెరుగు. శరీరంలో ఉత్పత్తిఅయ్యే విష పదార్థాలను అంటిపెట్టుకుని విసర్జన సమయంలో బయటకు తెస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యల్నుంచి బయట పడేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా కాపాడుతుంది. పెరుగు వాడటం ద్వారా క్యాన్సర్ కారక పదార్థాలు నియంత్రించబడతాయి. జీర్ణవ్యవస్థ లోపలి పొరపైన ఫంగస్ పెరగకుండా పెరుగు సంరక్షిస్తుంది. మర్మాంగాల వద్ద చేరి ఇబ్బంది కలిగించే ఈస్ట్‌ల బారినుంచి పెరుగు రక్షిస్తుంది.
పాలను కాచడంవల్ల అందులో వుండే హానికర సూక్ష్మజీవులు నశిస్తాయి. పాలకన్నా పెరుగు విలువైన పోషక పదార్థం, బలవర్ధకంమని చెబుతారు. పెరుగులో ఫోలిక్ యాసిడ్, విటమిన్-బి 6, బి-12 వున్నాయి. పాల నుండి లభించే కాల్షియం, పాస్ఫరస్ కన్నా పెరుగునుంచి వీటిని మన శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. దీర్ఘాయుష్షుకి పెరుగు టానిక్ వంటిది.
అయితే, పెరుగు మంచిది కదా అని మార్కెట్‌లో వున్న వాటిని ఆశ్రయిస్తే లాభంకన్నా నష్టాలే ఎక్కువ. పెరుగును నిల్వ వుంచేందుకు వాడే రసాయన పదార్థాలు మనకు చెరుపు చేస్తాయి. అంతేకాక ఆ రసాయనాల కారణంగా పెరుగులో వుండే కీలక బాక్టీరియాలు నశిస్తాయి. కనుక ఇంట్లో తోడుపెట్టి తయారుచేసుకున్న పెరుగు వాడడమే శ్రేష్టం. ఆకలిని కలిగించే శక్తి, జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే శక్తి పెరుగుదే.
- శాలిని
english title:
curd
Date:
Monday, January 30, 2012